ఇక యాప్ ఓన్లీగా ఫ్లిప్‌కార్ట్ | flipkart to turn into app only from next month | Sakshi
Sakshi News home page

ఇక యాప్ ఓన్లీగా ఫ్లిప్‌కార్ట్

Published Thu, Aug 6 2015 3:36 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

ఇక యాప్ ఓన్లీగా ఫ్లిప్‌కార్ట్ - Sakshi

ఇక యాప్ ఓన్లీగా ఫ్లిప్‌కార్ట్

భారత్‌లో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ 'ఫ్లిప్‌కార్ట్' వెబ్‌సైట్ వచ్చే నెల తర్వాత కనుమరుగు కానుంది. ఆ స్థానంలో కేవలం సెల్‌ఫోన్ అప్లికేషన్ (యాప్) ద్వారానే తన వ్యాపారాన్ని నిర్వహించనుంది. వచ్చేనెల నుంచే ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకొస్తామని, ఈలోగానే తమ యాప్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఎక్కువ మంది సందర్శకులున్న సైట్లలో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఈ ఏడాది 76 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్‌కు గుడ్‌బై చెప్పి యాప్‌ను ప్రవేశపెట్టడం అన్నది ఒక రకంగా గ్యాంబ్లింగే.  

దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు యాప్స్ పట్ల యువతీ యువకుల్లో పెరుగుతున్న మోజు ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయానికి కారణం కావచ్చు. యాప్ ద్వారా వచ్చే ఆర్డర్లలో విధేయత పాలు ఎక్కువనే నమ్మకమూ కావచ్చు. కానీ నేడు ఎంతమంది యాప్స్ వినియోగిస్తున్నారు, వారిలో ఎంతమంది ఈ-కామర్స్ కోసం యాప్స్ వైపు మొగ్గు చూపుతారన్నది ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం నేడు మార్కెట్లో దాదాపు మూడువేల యాప్స్ అందుబాటులో ఉండగా, భారతీయ స్మార్ల్‌ఫోన్ వినియోగదారులు సగటున సరాసరి 15 యాప్స్ వాడుతున్నారు. వాటిలో మ్యూజిక్ ప్లేయర్లు, ఫేస్‌బుక్, వాట్సప్, స్కైప్ లాంటి అప్లికేషన్లే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోన్లలో 15కు మంచి యాప్స్‌ను వినియోగించే స్పేస్ లేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో బడ్జెట్ ఫోన్ కొనుగోలుదారులు దాదాపు 80 శాతం మంది ఉన్నారు.

మొదటి 15 యాప్స్‌లో ఒక్క ఈ-కామర్స్ కంపెనీ కూడా లేదని మొబైల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'క్వెట్టరా' వెల్లడిస్తోంది. ఈ కామర్స్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కన్నా క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్‌వే లాంటి పాపులర్ గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని క్వెట్టరా పేర్కొంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజుకు సరాసరి 169 నిమిషాలు ఫోన్ల్‌తో ఎంగేజ్ అవుతుండగా అందులో నాలుగో వంతు మందే యాప్స్‌ను వాడుతున్నారని మొబైల్ మార్కెటింగ్, డేటా విశ్లేషణ కంపెనీ 'వీసర్వ్' తెలియజేస్తోంది. మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్స్‌నే వినియోగదారులు ఎక్కువ వాడుతున్నారని వెల్లడించింది. ఈ లెక్కన చూసిన ఈ కామర్స్ కంపెనీల యాప్స్ 'యూజర్ ఫ్రెండ్లీ' లో వెనకబడే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ కంపెనీకే చెందిన ఫాషన్ రిటైలర్ 'మైంత్ర డాట్ కామ్' ఈ ఏడాది 'యాప్ ఓన్లీ' వ్యాపారాన్ని ప్రారంభించగా పది శాతం సేల్స్ పడిపోయాయి. ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి మీడియా తీసుకెల్లగా ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్ అంతా యాప్స్ ఆధారితంగానే జరుగుతుందని వ్యాఖ్యానించింది.  'వ్యాపారులు తమ వద్దకు వినియోగదారులను రప్పించుకోవడం కన్నా వినియోగదారులు ఎక్కడున్నారో అక్కడికి వ్యాపారులు వెళ్లడం శ్రేయస్కరం' అనే ఆధునిక సాంకేతిక యుగం వ్యాపార నీతి సూత్రాన్ని విస్మరిస్తే ఎలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement