
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులలో.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విస్తృతంగా సోదాలు నిర్వహించింది. నిబంధనలను అనుగుణంగా లేని ఉత్పత్తుల పంపిణీని అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
బీఐఎస్ లక్నో, గురుగ్రామ్‌లోని అమెజాన్ గిడ్డంగులపై దాడి జరిపి.. అక్కడ నిబంధనలను అనుగుణంగా లేని బొమ్మలు, హ్యాండ్ బ్లెండర్లు, అల్యూమినియం ఫాయిల్స్, మెటాలిక్ వాటర్ బాటిళ్లు, పీవీసీ కేబుల్స్, ఫుడ్ మిక్సర్లు, స్పీకర్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది. గురుగ్రామ్‌లోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో వందలాది ధృవీకరించని స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు, బొమ్మలు, స్పీకర్లు ఉన్నట్లు గుర్తించింది.
ఈ నాన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవిగా బీఐఎస్ గుర్తించింది. ఈ కారణంగానే ఢిల్లీలోని వారి రెండు సౌకర్యాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లు బయటపడ్డాయి. వీటన్నింటికీ.. బీఐఎస్ సర్టిఫికేషన్ లేదు.
ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులలో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్‌ఫ్లై వంటి బ్రాండ్స్ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మాత్రమే కాకుండా.. మీషో, మింత్రా, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా నాన్-సర్టిఫైడ్ ఉత్పత్తులు ఉన్నట్లు బీఐఎస్ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment