న్యూఢిల్లీ: విక్రేతల మోసాలకు కూడా ఈ - కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా నిబంధనలను కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్‌ను రూపొందించడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సాధారణంగా విక్రేతలు, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్దిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ-కామర్స్ నిబంధనలను పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించే ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆయా ఈ-కామర్స్ సంస్థలనే బాధ్యులను చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి. ఈ-కామర్స్ సంస్థలో నమోదు చేసుకున్న విక్రేత నిర్లక్ష్యంగా వ్యవహరించి, వినియోగదారులు ఆర్డరు చేసిన ఉత్పత్తులు లేదా సర్వీసులను అందించడంలో విఫలమైనా సదరు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థే బాధ్యత వహించేలా నిబంధనలు ఉండవచ్చని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment