
మినరల్ వాటర్ కంటే చవకైన చమురు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. భారీగా పడిపోయిన ధరలతో ముడి చమురు ఇప్పుడు అధికారికంగా మినరల్ వాటర్ కంటే చవకైంది. గతవారం 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగివచ్చిన ముడి చమురు ధరలు మరింతగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 29.24 డాలర్లకు (రూ.1,956.45) తగ్గింది. దీంతో లీటర్ క్రూడాయిల్ ధర రూ. 12కు చేరింది. లీటర్ మినరల్ వాటర్ కంటే ఇది 20 శాతం తక్కువ. మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 15గా ఉంది.
ఈ నెల 7న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ. 159 డాలర్లకు చేరింది. డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడిచమురు రేట్లు భారీగా పతనమవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించకపోవడంతో వినియోగదారులకు ఊరట లభించడం లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 59.35, లీటర్ డీజిల్ ధర రూ. 45గా ఉంది.