‘కార్డు’తో పండుగ చేస్కో.. కానీ! | Before using a credit card with a financial... | Sakshi
Sakshi News home page

‘కార్డు’తో పండుగ చేస్కో.. కానీ!

Published Mon, Oct 3 2016 1:27 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

‘కార్డు’తో పండుగ చేస్కో.. కానీ! - Sakshi

‘కార్డు’తో పండుగ చేస్కో.. కానీ!

పండుగలొచ్చేస్తున్నాయి. దసరా, దీపావళి పండుగలకు అందరూ వస్తువులపై ఖర్చు పెడుతుంటారు కనక ఈ-కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ స్టోర్లు... అన్నీ ఆఫర్లతో సిద్ధమైపోయాయి. ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాయి కూడా. చాలా వస్తువులపై డిస్కౌంట్ల వెల్లువ కురుస్తోంది. ఇది చాలు కదా.. మనం కొనటానికని అనుకుంటున్నారా...?? చేతిలో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డులున్నాయి కదా బేఫికర్ అనుకుంటున్నారా!! కాస్త ఆగండి. ఇలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించే ముందు కొంచెం ఆర్థికంగా లెక్కలు వేసుకోండి. లేకపోతే రుణ వలయంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే... ఈ సమయంలో క్రెడిట్ కార్డును ఎలా వాడాలనే సూచనలే ఈ ‘ప్రాఫిట్’ ప్రత్యేక కథనం...
 
ఆఫర్లున్నాయని శక్తికి మించి కొంటే అంతే
చెల్లింపు సామర్థ్యాన్ని బట్టే క్రెడిట్ కార్డు వాడకం
ఈజీ చెల్లింపులకే కార్డు... రుణ సాధనంగా చూడొద్దు
బకాయి మొత్తం ఒకేసారి తీరిస్తేనే బెటర్
కనీస మొత్తం కట్టుకుంటూ పోతే దశాబ్దాలు చెల్లించాలి
కొత్తగా కార్డు చేతికొస్తే మరింత జాగ్రత్తగా ఉండండి

 
నిజమే! ఎవరెన్ని చెప్పినా క్రెడిట్ కార్డులనేవి ‘భలే మంచి చౌకబేరము’ లాంటివి. ఎందుకంటే చేతిలో పెద్ద మొత్తం లేకున్నా... ఆ స్థాయిలో కొనుగోళ్లు ఈజీగా చేసేయొచ్చు. పెపైచ్చు ఇప్పుడు కొనటం... తరవాత చెల్లించటం అనే సూత్రం ఎటూ తోడుంటుంది. కాకపోతే కొంచెం అతి చేశారనుకోండి!! ఒకవంక మీ కార్డుపై వాడకం పెరిగిపోయి మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. ఎలాగూ నెలనెలా చెల్లిస్తాం కదా అనుకున్నా... దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.

దీంతో భవిష్యత్తులో మీకు ఇతరత్రా కావాల్సిన రుణ అవకాశాలు దెబ్బతింటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం... చిరకాలంగా క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికంటే కొత్తగా కార్డు చేతిలోకి వచ్చినవారు ఈ రకమైన ఆఫర్లకు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. తాహతుకు మించి కొనుగోళ్లు చేస్తుంటారు. వారి క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వాడేయటం, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కావటం కూడా జరుగుతుంటుంది. అదే ఏడెనిమిదేళ్లుగా కార్డు వాడుతున్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉంటారు. ‘‘కొత్తగా కార్డు తీసుకున్నవారు తమ చేతిలో ఇన్‌స్టంట్ రుణాన్నిచ్చే అద్భుత సాధనం ఉన్నట్టుగా భావిస్తారు. అంతేతప్ప దానిపై భారీ వడ్డీ పడుతుందన్న విషయాన్ని గమనించరు’’ అని ఫైనాన్షియల్ సాధనాల్ని ఆన్‌లైన్లో విక్రయించే ‘రుబిక్’ వ్యవస్థాపకుడు, సీఈఓ మానవ్‌జీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
 
కార్డుదారులు చేసే తప్పిదాలు...
రుణం భారీగా పేరుకుపోవటానికి కార్డుదారులు చేసే ప్రధానమైన తప్పిదమేంటంటే వాయిదాలు చెల్లించటం. కనీస మొత్తంగా ఎంత చెల్లించాలని కార్డు కంపెనీ సూచిస్తుందో... అంతే మొత్తాన్ని చెల్లించి ఊరుకుంటారు. ఒకోసారి నెలవారీ చెల్లింపుల్ని చేయకుండా కూడా వదిలేస్తుంటారు. దీంతో అలా చెల్లించని మొత్తం... తదుపరి నెల బిల్లుకు జత అవుతుంది. ఈ రెండిటికీ భారీ అపరాధ రుసుములు, వడ్డీ కలుస్తాయి.

ఒకోసారి వడ్డీ వార్షికంగా లెక్కిస్తే 30-40 శాతం కూడా ఉంటుంది. నిజానికి కనీస మొత్తం చెల్లించటం, లేదా కొంత మొత్తాన్ని చెల్లించటం వంటి చర్యల వల్ల అపరాధ రుసుమును తప్పించుకోవచ్చు. క్రెడిట్ స్కోరు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. కాకపోతే మిగిలిన మొత్తంపై భారీ వడ్డీని మాత్రం చెల్లించక తప్పదు. దీంతో పాటు వడ్డీ లేకుండా చెల్లించే వ్యవధిని (ఇంట్రస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్) కూడా కోల్పోవటం జరుగుతుంది.
 
చాలామంది క్రెడిట్ కార్డుదారులు తమ కార్డులపై రుణాలు కూడా తీసుకుంటుంటారు. నిజానికి తక్షణం నగదు కావాల్సి వచ్చినపుడే ఇలాంటివి తీసుకోవాలి. అంటే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినపుడో, తమ వారికోసం ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి వచ్చినపుడో అన్న మాట. ఎందుకంటే మామూలు వ్యక్తిగత రుణాలపై కన్నా ఈ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రుణాలపై వడ్డీ ఎక్కువ. మీరు తీసుకున్న రుణం మొత్తాన్ని బట్టి... దానికి సమానంగా కార్డుపై మీ క్రెడిట్ లిమిట్ కూడా బ్లాక్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
 
ఇంకొందరు ఒక కార్డుపై చేసిన రుణాన్ని తీర్చటానికి వేరొక కార్డును వినియోగించటం వంటివి చేస్తుంటారు. అలా చేయటం వల్ల చెల్లించాల్సిన మొత్తం తగ్గిపోతుందని, తాము తెలివైన పని చేశామని వారు భావిస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయటం వల్ల వారు రుణ ఊబిలో కూరుకుపోతున్నారనేది సుస్పష్టం.
 
దీన్లోంచి బయటపడటం ఎలా?
ఒక్కటి గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డనేది చెల్లింపులు ఈజీగా చేయటానికి మీ దగ్గరుండే ఓ సాధనం. అంతేతప్ప దీన్నో రుణ సాధనంగా భావించొద్దు. ‘‘మీ ఖర్చులన్నీ మీ చెల్లించే సామర్థ్యానికి మించకుండా ఉండేటట్లు చూసుకోండి. మీ ఆదాయానికి తగ్గ ఖర్చులు చేసి... బిల్లును మొత్తం ఒకేసారి చెల్లించేయండి. ఒకవేళ అలా చేయలేనివారు మీ డెబిట్ కార్డును మాత్రమే వినియోగించటం నేర్చుకోండి. అపుడు మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని మాత్రమే వాడే వీలుంటుంది’’ అని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పంజా సూచించారు.
 
ఒకవేళ మీరు మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు... మీ దగ్గర ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే గనక ఎక్కువ వడ్డీని వసూలు చేసే రుణాన్ని మొత్తంగా తీర్చేయండి. అందుకు తక్కువ వడ్డీ వసూలు చేసే కార్డును ఉపయోగించండి. కాని పక్షంలో 12-15 శాతం మధ్య లభించే పర్సనల్ లోన్లు తీసుకుని క్రెడిట్ కార్డు రుణాలను పూర్తిగా తీర్చేయండి.
 
ఇవన్నీ కానపుడు మీ క్రెడిట్ కార్డు రుణాన్ని ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై నెలకు 1.2 నుంచి 2 శాతం వడ్డీ వసూలు చేస్తుంటారు. అంటే ఏడాదికి 24 శాతం మించకపోవచ్చు. ఇలా చేయటం వల్ల చెల్లింపులకు కొంత సమయం దొరకటంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. చెల్లింపులు జరిగినపుడల్లా మీ క్రెడిట్ లిమిట్ పెరుగుతుంటుంది.
 
ఇక చివరిగా మీ బ్యాంకుతో మాట్లాడుకుని వడ్డీ రేటు తగ్గించమని అడిగే అవకాశాన్ని పరిశీలించండి. మీకు ఆ బ్యాంకుతో ఇతరత్రా లావాదేవీలున్నపుడు, మీరు గనక ఓల్డ్ కస్టమర్ అయినప్పుడు బ్యాంకులు తప్పకుండా ఇలాంటి అభ్యర్థనను పరిశీలిస్తాయి. వడ్డీ రేటు తగ్గిస్తాయి.
 
ఎక్కువ చెల్లింపు... తక్కువ ఖర్చు
మోహన్ తన కార్డుపై రూ.2 లక్షలు ఖర్చుచేశాడు. నెలకు 3 శాతం వడ్డీ చెల్లించాలి. ఎంతెంత చెల్లిస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం..
 
మోహన్ ప్రతినెలా కనీస మొత్తంగా చెల్లించాల్సిన 5 శాతాన్నీ చెల్లిస్తున్నాడు. తదుపరి ఆ కార్డును వినియోగించటం మానేశాడు. మోహన్ గనక ఇలా చేస్తే మొదటి నెల రూ.10,000 చెల్లించాల్సి వస్తుంది. తరవాత కొంచెం తగ్గుతుంది. కానీ ఇలా 35 సంవత్సరాల 4 నెలలపాటు వాయిదాలు కడుతూనే ఉండాలి. మొత్తంగా మోహన్ చెల్లించేదెంతో తెలుసా? రూ.4,65,089.
 మోహన్ నెలకు బిల్లులో 25 శాతాన్ని చెల్లించటం మొదలెట్టాడు. కానీ ప్రతినెలా మరో 10 శాతం వాడుతున్నాడు.  

మిగిలిపోయిన బకాయికి, నెలనెలా పెట్టే ఖర్చుకు వడ్డీ వేస్తారు కనక మోహన్ మొదటినెల రూ.50,000 చెల్లిస్తాడు. అది కాస్తకాస్త తగ్గుతూ పూర్తిగా చెల్లించటానికి ఐదున్నరేళ్లు పడుతుంది. మొత్తంగా రూ.2,29,508 చెల్లిస్తాడు. అంటే ఒకరకంగా వడ్డీ తక్కువే.
 మోహన్ నెలకు  50 శాతం చొప్పున తీర్చేయటమే కాకుండా... మిగిలిన మొత్తంలో 25 శాతాన్ని నెలనెలా అదనంగా వాడటం మొదలెట్టాడు. మొదటి నెల రూ.లక్ష చెల్లిస్తాడు కాబట్టి మూడేళ్లలో అప్పు పూర్తిగా తీరిపోతుంది. మొత్తంగా చెల్లించేది రూ.2,08,333. అంటే వడ్డీ రూ.8,333 మాత్రమే.
 
మోహన్ ఒకేసారి పూర్తిగా చెల్లించాడనుకోండి. రూపాయి కూడా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. పెపైచ్చు మరుసటి నెల ఎంత వాడినా... దానిక్కూడా వడ్డీలేని వ్యవధి ఉంటుంది. దానిపైనా వడ్డీ పడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement