చివరి క్షణం వరకు డిస్కౌంట్ల వర్షం
చివరి క్షణం వరకు డిస్కౌంట్ల వర్షం
Published Thu, Jun 29 2017 12:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
న్యూఢిల్లీ : ఇంకో 48 గంటల్లో దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. జీఎస్టీ అమలుకు ముందే పాత స్టాక్‌ను విక్రయించుకోవడానికి ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన రిటైలర్లు, ఆన్‌లైన్ దిగ్గజాలు చివరి క్షణాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఈ మేరకు జూన్ 30 అర్థరాత్రి వరకు కూడా వినియోగదారులకు డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ అయితే, ప్రత్యేకంగా జూన్ 30 అర్థరాత్రి కూడా తమ స్టోర్లను షాపర్ల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఆ రోజు సేల్‌లో భాగంగా 22 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. ఇక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా బుధవారం అర్థరాత్రి నుంచి మళ్లీ ప్రీ-జీఎస్టీ సేల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ ఇప్పటికే ఈ సేల్‌ను రన్ చేస్తూ ఉంది. అమెజాన్ ఈ సేల్ ఈవెంట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్స్‌పై 40-50 శాతం వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. అయితే ప్రీ-జీఎస్టీ విక్రయాల గణాంకాలను మాత్రం విడుదల చేయడానికి అమెజాన్ నిరాకరించింది.
'' లక్ష రూపాయల టీవీని 60వేలకే కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ సమాచారం అవసరం లేకపోతే, మీ స్నేహితులకు చెప్పండి. షాపింగ్‌కు ఇదే మంచి సమయం'' అని ముంబైకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. జీఎస్టీ తర్వాత పూర్తి ప్రయోజనం చేకూరని ఆరు నెలల కిందటి స్టాక్‌ను అమ్మేయడానికి ఆఫ్‌లైన్ రిటైలర్లు సేల్-ఇన్-మోడల్‌ను చేపడుతున్నాయని ఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రితేష్ ఘోషల్ చెప్పారు. అప్పీరెల్, షూస్, యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలు పెంచడానికి కూడా పెద్ద రిటైలర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మొబైల్ వాలెట్ కూడా ఆన్‌లైన్ స్టోర్ పేటీఎం మాల్ ద్వారా ప్రీజీఎస్టీ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా గత నెల కాలంగా ఈ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ మూడింతలు పెరిగిందని, రిటైలర్లు ఇన్వెంటరీకి క్లియర్ చేసుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని పేటీఎం మాల్ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. జీఎస్టీ అమ్మకాలన్నీ జూన్ 30 అర్థరాత్రితో ముగుస్తాయని, జూలై 1 నుంచి కొత్త అమ్మకాలు ప్రారంభిస్తామని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ తెలిపారు. చాలా నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గుతున్నాయని, కానీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వెయిట్ అండ్ వాచ్ పాలసీని చేపడుతున్నాయని పేర్కొన్నారు. జూలై 1 నుంచి వారు కూడా ధరలు తగ్గించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement