Mineral water
-
ధరలు తెలిస్తే నీళ్లు నమలాల్సిందే
బిందె నీటిని రూ.2కు కొంటున్నారని పాతికేళ్ల క్రితం పత్రికల్లో వస్తే ‘నీళ్లు కొనాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయన్న మాట’ అని చాలామంది నోళ్లు నొక్కుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్లు వచ్చేశాయి. ప్రస్తుతం ఏ హోటల్‌కు వెళ్లినా నీటిని కొనాల్సిందే. ఉచితంగా మంచినీళ్లు ఇచ్చే పరిస్థితులు దాదాపు ఏ హోటల్, రెస్టారెంట్లోనూ కనిపించటం లేదు. ప్రజల ఆర్థి క పరిస్థితులు బాగా మెరుగుపడటంతో సురక్షిత నీటి కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. భారతదేశంలో 2018 వరకూ మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం ఏటా రూ.16 వేల కోట్లు ఉండేది. 2022లో రూ.33 వేల కోట్లకు చేరింది. 2023లో రూ.43 వేల కోట్ల బిజినెస్ జరుగుతోందని మార్కెట్ వర్గాల అంచనా. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, టాటా వాటర్ ప్లస్, బెయిలీ, రెయిల్ నీర్, ఆక్సీరిచ్ వాటర్ వినియోగం ఎక్కువ. ఇప్పుడు వీటికంటే ఖరీదైన నీరు మార్కెట్‌కు చేరింది. దేశంలో లీటర్ నీళ్ల ధర కనిష్టంగా రూ.20 ఉండగా.. గరిష్టంగా రూ.12 వేల వరకూ ఉంది. జపాన్, జర్మనీతో పాటు దేశాల్లో ఇంతకంటే ఖరీదైన మినరల్ వాటర్ కూడా ఉంది. వీటిని ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు. –సాక్షి ప్రతినిధి, కర్నూలు ఖరీదైన బ్రాండ్లు ఇవీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని హవాయి సముద్రం నుంచి 3వేల అడుగుల లోతులో నీటిని సేకరించి ప్రాసెస్ చేస్తారు. ఇందులో సముద్రపు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ‘కోనదీప్’ పేరుతో ఈ నీళ్లు మనదేశంలోనూ దొరుకుతున్నాయి. భారత్‌లో లభిస్తున్న అత్యంత ఖరీదైన నీరు ఇదే. ‘వోస్ ఆర్టేíÙయల్’ అనే మరో కంపెనీ దక్షిణ నార్వే నుంచి నీటిని సేకరిస్తోంది. మంచుకొండలో అతి చివరి పొర నుంచి ఈ నీటిని సేకరిస్తారు. భారత్‌లోని అత్యంత ఖరీదైన రెస్టారెంట్లు, లాంజ్లలో మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. 800 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.6,600 నుంచి రూ.12వేల వరకూ ఉంది. ‘ఆవా’ పేరుతో మరో కంపెనీ ఆల్కలైన్ వాటర్ ఇస్తోంది. ఇందులో పీహెచ్ 8+ ఉంటుంది. కాల్షియం, మెగ్నీíÙయం లాంటి ఫోర్టీ ఫైడ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆరావళి, తరంగ పర్వతాల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ‘ఈవియన్’ అనే మరో బ్రాండ్ నీటిలో మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మంచుకొండల్లో వర్షం కురిసినప్పుడు మంచుపై పారే నీటిని సేకరిస్తారు. ఇందులో పీహెచ్ 7.2 ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా క్రీడాకారులు, సెలబ్రిటీలు ఈ నీటినే వినియోగిస్తున్నారు. టాటా హిమాలయా బ్రాండ్ నీటిని హిమాలయాల్లో శివలేక్ పరిధిలో ఉన్న మంచు పర్వతాల నుంచి సేకరిస్తారు. 100 శాతం స్వచ్ఛమైన నేచురల్ మినరల్స్ ఇందులో ఉంటాయి. ఈ నీటిని సేకరించే ప్రాంతంలో మనుషుల సంచారం, కాలుష్యం ఉండదు. బాక్టీరియా కూడా ఉండదు. ఫిలికో వాటర్ రూ.1.14 లక్షలు ప్రపంచంలోని టాప్–10 బ్రాండ్లలో కనిష్టంగా 27 డాలర్ల నుంచి గరిష్టంగా 1,390 వరకు లీటర్ నీటి ధర ఉంది. ఇందులో జపాన్ కంపెనీకి చెందిన ఫిలికో లీటర్ వాటర్ ధర 1,390 డాలర్లు (రూ.1.14 లక్షలు). జర్మనీకి చెందిన నివాస్ ధర1,180 డాలర్లు (రూ.96,760). టాప్ బ్రాండ్లలో కనిష్టంగా ఆ్రస్టేలియాలోని టాస్మానియా కంపెనీ బీఎల్వీడీ నీటి ధర 27 డాలర్లు (రూ.2,214). కొత్తగా వచ్చింది ‘బ్లాక్ వాటర్’ ‘ఇవాకస్’ పేరిట మార్కెట్లోకి కొత్తగా బ్లాక్‌వాటర్ వచ్చింది. ఇందులో 70పైగా నేచురల్ మినరల్స్ ఉన్నట్టు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటంతో పాటు ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉంచుతుందట. వయసు ప్రభావం కన్పించదని చెబుతున్నారు. -
మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం!
సాక్షి, హైదరాబాద్ : సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రముఖుల పర్యటనలు... భాగ్యనగరంలో దాదాపు నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్లపై కనిపించే దృశ్యాలివి. దీనికితోడు నగరానికి ప్రముఖల రాకపోకల హడావుడి ఓవైపు.. ఏటా అట్టహాసంగా జరిగే గణేశ్ నిమజ్జనాలు, బోనాల వంటి పండగ సంబరాలు మరోవైపు... ఇలాంటి కార్యక్రమాలకు భారీ బందోబస్తు చేపట్టడం నగర పోలీసులకు కత్తిమీద సామే.. మరి అలాంటి సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు ఇప్పటివరకు హెవీ, జంక్ ఫుడ్ అందిస్తున్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తాజాగా తృణధాన్యాలతో చేసిన పౌష్టికాహారం అందిస్తోంది. దే శంలో మరే ఇతర పోలీసు విభాగం ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దీన్ని అమలు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు మిల్లెట్స్ ఫుడ్‌తోపాటు మినరల్ వాటర్ కూడా అందిస్తున్నారు. నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈ మిల్లెట్ ఫుడ్ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్లాన్డ్ బందోబస్తు’ల వరకు మాత్రమే అమలవుతున్న ఈ విధానాన్ని ‘సడన్ బందోబస్తు’లకూ వర్తింపజేయాలని ఆనంద్ యోచిస్తున్నారు. అనారోగ్య సమస్యలకు అనేక కారణాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లతో పోలిస్తే హైదరాబాద్ సిటీ పోలీసుల పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఏటా కనిష్టంగా 100 నుంచి 150 రోజులు బందోబస్తు విధుల్లో ఉండాల్సి వస్తుంది. వేళాపాళా లేని ఈ విధులతో సమయానికి ఆహారం, నిద్ర ఉండకపోవడంతోపాటు ఇంకా అనేక కారణాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఫిట్ కాప్‌తో 12 వేల మంది స్క్రీనింగ్... ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, సిబ్బందిలో అకాల మరణాలు సైతం సంభవిస్తున్నాయని గుర్తించిన నగర కొత్వాల్ సీవీ ఆనంద్... ఈ పరిణామం వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుండటంపై ఆందోళన చెందారు. ఈ పరిస్థితులను మార్చేందుకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో ఫిట్‌కాప్ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. మహారాష్ట్రలోని పుణే పోలీసు విభాగం కోసం అందుబాటులో ఉన్న హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ యాప్ స్ఫూర్తితోనే ఫిట్కాప్కు రూపమిచ్చారు. ఈ యాప్ ‘3 డీస్’గా పిలిచే డయాగ్నైస్, డెవలప్, డూ విధానంలో పనిచేస్తోంది. ఇప్పటికే 12 వేల మందికి స్క్రీనింగ్ చేసిన పోలీసు విభాగం అందులో అనేక మంది జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించింది. వారంతా వెంటనే ఆహార అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మార్పును బందోబస్తు డ్యూటీల నుంచే అమలులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ విధుల్లో ఉన్న వారికి ఏళ్లుగా బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేయడం ఆనవాయితీగా కొనసాగుతుండగా దీన్ని మారుస్తూ మిల్లెట్ భోజనం అందించడానికి శ్రీకారం చుట్టారు. మిల్లెట్ బిర్యానీ, మిల్లెట్ కిచిడీ, మిల్లెట్లతోపాటు బెల్లంతో రూపొందించిన స్వీట్లు, మిల్లెట్ కర్డ్ రైస్, మినరల్ వాటర్‌ను అందిస్తున్నారు. హఠాత్తుగా తలెత్తే వాటికి ఎలా..? సిటీ పోలీసులకు ప్రధానంగా రెండు రకాలైన బందోబస్తు డ్యూటీలు ఉంటాయి. ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న గణేష్ ఉత్సవాలు, బోనాలు, ఎన్నికలు తదితరాలు ప్లాన్, స్కీమ్ ఉంటాయి. దీంతో ఏ రోజు? ఎక్కడ? ఎంత మంది విధుల్లో ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీని ఆధారంగా ఆ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇచ్చి మిల్లెట్ ఫుడ్ తయారు చేయిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా బందోబస్తు విధులు వచ్చిపడతాయి. ఈ అన్ప్లాన్డ్ విధుల్లో ఉన్న వారికి ప్రస్తుతం మిల్లెట్ ఫుడ్ అందించలేకపోతున్నారు. అయితే వారికీ కచ్చితంగా ఇచ్చేందుకు మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు.. అధికారులు, సిబ్బంది ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు అంత మెరుగైన సేవలు అందించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫిట్కాప్కు రూపమిచ్చాం. దీనికి కొనసాగింపుగానే మిల్లెట్ ఫుడ్‌ను పరిచయం చేశాం. సాధారణ భోజనాలకు అయ్యే ఖర్చుకు అదనంగా 30 నుంచి 40 శాతం దీనికి ఖర్చవుతుంది. దీనిపై సిబ్బంది నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఆహారం తీసుకోవడం ఆలస్యమైనా ఏ ఇబ్బందీ లేదని చెబుతున్నారు. అలాగే భోజనం చేసేప్పుడే కాకుండా ఎప్పుడైనా అధికారులు, సిబ్బందికి మినరల్ వాటర్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. – ‘సాక్షి’తో సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
గాజు సీసాల్లోనే నీళ్లు!
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్‌లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి. ఆటోమేటిక్‌గా.. ఆరోగ్యకరంగా.. దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్‌ను హోటల్స్‌లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు. పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది. ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్‌గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్‌ను హోటల్లోని గెస్ట్ రూమ్‌లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు. రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి... ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్‌ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు. –సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ (చదవండి: రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు) -
శుద్ధ అబద్ధం: మినరల్ కాదు జనరల్ వాటరే
ఫ్లోరైడ్.. ఉప్పు నీటినుంచి ఉపశమనం కోసం ప్రజలు శుద్ధనీటి వైపు మళ్లారు. స్థానిక సంస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిని రోజువారీ అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగడానికి అత్యధిక శాతం మంది శుద్ధ్ధనీటిపైనే ఆధారపడుతున్నారు. ఫిల్టర్ చేసిన నీరు రుచికరంగా అనిపిస్తుండటంతో ఎక్కువ మంది వాటినే తాగుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల వరకే ఉన్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ (శుద్ధ జలం) ప్లాంట్లు గ్రామాలకూ విస్తరించాయి. మినరల్ వాటర్ అని పైకి చెప్పినా జనరల్ వాటర్‌నే పైపైన ఫిల్టర్ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సంస్కృతి విస్తరించింది. ఇల్లు, దుకాణాలు, హోటళ్లు, టీ కేఫ్‌లు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్ క్యాన్ వాటర్ దర్శనమిస్తున్నాయి. ఈ క్యాన్లోనివి మినరల్ నీళ్లు అని, స్వచ్ఛమైనవని సేవిస్తున్నారు. అయితే ఇవి అంత శుద్ధమైనవి కాదని అధికారుల తనిఖీల్లో ఎన్నోసార్లు రుజువైంది. ఉమ్మడి జిల్లాలో 44 లక్షల మందికి పైగా జనాభా ఉంటే రోజూ 25 లక్షల మంది ప్యూరిఫైడ్ నీటినే వాడుతున్నట్టు అంచనా. జిల్లాలో వెయ్యికి పైగా వాటర్ ప్లాంట్లు ఉంటే.. అందులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్ఐ గుర్తింపు పొందినవి మూడు మాత్రమే. మిగిలినవన్నీ ప్రమాణాలు పాటించకుండానే కొనసాగుతున్నాయి. ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు రూ.కోట్లల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకరించి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా లేదా? ఇవి సురక్షిత నీరేనా? అని చూసేవారు లేరు. కొన్నిసార్లు నీళ్ల క్యాన్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా అందాయి. ఇలా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ప్లాంట్ నుంచి గృహాలకు చేరే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను 90 సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. కానీ ఇక్కడ మూడేళ్లు దాటినా అవే క్యాన్లను వినియోగిస్తూనే ఉన్నారు. నీటి శుద్ధి ఇలా జరగాలి.. ఆర్ఓ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఆర్ఓ అంటే రివర్స్ ఓస్మోసిస్. బోరు నుంచి వచ్చే నీటిలో మోతాదుకు మించి మినరల్స్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉంటే హాని కలిగిస్తాయి. వీటిలో మెగ్నీíÙయం, రకరకాల సల్ఫేట్స్, బోరాన్, బేరియం, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఎక్కువ మోతాదులో మినరల్స్ కలిగి ఉన్న నీటినే భారజలం అంటాం. టీడీఎస్ (టోటల్ డిస్పెన్స్డ్ సాలిడ్స్) అనికూడా అంటాం. వీటిని ఆర్ఓ ప్లాంట్లు వడపోత నిర్వహించి భారజలాన్ని సాధారణ జలంగా మార్చాలి. వంద లీటర్లను ఆర్ఓ ద్వారా ఫిల్టర్ చేస్తే మనకు పది నుంచి 15 లీటర్లు మాత్రమే తాగునీరు వస్తుంది. ఇందులో మూడు దశల్లో వడపోత జరగాలి. ఆర్‌ఓలో ప్రీ ఫిల్టరైజేషన్ సాలిడ్ వాటర్ మొదటి దశ, ఉప్పుశాతాన్ని తగ్గించడం రెండోదశ. ఇక మూడోదశలో బ్యాక్టీరియాను తగ్గించే వడపోత ఉంటుంది. ఈ మూడు దశల్లో ఏది సరిగా జరగకపోయినా ఉపయోగం ఉండదు. నాణ్యమైన తాగునీరు కావాలంటే ఈ ఆర్ఓ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లను తరచూ మారుస్తూ ఉండాలి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు ప్లాంట్లకే ఐఎస్ఐ మార్క్ జిల్లాలోని మూడు వాటర్ ఫిల్టర్ ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉంది. మిగతావన్నీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో నడుస్తున్నవే. ఈ ప్లాంట్లపై ఫిర్యాదులొస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. కానీ ఇలా 20 లీటర్ల క్యాన్లతో లూజ్ వాటర్ సరఫరా చేసే వాటిపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలి. అయినా మేం తరచూ ఈ ప్లాంట్ల నమూనాలపై నిఘా పెట్టాం. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. –దేవరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి నిబంధనలు పాటించరు ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ, కాలుష్య నియంత్రణమండలి సరి్టఫికెట్ తదితర వాటితో వస్తే రాయితీలు ఇస్తాం. కానీ ఈ ప్రమాణాలు పాటించరు కాబట్టి మా దగ్గరకు రారు. ప్లాంటు ఏర్పాటుకే కాదు, నాణ్యత పాటిస్తే విద్యుత్ రాయితీ కూడా ఇస్తాం. ఈ నిబంధనలు పాటించే ప్లాంట్లు లేవనే చెప్పాలి –నాగరాజారావు, జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ వ్యాధులు సంక్రమిస్తాయి శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, డిసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్(టీడీఎస్) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అలాంటి నీటిని వాడుకోవడం హానికరం. – డాక్టర్ రజిత, క్యాజువాలిటీ మెడికల్ అధికారి, అనంతపురం -
నీళ్లకు డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి
సాక్షి, సైదాబాద్: మినరల్ వాటర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ రహదారిపై అబ్దుల్ జబ్బార్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఖాలేద్ అనే యువకుడు ప్లాంట్‌కు వచ్చి నీళ్లు తీసుకున్నాడు. డబ్బులు అడుగడంతో తాను సైదాబాద్ డాన్ అని వాగ్వాదానికి దిగాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తి, నక్కల్ పంచ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన జబ్బార్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని -
నిబంధనలకు ‘నీళ్లు’
పశ్చిమగోదావరి, తణుకు: ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్టు’ ప్రకృతి వరప్రసాదంగా లభించే నీరు కొందరు అక్రమార్కుల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిపోయింది. అమ్మేవారికి పన్నీరు... కొనేవారికి కన్నీరులా అన్నట్టు మంచినీరు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సహజసిద్ధంగా నేల తల్లి అందించే నీరు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాల్సింది పోయి.. కాసులు కురిపిస్తేనే గానీ కదలిరానంటోంది. జిల్లాలో తాగునీటిపై నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుండగా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాటి మనిషి కనిపిస్తే ఆప్యాయంగా పలకరించి కనీసం మంచినీరు ఇచ్చి దాహార్తిని తీర్చే మానవ సంబంధాలు పోయి దాహం తీర్చుకునేందుకు డబ్బులు పెట్టి మరీ నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడున్నారు. జిల్లాలో 2 వేలకు పైగా ప్లాంట్లు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే నీరు ఇçప్పుడు డబ్బులు వెచ్చిస్తే గాని దాహం తీర్చలేనంటోంది. మినరల్ వాటర్ పేరిట వాటర్ ప్లాంట్లు జిల్లాలోని ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్రధానంగా పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 2 వేలకు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ సుజల పథకం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 272 ప్లాంట్లు మాత్రం ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షిస్తుండగా మిగిలిన వాటిపై ఎవరి అజమాయిషీ లేకపోవడం విశేషం. ఇదిలా ఉంటే ఎలాంటి పరీక్షలు లేకుండా ఎంత వాటర్‌కు ఎంత మినరల్ కలవాలనేది కనీస అవగాహన లేకుండా ఏదో తెలిసినకాడికి వాటర్‌లో మినరల్ కలిపి జనరల్ వాటర్‌నే మినరల్‌గా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ కోట్లలో సంపాదించుకునే తంతు కొనసాగుతోంది. ఈ తతంగాన్ని ప్రభుత్వ అ«ధికారులు సైతం తమ శాఖ కాదంటే తమ శాఖ కాదని చూసీచూడనట్టు వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అక్రమార్కులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ చెలరేగిపోతున్నారు. పరిశుభ్రత పేరుతో రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు. రుచి కోసం మరో రసాయనాన్ని కలిపి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లలో బంధించిన వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. రోజుకు రూ.8 కోట్లు... పలు అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారు తప్పనిసరిగా డబ్బులు వెచ్చింది నీళ్లు కొనుక్కుని తాగాల్సిందే. పైగా ఫంక్షన్ హాళ్లకే అధికంగా నీరు అమ్ముడుపోతోంది. ఈ శుభకార్యాలకు హాజరయ్యే దూరప్రాంతాల బంధుగణం దాహార్తితో బస్సు దిగగానే నీళ్ల బాటిళ్లు కొనుక్కోవాల్సిందే. నీటి వ్యాపారులకు ఇదే మంచి అవకాశంగా కలిసివస్తోంది. జిల్లాలో రోజుకు 40 వేల కిలోలీటర్ల నీరు కేవలం తాగడానికే వినియోగిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం రోజుకు తాగునీటికే రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. చిరు వ్యాపారుల నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు ఈ మంచినీళ్ల వ్యాపారం కాసులు కురిపించే వరంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఈ నీళ్లలో కలిపే రసాయన పదార్థాలతో జబ్బులు వచ్చి వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. నీళ్ల వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో బోర్లు వేసి భూగర్భజలాలను యథేచ్ఛగా తోడివేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోతున్నాయి. అదీకాకుండా సరైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేసే నీటి ప్లాంట్లు వల్ల భూగర్భజలాల నీటిమట్టం విపరీతంగా పోతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత నీటి కొరతను ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన నీటి లభ్యత తగ్గిపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు విచ్చలవిడి నీటి ప్లాంట్ల ఏర్పాటులో నియంత్రణ విధించాలని పలువురు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అక్రమ వ్యాపారాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు ఉంటే చర్యలు తీసుకుంటాం తాగునీటి నాణ్యతపై ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పట్టణాలు, గ్రామాల్లోని ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లుపై రెవెన్యూ అధికారులు అజమాయిషీ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లుపై మా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.–సీహెచ్ అమరేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఏలూరు -
మార్కెట్లోకి ‘విజయ’ మినరల్ వాటర్
సాక్షి, హైదరాబాద్: పాల ఉత్పత్తుల నుంచి నీటి వ్యాపారంలోకి విజయ డెయిరీ అడుగుపెట్టింది. త్వరలో ‘విజయ’బ్రాండ్‌తో మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తేనుంది. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ‘విజయ’పేరుతో మినరల్ వాటర్ తీసుకొస్తున్నట్లు డెయిరీ యాజమాన్యం తెలిపింది. మరో 15 రోజుల్లో రాష్ట్ర మార్కెట్లోకి ప్రధానంగా హైదరాబాద్ వినియోగదారులకు ఈ వాటర్ అందుబాటులోకి తీసుకొస్తామని డెయిరీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లాలాపేటలో ఉన్న విజయ డెయిరీ ప్లాంటులోనే వాటర్‌ప్లాంటును నెలకొల్పారు. అందుకు సంబంధించి అత్యాధునిక వాటర్‌ప్లాంటు కొనుగోలు చేసినట్లు డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మినరల్ వాటర్ తయారీ, అమ్మకాలకు సంబంధించి లైసెన్సు తీసుకున్నట్లు వెల్లడించారు. మినరల్ వాటర్‌ను ఇళ్లకు సరఫరా చేసేలా 20 లీటర్ల క్యాన్లు తీసుకొస్తున్నామని, ఒక లీటరు, అర లీటరు బాటిళ్లను కూడా వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశాలు, శుభకార్యాలు తదితర అవసరాల కోసం పావు లీటర్ల బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వివరించారు. వాటి ధరపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మార్కెట్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ధరలకు కొంచెం తక్కువ ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మరీ తక్కువ ధరకు అమ్మడం సాధ్యపడదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరాకు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించనున్నట్లు వివరించారు. పాల ఏజెంట్ల పునరుద్ధరణ.. విజయ డెయిరీ పాల విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో యాజమాన్యం పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. డెయిరీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌రావు అందుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా, రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టాక పలు చర్యల ఫలితంగా విక్రయాలు 2.7 లక్షలకు చేరినట్లు డెయిరీ వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల్లో మూడున్నర లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ధారించారు. వచ్చే ఏడాదికి 5 లక్షల లీటర్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు విజయ డైయిరీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లో గతేడాది 650 మంది ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసి 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పడం వల్లే పాల విక్రయాలు పడిపోయాయి. దీంతో తాజాగా 650 మంది ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఆ ఏజెంట్లతో ఈ నెల 20 నుంచి పాల విక్రయాలు మళ్లీ ఊపందుకోనున్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకు వాటి ప్యాకెట్లు, నాణ్యతలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. మార్కెటింగ్, ప్రచార వ్యవస్థను పటిష్టం చేస్తారు. విజయ డెయిరీలో అంతర్గత వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అనేకమంది అధికారులకు స్థాన చలనం కల్పించారు. కొందరిని బదిలీ చేశారు. కాగా, ఇప్పటికే పేరుకుపోయిన రూ.100 కోట్ల విలువైన పాల ఉత్పత్తుల నిల్వలను ఎలా వదిలించుకోవాలన్న దానిపై యాజమాన్యం ఇంకా దృష్టిసారించలేదన్న ఆరోపణలున్నాయి. -
ఆ గ్రామాల్లో తాగేనీరు విషంగా మారాయి
-
రూ.4కే అల్పాహారం
కేంద్రాన్ని ప్రారంభించిన ఈఓ భరత్ గుప్త అందుబాటులో ఇడ్లీ, ఉప్మా శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జునస్వామి దర్శనార్థమై వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం గంగా, గౌరి సదన్ పక్కనున్న మినిరల్ వాటర్ ప్లాంట్ వద్ద అల్పాహార కేంద్రాన్ని ఈఓ నారాయణభరత్ గుప్త ఆదివారం ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం చేపట్టినట్లు ఈఓ తెలిపారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి ఇడ్లి(రెండు), ఉప్మా(150 గ్రాములు) అందుబాటులో ఉంటాయన్నారు. రూ.4లకే వాటిని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రద్దీ దృష్ట్యా ఉదయం, రాత్రి వేళల్లో కూడా కార్యక్రమాన్ని చేపడుతామని, మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నెల వరకూ కేంద్రాన్ని కొనసాగిస్తామని, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకముందు ఈఓ, అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటానికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏఈఓ రాజశేఖర్, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్‌కుమార్, సహాయ సంపాదకులు కెవి సత్యబ్రహ్మచార్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మినరల్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు
గ్యాంగ్‌టక్: పర్యావరణానికి అనుకూలంగా వ్యర్ధాల నిర్వహణకు సిక్కిం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో మినరల్ వాటర్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతోపాటు నురగతో కూడిన ఆహార కంటైనర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. -
సుజలం విఫలం
►మినరల్ వాటర్‌కు నోచుకోని గ్రామాలు ►ఎన్నికల హామీని గాలికొదిలేసిన ప్రభుత్వం ►డిప్యూటీ సీఎం ప్రారంభించిన మూడు ప్లాంట్లూ మూత ►కరెంటు బిల్లులు చెల్లించక సరఫరా నిలిపివేత ►జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు 25 ►ప్రస్తుతం మిగిలినవి 2 మాత్రమే సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి గ్రామానికీ మినరల్ వాటర్ అందిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన అధికార పార్టీ.. ఎన్నికల తర్వాత ఆ హామీని అటకెక్కించింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 25 ఆర్ఓ ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అయితే, ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లలో ఏకంగా 23 మూతపడగా.. కేవలం 2 ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పత్తికొండలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన మూడు ప్లాంట్లు మూతపడటం గమనార్హం. వాస్తవానికి జిల్లాలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలంటే 889 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.44.45 కోట్లు అవసరమని అంచనా. అయితే, కేవలం 25 ప్రారంభించి.. ఇందులోనూ ప్రైవేటు సంస్థల నిధులు, దాతల ద్వారా ప్రారంభించినవే అధికం. వీటికి కరెంటు బిల్లులు ఇవ్వలేక.. ఏకంగా ప్లాంట్లనే మూతపడేశారు. మొత్తంగా జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కాస్తా పడకేసింది. ఒత్తిడితెచ్చి మరీ ఏర్పాటు చేసి... వాస్తవానికి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం అధికారులు మొదట్లో నానా హైరానా పడ్డారు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల మీద ఒత్తిడి తెచ్చి మరీ ఏర్పాటు చేశారు. అయితే, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం దాతలు కేవలం గది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని... మినరల్ వాటర్ యంత్ర పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని అధికారులు హామీనిచ్చారు. దీంతో ప్రైవేటు సంస్థలు తమ స్థలాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. తీరా ప్లాంటు ఏర్పాటైన తర్వాత.. దీనిని స్థానిక పంచాయతీకి అప్పగించాలని చెప్పడంతో మా స్థలాన్ని కూడా పంచాయతీకి ఎలా అప్పగిస్తామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన యంత్ర పరికరాలు తీసుకెళ్లాలని ప్రైవేటు సంస్థలు కాస్తా తేల్చిచెప్పడంతో జిల్లాలో పలు చోట్ల ప్లాంట్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం ప్రారంభించినా.. పత్తికొండ నియోకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయంగా మూడు ఆర్ఓ పాంట్లను ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. మూడు ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. బిల్లులు కట్టకపోవడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. ఫలితంగా గ్రామాలకు మంచినీరు అందించే ప్రక్రియ కాస్తా మూలకుచేరింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాంట్లదీ ఇదే పరిస్థితి. ప్రచారానికే పరిమితం: ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకం ప్రచారానికే పరిమితమైంది. రూ.2లకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయలేకపోయారు. గ్రామంలో 2 వేలకు పైగా జనాభా కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడుతోంది. రామలింగ, హుళేబీడ -
పంపులో కంపు
కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా పట్టించుకోని నగరపాలకులు గగ్గోలు పెడుతున్న ప్రజానీకం జోరందుకున్న మినరల్ వాటర్ వ్యాపారం రాజధాని నగరంలో ప్రజారోగ్యానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. శుద్ధమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావాల్సిన పంపుల్లో కంపు నీరు వస్తోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఏ కుళాయి తిప్పినా మురికినీరే వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు. నీటి పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు నాణ్యమైన నీరివ్వడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా మినరల్ వాటర్ విక్రేతలు జేబులు నింపుకొంటున్నారు. విజయవాడ సెంట్రల్ : ఇటీవలి కాలంలో విజయవాడ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా మంచినీటి సమస్యే కనిపిస్తోంది. గతంలో సర్కిల్-3కి మాత్రమే పరిమితమైన సమస్య ఇప్పుడు 1, 2 సర్కిళ్లకు పాకింది. బాడవపేట, నెహ్రూనగర్, క్రీస్తురాజపురం, గుణదల, అంబేద్కర్‌నగర్, సున్నపుబట్టీల సెంటర్, పటమట, ఎల్ఐసీ కాలనీ, సింగ్‌నగర్, పాయకాపురం, వైఎస్సార్ కాలనీ, భవానీపురం ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని 103కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సమస్య అంత తీవ్రంగా లేదని కొట్టిపారేస్తున్నారు. నీటి సరఫరా కోసం ఏడాదికి రూ.32.40 కోట్లను నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు. రామలింగేశ్వరనగర్లో రూ. 25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంట్ అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే మంచి నీటిలో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షి త నీటి సరఫరా పథకాల కోసం రూ.110 కోట్లు కేటాయించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. తోడేస్తున్నారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ లేని విధంగా నీటిని సరఫరా చేస్తున్నామన్నది అధికారుల వాదన. నగర ప్రజల అవసరాల్లో 60 శాతం నీటిని కృష్ణానది నుంచి, 40 శాతం బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణానదిలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల నుంచి 7.1 అడుగులకు తగ్గింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద మోటార్ల ద్వారా నీటిని తోడేయడంతో లీకేజీలు ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు కలుస్తోంది. రా వాటర్ ట్రీట్మెంట్ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. పూర్తికాని ఇంటర్ కనెక్షన్లు రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, బ్రిడ్జిల ఏర్పాటు నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ మార్చేందుకు రూ.18 కోట్లతో పనులు చేపట్టారు. మూడు నెలలుగా పనులు సాగుతున్నాయి. ఇంటర్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తికాలే దు. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసినప్పుడు కొద్ది రోజుల పాటు ఈ సమస్య ఉంటుందని అధికారులు సమర్ధించుకుంటున్నారు. పట్టించుకోవడం లేదు హెడ్ వాటర్ వర్క్స్‌లోని 5, 8, 11, 16 ఎంజీడీ ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దుల దిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంట్ ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు 62 రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయిల ద్వారా తరచు మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. మినరల్ వాటర్‌కు రోజుకు కనిష్టంగా రూ.10 చొప్పున ఖర్చుచేయాల్సి వస్తోందంటున్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో సైతం పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు తాగునీటి కొరత, కలుషితం సమస్యలపై గళమెత్తారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు లేదు. తాగలేం బాబోయ్ మా ప్రాంతంలో కుళాయిల నుంచి వచ్చే నీటిని చూస్తుంటే భయమేస్తోంది. కనీసం కాచుకుని తాగేందుకు కూడా పనికిరాకుండా ఉన్నాయి. ఎంతసేపు ఎదురుచూసినా నీళ్లు మురికిగానే వస్తుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఈ నీటిని తాగితే రోగాలబారిన పడడం ఖాయం. నగరపాలక సంస్థ అధికారులు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలి. - మోపిదేవి కోకిల, చుట్టుగుంట చర్యలు చేపడతాం నగరంలో కలుషిత నీటి సమస్య అంత పెద్దగా ఏమీ లేదు. స్పష్టమైన ఫిర్యాదులు ఉంటే చర్యలు చేపడతాం. సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ పనులు పూర్తికావొచ్చాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాం. పలు ప్రాంతాల్లో కొత్తగా 9 బోర్లు వేస్తున్నాం. కార్పొరేటర్ల సూచన మేరకు మరో 20 బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. - ఎం.ఎ.షుకూర్, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ స్నానం చేయాలంటే భయమేస్తోంది.. నాలుగు రోజులుగా కుళాయిల నుంచి మురుగునీరు వస్తోంది. ఈ నీటితో స్నానం చేయాలంటే భయంగా ఉంది. తాగునీటి కోసం వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి వాడుతున్నాం. ఇటీవల మా పక్కింటి కుళాయిలో నీటితో పాటు పురుగులు కూడా వచ్చాయి. -కాకర్ల పద్మ, మధురానగర్ పన్ను వసూళ్లలో ఫస్ట్.. ముక్కుపిండి మరీ పన్నులు వసూలుచేయడంలో ముందుండే అధికారులు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వెనుకబడిపోతున్నారు. గ్రౌండ్ వాటర్ ఉన్న వారు ఆ నీటిని వాడుకుంటుండగా.. కృష్ణా నీటిపైనే ఆధారపడిన మాలాంటి వాళ్లం స్వచ్ఛమైన నీరు ఎప్పుడు వస్తుందో తెలియక అవస్థలు పడుతున్నాం. - మేరుగ ప్రీతి, ముత్యాలంపాడు లీకులే అధికం కొండపైకి ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారా నీరు అంతగా చేరడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన పైపులైన్లు పాతవి కావటంతో నీరు లీకుల ద్వారా వృథా అవుతోంది. నీళ్లకోసం ఇళ్లలోని మహిళలు ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన కుళాయి నుంచి బిందెలతో తెచ్చుకుంటున్నారు. - కోటయ్య, గుణదల అన్నీ నలకలే వస్తున్నాయి తాగునీటిలో నలకలు అధికంగా వస్తున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఈ ప్రాంతంలో నూతన పైపులైన్లను ఏర్పాటు చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. - ఉమామహేశ్వరరావు, గంగిరెద్దులదిబ్బ -
మినరల్ వాటర్ కంటే చవకైన చమురు
-
మినరల్ వాటర్ కంటే చవకైన చమురు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. భారీగా పడిపోయిన ధరలతో ముడి చమురు ఇప్పుడు అధికారికంగా మినరల్ వాటర్ కంటే చవకైంది. గతవారం 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగివచ్చిన ముడి చమురు ధరలు మరింతగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 29.24 డాలర్లకు (రూ.1,956.45) తగ్గింది. దీంతో లీటర్ క్రూడాయిల్ ధర రూ. 12కు చేరింది. లీటర్ మినరల్ వాటర్ కంటే ఇది 20 శాతం తక్కువ. మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 15గా ఉంది. ఈ నెల 7న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ. 159 డాలర్లకు చేరింది. డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడిచమురు రేట్లు భారీగా పతనమవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించకపోవడంతో వినియోగదారులకు ఊరట లభించడం లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 59.35, లీటర్ డీజిల్ ధర రూ. 45గా ఉంది. -
సుజలం .. దుర్లభం
నాణ్యత ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు కలుషితమవుతున్న మినరల్ వాటర్ రోగాల బారిన పడుతున్న ప్రజలు స్వార్థం మానవ విలువలను మింగేస్తోంది..ఏం కొనాలన్నా..ఏం తినాలన్నా కల్తీమయమై భయపెడుతున్నారుు.. తినే నూనె బొట్టులోనూ, తాగే నీటి చుక్కలోనూ నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి.. అధికారుల అలసత్వం ఒకవైపు.. అలవిగాని దురాశ మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.. చిలకలూరిపేట : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని చోట్లా తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రజలు, అధికారులు ప్రత్యామ్నాయ జల వనరులపై దృష్టి కేంద్రీకరించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ లేని విధంగా ఓగేరువాగు నీటిని ప్రజలకు సరఫరా చేసి విమర్శల పాలయ్యారు. ఒక వైపు ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా మినరల్ వాటర్ పేరుతో కొత్త దోపిడీకి తెరతీశారు. లాభార్జనే ధ్యేయంగా నీటి వ్యాపారం.. గ్రామీణ ప్రాంతల్లో అనుమతులు తీసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో కోటిపైనే. ప్లాంట్ ఏర్పాటుకు 22 అంశాల్లో ప్రాధాన్యమివ్వాలి. నీటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్, అందులో బీఎస్సీ కెమిస్ట్రీ వ్యక్తిని, మైక్రోబయాలజీ ల్యాబ్, ఎమ్మెస్సీ బయాలజీ వ్యక్తిని నియమించాలి. వాటర్ బాటిల్స్ నింపే ప్రాంతంలోనూ, ల్యాబ్‌లోనూ ఏసీ సౌకర్యం కల్పించాలి. పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతం నెలకొల్పుతున్న ప్లాంట్లలో ఇవేమీ పాటించడం లేదు. దీంతో ప్రజారోగ్యం అందోళనలో పడింది. నీరు శుద్ధి చేయకపోతే డయేరియా, కామెర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీటి శుద్ది కోసం మోతాదు మించి క్లోరిన్ వాడితే ప్రాణాంతకరమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. నిరుపయోగంగా మారిన నీటి పరీక్షల కిట్లు అర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి తాగటానికి నీరు పనికి వస్తుందా లేదా అని నిర్ధారిస్తారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పంచాయతీల్లో తాగునీటి పరీక్షలు నిర్వహించడానికి కిట్స్ పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ఇవి మూలన పడ్డాయి. తిరి ప్రస్తుతం ఫీల్ట్ టెస్టింగ్ కిట్స్ పేరుతో పంచాయతీలకు మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి వంద సార్లు ఉపయోగపడతాయి. ఈ కిట్స్ ద్వారా చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు, అంగన్వాడీ, వెలుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. కుళాయి నీళ్లే భేష్.. మినరల్ వాటర్ పేరుతో సరఫరా అవుతున్న నీటికన్నా శుద్ధి చేసిన కుళాయి నీళ్లే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సరఫరా చేసే నీటిలో రంగు, మట్టి శాతం, ఫ్లోరైడ్, క్లోరైడ్ ప్రమాణాల మేర ఉంటాయి. మినరల్ వాటర్ పేరుతో చలామణి అవుతున్న నీటిలో ఇవి ఉండవు. ఉదాహరణ లీటర్ నీటిలో 0.6 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండాలి. దీంతో ఎముకలు పటిష్టమవుతారుు. శుద్ధి చేసిన నీటిలో 0.1 మిల్లీగ్రాముల మేర మాత్రమే ఫ్లోరైడ్ ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టత కోల్పోతారుు. -
పుష్కర క్షోభ
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఉంది ప్రభుత్వోద్యోగుల పరిస్థితి. గోదావరి పుష్కర మహాపర్వం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా.. రాష్ర్ట మంత్రులు.. ఉన్నతాధికారులు.. మొత్తం రాష్ర్ట పాలనా యంత్రాంగ మంతా రాజమండ్రిలోనే రోజుల తరబడి కొలువుదీరింది. అమాత్యులు, పెద్ద దొరలు ఉన్నారంటే మాటలా..! ప్రొటోకాల్ ప్రకారం వారికి సకల మర్యాదలూ చేయాల్సిందే! వారికి, వారి మంది మార్బలానికి టిఫిన్లు, భోజనాలు, మినరల్ వాటర్, ఏసీ గదులు.. వారి పర్యటనలకు కావాల్సి వాహనాలు.. ఇలా అన్నీ దిగువస్థాయి అధికారులే సమకూర్చాలి. వీటన్నింటికీ అయిన ఖర్చును వారే భరించాల్సి వచ్చింది. పన్నెండు రోజుల పండగ ముగిసిన తరువాత లెక్కలు చూసుకుంటే.. తమకు వేలల్లో చేతిచమురు వదిలిపోయిందని.. ఈ మర్యాదల బాధ్యతలు చూసిన ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :పుష్కరాల పేరు చెప్పి డివిజన్ స్థాయి ఉద్యోగులకు చేతిచమురు బాగానే వదిలిపోయింది. ప్రొటోకాల్ ప్రకారం మంత్రులకు, ఉన్నతాధికారులకు అవసరమైన సేవలు అందించేందుకు వేలాది రూపాయలు మంచినీళ్లప్రాయంలా ఖర్చయిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని 12 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా దాదాపు రాజమండ్రిలోనే బస చేసింది. దీంతో ఇక్కడకు వచ్చే రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగులకు వసతి, ఇతర ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల డివిజన్ స్థాయి సిబ్బందిపై పడింది. వచ్చే పెద్దల కోసం హోటళ్లు, రిసార్ట్లు, ప్రైవేటు ఫామ్‌హౌస్‌లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు.. ఇలా దాదాపు అందుబాటులో ఉన్న అన్ని రూములూ ముందుగానే సిద్ధం చేశారు. అయితే పుష్కరాలకు లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆయా రూముల అద్దెలు ఆకాశాన్నంటాయి. ఒక్కో రూముకు రోజుకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు రూముల్లో బస చేసేవారికి టిఫిన్లు, భోజనాలు సమకూర్చేందుకు అదనంగా ఖర్చయ్యాయి. అంతేకాదు.. ఆయా పెద్దల కుటుంబ సభ్యులను గోదావరి స్నానానికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా కార్లు కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2500 వరకూ చెల్లించాల్సి వచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజుల్లోనైతే వాహనాల కోసం రూ.4 వేలు చెల్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వచ్చిందేమో ఉన్నతాధికారులాయె. వారు చెప్పింది చెప్పినట్లు చేయకపోతే ఏం కొంపలంటుకుంటాయోనన్న ఆందోళనతో సొంత డబ్బులు వెచ్చించి మరీ ఏర్పాట్లు చేసేశారు. ఇలా కింది స్థాయి ఉద్యోగులు సొంతంగా వెచ్చించిన సొమ్ము దాదాపు రూ.4 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. పెట్టిన ఖర్చు వేలల్లో ఉండడంతో కింది స్థాయి సిబ్బంది ఎటూ పాలుపోని పరిస్థితుల్లో పడ్డారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే దుస్థితి. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యం, వ్యవసాయం, దేవాదాయ, విద్య, పోలీసు శాఖల్లో ఖర్చులు అధికమైనట్లు తెలిసింది. పుష్కరాలు ప్రారంభమైన రెండో రోజు రాజమండ్రి వస్తానన్న ఓ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి కోసం తెల్లవారుజామున మూడు గంటల వరకూ రూము వద్ద తాళాలు పట్టుకుని డివిజన్ స్థాయిలోని ఒక మహిళా ఉద్యోగితోపాటు పలువురు వేచి చూడాల్సి వచ్చింది. ఆయన రూములోకి వెళ్లాక ఇంటికి వెళ్లిన సదరు ఉద్యోగిని మళ్లీ ఉదయం ఆరు గంటలకల్లా అక్కడికి రావాల్సి వచ్చింది. మర్నాడు మళ్లీ ఇంకొందరు ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం రావడంతో ఏదైతే అదే అయ్యిందిలే అని సదరు ఉద్యోగి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. జిల్లా స్థాయి అధికారి ఒకరు తన చెల్లెలు పుష్కర స్నానానికి వస్తున్నారని చెప్పడంతో కింది స్థాయి సిబ్బంది కాకినాడకు కారు పంపించి అక్కడ నుంచి ఆవిడను తీసుకువచ్చి వీఐపీ ఘాట్‌లో స్నానం చేసేవరకూ వెంటే ఉండి సాగనంపాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రులతో వచ్చిన పర్సనల్ సెక్రటరీ, గన్‌మెన్‌కు మంత్రులతో సమానంగా సేవలు అందించాల్సిన పరిస్థితి అధికారులపై పడింది. మంత్రుల సిబ్బంది కావడంతో వారు చెప్పిన మెనూ ప్రకారమే భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రొటోకాల్ అంశంతో బిల్లు పెట్టినా అవి పూర్తిగా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
సుజలాం...విఫలాం..!
- ‘ఎన్టీఆర్ సుజలధార’పై చేతులెత్తేసిన సర్కార్ - రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఎక్కడ? - గ్రామాల్లో కలుషిత జలాలే దిక్కు - ఆర్వో ప్లాంట్స్ లక్ష్యం 263, ఏర్పాటైంది...20 రాష్ర్టంలోని ఐదువేలకు పైగా గ్రామాల్లో ఇంటింటికీ మినరల్ వాటర్! రూ.2లకే 20 లీటర్ల నీరు. యువత, డ్వాక్రా సంఘాలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో పటిష్టమైన తాగునీటి ప్రణాళిక! ఇదీ ‘ఎన్టీఆర్ సుజల’ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రకటించిన పథకం. జిల్లా విషయానికి వస్తే ఈ పథకం అమలు కోసం 263 గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే ఇప్పటికి ఏర్పాటైనవి ఇరవయ్యే. దీనిని బట్టే ఈ పథకం తీరు ఎంత ఆర్భాటమో చెప్పకనే చెబుతోంది. ‘అధికారంలోకి రాగానే తాగునీటి కష్టాలు తీరుస్తాం....రక్షిత నీరు కాదు..ప్రతి ఒక్కరికి ఏకంగా మినరల్ వాటర్ అందిస్తాం..ప్రతి కుటుంబానికి రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాం...’ అంటూ ఎన్నికల్లో ప్రచారం ఊదరగొట్టారు. తీరా అందలమెక్కిన తర్వాత ఎన్టీఆర్ సుజలధార పేరిట రూపాయి ఖర్చు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ ఏడాదైనా నిర్ధేశిత లక్ష్యంలో కనీసం 10 శాతం ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఇక ప్రారంభమైన ప్లాంట్స్‌లో కూడా తరచూ సాంకేతిక లోపాలతో ముక్కుతూ..మూలుగుతూ నడుస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : సొమ్ము ఒకడిది..సోకొకడది అన్నట్టుగా దాతల సహకారంతో ‘ఎన్టీఆర్ సుజలధార’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రక్షిత జలాలు పూర్తి స్థాయిలో అందని 263 గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా దాతల నుంచి కనీస స్పందన రాలేదు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం స్పాన్సర్లుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు. తొలిదశలో రూ.ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ చివరి నిముషంలో దాతలు చేతులెత్తేయడంతో కనీసం మండలానికొకటి కాదు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలని తలచారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్-2వ తేదీన అతికష్టమ్మీద 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో మెజార్టీ ప్లాంట్స్ సామర్ద్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. ప్రకటనలకే పరిమితం అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్వో ప్లాంట్స్‌కు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మిగిలిన ప్రతిపాదిత ప్లాంట్స్ కోసం అడిగితే ‘చూద్దాం....పెడతాం! అంటూ ప్రకటనలకే అధికార పార్టీ నేతలు పరిమితమవుతున్నారు. జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో రక్షిత నీరు 1669 పంచాయతీల్లో పూర్తి స్థాయిలోనూ, 3799 ఆవాస ప్రాంతాల్లో పాక్షిక స్థాయిలోనూ సరఫరా చేస్తున్నారు. రక్షిత నీటి వనరులు లేని గ్రామాలు 45 ఉండగా, అసలు నీటి వనరులే లేని గ్రామాలు 16 వరకు ఉన్నాయి. ఫ్లోరైడ్ జలాలే దిక్కు! ఇటీవల నిర్వహించిన సర్వేలో 45 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా 500 చేతిపంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చారు. ప్రత్యామ్నాయం లేక జిల్లాలో 50వేల మందికి పైగా ప్రజలు ఈ ఫ్లోరైడ్ నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రూ.4727 కోట్లతో 13 గ్రిడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనీసం రూ.2 లక్షల వ్యయం కాగల ఆర్వో ప్లాంట్స్కే నిధుల్లేనప్పుడు ఇన్ని రూ.వేల కోట్లతో ప్రభుత్వం వాటర్ గ్రిడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏర్పాటైనవి కొన్ని..పనిచేసేవి ఎన్ని? ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను స్పాన్సర్స్ నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయితీలే నిర్వహిస్తున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన పడ్డాయి. మిగిలినవాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. మిగిలినపంచాయితీల్లో ప్రతిపాదిత ఆర్వోప్లాంట్స్ కోసం అడిగితే స్పాన్సర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవలే మరో తొమ్మిది ప్లాంట్స్ ఏర్పాటుకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. -
గరళం!
అనంతపురం మెడికల్: కలుషిత నీటి భయంతో ఫిల్టర్ నీటిని సేవిస్తున్న లక్షలాది ప్రజలకు గుర్తింపు లేని మినరల్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు మరో ముప్పును తెచ్చి పెడుతున్నాయి. శుద్ధి చేసిన క్యాన్, బాటిల్, ప్యాకెట్ ద్వారా విక్రయిస్తున్న నీటిని తాగితే రోగాలు త థ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కరిగిన ఘన పదార్థాల శాతాన్ని ( టీడీఎస్- టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అతి స్వల్ప మోతాదుకు తగ్గించడమే అందుకు ప్రధాన కారణం. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇందులో పట్టుమని 10 మినహా తక్కిన ప్లాంట్లన్నీ భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) గుర్తింపు లేకుండా వెలిసిన వే! బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నా పబ్లిక్ హెల్త్ అధికారులు గానీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు కానీ మొద్దునిద్ర వీడడం లేదు. స్వచ్ఛమైన నీరు అంటే: హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే కలిగి ఉన్న నీటిని స్వచ్ఛమైన నీరుగా వ్యవహరిస్తారు. దీన్ని శుద్ధజలం (డిస్టిల్డ్ వాటర్)గా పిలుస్తారు. ఈ నీటిని కర్మాగారాలకు వాడతారు. తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘన పదార్థాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఉపయోగకర ఘనపదార్థాలను మనం నీటి ద్వారానే గ్రహిస్తూ ఉంటాం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమై సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికర మూలకాలు కూడా తాగేనీటిలో కరిగి ఉన్నాయి. వీటిని తొలగించి శరీరానికి అవసరమైన మూలకాలను సరైన మోతాదులో ఉండేలా భూగర్భజలాలను శుద్ధి చేయాలి. కానీ చాలామంది ఈ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదు. హానికారకాలను తొలగించే ప్రక్రియలో భాగంగా చాలా ఫిల్టర్లు టీడీఎస్‌లను నామమాత్రపు స్థాయికి తగ్గిస్తున్నాయి. దీంతో తాగేనీటి ద్వారా శరీరం గ్రహించాల్సిన అవసరమైన మూలకాల మోతాదు గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో శరీరంలో ఘనపదార్థాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాగేనీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 80-150 మధ్య ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా పలు సంస్థలు చెబుతున్నాయి. అక్రమాలు ఇలా: ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాతన ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్‌తో పాటు ఇతర వివరాలను రోజూ పరీక్షించి నమోదు చేసేందుకు ఓ బయోకెమిస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మినరల్ ప్లాంటు ఏర్పాటుకు పబ్లిక్‌హెల్త్ అధికారులు అనుమతి ఇవ్వాలి. ఇవేవి ఫిల్టర్ ప్లాంట్లలో కనిపించవు. తెలుసుకోండిలా: నీటిలో టీడీఎస్ తెలుసుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర 500-1000 వరకూ ఉంటుంది. సాధారణంగా మార్కెటోలో లభించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే చాలామంది మినరల్ వాటర్‌గా వ్యవహరిస్తారు. కానీ మినరల్ వాటర్ ప్రత్యేకమైంది. కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే దీనిని తయారు చేస్తున్నాయి. అనారోగ్యం పాలవుతారు - డాక్టర్ శివకుమార్ నీటి లవణాలు(సోడియం,ప్లోరిన్,కాల్షియం) సమపాళ్లలో ఉండాలి. మినరల్‌వాటర్ పేరుతో లవణాలను తొలగిస్తున్నారు. దీని ద్వారా ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, చిన్నారుల్లో ఎదుగుదల, లో బీపీ తదితర సమస్యలు వస్తాయి. నిబంధనలు పాటించే మినరల్ వాటర్‌నే వాడాలి. -
‘ఎన్టీఆర్ సుజల’ దాతలకే అంకితం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందజేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడీ హామీ అమలును పూర్తిగా దాతల దాతృత్వానికే వదిలేశారు. ఎంతో ఆర్భాటంగా ‘ఎన్టీఆర్ సుజల’ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఒక్కో గ్రామంలో ఈ పథకం ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.పది లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 12 వేలకుపైగా ఉన్న గ్రామపంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.1,200 కోట్లు అవసరం. పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2015 మార్చినాటికి 5వేల గ్రామాల్లో దీన్ని ప్రారంభించాలని తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే దీనికి తానుగా నిధులు కేటాయించకుండా దాతల సాయంతో కొనసాగించాలని నిర్ణయించింది. గత బడ్జెట్లో రూ.ఐదున్నర కోట్లనే కేటాయించినా ఖర్చు చేయలేదు. దీంతో 5 వేల గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. పట్టణాల్లో వాటితో కలిపి కేవలం 561 మంచినీటి ప్లాంట్లే ఏర్పాటయ్యాయి. బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.11 కోట్లు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చినా వెయ్యికన్నా మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో పలుగ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి కొనసాగుతుంటే టీడీపీ సర్కారు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు నత్తనడకన కూడా సాగని పరిస్థితికి ఇది నిదర్శనం. -
ఓడ నది నుంచి సముద్రంలోకి ప్రవేశిస్తే... ?
నదీజలం కంటే సముద్ర జలాల్లో లవణాలు ఎక్కువ కాబట్టి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల అత్యంత లవణమయమైన ‘డెడ్ సీ’ నీటిపై నడవవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించే మినరల్ వాటర్‌ను ‘తిరోగామి ద్రవాభిసరణ’ (రివర్స ఆస్మాసిస్) ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఇదే ఆర్.ఒ. ప్రక్రియగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రక్రియలో ‘మెంబ్రేన్’ (అతి సూక్ష్మ రంధ్రాలున్న పలుచని పొర) ద్వారా ఉప్పు (కఠిన) నీటిని అధిక పీడనాన్ని ఉపయోగించి పంపిస్తారు. మెంబ్రేన్ నుంచి స్వాదుజలం బయటకు వస్తుంది. దీనిలో అయాన్లన్నీతొలగిపోతాయి. కాబట్టి ‘డీ అయోనైజ్డ్ వాటర్’ అని కూడా అంటారు. హైడ్రోజన్ - దాని సమ్మేళనాలు ఆవర్తన పట్టికలో మొదటి మూలకం హైడ్రోజన్. ఇది అత్యంత తేలికైంది. సాధారణ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి, పరమాణు భారం ఒకటి. న్యూట్రాన్లు లేని ఒకే ఒక కేంద్రకం హైడ్రోజన్. దీన్నే ప్రోటియం అని కూడా అంటారు. దీని సమస్థానీయాలు (ఐసోటోపులు) డ్యుటీరియం, ట్రిటియం. డ్యుటీరియంనే భార హైడ్రోజన్ అంటారు. ట్రిటియం రేడియోధార్మిక కేంద్రకం. హైడ్రోజన్ అత్యంత శ్రేష్టమైన ఇంధనం. దీన్ని మండించినప్పుడు నీటి ఆవిరి (ఏ2ై) మాత్రమే విడుదలవుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్యం ఉండదు. నక్షత్రాల్లోని శక్తికి మూలాధారం హైడ్రోజన్. హైడ్రోజన్‌కు చెందిన ఐసోటోపులు ‘కేంద్రక సంలీన’ చర్య ద్వారా అత్యధిక శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలోనే వివిధ మూలకాలు ఏర్పడతాయి. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల మిశ్రమాన్నే (ఇై+ఏ2) ‘వాటర్ గ్యాస్’ అంటారు. దీన్నే నీలిగ్యాస్ అని కూడా అంటారు. హైడ్రోజన్‌ను ఇంధన ఘటాల్లో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ లాంటి ఇంధనాలను దహనం చేయడం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుత్‌శక్తిగా మార్చే ఘటాలే ఇంధన ఘటాలు. వీటిలో ‘ఆక్సిజన్’ వాయువు ‘ఆక్సీకరణి’గా పనిచేస్తుంది. ఇది నూనెలను ‘హైడ్రోజనీకరణం’ చేసి ‘కొవ్వులు’గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్ప్రేరకం ‘నికెల్’ లోహం. డాల్డాను ఈ విధానంలోనే రూ పొందిస్తారు. ‘ఫిషర్ - ట్రాప్స్’ పద్ధతిలో కృత్రిమంగా పెట్రోల్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ‘వాటర్ గ్యాస్’ ను దానిలో సగం పరిమాణం ఉన్న ‘హైడ్రోజన్’తో కలిపి ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్ ఉత్ప్రేరకాల సమక్షంలో 2000ఇ వద్ద వేడిచేస్తే హైడ్రోకార్బన్ల మిశ్రమం (కృత్రిమ గ్యాసోలిన్) వస్తుంది. ఆమ్లాల్లో ఒక ముఖ్యమైన అనుఘటకం హైడ్రోజన్. లోహ సంగ్రహణలో.. లోహ ఆక్సైడ్ల నుం చి క్షయకరణ పద్ధతిలో లోహాల్ని నిష్కర్షించడానికి హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు. నీరు గాలి తర్వాత అత్యంత అవసరమైంది నీరే. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అత్యంత శుద్ధమైంది ‘వర్షపు నీరు’. తాగడానికి పనికివచ్చే నీటిని ‘పోటబుల్ నీరు’ అంటారు. నాలుగింట మూడు వంతుల నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్ర జలాల్లో అనేక రకాల లవణాలుంటాయి. ఈ నీరు తాగడానికి పనికి రాదు. సబ్బుతో నురగనివ్వదు. ఇలాంటి నీటిని కఠిన జలం అంటారు. ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం బైకార్బొనేట్లు; క్లోరైడ్లు; సల్ఫేట్లు ఉండటం వల్ల నీటికి కఠినత్వం వస్తుంది. నీటి కాఠిన్యత రెండు రకాలు. ఒకటి తాత్కాలిక కాఠిన్యత, రెండోది శాశ్వత కాఠిన్యత. తాత్కాలిక కాఠిన్యత: కాల్షియం బై కార్బొనేట్, మెగ్నీషియం బై కార్బొనేట్ లవణాల కారణంగా నీటికి తాత్కాలిక కాఠిన్యం వస్తుంది. నీటిని మరిగించడం ద్వారా తాత్కాలిక కాఠిన్యతను పూర్తిగా తొలగించవచ్చు. మరిగిస్తే బైకార్బొనేట్లు కార్బొనేట్లుగా అవక్షేపితమవుతాయి. నీటిని మరిగించినప్పుడు పాత్ర అడుగుభాగంలో తెల్లని పొలుసులను గమనించవచ్చు. ఈ పొలుసుల్లో ఉండేది కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లు. ఈ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. దీని కారణంగానే నీటిని మరిగిస్తున్నప్పుడు బుడగలు వస్తాయి. తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి తోడ్పడే మరో విధానం ‘క్లార్క పద్ధతి’. కఠిన జలానికి సున్నపు నీరు లేదా మిల్క్ ఆఫ్ లైమ్ (కాల్షియం హైడ్రాక్సైడ్) కలపడం ద్వారా నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించవచ్చు. నీటి శాశ్వత కాఠిన్యత: కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు నీటికి శాశ్వత కాఠిన్యాన్ని కలుగజేస్తాయి. అంటే నీటిలో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేటు, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్లు కరిగి ఉంటాయి. సాధారణంగా పెర్మ్యుటిట్ (సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్) లేదా కాల్గన్ (సోడియం హెక్సామెటా ఫాస్ఫేట్) ద్వారా కఠిన జలాన్ని పంపిస్తే అందులోని కాల్షియం, మెగ్నీషియం అయాన్లు తొలగిపోతాయి. అయాన్ మార్పిడి రెజిన్లు కూడా కఠిన జలాన్ని స్వాదుజలంగా మారుస్తాయి. ‘స్వేదన’ (డిస్టిలేషన్) ప్రక్రియ ద్వారా కూడా నీటి కఠినత్వాన్ని తొలగించవచ్చు. నీటిని మరిగించినప్పుడు ఆవిరవుతుంది. ఆవిరిని చల్లారిస్తే పరిశుద్ధ జలం (100% పరిశుద్ధమైంది) వస్తుంది. సముద్ర జలాన్ని ‘ఆవిరి చేయడం’ వల్ల చివరగా ఉప్పు మిగులుతుంది. నీటి రసాయన నామం హైడ్రోజన్ ఆక్సైడ్ నీటికి అనేక పదార్థాలను కరిగించుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి దీన్ని సార్వత్రిక ద్రావణి అంటారు. 40ఇ వద్ద నీటికి గరిష్ఠ సాంద్రత ఉంటుంది. అందుకే నీటిని 00ఇ నుంచి 100ఇ వరకు వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత - ఘనపరిమాణానికి వక్రాన్ని గీస్తే ‘హాకీ స్టిక్’లా ఉంటుంది. ఘనపరిమాణం మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. నీరు 00ఇ (273ఓ) వద్ద ఘనీభవిస్తుంది. 1000ఇ (373ఓ) వద్ద మరుగుతుంది. లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్ర నీటి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువు నది నీటి నుంచి సముద్రం నీటిలోకి ప్రవేశిస్తే కొంచెం పైకి తేలుతుంది. నీటిని విద్యుద్విశ్లేషణ చేస్తే విఘటనం చెం ది హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోతుంది. నీటిని క్రిమిరహితం చేయడానికి విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) లేదా క్లోరిన్ వాయువు లేదా అతి నీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు. పాత్రలో నీటిని వేడిచేసినప్పుడు పై నుంచి మరుగుతుంది. పొడిగాలి కంటే తడిగాలిలో ధ్వని వేగం ఎక్కువ. భారజలం రసాయనికంగా భారజలాన్ని డ్యుటీరియం ఆక్సైడ్ (ఈ2ై) అంటారు. దీన్ని హెచ్‌సీ యురే కనుగొన్నాడు. భారజలం ఘనీభవన స్థానం 3.820ఇ, భాష్పీభవన స్థానం 101.420ఇ. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగా న్ని తగ్గించడానికి మితకారిగా వాడతారు. -
స్వచ్ఛతకు నీళ్లొదిలారు
‘నెల్లూరు నీళ్లు తాగితే జబ్బులు ఖాయం’ అని స్వయానా జిల్లా కలెక్టరే అన్నారంటే నగరంలో తాగునీటి వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. అధికారులు కాస్త దృష్టిపెడితే రక్షిత నీటిని ఇవ్వడం పెద్ద విషయం కాదని ఈ నెల 2న జూబ్లీహాల్లో జరిగిన స్వచ్ఛభారత్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన చురకంటించారు. అయినా కూడా కార్పొరేషన్ అధికారుల్లో చలనం లేదు. అంటువ్యాధులు పొంచి ఉన్న కాలంలో మురికి, నీచు వాసనతో కూడిన తాగునీరు కుళాయిల్లో వస్తుండటం నగరవాసులను కలవరపెడుతోంది. * నగరంలో ఆకుపచ్చరంగులో తాగునీరు * ప్రబలుతున్న అంటువ్యాధులు * చోద్యం చూస్తున్న అధికారులు * మినరల్వాటర్కు భలే డిమాండ్ నెల్లూరు(హరనాథపురం): నెల్లూరు నగరంలోని వెంగళరావునగర్‌కు చెందిన ప్రసాద్‌ది సామాన్య కుటుంబం. తాగునీటి కోసం తప్పనిసరిగా నగరపాలక సంస్థ కుళాయిలపై ఆధారపడాల్సిందే. ఇటీవల కార్పొరేషన్ నీటిని తాగిన ప్రసాద్ డయేరియా బారిన పడ్డాడు. నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డాడు. ఆస్పత్రి ఖర్చు దాదాపు రూ.10 వేలు అయింది. దేవుడా ఏంటి ఈ పరిస్థితి అనుకుంటూ రోజుకు రూ.25 పెట్టి మినరల్ వాటర్ కొనుక్కుని వాడుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్క ప్రసాద్‌దే కాదు. నగరంలో దాదాపు 75 శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో నగరంలో అంటురోగాలు ప్రబలుతున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్ల ప్రజలకు పెన్నానది, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రదేశాల్లో నీటిని క్లోరినేషన్ చేసి అనుబంధ ట్యాంకులకు పంపాల్సి ఉంది. అక్కడి నుంచి పైపుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలకు నీటిని సరఫరా చేస్తారు. ఈ క్రమంలో నీటిని శుభ్రపరచడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలోని తాగునీటి పైపులైన్లు పగుళ్లిచ్చి నీరు లీకేజీ అవుతున్నాయి. ఈ ప్రదేశాల నుంచి వ్యర్థాలు, మురుగునీరు ప్రవహిస్తూ కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీంతో కార్పొరేషన్ కుళాయిల నుంచి ఆకుపచ్చరంగులో నీరు విడుదలవుతోంది. ఈ నీరు దుర్గంధం వెదజల్లుతూ, చిన్నపాటి పురుగులు కన్పిస్తున్నాయి. ఈ నీటిని చూస్తేనే ప్రజల కడుపులు కెళ్లిస్తున్నాయి. ఈ నీటిని తాగుతున్న ప్రజానీకం వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య. ఈ విషయంపై నిత్యం కార్పొరేషన్ అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మినరల్ వాటర్‌కు పెరిగిన డిమాండ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు నానా ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల పరిస్థితి మరీ దారుణం. నీరు కలుషితమవడంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ప్లాంట్ నిర్వాహకులు అడ్వాన్స్‌గా రూ.140 తీసుకుని 20లీటర్ల క్యాను నీటిని రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. దీంతో నగరంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. మినరల్ వాటర్ కొనలేని సామాన్యులు గత్యంతరం లేక కార్పొరేషన్ నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నట్టు? నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతున్నా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. సాధారణంగా నీటిని సరఫరా చేసే పెన్నానది, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల వద్ద నిత్యం నీటిని శుభ్రపరచి క్లోరినైజేషన్ చేయాల్సి ఉంది. పాయింట్ టు పాయింట్ క్లోరిన్ శాతం 0.2పీపీఎం ఉండాలి. ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈల నుంచి ఫిట్లర్ల వరకు ప్రతి ఒక్కరి వద్ద క్లోరిన్ శాతాన్ని పరిశీలించేందుకు క్లోరోస్కోప్స్ పరికరాలు ఉండాలి. అయితే ఎక్కడా క్లోరిన్ శాతాన్ని పరిశీలించిన దాఖలాలు కానరావడం లేదు. పైపులైన్ల లీకేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేయాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది. ఆధార్‌సీడింగ్, పింఛన్ల వెరిఫికేషన్లకు కింది స్ధాయి సిబ్బందిని ఉపయోగించడంతో వారి రెగ్యులర్ పనితీరును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లీకేజీలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. అటు ప్రజలు, ఇటు పత్రికలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వీరికి మాత్రం సమస్య పట్టడం లేదు. కార్పొరేషన్‌కు, తమ నివాసాలకు మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర పురపాకశాఖ మంత్రి నారాయణ స్వయంగా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును పరిశీలించి మురుగునీరు వస్తున్నదని హెచ్చరించినా కార్పొరేషన్ అధికారుల తీరు మారలేదు. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని, లీకేజీలను అరికట్టాలని, అంటువ్యాధులపై అవగాహనతో ఉండాలని సూచించారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాల్సి ఉంది. -
గిరిజనులకు మినరల్ వాటర్
సాక్షి, ఏలూరు: రాష్ట్రంలోని కొండకోనల్లో నివసించే గిరిజనులందరికీ మినరల్ వాటర్ అందించేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్లను నెలకొల్పడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఏలూరు ఇరిగేషన్ అతిథి గృహంలో బుధవారం ఐటీడీఏ అధికారులతో గిరిజన హాస్టల్స్ అభివృద్ధి, సురక్షిత తాగునీరు సరఫరా తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ప్రభుత్వం ఈ ఏడాది గిరిజనుల కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు సరఫరా, పూర్తిస్థాయి అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మారుమూల కొండ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ల ఏర్పాటుచేసే విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలి పారు. రాష్ట్రంలో పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, కోటరామచంద్రపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితులు, సురక్షిత నీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌గా గిరిజన హాస్టల్స్ గిరిజన హాస్టల్స్‌ను ద శలవారీగా రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చి కార్పొరేట్ విద్య అందిస్తామని ఆమె చెప్పారు. పోటీ పరీక్షలకు గిరిజన యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. గతేడాది ఇద్దరు గిరిజన విద్యార్థులు ఐఐటీకి, 35 మంది నిట్‌కు ఎంపికయ్యారని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్షిప్లు అందిస్తూ వారిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నామన్నారు. జిల్లా ఏజెన్సీలో గిరిజన హాస్టల్స్‌ను ఆశ్రమ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన ప్రణాళికల మ్యాప్‌లను ఉదయలక్ష్మి పరిశీలించారు. ఐటీడీఏ పీవో రామచంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
దాతలారా ... దయచేయండి
ఒంగోలు: కేవలం రెండు రూపాయలకే ప్రతి పల్లెకు 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ. ఈ పథకానికి పెట్టిన పేరు ‘ఎన్టీఆర్ సుజల పథకం’. చంద్రబాబు ప్రకటించిన అయిదు సంతకాల్లో ఇది కూడా ఒకటి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 818, మున్సిపాల్టీల్లో 98 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయం కనీసంగా రూ.32 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. నిర్మాణం ఇలా... ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధిత ఆవాస ప్రాంతంలో ఏదో ఒక ప్రభుత్వ భవనం లేదా కమ్యూనిటీ హాలులో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దానికి తప్పనిసరిగా కరెంటు సౌకర్యం ఉండాలి. అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి నాటికి ప్రతి మండలానికి కనీసం ఒక ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. కానీ చేతిలో దాతలు ఇచ్చే పైకం మాత్రం లేదు. ప్రతి గంటకు వెయ్యి లీటర్లను శుద్ధిచేసే ప్లాంట్‌కు కనీసంగా రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాలంటే బిగ్‌షాట్సే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభుత్వంలోని పలు కీలకమైన విభాగాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, వీటిని పర్యవేక్షించే శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఇక వ్యాపారులపై కూడా కన్ను పడింది. ఏదో ఓ లొసుగు బయటకు తీసి విరాళాల ఒత్తిడి తేవడానికి పక్కా ప్లాన్ తయారు చేసుకున్నారు టీడీపీ నేతలు. డబ్బు ఒకరిది ... డాబు మరొకరిది ... ఇదేమి పథకమంటూ ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న అజ్ఞాత దాతలు మదనపడుతున్నారు. -
గ్రామాల్లో అక్టోబరు 2నుంచి మినరల్ వాటర్
విజయనగరం క్రైం: జిల్లా ప్రజలకు అక్టోబరు 2 నుంచి చౌకగా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్.మెహర్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు, కాలుష్య నియంత్రణ మండలి, ఎన్విరాన్మెంట్ ఇంజినీరు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలతో ఆయన గురువారం సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2న సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాలన్న ఆశయంతో పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశంలో పలు సంస్థలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. మెుదటి దశలో 200 గ్రామాల్లో నీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి మినరల్ వాటర్ అందించేందుకు సహకరించాలని కోరారు. అందులో అవసరమైన వాటర్ రిసోర్సు అందిస్తామని తెలిపారు. నీటి బోరుతో పాటు షెడ్, విద్యుత్ సరఫరా కల్పిస్తామన్నారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయ భవనాలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు యూజమాన్యాలతో సంప్రదించి ప్లాంట్లు ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. మరి కొంత మంది ప్రతినిధులు ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశానికి పూర్తి స్థాయి హామీ, ప్రతిపాదనలతో హాజరు కావాలని పీసీబీ ఈఈ కోరారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్.మెహర్‌ప్రసాద్, పీసీబీ ఈఈ ఆర్.లక్ష్మీనారాయణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటీశ్వరరావు, 21 పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
డేంజర్ వాటర్ !
గుర్తింపులేని మినరల్ వాటర్ తాగితే రోగాలబారిన పడటం ఖాయం టీడీఎస్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు ముప్పని తెలిసినా చోద్యం చూస్తున్న ప్రజారోగ్య శాఖ అధికారులు ఇదిగో! ఈ ఫొటో చూడండి ! మినరల్ వాటర్‌కోసం క్యూలో ఎలా నిలుచున్నారో! భూగర్భజలం మంచిది కాదని, మినరల్ వాటర్ ‘సురక్షితమని’ వీరి భావన. వాస్తవానికి మినరల్ వాటర్ సేవిస్తే...అనారోగ్యానికి దగ్గర పడుతున్నట్లే ! ఎందుకంటే మినరల్ వాటర్‌లో శరీర సమతుల్యతకు అవసరమైన మూలకాలను పూర్తిగా తొలగించి ఏమాత్రం పనికిరాని నీళ్లను ‘మినరల్’వాటర్ పేరుతో సేవిస్తున్నారు. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సాక్షి, చిత్తూరు: కలుషిత నీటి భయంతో ఫిల్టర్ నీటిని సేవిస్తున్న లక్షలాది ప్రజలకు గుర్తింపు లేని మినరల్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు మరో ముప్పును తెచ్చి పెడుతున్నాయి. శుద్ధి చేసిన క్యాన్, బాటిల్, ప్యాకెట్ ద్వారా విక్రయిస్తున్న నీటిని తాగితే రోగాలు త థ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కరిగిన ఘన పదార్థాల శాతాన్ని (టీడీఎస్- టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అతి స్వల్ప మోతాదుకు తగ్గించడమే అందుకు ప్రధాన కారణం. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వీటిలో పట్టుమని పది మినహా ప్లాంట్లన్నీ భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) గుర్తింపు లేకుండా వెలిసిన వే ! బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నా ప్రజారోగ్య అధికారులుగానీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు కానీ మొద్దునిద్ర వీడడం లేదు. స్వచ్ఛమైన నీరు అంటే.. హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే ఉన్న నీటిని స్వచ్ఛమైన నీరుగా వ్యవహరిస్తారు. దీన్ని శుద్ధజలం (డిస్టిల్డ్ వాటర్)గా పిలుస్తారు. ఈ నీటిని కర్మాగారాలకు వాడతారు. తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘన పదార్థాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఉపయోగకర ఘనపదార్థాలను మనం నీటి ద్వారానే గ్రహిస్తూ ఉంటాం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమై సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికర మూలకాలు కూడా తాగేనీటిలో కరిగి ఉన్నాయి. వీటిని తొలగించి శరీరానికి అవసరమైన మూలకాలను సరైన మోతాదులో ఉండేలా భూగర్భజలాలను శుద్ధి చేయాలి. కానీ చాలామంది ఈ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదు. హానికారకాలను తొలగించే ప్రక్రియలో భాగంగా చాలా ఫిల్టర్లు టీడీఎస్‌లను నామమాత్రపు స్థాయికి తగ్గిస్తున్నాయి. దీంతో తాగేనీటి ద్వారా శరీరం గ్రహించాల్సిన అవసరమైన మూలకాల మోతాదు గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో శరీరంలో ఘనపదార్థాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాగేనీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 80-150 మధ్య ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా పలు సంస్థలు చెబుతున్నాయి. బోరుబావులు, మున్సిపాలిటీ ద్వారా అందే శుద్ధజలమే ఆరోగ్యానికి మంచిది. టీడీఎస్ అంటే.. నీటిలో పూర్తిగా కరిగిన ఘన పదార్థాల శాతాన్ని టీడీఎస్‌గా వ్యవహరిస్తారు. లీటరు నీటిలో ఎన్ని మిల్లీగ్రాముల ఘన పదార్థాలు కరిగి ఉన్నాయో దీని ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలోని బోరు లేదా కొళాయి నుంచి సేకరించిన నీటిలో 500 టీడీఎస్ ఉందంటే ఈ నీటిలో లీటరుకు 500 మిల్లీగ్రాముల ఘనపదార్థాలు ఉన్నాయని అర్థం. అక్రమాలు ఇలా.. ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాతన ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్‌తో పాటు ఇతర వివరాలను రోజూ పరీక్షించి నమోదు చేసేందుకు ఓ బయోకెమిస్ట్ ఉండాలి. ఇవి ఉంటేనే మినరల్ ప్లాంటు ఏర్పాటుకు పబ్లిక్‌హెల్త్ అధికారులు అనుమతి ఇవ్వాలి. ఇవేవీ ఫిల్టర్ ప్లాంట్లలో కనిపించవు. ఈ క్రమంలో కనిపించే వాటర్ ప్యాకెట్, క్యాన్లలోని మినరల్ వాటర్ శుద్ధమైందని భావిస్తే ముప్పును కొని తెచ్చుకున్నట్లే! తెలుసుకోండిలా.. నీటిలో టీడీఎస్ తెలుసుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర *500-1000 వరకూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే చాలామంది మినరల్ వాటర్‌గా వ్యవహరిస్తారు. కానీ మినరల్ వాటర్ ప్రత్యేకమైంది. కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే దీనిని తయారు చేస్తున్నాయి... సిసలైన మినరల్ వాటర్ ఎన్ని ప్లాంట్లలో దొరుకుతుంటుందో? ఎలాంటి నీళ్లు సేవిస్తున్నారో అర్థమై ఉంటుంది కదా! -
మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?
మీరు మా ఆఫీసులో సరఫరా చేసే మినరల్ వాటర్ తాగుతున్నారా? మీ వాటర్ ప్యూరిఫయర్ ను ఎన్నాళ్లకి ఓ సారి కడుగుతున్నారు? వాటర్ మంచి కంపెనీ నుంచే వచ్చి ఉండవచ్చు. కానీ వాటర్ ను తీసుకొచ్చే బబుల్స్ (ప్లాస్టిక్ సిలెండర్స్) ఎంత శుభ్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలను ఎప్పుడైనా వేసుకున్నారా? ముంబాయిలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎం జీ ఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన వివరాలు చూస్తే కళ్లు తేలవేయడం ఖాయం. ముంబాయిలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్ ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. మరి.. మీ ఆఫీసులో ఎలా ఉంది? -
దాహం.. దాహం
నూజెండ్ల: మండలంలోని 50 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సాగర్ జలాలు విడుదల కాకపోవటం, వర్షాలు లేకపోవటం, గుండ్లకమ్మ నది ఎండిపోవటంతో మంచినీటి పథకాలకు నీరందకపోవటమే ఈ దుస్థితికి కారణం. నెల రోజులుగా జనం దాహం కేకలు పెడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రతి గ్రామానికి సురక్షితమైన మినరల్ వాటర్ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇదీ పరిస్థితి మండలంలోని 25 పంచాయతీల పరిధిలో 60 గ్రామాలు ఉన్నారుు. వీటిలోని 50 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీరు లేక తలార్లపల్లిలోని మంచినీటి పథకం పనిచేయకపోవటంతో తలార్లపల్లి, గొల్లపాలెం, మారెళ్లవారిపాలెం, త్రిపురాపురం, రెడ్డిపాలెం తదితర గ్రామాల ప్రజలకు తాగునీరు అందటం లేదు. దాదాపు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆయూ గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తలార్లపల్లిలోని బావి, చెరువుల్లో నీరు అడుగంటడం, చాలా గ్రామాల్లో బోర్లు ఎండిపోవటంతో కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క జనం అవస్థలు పడుతున్నారు. గతంలో సాగర్ జలాలు విడుదల చేసినపుడు చెరువులను నింపుకోవాలని ఉన్నతాధికారులు సూచించినప్పటికీ ఎస్ఎస్ ట్యాంక్‌లను నింపటంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. తలార్లపల్లి ఎస్ఎస్ ట్యాంక్‌కు నీరు వచ్చే ఛానల్ మధ్యలో ఉన్న కుంట ఆక్రమణకు గురవటంతో ఇకపై నీరు రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామం నుంచి వలస పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. రవ్వారం మంచినీటి పథకానికి సంబంధించిన ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తిగా ఎండిపోవటంతో పథకం పరిధిలోని ప్రజలు తాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.గుండ్లకమ్మ నది పూర్తిగా ఎండిపోవటంతో తంగిరాల, ఉప్పలపాడు, తెల్లబాడు, ములకలూరు, కొత్తకొత్తపాలెం, ఐనవోలు నాగిరెడ్డిపల్లి, జంగాలపల్లి తదితర గ్రామాల్లోని మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారారుు. సాగర్ జలాలు విడుదలయ్యే వరకు ఇబ్బందులు తప్పవు ఈ విషయమై ఆర్డ బ్ల్యూఎస్ ఏఈ మల్లికార్జునరావును వివరణ కోరగా సాగర్ జలాలు విడుదలయ్యేవరకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. జలాల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని వెల్లడించారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. -
మా హీరో బావకు మామంచి మెడిసిన్!
సరదాగా... చాలా రోజుల తర్వాత మా బావ దిగులుగా బజార్లో తిరుగుతూ కనిపించాడు. ‘‘తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. ఏ లోటూ లేకుండా బతుకుతున్నావు. ఇంకా ఏంటి, ఇంకా ఏం కావాలి బావా నీకు?’’ అని అడిగా. ‘‘ఏం బతుకులే... మొన్న ఆసుపత్రికి పోతే పరామర్శకు ఎవరూ రాలేదు. నా కోరిక ఏమిటంటే... నాకు జలుబు చేసి హాస్పిటల్‌కు వెళ్లానని తెలియగానే... ఆసుపత్రి ముందు ఇసకేస్తే రాలనంతగా జనం పోగవ్వాలి. కిటకిటలాడిపోతున్న ఆ జనసందోహమంతా ముక్తకంఠంతో ‘అన్నా... ఆసుపత్రిలో చేరావా అన్నా? డాక్టర్... డాక్టర్... ఏమైంది మా అన్నకు? ఒక్కసారి మా అన్నను మాకు చూపించండి డాక్టర్’ అంటూ అరవాలి. పోలీసులు బారికేడ్లు కట్టి ముందుకు నెడుతున్నా తోసుకొస్తున్న జనం... ‘పోనివ్వండి... మా అన్నను చూడాలి. డాక్టర్... ముక్కు మార్పిడి సర్జరీ చేయాల్సి వస్తే నా ముక్కు తీస్కోండి డాక్టర్...’ అంటూ జనం అరవాలి. నా జలుబు తగ్గాలంటూ సర్వమత ప్రార్థనలు జరగాలి. నా అభిమానుల్లో ఒకరు కర్చిఫ్ల లాట్‌ను లారీ మీద వేసుకురావాలి. ‘వదలండి... ఈ కర్చిఫ్లను మా అన్నకు ఇవ్వనివ్వండి’ అంటూ ఆ అభిమాని విలవిలలాడుతూ డాక్టర్లనూ, పోలీసులనూ ప్రాధేయపడుతుండాలి. దాంతో డాక్టర్లు నన్ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆసుపత్రి బాల్కనీ మీద నుంచి నావాళ్లకు చూపించాలి. నేనెంత ట్రై చేసినా ఇది కుదరడం లేదురా’’ అంటూ వాపోయాడు. ‘‘హీరోలా కనిపించడం కోసం మరి నువ్వేదో ఇతోధిక కృషి, అత్యధిక శ్రమా చేస్తున్నావటగా, ఏమిటవి?’’ అని అడిగా. ‘‘ఇంట్లో అటు మొక్కలకూ, ఇటు కుక్కలకూ మినరల్ వాటర్ పోస్తున్నా. మొన్న మా పెంపుడు కోడికి కాలు బెణికి కుంటుతుంటే... నా హీరోయిన్ అయిన మీ అక్క ముందు దానికి జండూబామ్ రాశా. దీనికి నా ఇంటి హీరోయిన్ అయిన మీ అక్క నావైపు ఆరాధనగా చూడాలి కదా! కానీ ఇవేం పనులంటూ ముక్కచివాట్లు పెట్టింది’’ అన్నాడు బావ. ఒకే ఒక్క మాటతో మా బావ హీరో అయ్యేలాగా, పనిలోపనిగా ఆయన కోరిక కూడా తీరేలా చేశాం. ఓ ఫ్రెండ్ సలహా మేరకు మా బావతో గొడవపడ్డట్టు నటించాం. మా అక్కను మా ఇంటికి తీసుకెళ్లాం. మాకు సలహా ఇచ్చిన ఫ్రెండే మా బావ దగ్గరికి వెళ్లి ‘నీ పెళ్లాన్ని నువ్వు తెచ్చుకో’’ అంటూ రెచ్చగొట్టాడు. దాంతో మా బావ వచ్చి మా అక్కను హీరోలా లాక్కెళ్లాడు. మా అక్క కోసం మేమంతా బావ మాట వింటామని ఆయనకు మాటిచ్చాం. ఆ రోజునుంచి మా బావతో మేం తరచూ అంటున్న మాట... ‘‘మన రెండు కుటుంబాలనూ కలిపిన హీరోవు బావా నువ్వు’’. ఈ మాటే మా పాలిట తారక మంత్రం... మా బావ పాలిట మాంఛి మెడిసిన్. తెలుగు సినిమాలు అంతగా తెలియని మాకు ఆ తర్వాత తెలిసిందేమిటంటే... ఇలా సయోధ్య లేకుండా కొట్టుకునే రెండు కుటుంబాలను కలపడం అన్నది హీరోలే చేస్తారట! - యాసీన్ -
మినరల్ వాటర్ పంపిణీ సాధ్యమేనా!
ఏలూరు :గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని పూర్తిస్థాయిలో ఇవ్వలేని ప్రభుత్వానికి మినరల్ వాటర్ ఇవ్వటం సాధ్యమైవుతుందా అనే అనుమానాలు వెన్నాడుతున్నాయి. నీటి వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లకు తలుపులు బార్లా తీసి నిర్వహణ బాధ్యతలను అప్పగించటానికే ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా శుద్ధి చేసిన నీటిని జనాభా నిష్పత్తిలో ఏ గ్రామాలోను ఇవ్వలేకపోతున్నారు. ఇందుకుగాను వనరులు పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్నా అవి గ్రామీణుల గొంతులను పూర్తిగా తడపటం లేదు. జిల్లాలో 2వేల 158 నివాసిత ప్రాంతాలకుగాను 1,292 ప్రాంతాలకు మాత్రమే పూర్తిస్థాయిలో తాగునీటిని అందిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాక్షికంగా నీరందుతున్న గ్రామాలు 790 ఉన్నాయి. సురక్షిత నీటి వనరులు లేని గ్రామాలు 76 ఉన్నాయి. 11 సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ ద్వారా సుమారు 100 గ్రామాలకు సురక్షిత నీరందిస్తున్నారు. ఇంకా పూర్తికాని మంచినీటి ప్రాజెక్టులు 15 వరకు ఉండగా, వాటికి చేయాల్సిన ఖర్చు రూ.150 కోట్ల పైమాటే. ఈ పథకాల నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. వీటి నిర్మాణాల్లో జాప్యం కారణంగా ప్రతి ఏటా వేసవిలో నీటి ఎద్దడితో 170 గ్రామాల వరకు అల్లాడుతున్నాయి. అలాంటి గ్రామాలకు మోక్షం కలిగించే నిర్ణయాలే మీ తీసుకోకుండా గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.2లకే 20 లీటర్లను అందిస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే స్థలం కావాలి. ఒక్కొక్క ప్లాంటు ఏర్పాటుకు కనీసం రూ.20లక్షల వ్యయమవుతుంది. ఇంత చేసి వీటిని ఏర్పాటుచేస్తే అందరికీ మినరల్ వాటర్ ఇవ్వటం సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలిసిన ప్లాంట్ల మాటేమిటి? జిల్లాలో 884 గ్రామ పంచాయతీలలో సుమారు 350కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఏర్పాటుకు చాలా చోట్ల విరాళాల రూపంలో నిధులు సమీకరించారు. వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఐదేళ్లపాటు వాటిపై వ్యాపారం చేసుకున్న తర్వాత వాటిని పంచాయతీలకు వదిలేసి వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ ప్లాంట్ల నిర్వహ ణను తనిఖీ చేయాల్సిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నీటిని విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. మూడేసి ప్లాంట్లు ఉన్న పంచాయతీలు కూడా ఉన్నాయి. కాగా ప్రభుత్వం మినరల్ వాటర్ అందించేందుకు కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తుందా? ఉన్న వాటినే తన అధీనంలోకి తీసుకుంటుందా? అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఆర్వో ప్లాంటు జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వాటి స్థితిగ తులు, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యాల్లో నడుస్తాయా? దీనికి చెల్లించే విద్యుత్ టారిఫ్ వివరాలను ఓ ఫ్రొఫార్మాలో అందించాలని ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం( ఆర్ డబ్ల్యుఎస్) అధికారులకు అందిందని విశ్వసనీయ సమాచారం. వారు వివరాలు సేకరిస్తున్నారు. సుజల స్రవంతి పథకం అమలుపై ఈనెల 30న మంత్రి వర్గ ఉపసంఘం 13 జిల్లాల్లోని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనుంది. ఆ రోజు మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
'2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్'
హైదరాబాద్: ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తొలి విడతలో 5,200 గ్రామాల్లో అమలు చేస్తామని ఆయన అన్నారు. అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తామని ఓ ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. ఈ పథక విధివిధానాలపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో రూ.2కే 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆధికారులకు అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. -
దవాఖానాల్లో దాహం.. దాహం
ప్రభుత్వాసుపత్రుల్లో క‘న్నీటి’ కష్టాలు పేషెంట్లకు కలుషిత నీరే దిక్కు మినరల్ వాటర్ కొనలేని పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆసుపత్రులు సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు దాహంతో అల్లాడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ఆస్పత్రులకు సరిపడా మంచి నీరు సరఫరా చేయక పోవడంతో ఖాళీ సీసాలు పట్టుకుని రోగుల బంధువులు రోడ్ల వెంట ఉన్న చలివేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. కొంతమంది సొంత ఖర్చుతో మినరల్ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఆస్పత్రుల్లో సరఫరా అవుతున్న మురుగు నీరే సేవిస్తున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల సమీపంలోని దుకాణాల్లో మంచినీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అడపాదడపా సరఫరా అవుతున్న నీరు కూ డా పూర్తిగా కలుషితం అవుతోంది. మంచినీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత అంశాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్రమత్తత లోపించింది. కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీటి ట్యాంకుల్లో చెత్త, మురికి పేరుకు పోతుంది. దీంతో రోగులకు సరఫరా చేస్తున్న మంచి నీటిలో ‘ఈ కోలీ బ్యాక్టీరియా’ ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఈ నీటిని తాగడంతో రోగులతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు అనారోగ్యం పాలు కావాల్సి వస్తోందని పేర్కొంది. రోజుల తరబడి శుభ్రం చేయని సంపులు రోగులు, వైద్యులు, సిబ్బంది తాగునీటి అవసరాల కోసం ఉస్మానియా ఆసుపత్రిలో 14 సంపులను ఏర్పాటు చేశారు. వీటిలో చా లా వాటికి మూతల్లేవు. చెట్ల ఆకులు, దుమ్ము, ధూళి ట్యాంకుల్లో చేరడంతో నాచు పేరుకుపోతోంది. దీనికి తోడు బోరు నీరు కూడా కలుస్తుంది. ఏడాదైనా వీటిని శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతోంది. ఇలా కలుషితమైన నీటిని తాగడంతో గత ఏడాది ఇదే ఆసుపత్రిలోని 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అప్రమత్తమైన అధికారులు అప్పట్లో ట్యాంకులను క్లీన్ చేయించినప్పటికీ, ఆ తర్వాత వీటి నిర్వహణను పూర్తిగా మరిచిపోయారు. తాజాగా ఓ రోగికి చెందిన ఇద్దరు బంధువులు ఈ నీటిని తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. బ్లీచింగ్ కూడా కొరతే ఛాతీ ఆసుపత్రిలోని మంచినీటి ట్యాంకు పరిసరాలు, వంటగది అపరిశుభ్రంగా ఉన్నాయి. అదేవిధంగా ఎర్రగడ్డ మానసిక చికిత్సా లయంలోని నీటి ట్యాంకుల వద్ద మురుగు నీరు చేరుతుంది. నిలోఫర్, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇక్కడ సరఫరా అవుతున్న మంచినీటిలో కోలీఫామ్ బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు ఐపీఎం పరీక్షల్లో తేలింది. ప్రతి ఆరు మాసాలకోసారి బ్లీచింగ్‌తో ట్యాంకులను శుభ్రం చే యడంతో పాటు, ప్రతి నెలా నీటిని పరీక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు వీటిని అసలు పట్టించుకోవడం లేదు. అయితే ఆసుపత్రుల్లో బ్లీచింగ్ లేకపోవడం వల్లే ట్యాంకుల జోలికి వెల్లడం లేదని సిబ్బంది పేర్కొం టుంది. ఫలితంగా అనేక మంది రోగులు, వారి తరుపు బంధువులు వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
వాటర్ ప్లాంట్లకు తాళం
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో మినరల్ వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. 250 మినరల్ వాటర్ ప్లాంట్లకు తాళం వేస్తూ పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు వెలువరించింది. ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో క్యాన్ల ధరకు రెక్కలు రానున్నాయి. లారీల ద్వారా తాగు నీటిని సరఫరా చేయడానికి నీటి పారుదల శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల మినరల్ వాటర్ క్యాన్ల వాడకం పెరుగుతోంది. ఇళ్లలోనూ, కార్యాలయాలు, హోటళ్లలో తాగునీరుగా మినరల్ వాటర్ క్యాన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ఉత్పత్తి సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ అనుమతితో కొన్నిసంస్థలు శుద్ధీకరించిన నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు ధనార్జనే ధ్యేయంగా శుద్ధీకరించకుండానే ముందుకు సాగుతున్నాయి. చెన్నైలో ప్రతి ఇంటా తప్పనిసరిగా వాటర్ క్యాన్లను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో నగర శివారుల్లో కోకొల్లలుగా వెలసిన మినరల్ వాటర్ ప్లాంట్లు పోటీ పడి విక్రయాలు చేస్తున్నాయి. అయితే, శుద్ధీకరించకుండా క్యాన్ల విక్రయం, భూగర్భజలాల దోపిడీపై పర్యావరణ ట్రిబ్యునల్ ఇటీవల దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో సాగుతున్న నీటి వ్యాపారంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక: దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా జల దోపిడీకి పాల్పడుతూ సొమ్ములు చేసుకుంటున్న మినరల్ వాటర్ క్యాన్ సంస్థలపై పడ్డారు. అనుమతులు లేవని గుర్తించి కొన్ని సంస్థలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంతో గతంలో యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో చెన్నై మహానగరంలో వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. బ్లాక్ మార్కెట్లో రూ.వంద నుంచి రూ.150 వరకు పలికారుు. ఎట్టకేలకు కొరడా ఝుళిపించిన అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలనల అనంతరం నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను గురువారం పర్యావరణ ట్రిబ్యునల్ ముందు ఉంచారు. రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారి రామన్ నేతృత్వంలోని బృందం సమర్పించిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 857 మినరల్ వాటర్ క్యాన్ల ఉత్పత్తి సంస్థలు ఉన్నట్టు తేల్చారు. 252 సంస్థలకు బోరు బావుల ద్వారా నీటిని తోడుకునే అనుమతి ఉందని, అయితే, అదే సంస్థల పరిధిలో ఉన్న మరో 527 సంస్థలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చెన్నైలో 33 సంస్థలు మెట్రో వాటర్ బోర్డు నీటిని ఉపయోగించుకుంటున్నాయని వివరించారు. నివేదికను పరిశీలించినానంతరం ఆ 252 సంస్థలకు తాళం వేయాలని ఆదేశించారు. దీంతో ఆ సంస్థలతో పాటుగా 527 సంస్థల్లో వాటర్ క్యాన్ల ఉత్పత్తి ఆగింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 13కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. అంత వరకు ఆ సంస్థలకు తాళం వేయాల్సిందేనని ఆదేశాలు వెలువడటంతో మినరల్ వాటర్ క్యాన్ల యాజమానుల సంఘాన్ని ఆందోళనలో పడేసింది. ఆగిన సరఫరా: ట్రిబ్యునల్ తీర్పుతో ఆయా సంస్థల్లో క్యాన్ల ఉత్పత్తి ఆగింది. వాటర్ క్యాన్ల సరఫరాను నిలుపుదల చేస్తూ యాజమాన్య సంఘం నాయకుడు ఎల్ లోకేష్ ప్రకటించారు. అన్ని సంస్థలు ఉత్పత్తిని నిలుపుదల చేసి ఆందోళన బాట పట్టినట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులతో తాము క్యాన్లను సరఫరా చేస్తుంటే, కొత్తగా మెలికలు పెట్టడం, సంబంధం లేని సంస్థలను తమకు అంట కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అయితే, అనుమతులు ఉన్న సంస్థలకు తాళం వేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. తాము ఆందోళన బాట పట్టిన దృష్ట్యా, ఇక వాటర్ క్యాన్ల సరఫరా ఆగినట్టేనని ప్రకటించారు. వీరి ఆందోళన పుణ్యమా నగరంలో వాటర్ క్యాన్లకు డిమాండ్ ఏర్పడబోతుంది. చాపకింద నీరులా వాటర్ క్యాన్ల సరఫరా జరగడం తథ్యమని, అదే సమయంలో ధర పెరగడం ఖాయం అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీల ద్వారా సరఫరా: వాటర్ క్యాన్ల సరఫరా ఆగడంతో లారీల ద్వారా తాగునీటిని ప్రజలకు సరఫరా చేయడానికి మెట్రో వాటర్ బోర్డు నిర్ణయించింది. ఆగమేఘాలపై ఇందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. నగర శివారుల్లోని వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని రోజుకు నాలుగు కోట్ల లీటర్ల తాగునీటిని అందించడంతో పాటుగా, నైవేలిలో అదనపు బోరు బావుల ఏర్పాటుకు నిర్ణయించారు. -
‘మినరల్’ పేరిట దగా!
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట పట్టణంలో 23 వేల కుటుంబాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు మినరల్ వాటర్ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించిన మినరల్ ప్లాంట్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస ప్రమాణాలు, పరిజ్ఞానం, సాంకేతికత లేకుండానే జనం జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మనిషి వందేళ్ల ఆయుష్షులో సగం పడిపోవడానికి కలుషిత నీరే కారణమని నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన నీరని నమ్ముబలుకుతూ... పట్టణ పరిధిలో 23 వాటర్ ప్లాంట్లున్నాయి. వీటిలో చాలా వాటికి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), ఐఎస్ఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) అనుమతులు లేవు. బీఐఎస్ అనుమతి ఉంటే.. కనీస ప్రమాణాలను పాటించి తీరాల్సిందే. ఆకస్మిక తనిఖీలను ఎదుర్కోవాల్సిందే. అందుకే బీఐఎస్ పర్మిషన్లు తీసుకోరు. 20 లీటర్ల సామర్థ్య ఉన్న బబుళ్లను నిర్ధేశిత ప్రక్రియతో శుభ్రం చేయకుండానే ప్లాంట్ల ద్వారా నేరుగా భర్తీ చేస్తున్నారు. ఓ క్రమ పద్ధతి అంటూ పాటించకుండానే ఎక్కడెక్కడో తిరిగొచ్చే బబుళ్లల్లో నీటిని నింపేస్తున్నారు. వేలల్లో బబుళ్ల అమ్మకాలు.. లక్షల్లో ఆదాయం మున్సిపాలిటీ నల్లాల ద్వారా 10 వేల కుటుంబాలకు తాగునీరు అందుతోంది. మిగతా వాటిల్లో సుమారు 8 వేల కుటుంబాలు వాటర్ ప్లాంట్ల నీటినే వినియోగిస్తున్నట్లు అం చనా. అంటే ఒక్కో బబుల్‌కు రూ. 15 చొప్పున లెక్కగట్టినా రోజుకు రూ. 1.20 లక్షల మేర నీళ్లు అమ్ముడవుతున్నాయి. ప్రక్రియ ఎలా ఉండాలంటే... క్లోరినేషన్, ఫిల్ట్రేషన్ (వడపోత), డీ క్లోరినేషన్ (సోడియం మెటాబై సల్ఫేడ్), యాంటీ స్కాలెంట్, మెంబ్రెన్ ఫిల్ట్రేషన్(0.5 మైక్రాన్స్), అల్ట్రా వయలెట్(యూవీ) స్టెరిలైజేషన్(క్రిమి సంహరణం), అల్ట్రా ఫిల్ట్రేషన్(0.2 మైక్రాన్లు), రివర్స్ ఆస్మాసిస్ నుంచి ఓజొనేషన్ అవుతుంది. ఈ దశల వారీ ప్రక్రియలతో నీరు గరిష్టంగా శుద్ధమై.. ఫిల్లింగ్ గదిలోకి చేరుతుంది. అక్కడ బబుళ్లలో భర్తీ చేస్తారు. చివరగా రవాణా చేసే ముందు కూడా స్క్రీనింగ్ (ఇన్స్పెక్షన్ బాక్స్) చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాకే డోర్ డెలివరీకి తరలించాలి. కానీ అలా జరగడం లేదు. మచ్చుకు కొన్ని గమనించండి... బబుళ్లను వేడి నీళ్లు, సోడియం హైపోక్లోరైడ్ (బబుల్ వాషింగ్ ఏజెంట్)తో కడగడంలేదు. అనేకచోట్ల రికార్డుల నిర్వహణ ఉండడంలేదు. ఐఎస్ఐ సర్టిఫైడ్ బబుళ్లకు బదులు నాసిరకం వాటిని వాడుతున్నారు. సాన్డ్ ఫిల్టర్ నుంచి మొదలుకొని...రివర్స్ ఆస్మాసిస్, ఓజెనైజ్డ్ వరకు నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాలి. నిర్దేశిత ప్రమాణాలు పాటించే వాటర్ బబుళ్ల నీరు 21 రోజులు వినియోగించొచ్చు. ప్యూమిగేషన్ (కనీసం రెండ్రోజులకోసారి చేసే ఈ ప్రయోగంతో ప్లాంట్ల విభాగాల్లోని బ్యాక్టీరియా విగతమవుతుంది) చేయాలి. క‘హానీ’లు తెలుసుకోండి... సిద్దిపేటలోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు ‘న్యూస్‌లైన్’తో సోమవారం అబద్ధమాడారు. తమకు బీఐఎస్ లెసైన్సు ఉందని జిరాక్సు సెట్టు చూపాడు. దాంట్లో నిజంగా నే వచ్చే నవంబరు 4 దాకా గడువుంది. కానీ...సరైన ప్రమాణాలు పాటించనందున ‘అండర్ స్టాప్ మార్కింగ్’ అని ఆ కంపెనీ వివరాలను వెబ్సైట్లో బీఐఎస్ ప్రదర్శిస్తోంది. నిజంగానే అనుమతి కొనసాగుతుంటేగనక ‘ఆపరేటివ్’ అని ఉండాలి. మరో ప్లాంటాయన...‘మాకు గిట్టుబాటు అవడంలేదు. వచ్చేనెలలో మూసేస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. ఇం కో చోటకెళ్తే మేం రూ.7కే బబుల్ ఇస్తున్నాం. మాది ప్రజాసేవ. బీఐఎస్ అనుమతి ఎందుకంటూ సమర్థించుకున్నాడు. ఇంకొకాయనేమో...ఐఎస్ఐ పర్మిషన్ ఉన్నవాళ్లు నామ్కేవాస్తేగా ల్యాబులు పెడతారంతేనని అన్నాడు. సురక్షితమైన నీరు కావాలా...ఆరోగ్యాలను హరించి ఆస్పత్రుల పాల్జేసే నీళ్లు కావాలా..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. పరిశీలిస్తాం... వాటర్ప్లాంట్లను తనిఖీ చేసే పూర్తి అధికారం మాకుంది. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. ఒకవేళ తగిన అనుమతులు లేకుంటే చూసి తగిన చర్యలు తీసుకుంటాం. - కృష్ణారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, సిద్దిపేట మున్సిపాలిటీ మళ్లీ తెరిచిన సంగతి తెలీదు గతంలో నేను 18 ప్లాంట్లను సీజ్ చేశాను. తమకు సీజ్ చేసే అధికారం లేదని కొందరు...ట్రస్టీల తరఫున నిర్వహిస్తున్నామంటూ ఇంకొందరు..కోర్టు మార్గదర్శకాలంటూ మరి కొందరు వాదించారు. మళ్లీ తెరిచిన సంగతి తెలియాల్సి ఉంది. - ఎన్వై.గిరి, తహశీల్దారు, సిద్దిపేట -
మాయాజలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రజల పాలిట శాపంగా మారాయి. వినియోగదారులను రోగాల బారిన పడేస్తున్నాయి. అధికారుల నియంత్రణ కరువవడం.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ) నిబంధనలు విస్మరించిన నిర్వాహకులు.. అధికారులతో కుమ్మక్కై వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం ఇలా కాలాలతో సంబంధం లేకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌తోపాటు జిల్లాలో మంచినీళ్ల వ్యాపారం సాగుతోంది. 200 వరకు ప్లాంట్లు ఉన్నా కేవలం ఏడింటికే బీఎస్ఐ అనుమతి ఉంది. ఈ ప్లాంట్లలో మాత్రమే ఐఎస్ఐ ప్రమాణాలు పాటిస్తుండగా, నిబంధనలు విస్మరించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలు ఇవే.. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. బీఎస్ఐ అనుమతి తీసుకోవాలి. వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సమస్యలు వస్తాయని బీఎస్ఐ, వైద్యులు పేర్కొంటున్నారు. * నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలు(టీడీఎస్) కూడా పరీక్షించాలి. * కొత్తగా ఒక వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే కనీసం పది గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటి పరీక్ష చేసే ల్యాబ్, పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. * ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో పద్ధతిలో 3 వేల లీటర్ల కెపాసిటీ డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని ఓజోనైజేషన్ చేయాలి. *మినరల్ వాటర్‌ను క్యానులోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి, మార్కెట్లోకి పంపాలని బీఎస్ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. * నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి. * నీటిని క్యానులలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి. * శానిటరీ అధికారులు ప్రతినెలా నీటిని తనిఖీ చేసి నివేదికను ఐఎస్ఐకి పంపాలి. {పతి ఏడాది ఐఎస్ఐ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాలి. భూగర్భ జలాలే శ్రేయస్కరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్లాంట్లలో చాలామంది ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని చిన్నచిన్న గదుల్లో ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వ చేసే క్యాన్లను శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. అనుమతి ఉన్న ఏడింటిలో మినహాయిస్తే మిగతా ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలకు ఐఎస్ఐ సర్టిఫికెట్లు ఉన్నా ఏటా రెన్యూవల్ చేయించుకోవడం లేదు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కచ్చితంగా భూగర్భజలాలు ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధ జలం తయారీకి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలు విరివిగా తీయడం వల్ల ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని చుట్టూ పక్కల ఉండే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏటా రూ.3 కోట్లపైనే పన్ను ఎగవేత బీఎస్ఐ అనుమతి లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు జిల్లాలో ఏటా రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు. మినరల్ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు పన్నులు చెల్లించడం లేదు. బీఎస్ఐ అనుమతి ఉంటే ప్లాంటు నిర్వాహకుడు ఏటా రూ.90,260 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. రూ.32,205 వాటర్ టెస్టింగ్ కోసం చెల్లించాలి. మరో రూ.27,500 వరకు ఇతర ఖర్చులు అవుతాయి. అయితే జిల్లాలో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మినహాయిస్తే ఎక్కడా ఈ పద్ధతి పాటించడం లేదు. ఏటా ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దమొత్తంలో నష్టం జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్టయిన లేదు. ఇదిలా వుండగా నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని వాటర్ ప్లాంట్ల యజమానులు పోటాపోటీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 లీటర్ల నీటికి రూ.15 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.1 నుంచి రూ.2 ఖర్చవుతుంది. ట్రాన్స్‌పోర్టు చార్జీలు మినహా ఎలాంటి పన్నులు, ఖర్చులు లేకున్నా అధిక ధరలు వసూలు చేయడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండటంపై విమర్శలు వస్తున్నాయి. -
నాణ్యత ‘నీటి’ మూట
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: పేరుకే మినరల్ వాటర్. ఆ పేరుతో జనాన్ని పచ్చి దగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. నిత్యం శుద్ధజలం పేరుతో లక్షల లీటర్లు రవాణా చేస్తూ నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న ప్యూరిఫైడ్ వ్యాపారంపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.. ప్రజలకు రక్షిత నీరు అందిచండంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు చేస్తున్న నీటి వ్యాపారం దినాదినాభివృద్ధి చెందుతోంది. జిల్లాకేంద్రం నెల్లూరుతో పాటు 46 మండలాల్లో దాదాపు 400కు పైగా ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐఎస్ఐ మార్కుతో పాటు ప్రమాణాలు పాటిస్తున్నా.. దాదాపు 300కు పైగా వాటర్ప్లాంట్లలో ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆయా వాటర్ప్లాంట్లలో నిత్యం లక్షల లీటర్ల నీరు ఉత్పత్తి అవుతోంది. అయితే పంచాయతీల్లో మలినాలతో కూడిన నీటితో వ్యాపార నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.20 లక్షలు అర్జిస్తున్నట్టు అంచనా. అంటే నెలకు రూ.6కోట్లకు పైగా ధనాన్ని ప్రజలు వెచ్చిస్తున్నారు. అధికారుల పరిశీలన శూన్యం వాటర్ప్లాంట్ల నుంచి తయారవుతున్న నీటి నాణ్యతపై ప్రజారోగ్య విభాగం చర్యలు శూన్యం. ఈ నీళ్లు ఎంతవరకు సురక్షితమో గతంలో అధికారులు నిర్వహించిన దాడులే వెల్లడించాయి. పలుచోట్ల పంచాయతీ వాటర్ ట్యాప్‌ల నుంచి నీటిని నింపి అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. మార్కెట్లో విక్రయించే ముందు నీళ్లలోని జీవ, రసాయన కణాల ఉనికిని తెలుసుకోవడానికి మైక్రోబయాలజీ, బయోకెమికల్ పరీక్షలు నిర్వహించాలి. దీనికి ప్రతి ప్లాంట్‌లో తప్పనిసరిగా సొంత ప్రయోగశాల, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలి. దాదాపు 90 శాతం ప్లాంట్లలో ప్రయోగశాలల్లేవు. పరీక్షించకుండానే ప్రజలకు అంటగడుతున్నారు. చాపకింద నీరులా ఈ వ్యాపారం గ్రామాలకు విస్తరించింది. ఇకనైనా ప్రజారోగ్య విభాగం మామూళ్ల మత్తును వీడి నీటి నాణ్యత పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మధ్యాహ్న భోజనంతో మినరల్ వాటర్
సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు మినరల్ వాటర్ బాటిళ్లను అందించే అవకాశాలను పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై టాస్క్‌ఫోర్స్ సభ్యులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీనా మాట్లాడుతూ.. పాఠశాలలకు నాంది ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యత, పరిమాణం.. తదితర అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షించే బాధ్యతను ప్రత్యేకంగా ఒక టీచర్‌కు అప్పగించాలని డీఈవోకు సూచించారు. ప్రైవేటు ఏజెన్సీకి నాణ్యత పరిశీలన ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తోన్న ఆహారం, మంచినీటి నాణ్యతను పరిశీలించేందుకు అవసరమైన శాంపిల్స్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, మెట్రోవాటర్ వర్క్స్ సంస్థలకు పంపాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే ఈ బాధ్యతలను ప్రైవేటు ఏజన్సీకి అప్పగించే ప్రతిపాదనను పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సోషల్ ఆడిట్(సామాజిక సర్వే) బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి ప్రజల స్పందనను తెలుసుకోవాలని కలెక్టర్ మీనా డీఈవోకు సూచించారు. సమావేశంలో ఆర్వీఎం పీవో సుబ్బరాయుడు, డీఈవో సుబ్బారెడ్డి, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.