హ్యాపీగా ఉండాలి షాపింగ్
మాల్ మంత్ర
షాపింగ్ మాల్ బయట ‘సేల్’ అనే పెద్ద బోర్డు ఉంది. దాని పక్కనే మరో బోర్డుపై ఏ ఐటమ్‌కు ఎంత డిస్కౌంట్ అనేది రంగు రంగుల అక్షరాలతో రాసింది. ఒక బ్యాగ్‌లో కాస్మెటిక్స్, మరో బ్యాగ్‌లో ఇష్టమైన డ్రెస్సులు.. ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కానీ పెట్టుకోవడానికి బ్యాగ్‌లో ప్లేస్ లేదు. అలాగే పట్టుకోవడానికి రెండు చేతులూ సరిపోవడం లేదు. అయ్యో... అయ్యో అంటూ ఓ అమ్మాయి దడేలున కింద పడింది... మంచంపై నుంచి నేల మీదకి. ఆ షాపింగ్ అంతా ఆమె కల! ఇలాంటి కలలు ప్రతి అమ్మాయికీ వస్తూనే ఉంటాయి. అదీ అమ్మాయిలకు, షాపింగ్‌కూ మధ్య ఉన్న విడదీయలేని బంధం. అందుకే సేల్ సీజన్‌లో షాపింగ్‌కు వెళ్లినప్పుడు అమ్మాయిలు పాటించవలసిన కొన్ని సూత్రాలున్నాయి.
సైజు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవడం: డ్రెస్సెస్ ఎంచుకునేటప్పుడే అది మీరు వాడే సైజేనా అని చూసుకోండి. ఎందుకంటే ప్రతిసారి ట్రయల్ రూమ్‌కు వెళ్లి డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటే, మీకూ అలాగే ఆ షాపింగ్ మాల్ వాళ్లకూ టైం వృథానే. డిస్కౌంట్ సీజన్ అయినంత మాత్రాన ట్రయల్ రూములు పెరగవు కదా. కాబట్టి మీకు ‘ఎక్స్’ సైజ్ సరిపోతుందా లేక ‘ఎక్స్‌ఎల్’ అవసరమౌతుందా అన్నది ముందే చూసుకుంటే సరిపోతుంది.
క్వాలిటీని అతిగా పరిశీలించనక్కర్లేదు: మీరు తీసుకునే వస్తువులు నాణ్యమైనవేనా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యమే. అంతమాత్రాన వాటిని సాగదీయడం, లాగడం (బట్టలు), ఓపెన్ చేసి చూడటం (కాస్మెటిక్స్) లాంటివి తగ్గిస్తే మంచిది. కొన్ని బట్టలు షాప్ బయట వేలాడదీస్తారు, కొన్నింటిని ర్యాక్స్‌కు హ్యాంగ్ చేస్తారు. దాంతో వాటిపై ఏవైనా మరకలు, దుమ్ము ఉంటే ఆ సేల్స్ గల్స్, బాయ్స్‌పై అరవకండి. మీకు నచ్చక పోతే ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి.
బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఆలస్యం వద్దు: చాలామంది బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వెళ్లాక కానీ బ్యాగుల్లోంచి డబ్బులు తీయరు. సేల్ సీజన్‌లో అలా చేస్తే బిల్లింగ్ కోసం మీ వెనుక క్యూ పెరుగుతుంది. ఎవరైనా పనులు పూర్తి చేసుకొని ఇళ్లకు త్వరగా చేరాలనే కోరుకుంటారు. కాబట్టి బిల్ కట్టడానికి వెళ్లేటప్పుడే చేతిలో డబ్బులు పట్టుకెళ్లండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే క్యూలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడటం లాంటివి చేయకండి.