సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట పట్టణంలో 23 వేల కుటుంబాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు మినరల్ వాటర్ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించిన మినరల్ ప్లాంట్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస ప్రమాణాలు, పరిజ్ఞానం, సాంకేతికత లేకుండానే జనం జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మనిషి వందేళ్ల ఆయుష్షులో సగం పడిపోవడానికి కలుషిత నీరే కారణమని నిపుణులు చెబుతున్నారు.
స్వచ్ఛమైన నీరని నమ్ముబలుకుతూ...
పట్టణ పరిధిలో 23 వాటర్ ప్లాంట్లున్నాయి. వీటిలో చాలా వాటికి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), ఐఎస్‌ఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) అనుమతులు లేవు. బీఐఎస్ అనుమతి ఉంటే.. కనీస ప్రమాణాలను పాటించి తీరాల్సిందే. ఆకస్మిక తనిఖీలను ఎదుర్కోవాల్సిందే. అందుకే బీఐఎస్ పర్మిషన్లు తీసుకోరు. 20 లీటర్ల సామర్థ్య ఉన్న బబుళ్లను నిర్ధేశిత ప్రక్రియతో శుభ్రం చేయకుండానే ప్లాంట్ల ద్వారా నేరుగా భర్తీ చేస్తున్నారు. ఓ క్రమ పద్ధతి అంటూ పాటించకుండానే ఎక్కడెక్కడో తిరిగొచ్చే బబుళ్లల్లో నీటిని నింపేస్తున్నారు.
వేలల్లో బబుళ్ల అమ్మకాలు.. లక్షల్లో ఆదాయం
మున్సిపాలిటీ నల్లాల ద్వారా 10 వేల కుటుంబాలకు తాగునీరు అందుతోంది. మిగతా వాటిల్లో సుమారు 8 వేల కుటుంబాలు వాటర్ ప్లాంట్ల నీటినే వినియోగిస్తున్నట్లు అం చనా. అంటే ఒక్కో బబుల్‌కు రూ. 15 చొప్పున లెక్కగట్టినా రోజుకు రూ. 1.20 లక్షల మేర నీళ్లు అమ్ముడవుతున్నాయి.
ప్రక్రియ ఎలా ఉండాలంటే...
క్లోరినేషన్, ఫిల్ట్రేషన్ (వడపోత), డీ క్లోరినేషన్ (సోడియం మెటాబై సల్ఫేడ్), యాంటీ స్కాలెంట్, మెంబ్రెన్ ఫిల్ట్రేషన్(0.5 మైక్రాన్స్), అల్ట్రా వయలెట్(యూవీ) స్టెరిలైజేషన్(క్రిమి సంహరణం), అల్ట్రా ఫిల్ట్రేషన్(0.2 మైక్రాన్లు), రివర్స్ ఆస్మాసిస్ నుంచి ఓజొనేషన్ అవుతుంది. ఈ దశల వారీ ప్రక్రియలతో నీరు గరిష్టంగా శుద్ధమై.. ఫిల్లింగ్ గదిలోకి చేరుతుంది. అక్కడ బబుళ్లలో భర్తీ చేస్తారు. చివరగా రవాణా చేసే ముందు కూడా స్క్రీనింగ్ (ఇన్‌స్పెక్షన్ బాక్స్) చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాకే డోర్ డెలివరీకి తరలించాలి. కానీ అలా జరగడం లేదు.
మచ్చుకు కొన్ని గమనించండి...
బబుళ్లను వేడి నీళ్లు, సోడియం హైపోక్లోరైడ్ (బబుల్ వాషింగ్ ఏజెంట్)తో కడగడంలేదు.
అనేకచోట్ల రికార్డుల నిర్వహణ ఉండడంలేదు.
ఐఎస్‌ఐ సర్టిఫైడ్ బబుళ్లకు బదులు నాసిరకం వాటిని వాడుతున్నారు.
సాన్డ్ ఫిల్టర్ నుంచి మొదలుకొని...రివర్స్ ఆస్మాసిస్, ఓజెనైజ్డ్ వరకు నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాలి.
నిర్దేశిత ప్రమాణాలు పాటించే వాటర్ బబుళ్ల నీరు 21 రోజులు వినియోగించొచ్చు.
ప్యూమిగేషన్ (కనీసం రెండ్రోజులకోసారి చేసే ఈ ప్రయోగంతో ప్లాంట్ల విభాగాల్లోని బ్యాక్టీరియా విగతమవుతుంది) చేయాలి.
క‘హానీ’లు తెలుసుకోండి...
సిద్దిపేటలోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు ‘న్యూస్‌లైన్’తో సోమవారం అబద్ధమాడారు. తమకు బీఐఎస్ లెసైన్సు ఉందని జిరాక్సు సెట్టు చూపాడు. దాంట్లో నిజంగా నే వచ్చే నవంబరు 4 దాకా గడువుంది. కానీ...సరైన ప్రమాణాలు పాటించనందున ‘అండర్ స్టాప్ మార్కింగ్’ అని ఆ కంపెనీ వివరాలను వెబ్‌సైట్‌లో బీఐఎస్ ప్రదర్శిస్తోంది. నిజంగానే అనుమతి కొనసాగుతుంటేగనక ‘ఆపరేటివ్’ అని ఉండాలి. మరో ప్లాంటాయన...‘మాకు గిట్టుబాటు అవడంలేదు. వచ్చేనెలలో మూసేస్తాం..’ అని చెప్పుకొచ్చాడు. ఇం కో చోటకెళ్తే మేం రూ.7కే బబుల్ ఇస్తున్నాం. మాది ప్రజాసేవ. బీఐఎస్ అనుమతి ఎందుకంటూ సమర్థించుకున్నాడు. ఇంకొకాయనేమో...ఐఎస్‌ఐ పర్మిషన్ ఉన్నవాళ్లు నామ్‌కేవాస్తేగా ల్యాబులు పెడతారంతేనని అన్నాడు. సురక్షితమైన నీరు కావాలా...ఆరోగ్యాలను హరించి ఆస్పత్రుల పాల్జేసే నీళ్లు కావాలా..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.
పరిశీలిస్తాం...
వాటర్‌ప్లాంట్లను తనిఖీ చేసే పూర్తి అధికారం మాకుంది. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. ఒకవేళ తగిన అనుమతులు లేకుంటే చూసి తగిన చర్యలు తీసుకుంటాం.
- కృష్ణారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సిద్దిపేట మున్సిపాలిటీ
మళ్లీ తెరిచిన సంగతి తెలీదు
గతంలో నేను 18 ప్లాంట్లను సీజ్ చేశాను. తమకు సీజ్ చేసే అధికారం లేదని కొందరు...ట్రస్టీల తరఫున నిర్వహిస్తున్నామంటూ ఇంకొందరు..కోర్టు మార్గదర్శకాలంటూ మరి కొందరు వాదించారు. మళ్లీ తెరిచిన సంగతి తెలియాల్సి ఉంది.
- ఎన్‌వై.గిరి, తహశీల్దారు, సిద్దిపేట
‘మినరల్’ పేరిట దగా!
Published Tue, Oct 29 2013 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement