e commerce site
-
'రెండు లక్షల కిరాణా స్టోర్లు మూతపడతాయి': ఏఐసీపీడీఎఫ్
భారతదేశంలో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆన్లైన్ వ్యాపారం దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది.చాలామంది నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పండుగ సీజన్లో కిరాణా స్టోర్ల విక్రయాలు చాలా వరకు మందగించాయని ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 13 మిలియన్ల కిరాణా స్టోర్స్ ఉన్నట్లు.. ఇందులో 10 మిలియన్ల కంటే ఎక్కువ టైర్ 2, చిన్న నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ ప్రకారం.. క్విక్ కామర్స్ సైట్స్ వల్ల చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం ఆ సైట్లలో అందించే కొన్ని డిస్కౌంట్స్ కూడా అని వెల్లడించారు. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో చిల్లర వ్యాపారులను భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది, లేదా వారి వ్యాపారాలకు మంగళం పాడాల్సి ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కిరాణా స్టోర్లకు కస్టమర్ల సందర్శనలు దాదాపు సగానికి పడిపోయాయని తెలుస్తోంది. క్విక్ కామర్స్ ప్రభావం మెట్రోల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఇప్పటికే.. టైర్ 1 నగరాల్లో 60,000 స్టోర్స్, టైర్2, టైర్ 3 నగరాల్లో 50,000 స్టోర్స్ మూతపడ్డాయి. కాబట్టి చిన్న చిల్లర వ్యాపారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీపీడీఎఫ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by Upsc World official (@upscworldofficial) -
ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్‌హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రీ ఆన్లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్‌హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్ఎస్డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్ఎస్డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ఇంకా ఆగని ఉద్యోగాల కోత - ఈ సారి ఎంతమందంటే?
Amazon Layoffs: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజంగా ప్రసిద్ధి చెందిన 'అమెజాన్' (Amazon) మరోసారి లేఆఫ్స్ కింద తమ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. కంపెనీ ఎక్కడ, ఎంతమందిని తీసి వేసిందనే విషయాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, అమెరికాలోని ఫ్రెష్ గ్రోసరీ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులను తాజాగా తొలగించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ తన వర్క్‌ఫోర్స్ కోసం 'జోన్ లీడ్' పాత్రలను తొలగిస్తున్నట్లు గురువారం ధృవీకరించింది. జోన్ లీడ్ అనేది లోయర్ లెవెల్ మేనేజింగ్ పొజిషన్ అని తెలుస్తోంది. వీరందరూ అసోసియేటర్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. కస్టమర్ల సమస్యలపై ద్రుష్టి సారిస్తారు. అమెజాన్ ఎంతమందిని తొలగించిందనే విషయం ఖచ్చితంగా వెల్లడి కాలేదు, కానీ వందకంటే ఎక్కువ మంది ఉండవచ్చని సమాచారం నివేదికలు చెబుతున్నాయి. తీసేసిన ఉద్యోగులకు పరిహారం కూడా అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. (ఇదీ చదవండి: జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర ఎంతో తెలుసా?) గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్ఎం మెటా కంపెనీలు ఉన్నాయి. అమెజాన్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా లెక్కకు మించిన ఉద్యోగులను తీసేసింది. -
ఈ-కామర్స్ సంస్థలకు కొత్త బాధ్యతలు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: విక్రేతల మోసాలకు కూడా ఈ - కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా నిబంధనలను కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్‌ను రూపొందించడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సాధారణంగా విక్రేతలు, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్దిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ-కామర్స్ నిబంధనలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించే ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆయా ఈ-కామర్స్ సంస్థలనే బాధ్యులను చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి. ఈ-కామర్స్ సంస్థలో నమోదు చేసుకున్న విక్రేత నిర్లక్ష్యంగా వ్యవహరించి, వినియోగదారులు ఆర్డరు చేసిన ఉత్పత్తులు లేదా సర్వీసులను అందించడంలో విఫలమైనా సదరు ఆన్లైన్ షాపింగ్ సంస్థే బాధ్యత వహించేలా నిబంధనలు ఉండవచ్చని పేర్కొన్నాయి. -
ఫెస్టివల్ సీజన్ కదా.. చిల్ అవ్వండి, ఉద్యోగులకు 11 రోజులు సెలవులిచ్చిన కంపెనీ!
నగర వాసుల డైలీ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్లో కాస్త చిల్ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్ పేరుతో సెలవులు ఇచ్చింది. వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్ సీజన్ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We’ve announced an 11-day company-wide break for a second consecutive year! Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov. Mental health is important. — Sanjeev Barnwal (@barnwalSanjeev) September 21, 2022 చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
ఈ ఏడాది తొలి యూనికార్న్‌గా హోనాసా
న్యూఢిల్లీ: మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిల్చింది. సెకోయా, సోఫినా వెంచర్స్, ఎవాల్వెన్స్ క్యాపిటల్ తదితర సంస్థలు ఈ విడత ఇన్వెస్ట్ చేశాయి. సంస్థ ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన వాటి నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంది. కొత్తగా సమీకరించిన నిధులను వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్లు, నవకల్పనలు, పంపిణీ.. మార్కెటింగ్ వ్యవస్థలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు హోనాసా సహ వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ అలగ్ తెలిపారు. మామాఎర్త్, ది డెర్మా కంపెనీతో పాటు కొత్తగా ఆక్వాలాజికా బ్రాండ్ పేరిట స్కిన్‌కేర్ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లు ఆయన వివరించారు. మామాఎర్త్ బ్రాండ్ కింద శిరోజాలు, చర్మ సంరక్షణ, కాస్మెటిక్స్ మొదలైన ఉత్పత్తులను, ది డెర్మా కంపెనీ బ్రాండ్ కింద 40 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు హోనాసా మరో సహ వ్యవస్థాపకుడు, సీఈవో గజల్ అలగ్ తెలిపారు. అయిదేళ్ల క్రితం ఏర్పాటైన హోనాసా దేశీయంగా 1,000 పైచిలుకు నగరాల్లో ఉత్పత్తులు అందిస్తోంది. -
క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు
న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్న పలు విక్రయ సంస్థలపై కేంద్ర వినియోగ హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) దృష్టి సారించింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను అందిస్తున్నందుకు విక్రేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన సంస్థల్లో ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్మాల్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటీఎంమాల్ తదితర విక్రేతలకు ఈ నెల 18న నోటీసులు జారీ అయ్యాయని సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఫోకస్ చేశాం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో సందర్భంగా నిర్వహిస్తున్న ’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై దృష్టి సారించినట్లు సీసీపీఏ స్పష్టం చేసింది. నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి సీసీపీఏ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఈ ప్రకటన తెలిపింది. నకిలీ వస్తువుల తయారీ లేదా విక్రయాల ద్వారా నిబంధలనకు వ్యతిరేకంగా వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరిపే సంస్థలపై దర్యాప్తు చేయాలని సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. రోజువారీ వినియోగ ఉత్పత్తులపై దృష్టి ప్రత్యేకించి రోజువారీ వినియోగ ఉత్పత్తులు హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు వంట గ్యాస్ సిలిండర్ల వంటి వస్తువులపై సీసీపీఏ దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రకటన వివరించింది. ‘బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 16 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇ–కామర్స్ సంస్థలపై సీసీపీఏ తనకుతానుగా సీసీపీఐ చర్యలకు ఉపక్రమించింది’’ అని అని ప్రకటన పేర్కొంది. నోటీసులు నవంబర్ 18న జారీ అయ్యాయని ప్రకటన పేర్కొంటూ, నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా ఇ–కామర్స్ సంస్థల నుండి ప్రతిస్పందనను అథారిటీ కోరిందని, లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్య తీసుకోవచ్చని వివరించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఐఎస్ డీజీ (డైరెక్టర్ జనరల్)కి కూడా సీసీపీఏ లేఖ రాసిందని వెల్లడించింది. బీఐఎస్ ఉత్తర్వు ప్రకారం, దేశీయ ప్రెషర్ కుక్కర్లు భారతీయ ప్రామాణిక ఐఎస్ 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 ఆగస్ట్ 1 నుండి అమలులోకి వచ్చిన బీఐఎస్ లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి. వినియోగదారుల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు, 2020లోని రూల్ 4(2) ఏ ప్రకారం ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారానికి సంబంధించి వినియోగదారుకు వ్యతిరేకంగా ఎటువంటి అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అవలంభించకూడదు. 13 ఉత్పత్తుల జాబితా ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉన్న 13 ఉత్పత్తుల జాబితాపై దృష్టి సారించినట్లు సమాచారం. ► వీటిలో రెండు– ‘అమెజాన్ బేసిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్– నాలుగు లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు), క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్– ఇన్నర్ లిడ్’ వీటిలో ఉన్నాయి. ► ఫ్లిఫ్‌కార్ట్. కామ్ విషయంలో మూడు ప్రాడక్టులపై పరిశీలన ఉంది. వీటిలో క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (అల్యూమినియం), ప్రిస్టైన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (స్టెయిన్లెస్ స్టీల్), డైమండ్ బై ఫాస్ట్కలర్స్ ఔటర్ లిడ్ 10 మినీ ప్రీమియం 10మిని ) ఉన్నాయి. ► స్నాప్ డీల్‌కు సంబంధించి రెండు ఉత్పత్తుల్లో– ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్ల అల్యూమినియం ఔటర్లిడ్ ప్రెజర్ కుక్కర్, బెస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్టాప్ అనుకూలమైన చెర్రీ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు) ఉన్నాయి. ► షాప్‌క్లూస్.కామ్లోలో మూడు ఉత్పత్తులు ఉన్నాయి –– క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ప్రెజర్ కుక్కర్ (ఇండక్షన్ బాటమ్–అల్యూమినియం), ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఎథికల్ టీఆర్ఐ–నేచర్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఇండక్షన్ బోటమ్ స్టైన్లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్ఏఎస్ జాబితాలో నిలిచాయి. ► పేటీఎంమాల్ మూడు ఉత్పత్తుల విక్రయాన్ని అందిస్తోంది. ప్రిస్టైన్ 5.5 లీటర్ల ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1), క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1), ఎథికల్ కుక్వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్ (స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1) వీటిలో ఉన్నాయి. చదవండి: ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా -
చైనాకు అమెజాన్ భారీ షాక్
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్.. చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన ప్లాట్‌ఫామ్ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(తొలగిస్తున్నట్లు) ప్రకటించింది. అంతేకాదు ఇవి ప్రమోట్ చేసిన 600 చైనా బ్రాండ్లను సైతం ప్రొడక్ట్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటోందా?.. అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఫేక్ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్ చేస్తున్న ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(యాప్ నుంచి తొలగిస్తున్నట్లు), 600 బ్రాండ్లను తీసేస్తున్నట్లు ప్రకటించి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ హఠాత్ నిర్ణయంతో సుమారు 130 మిలియన్ల రెన్మింబి (చైనీస్ యువాన్) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫేక్ రివ్యూలతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినందుకు తొలగించినట్లు తెలిపింది. ‘మేడ్ ఇన్ చైనా.. సోల్డ్ ఇన్ అమెజాన్’ పేరుతో ఏర్పాటైన మర్చంట్ కమ్యూనిటీ ఈ తతంగాన్ని ఇంతకాలం నడిపిస్తూ వస్తోంది. ఇదంతా వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన కిందకు వస్తుందని అమెజాన్ పేర్కొంది. నిజానికి చైనా యాప్‌ల విషయంలో అమెజాన్ ఇలా కఠినంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదు. న్యాయపరమైన చర్యలు కూడా.. ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్ సంస్థ బ్యాన్ చేసింది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది కూడా. అయినప్పటికీ చైనా మార్కెట్లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అయ్యాయి. అయితే అమెజాన్ మాత్రం ఇలాంటి చర్యల్ని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే నుంచి రంగంలోకి దిగి.. చర్యలను మొదలుపెట్టింది. దీనివల్ల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ట్రేడ్ గ్రూప్ షెంజెన్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ అసోషియేషన్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తీసుకున్న చర్యలు.. మునుపటి కంటే తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్, బ్యాన్‌తో పాటు న్యాయపరమైన చర్యలకు సిద్ధపడుతోంది అమెజాన్. అమెజాన్ కాకుంటే ఇంకొకటి.. అయితే అమెజాన్ చర్యలు.. చైనా ఈ-కామర్స్ మార్కెట్‌పై ప్రభావం చూపెట్టకపోవచ్చని చైనా మీడియా హౌజ్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. చైనా తొలగించిన ఆన్లైన్ స్టోర్లు, బ్రాండ్లు.. ఈబే, అలీఎక్స్‌ప్రెస్ వైపు మళ్లుతున్నట్లు చెబుతోంది. ఇక అమెజాన్ సైతం ఈ వివాదంపై స్పందించింది. అమెజాన్ కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేయలేదని.. మిగతా దేశాల్లోనూ ఈ తరహా చర్యలు చేపట్టినట్లు అమెజాన్ ఆసియా గ్లోబల్ సెల్లింగ్ వైస్ ప్రెసిడెంట్ సిండీ థాయ్ వెల్లడించారు. తమ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ చెప్తున్నారామె. ఈ పోటాపోటీ స్టేట్మెంట్ల నడుమ మిలియన్ల విలువ చేసే చైనీస్ ఆన్లైన్ స్టోర్ల ఫండ్స్‌ను అమెజాన్ నిలిపివేయడం ఆసక్తికర పరిణామం అనే చెప్పొచ్చు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయింది చైనావోడే! -
న్యూజిలాండ్‌లో నవారు మంచం ధరెంతో తెలుసా?
New Zealand Indian Charpai Price: నవారు మంచం.. భారతీయ గ్రామీణ ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇవి కనిపిస్తుంటాయి. పల్లెటూరులో ఉండేవాళ్లు ఎక్కువగా నవారు మంచాలపైనే పడుకుంటారు. ఇక వేసవికాలం వచ్చిదంటే ఆరు బయట నవారు మంచం మీదే హాయిగా నిద్రిస్తారు. పొద్దంతా పనిచేసి అలసిపోయి అలా కాసేపు మంచంపై ఒరిగితే చాలు.. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఊళ్లలో నవారు మంచం అల్లేవారు ఉంటారు. లేదంటే ఇంట్లోని వారే నవారును అల్లుకుంటారు. లేదా మంచం కొనాలంటే కనీసం 800 నుంచి 10 వేల వరకు ఖర్చవుతుందంతే.. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం నవారు మంచానికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి అన్నాబెల్లె అనే ఓ ఈ కామర్స్ సైట్ ‘వింటేజ్ ఇండియన్ డేబెడ్’తో నవారు మంచానికి ఏకంగా 41, 297 రూపాయల ధర నిర్ణయించింది. వాస్తవానికి దీన ధర 61,980 ఉండగా డిస్కౌంట్ తర్వాత 41 వేలుగా ఉంది. ప్రస్తుతం ఈ మంచం ధర సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచం ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అంత ధర వెచ్చించి కొనుగోలు చేస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
మీరు వాట్సాప్ వాడుతున్నారా..అయితే జాగ్రత్త!
కరోనావైరస్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు గణనీయంగా పెరిగాయి. కేవైసీ అప్డైట్ పేరిట బ్యాంకు ఖాతాదారులపై సైబర్ నేరస్తులు విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న హాకర్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. తాజాగా వాట్సాప్ యాప్ ద్వారా సైబర్‌నేరస్తులు తెరపైకి మరో కొత్త స్కామ్‌ను తెచ్చారు. ఆన్లైన్ ఆర్డర్స్ పేరిట వాట్సాప్ యూజర్లకు హానికరమైన లింక్‌లను హాకర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా లింకులను ఓపెన్‌చేయగానే యూజర్లకు చెందిన బ్యాంకు బ్యాలెన్స్‌ను హకర్లు ఊడ్చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. తాజాగా రష్యాకు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ఆన్లైన్ డెలివరీ పేరిట వాట్సాప్ యాప్‌కు వస్తోన్న సందేశాలపై యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ మెసేజ్‌లను చేస్తున్న ఆయా హాకర్లు ఆన్లైన్ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేసిన వారుగా ఉన్నారని కాస్పర్‌స్కై పరిశోధకులు వెల్లడించారు. ఆయా ఆన్లైన్ డెలివరీ సంస్థలు అందించే వస్తువులను వాట్సాప్ ద్వారా యూజర్లకు పంపుతూ పేమెంట్ చేసే సమయంలో వారి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకోని యూజర్ల బ్యాంకు బ్యాలెన్స్‌ను ఊడ్చేస్తున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. వాట్సాప్‌కు వచ్చే ఆన్లైన్ డెలివరీ సంస్థల లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని కాస్పర్‌స్కై యూజర్లకు హెచ్చరించింది. హాకర్లు నకిలీ వైబ్‌సైట్ లింక్‌లను పంపుతూ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. సరైన వెబ్సైట్ చిరునామా లేదా అనుమానాస్పదంగా అనిపించే ఏదైనా లింక్‌పై ఎప్పటికీ క్లిక్ చేయకూడదని వాట్సాస్ యూజర్లను కాస్పర్‌స్కై పేర్కొంది. -
ఈ-కామర్స్‌లో తెలుగుతో తెలివిగా టోకరా..
సాక్షి, హైదరాబాద్: ఈ-కామర్స్ సైట్లలో వినియోగదారుల వివరాలు సేకరిస్తారు. ప్రైజ్‌మనీ వచ్చిందంటారు. టాటా సఫారీ వాహనం గెలుచుకున్నారని నమ్మబలుకుతారు. ఆపై మోసాలకు తెరలేపుతారు. ఇలా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలవారితో తెలుగులో మాట్లాడి రూ.కోట్లలో మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట సైబర్ నేరాల కేసులో అయిదుగురు తెలుగువారు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాటా సఫారీ గెలుచుకున్నారంటూ నమ్మించి రూ.95,459 వసూలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్ 1న సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సైబర్‌క్రైమ్ ఏసీపీ బాలకృష్ణారెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పోస్టులు పంపించి.. నమ్మించి.. ⇔ బిహార్‌లోని నవాడా జిల్లా మిర్జాపూర్కు చెందిన తరుణ్ కుమార్ అలియాస్ అమిత్ బీసీఏ చదివాడు. కోచింగ్ సెంటర్ పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు అలోక్, తిరంజ్‌ల సహకారంతో ఈ-కామర్స్ సైట్లు హెర్బల్ కేర్ గ్రూప్, నాప్టాల్, షాప్‌క్లూజ్‌ల నుంచి కొనుగోలుదారుల వివరాలు సేకరించాడు. భజరంగి, కామ్లేష్ దూబె, యశ్వంత్ ఠాకూర్, సౌరవ్ పటేల్‌లతో కలిసి 53 బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. ⇔ బిహర్ షరీఫ్‌లోని ప్రింటింగ్ ప్రెస్ వద్ద స్క్రాచ్ కార్డులు, అప్లికేషన్లు, బ్యాంక్‌ల నకిలీ స్టాంప్‌లు ముద్రించాడు. ఆయా సంస్థల ఎన్వెలప్ కవర్లకు బ్యాంక్ సీల్ వేసి లోపల స్క్రాచ్‌కార్డులు పంపి కస్టమర్లను నమ్మించేవారు. ప్రైజ్‌మనీ, టాటా సఫారీ గిఫ్ట్‌లు వచ్చాయని నకిలీ ఐడీ కార్డులు, లెటర్ హెడ్లను కొనుగోలుదారుల వాట్సాప్ నంబర్లకు పంపించేవారు. అనంతరం నగదు, కారు డెలివరీ అంటూ రిజిస్ట్రేషన్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ తదితరాలు చెల్లించాలంటూ బురిడీ కొట్టించేవారు. రాంచీ, ఒడిశా కేంద్రాలుగా.. ⇔ 2020 ఆగస్టులో జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని కొకర్‌కాల్ సెంటర్, ఒడిశాలోని రూర్కెలాలో తరుణ్ కుమార్ టెలీ కాలింగ్ కార్యాలయాలు ప్రారంభించాడు. అలోక్, తిరంజల నుంచి సేకరించిన ఈ– కామర్స్ సైట్ల కొనుగోలుదారుల వివరాలను టెలీ కాలర్లకు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసగించేందుకు తెలుగు భాష వచ్చిన టెలీ కాలర్లను, కర్ణాటక, తమిళనాడు ప్రజలను చీటింగ్ చేసేందుకు కన్నడ, తమిళం మాట్లాడేవారిని నియమించాడు. ⇔ రాంచీకి చెందిన కామ్లేష్ దూబే ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం మంచిర్యాలలోని బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతని స్నేహితులు యశ్వంత్‌కుమార్, సౌరభ్ పటేల్ పిలవడంతో రాంచీకి వెళ్లి వారితో చేతులు కలిపాడు. సైబర్ నేరాలు చేసే క్రమంలో తెలుగువాళ్లు అతిగాస్పందిస్తుండడంతో కామ్లేష్ దూబే సహకారంతో మంచిర్యాలకు చెందిన మచినెల్ల వెంకటేష్, గుర్రం రాకేష్, ప్రశంత్, రాజేందర్‌రెడ్డి, రాజలింగులను రాంచీకి పిలిపించుకొని టెలీకాలర్లుగా నియమించుకుని దందా సాగిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల వరకు ఈ ముఠా మోసగించింది. పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన అయిదుగురు ఉన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. చదవండి: ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా.. రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ఏపీ సర్కార్ ఒప్పందం!
ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుపుకున్నారు. చేనేత రంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ‘వైఎస్సార్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ.24 వేలను అందించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి తోడు చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు నూతన పంథాను అవలంభించారు. దేశవిదేశాలకు సైతం చేనేత ఉత్పత్తులను అందుబాటులో తీసుకెళ్లే విధంగా పటిష్టమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేశారు. – అనంతపురం, సప్తగిరి సర్కిల్ మగువలు ఇష్టపడే ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు.. యువతులు మెచ్చే చేనేత డ్రస్ మెటీరియల్స్.. మగవారి హుందాతనాన్ని పెంచే చొక్కాలు, ధోవతులు... ఇలా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ఇకపై ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటి కోసం దుకాణాలు వెదుక్కొంటూ వెళ్లాల్సిన పని ఉండదు. ఒక్క క్లిక్‌తో ఇంటి ముంగిటకు వచ్చి చేరుతాయి. మనసుకు నచ్చిన రంగులు, డిజైన్లను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలిదశలో 25 ఉత్పత్తులను అమెజాన్ ద్వారా నవంబర్ 1వ తేదీ నుంచి విక్రయాలు చేపట్టనున్నారు. అదే నెల చివరి వారం నుంచి ఫ్లిప్‌కార్టు ద్వారా అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి. మధ్యతరగతికి అందుబాటులో తొలి విడతగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో వస్త్రాల అమ్మకాలు సాగించనున్నారు. ఇందులో భాగంగా రూ. 500 నుంచి రూ. 20 వేల వరకు ధర ఉన్న వాటిని అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్రంలో ప్రాచూర్యం కలిగిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పెడన, పొందూరు, వెంకటగిరి, మాధవరం తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను విక్రయాలకు ఉంచనున్నారు. బయటి మార్కెట్లో కంటే తక్కువ ధరకు వీటిని అందించేలా చర్యలు తీసుకున్నారు. చేనేత వస్త్రాల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా వాటిపై ప్రభుత్వ గుర్తింపు లోగోను ముద్రించనున్నారు. రకానికి వెయ్యి చొప్పున మొత్తంగా 25 రకాల చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా చీరలు(కాటన్, సిల్కు), డ్రస్ మెటీరియల్స్, చున్నీలు, చొక్కాలు, ధోవతులు, బెడ్ షీట్లు, టవళ్లు, దిండు కవర్లు, లుంగీలు, చేతి రుమాళ్లు తదితరాలు ఉన్నాయి. ఇందులోనూ రకానికి వెయ్యి చొప్పున అందుబాటులోకి తేనున్నారు. అమ్ముడు పోని వస్త్రాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. కొత్త డిజైన్లను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆయా ఉత్పత్తుల ఫొటోలను సిద్దం చేశారు. ప్రతి చీరకు సంబంధించి బార్డర్, బాడీ, కొంగు కనిపించేలా మూడు ఆకర్షణీయమైన ఫొటోలను ఆన్లైన్లో ఉంచుతారు. మాస్టర్ వీవర్లతో సమావేశమవుతాం ఆన్లైన్లో చేనేత వస్త్రాల విక్రయాలకు సంబంధించి జిల్లాలో ఉన్న మాస్టర్ వీవర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నాం. ఈ వ్యాపారంపై వారికి పూర్తి అవగాహన కల్పించనున్నాం. ఆన్లైన్ షాపింగ్ ద్వారా చేనేతలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. – భీమయ్య, ఏడీ, జిల్లా చేనేత, జౌళి శాఖ పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలో అమలు నవంబర్ 1 నుంచి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు విస్తరించనున్నారు. దీని ద్వారా చేనేతలు పెద్ద ఎత్తున లాభపడతారు. – నారాయణస్వామి, ఏఎంఓ, ఆప్కో -
వన్‌ప్లస్ 6 ఫోన్ ఆర్డర్ చేస్తే....
సాక్షి, న్యూఢిల్లీ : తల్లిని సర్ప్రైజ్ చేయడం కోసం ఓ టాప్ ఈ కామర్స్ సైట్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫోన్‌కు బదులుగా మార్బుల్స్ రావడంతో కంగుతిన్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... దక్షిణ ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా అనే యువకుడు ఈ కామర్స్ సైట్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 34,999 రూపాయలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాడు. మరుసటి రోజు సాయంత్రానికల్లా ఫోన్ డెలివరీ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అయితే అడిగిన సమయాని కంటే ముందుగానే డెలివరీ బాయ్ రావడంతో సంతోష పడిన మానస్ ప్యాకింగ్ చేసి ఉన్న బాక్స్‌ను తీసుకున్నాడు. కొడుకు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసేందుకు సాయంత్రం అతడి తల్లి బాక్స్‌ను తెరచి చూడగా అందులో ఫోన్‌కు బదులు మార్బుల్స్‌తో పాటు చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. దీంతో ఆమె సంబంధిత కామర్స్ సైట్‌కు ఫోన్ చేసి చేయగా... బాక్స్‌లో ఉన్న మార్బుల్స్ ఫొటోతో సహా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు ఫైల్ చేయమని చెప్పడంతో ఆమె అలాగే చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించిన అనంతరం తాము ఆ బాక్స్‌లో ఫోన్‌ను ఉంచి ప్యాక్ చేశామని, సీల్ తీయలేదు అంటున్నారు గనుక డెలివరీ బాయ్ తప్పు కూడా లేదంటూ బాధ్యతా రహితంగా మాట్లాడటంతో ఆమె వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇక యాప్ ఓన్లీగా ఫ్లిప్‌కార్ట్
భారత్‌లో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ 'ఫ్లిప్‌కార్ట్' వెబ్సైట్ వచ్చే నెల తర్వాత కనుమరుగు కానుంది. ఆ స్థానంలో కేవలం సెల్‌ఫోన్ అప్లికేషన్ (యాప్) ద్వారానే తన వ్యాపారాన్ని నిర్వహించనుంది. వచ్చేనెల నుంచే ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకొస్తామని, ఈలోగానే తమ యాప్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఎక్కువ మంది సందర్శకులున్న సైట్లలో ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఈ ఏడాది 76 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్‌కు గుడ్‌బై చెప్పి యాప్‌ను ప్రవేశపెట్టడం అన్నది ఒక రకంగా గ్యాంబ్లింగే. దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు యాప్స్ పట్ల యువతీ యువకుల్లో పెరుగుతున్న మోజు ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయానికి కారణం కావచ్చు. యాప్ ద్వారా వచ్చే ఆర్డర్లలో విధేయత పాలు ఎక్కువనే నమ్మకమూ కావచ్చు. కానీ నేడు ఎంతమంది యాప్స్ వినియోగిస్తున్నారు, వారిలో ఎంతమంది ఈ-కామర్స్ కోసం యాప్స్ వైపు మొగ్గు చూపుతారన్నది ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం నేడు మార్కెట్లో దాదాపు మూడువేల యాప్స్ అందుబాటులో ఉండగా, భారతీయ స్మార్ల్‌ఫోన్ వినియోగదారులు సగటున సరాసరి 15 యాప్స్ వాడుతున్నారు. వాటిలో మ్యూజిక్ ప్లేయర్లు, ఫేస్బుక్, వాట్సప్, స్కైప్ లాంటి అప్లికేషన్లే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోన్లలో 15కు మంచి యాప్స్‌ను వినియోగించే స్పేస్ లేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో బడ్జెట్ ఫోన్ కొనుగోలుదారులు దాదాపు 80 శాతం మంది ఉన్నారు. మొదటి 15 యాప్స్‌లో ఒక్క ఈ-కామర్స్ కంపెనీ కూడా లేదని మొబైల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'క్వెట్టరా' వెల్లడిస్తోంది. ఈ కామర్స్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం కన్నా క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్వే లాంటి పాపులర్ గేమ్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని క్వెట్టరా పేర్కొంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజుకు సరాసరి 169 నిమిషాలు ఫోన్ల్తో ఎంగేజ్ అవుతుండగా అందులో నాలుగో వంతు మందే యాప్స్‌ను వాడుతున్నారని మొబైల్ మార్కెటింగ్, డేటా విశ్లేషణ కంపెనీ 'వీసర్వ్' తెలియజేస్తోంది. మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్స్‌నే వినియోగదారులు ఎక్కువ వాడుతున్నారని వెల్లడించింది. ఈ లెక్కన చూసిన ఈ కామర్స్ కంపెనీల యాప్స్ 'యూజర్ ఫ్రెండ్లీ' లో వెనకబడే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ కంపెనీకే చెందిన ఫాషన్ రిటైలర్ 'మైంత్ర డాట్ కామ్' ఈ ఏడాది 'యాప్ ఓన్లీ' వ్యాపారాన్ని ప్రారంభించగా పది శాతం సేల్స్ పడిపోయాయి. ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి మీడియా తీసుకెల్లగా ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్ అంతా యాప్స్ ఆధారితంగానే జరుగుతుందని వ్యాఖ్యానించింది. 'వ్యాపారులు తమ వద్దకు వినియోగదారులను రప్పించుకోవడం కన్నా వినియోగదారులు ఎక్కడున్నారో అక్కడికి వ్యాపారులు వెళ్లడం శ్రేయస్కరం' అనే ఆధునిక సాంకేతిక యుగం వ్యాపార నీతి సూత్రాన్ని విస్మరిస్తే ఎలా! -
ఈ-కామర్స్‌తో ఆప్కోలో రూ. అరకోటి వ్యాపారం!
సాక్షి, హైదరాబాద్: ఆప్కో ఈ-కామర్స్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు రూ. అరకోటి విలువైన వస్త్రాలను విక్రయించామని ఆ సంస్థ ఎండీ గౌరీశంకర్ గురువారం తెలిపారు. ‘షాప్ డాట్ ఆప్కో ఫ్యాబ్రిక్స్ డాట్ కామ్’ ద్వారా 30 శాతం రాయితీతో వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉచిత డెలివరీ సదుపాయం ఉందన్నారు. ఆప్కో వస్త్రాలకు దేశీయంగానే కాకుండా ఏకంగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,200 ఆర్డర్స్‌ను డెలివరీ చేశామని వివరించారు. ఆన్లైన్లో ఆప్కో ఉత్పత్తులను లక్షన్నర మంది పరిశీలించారని, ఈ-కామర్స్ పేజీని 5 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. ఎక్కువ మంది చీరాల నిఫ్ట్ డిజైన్‌ను పరిశీలించారన్నారు. కేవలం రూ.30 వేలతో ఏర్పాటు చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో ఆప్కో వస్త్రాలకు మరింత డిమాండ్ పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.