డిస్కౌంట్ల పండగ వచ్చింది.. | start know discount festivals | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్ల పండగ వచ్చింది..

Published Sat, Oct 10 2015 12:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

డిస్కౌంట్ల పండగ వచ్చింది.. - Sakshi

డిస్కౌంట్ల పండగ వచ్చింది..

గతేడాది కంటే 30% వృద్ధి అంచనా
* పండగ అమ్మకాలపై ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆశలు
* దోహదం చేయనున్న వడ్డీ రేట్ల తగ్గుదల
* డిస్కౌంట్లు, కొత్త ఉత్పత్తులతో ఆన్‌లైన్ సంస్థల ‘సై’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండగ సీజన్ తరుముకుంటూ వచ్చేస్తోంది. దుకాణాలు, ఆఫ్‌లైన్ స్టోర్లను అధిగమించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ కంపెనీలు ఈ సారి ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తుల్ని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

పెద్ద ఎత్తున వివిధ సంస్థల నుంచి ఫండింగ్ అందుకుని ఊపుమీదున్న ఈ కంపెనీలు... భారీగా డిస్కౌంట్లనూ ఆఫర్ చేయబోతున్నాయి. అయితే ఆఫ్‌లైన్ కంపెనీలు కూడా చిరకాలంగా తమనే ఆశ్ర యిస్తున్న కస్టమర్లకు బహుమతులు, డిస్కౌంట్లను ఇచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేశాయి. 2014తో పోలిస్తే ఈ పండగల సీజన్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి వుంటుందని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చెబుతున్నాయి.
 
ఆన్‌లైన్ కంపెనీలు సైతం..
దసరా, దీపావళి, క్రిస్మస్‌కు సాధారణంగా కొత్త గృహోపకరణాలను కొనేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపిస్తారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే వంటి ఇ-కామర్స్ కంపెనీలు ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులతో రంగంలోకి దిగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని వందల ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. అలాగే తక్కువ సమయంలో ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నాయి. మధ్యలో తమ ఫెసిలిటేషన్ సెంటర్‌కు రాకుండానే రిటైలర్ నుంచి నేరుగా కస్టమర్లకు వస్తువులను చేరవేసేలా కూడా సిద్ధమవుతున్నాయి. ఇంటెక్స్, లావా, ఫిలిప్స్ బ్రాండ్ల ఎక్స్‌క్లూజివ్ మొబైల్స్‌ను విక్రయించనున్నట్టు ఈబే ఇప్పటికే ప్రకటించింది.
 
వడ్డీ రేట్లు తగ్గడంతో..
భారత్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2014లో రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2015లో రూ.52,000 కోట్లకు చేరుకుంటుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంటోంది. ఇటీవల కీలక రేట్లను సవరిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ పరిణామంతో సెంటిమెంటు బలపడి పరిశ్రమకు ఊతమిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి.

భారత్‌లో అమ్మకాల్లో ఫైనాన్స్ స్కీమ్‌ల ద్వారా జరుగుతున్న లావాదేవీల వాటా 30 శాతంగా ఉంది. ఇది మరింత పెరుగుతుందని సియామ్ ఆశిస్తోంది. అమ్మకాలు పెరగడంలో బజాజ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్స్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. సులభ వాయిదాల్లో ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతారని చెప్పారు. మార్కెటింగ్‌కు ప్యానాసోనిక్ రూ.90 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలియజేశారు.
 
30 శాతం దాకా వృద్ధి..
ప్రస్తుతం మార్కెట్ సానుకూలంగా ఉందని సామ్‌సంగ్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ రిషి సూరి అన్నారు. కంపెనీ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. పెద్ద స్క్రీన్లవైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండడంతో 40 అంగుళాలు, ఆపైన సైజున్న టీవీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

పండగల సీజన్‌లో 25 శాతం దాకా వృద్ధి ఆశిస్తున్నామని ఎల్‌జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ నీలాద్రి దత్తా తెలిపారు. వెబ్ ఓఎస్ టెక్నాలజీతో ఓఎల్‌ఈడీ టీవీ, స్మార్ట్ టీవీతోపాటు డ్యూయల్ డోర్ ఇన్ డోర్ రిఫ్రిజిరేటర్, జెట్ స్ప్రే టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లను ఎల్‌జీ విడుదల చేసింది. ఈ సీజన్లో బ్రాండ్‌ను బట్టి 25 శాతం వరకూ డిస్కౌంట్లుంటాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఐటీ మాల్ సైతం ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోందన్నారు.
 
ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపు..
దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... అక్టోబరు 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన బిగ్ బిలియన్ డేలో కొన్ని సమస్యలు తలెత్తటం, పరువు పోయే పరిస్థితి రావటంతో ఈ సారి ఒకేరోజు కాకుండా ఐదు రోజుల పాటు బిలియన్ డేస్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది.

అంతేకాక తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి ఇటీవలే ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో, హోం ఎంటర్‌టైన్‌మెంట్ వంటి టెక్నాలజీ ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంటు ఇవ్వనున్నట్టు ఈబే ఇండియా డెరైక్టర్ విద్మయ్ నైని వెల్లడించారు.70% దాకా డిస్కౌంట్‌ను తమ కంపెనీ నుంచి ఆశించొచ్చని స్నాప్‌డీల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement