Online companies
-
ఆన్లైన్ దిగ్గజాల కట్టడిపై ఈయూ దృష్టి - ఎక్కువ కానున్న నిఘా!
లండన్: ఆన్లైన్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త డిజిటల్ చట్టాల కింద ఆరు కంపెనీలను ఆన్లైన్ ‘గేట్‌కీపర్స్‘ పరిధిలోకి చేర్చింది. వీటిలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ఉన్నాయి. గేట్‌కీపర్లుగా ఈ సంస్థలపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా కంపెనీలు డిజిటల్ మార్కెట్స్ చట్టాలను పాటించడం మొదలుపెట్టేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. చట్టం ప్రకారం తమతో పాటు ఇతర కంపెనీలు కూడా తమ తమ ఉత్పత్తులు, సర్వీసుల పనితీరులో గణనీయంగా మార్పులు, చేర్పులు చేయాల్సి రానున్నట్లు గూగుల్ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మెసేజింగ్ సేవల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టెలిగ్రామ్ లేదా సిగ్నల్ యూజర్లు తమ టెక్ట్స్ లేదా వీడియో ఫైల్స్‌ను వాట్సాప్ యూజర్లకు కూడా పంపించుకోవచ్చు. ఇక ప్లాట్‌ఫామ్‌లు సెర్చి రిజల్ట్‌లో తమ ఉత్పత్తులకు .. పోటీ సంస్థల ఉత్పత్తులు, సర్వీసులకు మించిన రేటింగ్ ఇచ్చుకోకూడదు. కాబట్టి అమెజాన్ లాంటివి థర్డ్ పార్టీ వ్యాపారుల ఉత్పత్తుల కన్నా తమ ఉత్పత్తులే సులభంగా కనిపించేలా చేయడానికి ఉండదు. అటు ఆన్లైన్ సేవల సంస్థలు .. నిర్దిష్ట యూజర్లు లక్ష్యంగా పంపే ప్రకటనల కోసం వివిధ వేదికల్లోని యూజర్ల వ్యక్తిగత డేటాను కలగలిపి వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ సర్వీసులను వినియోగించుకునే యూజర్ల డేటాను వారి సమ్మతి లేకుండా ఆయా వేదికల మాతృసంస్థ మెటా కలగలిపి వినియోగించుకోవడానికి కుదరదు. -
ఈ-కామర్స్ సంస్థలకు కొత్త బాధ్యతలు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: విక్రేతల మోసాలకు కూడా ఈ - కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా నిబంధనలను కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్‌ను రూపొందించడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సాధారణంగా విక్రేతలు, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్దిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ-కామర్స్ నిబంధనలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించే ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆయా ఈ-కామర్స్ సంస్థలనే బాధ్యులను చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి. ఈ-కామర్స్ సంస్థలో నమోదు చేసుకున్న విక్రేత నిర్లక్ష్యంగా వ్యవహరించి, వినియోగదారులు ఆర్డరు చేసిన ఉత్పత్తులు లేదా సర్వీసులను అందించడంలో విఫలమైనా సదరు ఆన్లైన్ షాపింగ్ సంస్థే బాధ్యత వహించేలా నిబంధనలు ఉండవచ్చని పేర్కొన్నాయి. -
వావ్! 13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్!మరి ఆదాయం!
న్యూఢిల్లీ: 10వ తరగతి చదువుకునే వయసులోనే డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ వ్యవహరాల్లో ఆరితేరి, పలు కంపెనీల సీఈవోగా వ్యాపారంలో దూసుకుపోతున్నాడంటే నమ్మశక్యంగా లేదు కదా? కానీ బిహార్, ముజఫర్‌పూర్‌కు చెందిన సూర్యాంశ్ కుమార్ అలాంటి అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈవోగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం సూర్యాంశ్ సక్సెస్ స్టోరీ వైరల్‌గా మారింది. మ్యాట్రిమోనీ, డెలివరీ, క్రిప్టోకరెన్సీ సేవల వరకు అన్ని రంగాల్లోనూ ప్రతిభను చాటుకొని, రాణించాలని ప్రయత్ని స్తున్నాడు. ఈ క్రమంలోనే అమ్మ గ్రామానికి చెందిన సూర్యాంశ్ (13) ఇపుడు 56 ఆన్లైన్ కంపెనీలకు సీఈఓగా ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక కంపెనీని లాంచ్ చేయబోతున్నాడట. సూర్యాంశ్ కుమార్ సక్సెస్ జర్నీని ఒకసారి పరిశీలిస్తే తన తొలి కంపెనీని 9వ తరగతిలోనే ప్రారంభించాడు. ఆన్లైన్లో వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు, ఆన్లైన్ కంపెనీని తెరవాలనే ఆలోచన వచ్చిందట సూర్యాంశ్‌కి. వెంటనే ఈ ఆలోచనను తన తండ్రి సంతోష్‌కుమార్‌తో షేర్ చేశాడు. ఈ ఆలోచనను ప్రోత్సహించిన తండ్రి ప్రోత్సహించి మొత్తం ఆలోచనను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చూపించమన్నారు. అలా తొలిగా ఈ-కామర్స్ కంపెనీకి బీజం పడింది. సూర్యాంశ్ తల్లిదండ్రులు, సంతోష్‌కుమార్, అర్చన ఐక్యరాజ్య సమితితో అనుసంధానమైన ఎన్జీవో నడుపుతున్నారు. ఆడుకునే వయసులోనే పలు కంపెనీలకు యజమానిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. తమ బిడ్డ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. Names Of All The Companies That I Am Currently Running..https://t.co/wiNm0zamuv pic.twitter.com/Ciy5vijhd6 — Suryansh (@ceosuryansh) August 3, 2022 కోరుకున్న వస్తువులను కేవలం 30 నిమిషాల్లో ప్రజల ఇళ్లకు డెలివరీ చేయడమే లక్క్ష్యమని సూర్యాంశ్ చెప్పారు. త్వరలో వస్తువుల పంపిణీని ప్రారంభించనుంది. సూర్యాంశ్ మరో సంస్థ షాదీ కీజేయే. ఇది జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ప్రజలకు సహాయం చేస్తుంది. ఇప్పటిదాకా సూర్యాంశ్ కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 56కు పైగా స్టార్టప్ కంపెనీలను నమోదవ్వగా, మరికొన్నిరిజిస్టర్ కావాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పించేలా ‘మంత్రా ఫై’ అనే ఆసక్తికరమైన క్రిప్టో కరెన్సీ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉన్నాడు. చిన్న వయస్సులోనే టెక్నాలజీని అవపోసిన పట్టిన సూర్యాంశ్ రోజుకు 17-18 గంటలు పనిచేస్తాడు. పగలు రాత్రి అటు చదువును, ఇటు వృత్తిని మేనేజ్ చేస్తున్నాడు.ఇ తనికి తల్లిదండ్రుల పప్రోత్సాహం కూడా మూములుదికాదు. పాఠశాల యాజమాన్యం కూడా అతనికి పూర్తి సహాయాన్ని అందిస్తోంది .ప్రస్తుతం ఈ ఆన్లైన్ కంపెనీల ద్వారా సూర్యాంశ్ ఎలాంటి ఆదాయం లేదు.. కానీ భవిష్యత్తులో లక్షల రూపాయలు సంపాదించడం ఖాయమని నమ్ముతున్నాడు. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల అమ్మకాల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో ప్రముఖ ఆన్లైన్ అమ్మకాల సంస్థలయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. డిస్కౌంట్ల విషయంలో ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి. అన్ని సరకులపై 15 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ డిస్కౌంట్ అమ్మకాలను సెప్టెంబర్ పదవ తేదీన ప్రారంభించగా, అదే రోజు నుంచి తమ డిస్కౌంట్ సేల్స్ ప్రారంభం అవుతాయని ముందుగా ప్రకటించిన అమెజాన్ సంస్థ, అంతకన్నా 12 గంటల ముందే అంటే, 9వ తేదీ మధ్యాహ్నం నుంచే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ పేరిట అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 15వ తేదీ వరకు సాగే ఈ ఫెస్టివల్లో మూడు వందల కోట్ల డాలర్ల (22,206 కోట్ల రూపాయలు) వ్యాపారం సాగుతుందని ‘రెడ్‌సీర్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది ఈ రెండు ఆన్లైన్ సంస్థల ద్వారానే భారత్‌లో 150 కోట్ల వ్యాపారం సాగింది. అంటే ఈసారి అంతకన్నా రెట్టింపు వ్యాపారం జరుగుతుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో సెల్ఫోన్లు, ఎలక్రానిక్స్, ఆటోమొబైల్స్, బట్టలతోపాటు గృహోపకరణాల అమ్మకాల్లో 40 శాతం అమ్మకాలు ఈ ఒక్క దసరా, దీపావళి సందర్భంగానే జరుగుతుంటాయి. ఈ సారి ఆన్లైన్ అమ్మకాల్లో సెల్ఫోన్లే ఎక్కువగా అమ్ముడు పోతాయని, దాదాపు వందకోట్ల డాలర్ల సెల్‌ఫోన్ అమ్మకాల వ్యాపారం జరగవచ్చని ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఇండియా’ సీనియర్ అనలిస్ట్ జైపాల్ సింగ్ అంచనా వేశారు. అమెరికాలో ‘బ్లాక్ ఫ్రైడే’, చైనాలో ‘సింగిల్స్ డే’ పేరిట కొనసాగే డిస్కౌంట్ అమ్మకాలకన్నా భారత్‌లో పండగల సీజన్ సందర్భంగా జరిగే అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తుండగా, కాస్త ఖరీదైన సెల్ఫోన్ల ద్వారా అమెజాన్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యనుండే ఫోన్లే ఈ సారి ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉందని వివిధ సంస్థలకు చెందిన సీనియర్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా అతిపెద్ద ఆన్లైన్ సంస్థగా ఎదిగిన ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ ఆరు రోజుల్లో వందకోట్ల డాలర్లకు పైగా వ్యాపారం చేయనున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ దేశవ్యాప్తంగా 66 సెంట్రల్ హబ్స్‌తో కోటి చదరపు అడుగుల గిడ్డంగి సౌకర్యాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 900 డెలివరి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. ఈ ఒక్క పండగ సీజన్ కోసమే 30వేల మంది ఉద్యోగులను అదనంగా తీసుకుంది. వారికి తగిన శిక్షణ కూడా ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లోని కిరాణ కొట్ల వరకు నెట్‌వర్క్‌ను విస్తరించింది. అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ ఇందులో దేనికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 50 సెంట్రల్ హబ్‌లున్నాయి. వాటì కి రెండు కోట్ల క్యూబిక్ అడుగుల గిడ్డంగులు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో 30 సార్టింగ్ సెంట్రల్ ఉన్నాయి. రెండు వేల ఔట్లెట్లు ఉన్నాయి. ప్రతి రోజు దేశంలోని 500 నగరాలను సందర్శించే 1500 ట్రక్కులు ఉన్నాయి. వినియోగదారులకు సకాలంలో కోరుకున్న సరకును అందించడం కోసం ఈ రెండు సంస్థలు సాంకేతిక రంగంలో కూడా పరస్పరం పోటీ పడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ గతేడాదే ‘ఎఫ్క్విక్’ యాప్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈసారి పది శాతం అమ్మకాలు ఈ యాప్ ద్వారానే కొనసాగుతాయని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియా ‘ఐ హావ్ స్పేస్’ పేరిట 2015 నుంచే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత్‌లోని భిన్న నైసర్గిక స్వరూపాలు, సంస్కృతులు, భాషలు, భిన్న ఆదాయ వర్గాలు, వారి మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల కోసం తాము వ్యాపారాన్ని నిర్వహించాల్సి వస్తోందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ రాఘవన్ తెలిపారు. అమెరికా సంస్థ వాల్‌మార్ట్ మద్దతు కలిగిన ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఆన్లైన్ మార్కెట్లో 3,463 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగా, అమెజాన్ ఇండియా సంస్థ గత ఆగస్టు నెలలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. భారత్‌లో ఐదేళ్ల కాలంలో ఐదువందల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలనే అమెరికా కంపెనీ కార్యాలయం స్కీమ్‌కు అదనం ఈ పెట్టుబడులు. -
చివరి క్షణం వరకు డిస్కౌంట్ల వర్షం
న్యూఢిల్లీ : ఇంకో 48 గంటల్లో దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. జీఎస్టీ అమలుకు ముందే పాత స్టాక్‌ను విక్రయించుకోవడానికి ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన రిటైలర్లు, ఆన్లైన్ దిగ్గజాలు చివరి క్షణాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఈ మేరకు జూన్ 30 అర్థరాత్రి వరకు కూడా వినియోగదారులకు డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ అయితే, ప్రత్యేకంగా జూన్ 30 అర్థరాత్రి కూడా తమ స్టోర్లను షాపర్ల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఆ రోజు సేల్‌లో భాగంగా 22 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. ఇక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా బుధవారం అర్థరాత్రి నుంచి మళ్లీ ప్రీ-జీఎస్టీ సేల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ ఇప్పటికే ఈ సేల్‌ను రన్ చేస్తూ ఉంది. అమెజాన్ ఈ సేల్ ఈవెంట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్స్‌పై 40-50 శాతం వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. అయితే ప్రీ-జీఎస్టీ విక్రయాల గణాంకాలను మాత్రం విడుదల చేయడానికి అమెజాన్ నిరాకరించింది. '' లక్ష రూపాయల టీవీని 60వేలకే కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ సమాచారం అవసరం లేకపోతే, మీ స్నేహితులకు చెప్పండి. షాపింగ్‌కు ఇదే మంచి సమయం'' అని ముంబైకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. జీఎస్టీ తర్వాత పూర్తి ప్రయోజనం చేకూరని ఆరు నెలల కిందటి స్టాక్‌ను అమ్మేయడానికి ఆఫ్‌లైన్ రిటైలర్లు సేల్-ఇన్-మోడల్‌ను చేపడుతున్నాయని ఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రితేష్ ఘోషల్ చెప్పారు. అప్పీరెల్, షూస్, యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలు పెంచడానికి కూడా పెద్ద రిటైలర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మొబైల్ వాలెట్ కూడా ఆన్లైన్ స్టోర్ పేటీఎం మాల్ ద్వారా ప్రీజీఎస్టీ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా గత నెల కాలంగా ఈ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ మూడింతలు పెరిగిందని, రిటైలర్లు ఇన్వెంటరీకి క్లియర్ చేసుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని పేటీఎం మాల్ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. జీఎస్టీ అమ్మకాలన్నీ జూన్ 30 అర్థరాత్రితో ముగుస్తాయని, జూలై 1 నుంచి కొత్త అమ్మకాలు ప్రారంభిస్తామని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ తెలిపారు. చాలా నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గుతున్నాయని, కానీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు వెయిట్ అండ్ వాచ్ పాలసీని చేపడుతున్నాయని పేర్కొన్నారు. జూలై 1 నుంచి వారు కూడా ధరలు తగ్గించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెప్పారు. -
డిస్కౌంట్ల పండగ వచ్చింది..
గతేడాది కంటే 30% వృద్ధి అంచనా * పండగ అమ్మకాలపై ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆశలు * దోహదం చేయనున్న వడ్డీ రేట్ల తగ్గుదల * డిస్కౌంట్లు, కొత్త ఉత్పత్తులతో ఆన్లైన్ సంస్థల ‘సై’ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండగ సీజన్ తరుముకుంటూ వచ్చేస్తోంది. దుకాణాలు, ఆఫ్‌లైన్ స్టోర్లను అధిగమించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ కంపెనీలు ఈ సారి ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తుల్ని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. పెద్ద ఎత్తున వివిధ సంస్థల నుంచి ఫండింగ్ అందుకుని ఊపుమీదున్న ఈ కంపెనీలు... భారీగా డిస్కౌంట్లనూ ఆఫర్ చేయబోతున్నాయి. అయితే ఆఫ్‌లైన్ కంపెనీలు కూడా చిరకాలంగా తమనే ఆశ్ర యిస్తున్న కస్టమర్లకు బహుమతులు, డిస్కౌంట్లను ఇచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేశాయి. 2014తో పోలిస్తే ఈ పండగల సీజన్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి వుంటుందని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చెబుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలు సైతం.. దసరా, దీపావళి, క్రిస్మస్కు సాధారణంగా కొత్త గృహోపకరణాలను కొనేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపిస్తారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే వంటి ఇ-కామర్స్ కంపెనీలు ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులతో రంగంలోకి దిగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని వందల ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. అలాగే తక్కువ సమయంలో ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నాయి. మధ్యలో తమ ఫెసిలిటేషన్ సెంటర్‌కు రాకుండానే రిటైలర్ నుంచి నేరుగా కస్టమర్లకు వస్తువులను చేరవేసేలా కూడా సిద్ధమవుతున్నాయి. ఇంటెక్స్, లావా, ఫిలిప్స్ బ్రాండ్ల ఎక్స్‌క్లూజివ్ మొబైల్స్‌ను విక్రయించనున్నట్టు ఈబే ఇప్పటికే ప్రకటించింది. వడ్డీ రేట్లు తగ్గడంతో.. భారత్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2014లో రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2015లో రూ.52,000 కోట్లకు చేరుకుంటుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంటోంది. ఇటీవల కీలక రేట్లను సవరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ పరిణామంతో సెంటిమెంటు బలపడి పరిశ్రమకు ఊతమిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. భారత్‌లో అమ్మకాల్లో ఫైనాన్స్ స్కీమ్‌ల ద్వారా జరుగుతున్న లావాదేవీల వాటా 30 శాతంగా ఉంది. ఇది మరింత పెరుగుతుందని సియామ్ ఆశిస్తోంది. అమ్మకాలు పెరగడంలో బజాజ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్స్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. సులభ వాయిదాల్లో ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతారని చెప్పారు. మార్కెటింగ్‌కు ప్యానాసోనిక్ రూ.90 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలియజేశారు. 30 శాతం దాకా వృద్ధి.. ప్రస్తుతం మార్కెట్ సానుకూలంగా ఉందని సామ్సంగ్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ రిషి సూరి అన్నారు. కంపెనీ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండడంతో 40 అంగుళాలు, ఆపైన సైజున్న టీవీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పండగల సీజన్లో 25 శాతం దాకా వృద్ధి ఆశిస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ నీలాద్రి దత్తా తెలిపారు. వెబ్ ఓఎస్ టెక్నాలజీతో ఓఎల్ఈడీ టీవీ, స్మార్ట్ టీవీతోపాటు డ్యూయల్ డోర్ ఇన్ డోర్ రిఫ్రిజిరేటర్, జెట్ స్ప్రే టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లను ఎల్జీ విడుదల చేసింది. ఈ సీజన్లో బ్రాండ్‌ను బట్టి 25 శాతం వరకూ డిస్కౌంట్లుంటాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఐటీ మాల్ సైతం ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోందన్నారు. ఆన్లైన్లో భారీ తగ్గింపు.. దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... అక్టోబరు 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన బిగ్ బిలియన్ డేలో కొన్ని సమస్యలు తలెత్తటం, పరువు పోయే పరిస్థితి రావటంతో ఈ సారి ఒకేరోజు కాకుండా ఐదు రోజుల పాటు బిలియన్ డేస్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. అంతేకాక తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి ఇటీవలే ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, హోం ఎంటర్టైన్మెంట్ వంటి టెక్నాలజీ ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంటు ఇవ్వనున్నట్టు ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని వెల్లడించారు.70% దాకా డిస్కౌంట్‌ను తమ కంపెనీ నుంచి ఆశించొచ్చని స్నాప్‌డీల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. -
మొబైల్ ఫోన్ ఎక్కడ కొనాలి?
* మరమ్మతుల దృష్ట్యా రిటైల్ షాపులే బెటర్ * ధరలు, ఫీచర్లతో ఆకర్షిస్తున్న ఆన్లైన్ సంస్థలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ మీడియాలుగా మారి పోయిన ఈ-కామర్స్ సంస్థలిపుడు సరికొత్త ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ఒక్కొక్క సంస్థకూ భారీ ఎత్తున యూజర్లుండటంతో... చైనా కంపెనీల మొబైళ్లను ఇవే నేరుగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. స్టోర్లకు ఇవ్వాల్సిన క మిషన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులన్నీ మిగులుతూ ఉండటంతో అత్యాధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. లెనోవో, షియోమీ, మోటోరోలా ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్‌సేల్ పేరిట నేరుగా విక్రయిస్తుండగా... తానేమీ తీసిపోలేదన్నట్లు అమెజాన్ కూడా చైనా కంపెనీ జెడ్‌టీఈతో జట్టు కట్టి... నుబియా సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మైక్రోమ్యాక్స్‌కు చెందిన ‘యూ’ సిరీస్ ఫోన్లను కూడా ఇది ప్రత్యేకంగా విక్రయిస్తోంది. సరే! ఇదంతా బాగానే ఉంది. మరి వీధికొకటిగా వెలసిన స్టోర్ల మాటేంటి? కొన్ని స్టోర్లతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా విస్తరించిన మొబైల్ చైన్ల సంగతేంటి? అసలు విక్రయాల్లో ఆన్లైన్కూ, ఆఫ్లైన్కూ మధ్య ఉన్న తేడా లైన్ ఏంటి? ఆన్లైన్లో కొంటే బెటరా లేక దగ్గర్లోని రిటైల్ షాపే మంచిదా? ఇది తెలియాలంటే ఇటీవల జరిగిన రెండు ఉదాహరణలు చూడాలి. శివ ఈ మధ్యే ఒక మొబైల్ కొన్నాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌ల ద్వారా చిరపరిచితమైన కంపెనీకి చెందిన ఫోన్ కావటంతో దానికోసం ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. అన్ని ఫీచర్లూ ఉండటం... పైగా ధర కూడా రూ.7వేలే కావటంతో మొత్తానికి ఆ ఫోన్ దక్కించుకున్నాడు. ఫోన్ డెలివరీ అయింది. చూడటానికి, వాడటానికి కూడా బాగుండటంతో శివ ఆనందానికి అవధుల్లేవు. అయితే వారం తిరక్కుండానే... వాళ్లబ్బాయి టేబుల్ మీదున్న ఫోన్‌ను లాగటంతో కిందపడి స్క్రీన్ పగిలింది. ఫోన్ పనిచేస్తోంది కానీ డిస్ప్లే లేదు. శివ ఆ కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌కు వెళ్లాడు. వాళ్లేం చెప్పారంటే.. ‘‘దీని డిస్ప్లే పోయింది. వేయటానికి రూ.1,900 అవుతుంది. కాకపోతే మా దగ్గర స్టాకు లేదు. తెప్పించాలంటే కనీసం 2 నెలలు పడుతుంది’’ అని. అది విన్నాక శివకు దిమ్మతిరిగింది. ఎందుకంటే 2 నెలలు ఫోన్ లేకుండా ఎలా? ఆన్లైన్లో కొందామని డిస్ప్లే కోసం వెదికినా ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే అది చైనా కంపెనీది. దాని విడిభాగాలు ఇంకా ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. చేసేదేమీ లేక కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. మహేష్ విషయంలో కూడా సరిగ్గా శివ మాదిరే జరిగింది. తను స్థానికంగా ఉన్న రిటైల్ దుకాణంలో ఫోన్ కొన్నాడు. కొన్ని ఫీచర్లు తక్కువ ఉన్నా... ధర కూడా తనకు అందుబాటులోనే ఉండటంతో కొనుక్కున్నాడు. తనది కూడా నెల తిరక్కుండానే కిందపడి స్క్రీన్ పగిలింది. సదరు కంపెనీకి ఒప్పందం ఉన్న సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. మరుసటి రోజు రమ్మన్న సర్వీస్ సెంటర్ ప్రతినిధి... అప్పటికల్లా స్క్రీన్ వేసి సిద్ధంగా ఉంచాడు. మహేష్ హ్యాపీ. ఈ రెండు ఉదాహరణలూ చూశాక ఏమనిపిస్తుంది? ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించే ఫోన్లను కొన్నపుడు... వాటికి రిపేరు రాకుండా ఉన్నంతకాలం ఓకే. కానీ రిపేరు వచ్చిందంటే కష్టం. కాకపోతే ఫీచర్లు ఎక్కువ... ధర కాస్త తక్కువ. రిటైల్ షాపులో కొన్న ఫోన్లకైతే సర్వీసింగ్ సదుపాయం ఉంటుంది. ఎందుకంటే ఫోన్లు విక్రయించే ముందే ఆ కంపెనీకి ఉన్న నెట్వర్క్, విడిభాగాల లభ్యత, అన్నీ చూసి విక్రయిస్తామని చెబుతున్నారు రిటైలర్లు. ఉత్తమ సర్వీస్ ఇస్తేనే.. ‘‘సెల్ఫోన్లకు వారంటీ ఉందా? విక్రయానంతర సేవలు ఏ స్థాయిలో ఉన్నాయి? సదరు కంపెనీ ఎన్ని సర్వీసింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది? ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే సదరు బ్రాండ్ల ఫోన్లను విక్రయస్తామని చెప్పారు మల్టీబ్రాండెడ్ రిటైలర్ టెక్నోవిజన్ ఎండీ సికిందర్. ‘‘ఫోన్‌కు ఏదైనా సమస్య వస్తే దుకాణదారులతో గొడవపడే కస్టమర్లూ ఉన్నారు. అందుకే బ్రాండ్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తాం’’ అన్నారాయన. బ్రాండ్ పట్ల నమ్మకం ఏర్పడితేనే రిటైలర్లు విక్రయాలకు ఓకే చెబుతున్నారని, సర్వీసింగ్ సరిగా ఇవ్వలేని కంపెనీలు కనుమరుగవటం ఖాయమని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కైలాశ్ లఖ్యాని చెప్పారు. ధర, మార్జిన్లు కూడా ముఖ్యమే.. మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు వాటిని విక్రయిస్తే తమకెంత మార్జిన్ ఉంటుందనేది కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తెలియనిదేమీ కాదు. అయితే టెక్నాలజీ వ్యయాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఉపకరణాల ధరలూ దిగొస్తున్నాయి. అందుకే రిటైల్ దుకాణాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మొబైల్స్ విషయంలో దాదాపుగా ఒకే రకమైన ఫీచర్లున్నప్పటికీ బ్రాండ్‌ను బట్టి ధరల్లో బాగా తేడా ఉంటోంది. ‘‘బ్రాండ్‌ను ఒప్పుకునే ముందు ఏ మోడల్‌కు ఎంత ధర ఉంది? ఇంత ధర ఉండొచ్చా? అనేది కూడా చూస్తాం’’ అని లాట్ మొబైల్స్ ప్రతినిధి చెప్పారు. -
ఆన్‌లైన్‌లోనూ అమ్ముతాం..
⇒ మారిన ఎలక్ట్రానిక్స్ కంపెనీల వైఖరి ⇒ ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో రంగంలోకి ⇒ మొదట్లో వద్దనుకున్నా మారిన వ్యూహం ⇒ ఈ-కామర్స్‌ను విస్మరించలేమన్నదే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మేం ఆన్‌లైన్‌కు వ్యతిరేకం. ఆన్లైన్లో మాకెవ్వరూ అధీకృత డీలర్లు లేరు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కొంటే వారంటీ వర్తించదు. సర్వీసింగ్ విషయంలోనూ కంపెనీ ఎలాంటి బాధ్యతా వహించదు’’... ఇదీ పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు గతంలో ఇచ్చిన ప్రకటన. మరిప్పుడో...! పరిస్థితులు మారాయి. ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు మధ్య ధరల్లో తేడా చాలా ఎక్కువగా ఉందని, ఇది స్నేహపూర్వక వ్యాపారం కాదని గతంలో ఊదరగొట్టిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పుడు ఆన్లైన్ విక్రయాలకు సై అంటున్నాయి. వ్యూహాత్మకంగా ‘ఎక్స్‌క్లూజివ్’ పేరుతో రంగంలోకి దిగుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను వాటికి అప్పగిస్తున్నాయి. అంటే ఈ మోడళ్లు ఏదైనా ఒక ‘ఈ-కామర్స్’ కంపెనీ పోర్టల్‌లో మాత్రమే లభిస్తాయన్న మాట. వ్యూహం ఏదైనా... ఒక్కటి మాత్రం నిజం. అంతకంతకూ పెరుగుతున్న భారత ఈ-కామర్స్ మార్కెట్‌ను విస్మరించగలిగే పరిస్థితుల్లోనైతే ఎలక్ట్రానిక్స్ కంపెనీలు లేవు. ఒకవేళ విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని, అది తమ మనుగడనే దెబ్బతీసే ప్రమాదం ఉందని అవి భయపడుతున్నాయి. అందుకే ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఇదీ... మన ఈ-కామర్స్ విశ్వరూపం భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ-కామర్స్ మార్కెట్ పుంజుకుంటోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా, ఇందులో ఈ-కామర్స్ వాటా ఇంచుమించు లక్ష కోట్లు. దీన్లో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం సుమారు రూ.24,000 కోట్లు కాగా మిగతాదంతా ఈ-టికెటింగ్ తదితరాలకు వెళుతోంది. ఆన్లైన్ రిటైల్ వ్యాపారం ప్రస్తుతం స్వల్పంగానే ఉన్నా 2018 నాటికి రూ.లక్ష కోట్లకు చేరుతుందని సీఐఐ-కేపీఎంజీ నివేదిక చెబుతోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ వాటా ఎక్కువగానే ఉండటంతో పలు కంపెనీలు ఈ-కామర్స్‌ను సైతం వ్యాపార వేదికగా చేసుకుంటున్నాయి. అయితే తక్కువ ధర ఉండటం, తిరిగి పంపించే వస్తువులు కూడా ఎక్కువగానే ఉండటం, పార్ట్లు మార్చిన వస్తువులు వస్తుండటంతో సర్వీస్ సెంటర్లు గగ్గోలు పెడుతుండటం వంటి కారణాల వల్ల పలు కంపెనీలు ఆన్లైన్లో అమ్మటానికి ఇప్పటిదాకా ముందుకు రాలేదు. కానీ పోటీ కంపెనీలు ఆన్లైన్ వ్యాపారంలో కూడా గణనీయమైన వ్యాపారం చేస్తుండటంతో మిగతా కంపెనీలూ ఆ దార్లోకి రాక తప్పటం లేదు. ఇందుకోసం కొత్త మార్గాన్ని ఎన్నుకుని... ఎక్స్‌క్లూజివ్ పేరిట తమ మోడళ్లను ప్రత్యేక ఒప్పందంతో విడుదల చేస్తున్నాయి. ఉదాహరణకు షియోమీ తన ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే విడుదల చేయగా బీభత్సమైన స్పందన వచ్చింది. చివరికి ఎప్పటికప్పుడు ఆ మోడళ్లు విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోవటం, మళ్లీ కొన్నాళ్ల తరవాత పెట్టడం జరిగింది. లెనోవో ఎస్8 ట్యాబ్లెట్, ఏ6000 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోంది. హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్ 8జీబీ వేరియంట్, ఆర్ఈ కెమెరాను, ప్యానాసోనిక్ ఎలూగ ఎస్ మోడల్‌ను స్నాప్‌డీల్‌లో విక్రయించాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మినీ మోడల్‌ను గతేడాదే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లోకి తెచ్చింది. ఇక సోనీ సంస్థ స్నాప్‌డీల్‌తో చేతులు కలిపింది. తన డీలర్లనే ఆన్లైన్ విక్రేతలుగా నియమించుకుంది. తద్వారా అసలైన ఉత్పత్తులు, వారంటీకి తోడు ఆఫ్‌లైన్‌కు సమానమైన ధర ఉంటుందని సోనీ ఇండియా సేల్స్ హెడ్ సునీల్ నయ్యర్ చెప్పారు. ప్యానాసోనిక్ సైతం రంగంలోకి దిగింది. జనరల్ ట్రేడ్ సేఫ్.. భారత్‌లో చిల్లర వర్తకంలో సంప్రదాయ దుకాణాల పాత్ర అత్యంత కీలకం. అందుకే కొత్త వ్యాపార వేదికైన ఆన్‌లైన్‌ను వినియోగించుకుంటూనే ఆఫ్‌లైన్‌ను కూడా విస్మరించకూడదని తయారీ కంపెనీలు నిర్ణయించాయి. అందుకోసమే పోర్టళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఇవి దుకాణాల్లోగానీ, ఇతర పోర్టళ్ల వద్దగానీ లభించవు. వాస్తవానికి ఆన్లైన్ కంపెనీలు కొన్ని మోడళ్లను మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నాయి. ధరలు తగ్గించి విక్రయించడంతో మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని మోడళ్లను ఇవ్వడం వల్ల ఇతర మోడళ్ల జోలికి ఆన్లైన్ కంపెనీలు పోవన్నది తయారీ సంస్థల భావన. ఏదైతేనేం జనరల్ ట్రేడ్‌లో తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేసేవాళ్లే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ వ్యాఖ్యానించారు. ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతో సాధారణ ట్రేడర్ల వ్యాపారంపై ప్రభావం ఉండదని చెప్పారు.