E-commerce companies
-
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన యాప్‌లో ఎస్‌వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్‌లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్‌పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్‌వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్‌పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే. -
భద్రం బ్రదర్.. సీవోడీనే బెటర్
మహేశ్వరి అనే మహిళ ఈ–కామర్స్ వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకున్న తరువాత తెరిచి చూస్తే ఆమె ఆర్డర్ పెట్టిన కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌తో ఉన్న నకిలీ ల్యాప్‌టాప్ వచ్చినట్టు గ్రహించింది. ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ.. పట్టించుకోలేదు. కంపెనీ కార్యాలయానికి వెళితే ఆమె ఫిర్యాదును పరిష్కరించే బాధ్యులెవరూ కనిపించలేదు. చేసేది లేక అదనంగా సొమ్ము చెల్లించి ఆ ల్యాప్‌టాప్‌లోనే తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. – సాక్షి, అమరావతి ఆన్లైన్ షాపింగ్ మారుమూల పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ చేస్తే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వేరొకటి రావడం.. వస్తువును రిఫండ్ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవడం వంటి మోసాలు పెరుగుతున్నాయి. నగదు చెల్లించినా వస్తువు రాకపోవడం.. క్రెడిట్, డెబిట్ కార్డులను తస్కరించి వేరొకరు ఆన్లైన్ షాపింగ్ చేయడం వంటి మోసాలెన్నో జరుగుతున్నాయి. ఇలా మోసపోతున్న వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో ఈ–కామర్స్ వ్యాపారంపై నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ.. వినియోగదారుల రక్షణ చట్టం–1986, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం 2008, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన నియంత్రణ సంస్థలచే నిర్దేశించిన విధానాలు ఈ–కామర్స్ సంస్థలకు కూడా వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలంటే.. ఈ–కామర్స్ సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే.. ‘కన్సూమర్ కోర్ట్ ఆన్లైన్ ఇండియా’, కన్సూమర్ ఫోరమ్, కమిషన్లలో ఫిర్యాదు చేయొచ్చు. వీటికి వెబ్సైట్, యాప్, టీవీ షాపింగ్ షో ద్వారా ఆర్డర్ చేసి రిఫండ్ లేదా రీప్లేస్మెంట్ పొందకపోవడం, ఆలస్యంగా డెలివరీ చేయడం, తప్పుదారి పట్టించే ప్రమోషన్ల వంటి వాటిపై పైన పేర్కొన్న సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి ముందు ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. ప్రతి ఈ–కామర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిర్దేశించిన విధంగా ఫిర్యాదు అధికారిని అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలు కంపెనీ వెబ్సైట్లో ఉండాలి. మీ ఫిర్యాదును సదరు అధికారికి తెలియజేయండి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరిస్తాయి. అది సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇలా చేసినా ప్రయోజనం లేకపోతే డీలర్, తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్ పేర్లు, చిరునామాలను సేకరించండి. ఆ చిరునామాలకు సమస్యను రిజిస్టర్ పోస్ట్ ద్వారా రాసి పంపండి. గడువు ముగిసిన తర్వాత మీకు ఎలాంటి స్పందన రాకపోతే వినియోగదారుల ఫోరమ్, కమిషన్‌ను ఆశ్రయించండి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ–కామర్స్ వినియోగదారులు తమ సొంత నగరంలోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ‘సైబర్’ భద్రత ఇలా.. ఇటీవల రోగ్ (నకిలీ) వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా తప్పుడు వివరాలతో నకిలీ ఈ–కామర్స్ వెబ్సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వీటిని గుర్తించి నిషేధించినా మరో పేరుతో మళ్లీ వస్తున్నాయి. వాటిని తెరిస్తే మనకు తెలియకుండానే మన కార్డుల్లో నగదు ఖర్చవుతుంటుంది. ఇలాంటి నకిలీ, పైరసీ వంటి నేరాల బారినపడిన బాధితులు 24 గంటల్లోపు ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో ఫిర్యాదు చేయాలి. సంబంధిత అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా సైబర్ మోసగాళ్లను కనిపెడతారు. నకిలీలను ప్రోత్సహించే డొమైన్‌పై నేషనల్ ఇంటర్నెట్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అనధికార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం ద్వారా కార్డును బ్లాక్ చేసి, నగదును తిరిగి పొందవచ్చు. అన్నిటికంటే ముందు ఈ–కామర్స్ సైట్ అడ్రస్‌ను ప్రభుత్వం అందిస్తున్న రిజస్ట్రీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వెతికితే అది అసలైనదో, నకిలీదో తెలిసిపోతుంది. సురక్షిత ఆన్లైన్ షాపింగ్ కోసం.. ► తెలియని ఈ–కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి ముందు వాటిని పరిశోధించండి. అనుమానం ఉంటే కొనుగోలును ఆపేయాలి. ► మొదటిసారి సైట్ నుంచి కొనుగోలు చేస్తుంటే క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోండి. ► కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, గోప్యతా విధానాన్ని చదవండి. ► డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్ థర్డ్ పార్టీతో షేర్ చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోండి. ► ఆర్డర్ రద్దు, వాపసు విధానాలను, నియమాలను చదివి అర్థం చేసుకోండి. ► ఈ–కామర్స్ కంపెనీ చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబర్, హెల్ప్‌లైన్ వంటి కస్టమర్ కేర్ వివరాలు వాస్తవమో కాదో నిర్ధారించుకోండి. ► ఉత్పత్తి, వారంటీ వివరాలు తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి. ► నగదు చెల్లించడానికి ముందు, ఆ వస్తువును కంపెనీ మీ పిన్‌కోడ్‌కు డెలివరీ చేస్తుందో లేదో చూసుకోండి. ► ఒకవేళ కంపెనీ ధర, వస్తువు వివరణను ఆర్డర్ చేసిన తర్వాత మార్చవచ్చు. కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే ఆర్డర్ వివరాలు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ► ఎక్స్చేంజ్ , రిఫండ్ వంటి క్లెయిమ్‌ల విషయంలో జాగ్రత్త వహించండి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు లోపభూయిష్టంగా ఉంటే కంపెనీలు ఎక్సే్చంజ్, రిఫండ్ చేయాలి. -
ఆన్లైన్ రివ్యూలకు భారత ప్రమాణాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నకిలీ రివ్యూల కట్టడి దిశగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) 19000:2022’ను తీసుకొచ్చింది. ఆన్లైన్లో వినియోగదారుల నుంచి సేకరించే రివ్యూలు, ఆ రివ్యూల సేకరణకు అనుసరించే అవసరాలు, ప్రమాణాలు, వాటి ప్రచురణకు కచ్చితంగా బీఐఎస్ ప్రమాణాలను ఈ కామర్స్ సంస్థలు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ మేరకు బీఐఎస్ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ వేదికగా కస్టమర్ల రివ్యూలు (అభిప్రాయాలు, సమీక్ష) సమీకరించే అన్ని సంస్థలు, ఉత్పత్తులు, సేవలను విక్రయించే, సరఫరాచేసే సంస్థలు, రివ్యూలను సమీకరించేందుకు మూడో పార్టీని ఏర్పాటు చేసుకునే సరఫరాదారులు, విక్రయదారులు వీటిని పాటించాల్సి ఉంటుందని బీఐఎస్ తెలిపింది. ముఖ్యంగా రివ్యూ తీసుకునే విషయంలో అనుసరించాల్సిన ప్రమాణాలు, సూత్రాలను ఇండియన్ స్టాండర్డ్ సూచిస్తుంది. రివ్యూని రాసే, రివ్యూని సమీక్షించే వారిపై ఉండే బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. ‘‘ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసే వారిలో ఇది విశ్వాసాన్ని కలిగిస్తుంది. మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సాయపడుతుంది. ఈ కామర్స్ ఎకోసిస్టమ్, వినియోగదారులు, ఈ కామర్స్ వేదికలు, విక్రేతలు ఇలా భాగస్వాములు అందరికీ ఇండియన్ స్టాండర్డ్ 19000:2022 ప్రయోజనం కలిగిస్తుంది’’అని బీఐఎస్ తెలిపింది. -
వ్యాపారాల్లో మహారాణులు: మష్రూమ్ పౌడర్‌తో థైరాయిడ్కి చెక్
కోచి: వ్యాపారంలో వారికంటూ ఓ చోటు కల్పించుకున్నారు. తమదైన ‘బ్రాండ్’ను సృష్టించుకోవడమే కాదు.. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రగతి దిశగా సాగిపోతున్న ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వారంతా. కోచిలో ఏర్పాటు చేసిన ‘వ్యాపార్ 2022’ పారిశ్రామిక ఎగ్జిబిషన్లో వీరు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తే.. అందులో 65 మంది మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. వీరిని పలుకరించగా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, వ్యాపారంలో గొప్ప దార్శనికత, లక్ష్యం దిశగా వారికి ఉన్న స్పష్టత, ఆకాంక్ష వ్యక్తమైంది. చేతితో చేసిన ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నింటినో వారు ప్రదర్శనకు ఉంచారు. వీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అందించడమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ తమకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు. ► సహజసిద్ధ రీతిలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) సాగు చేస్తూ వాటిని అందరిలా కేవలం మార్కెట్లో విక్రయించడానికి ‘నహోమి’ బ్రాండ్ పరిమితం కాలేదు. విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించి కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. ఓయెస్టర్ మష్రూమ్ పౌడర్, ఆయిల్, చాక్లెట్, సోప్, పచ్చళ్లు, కేక్ ఇలా భిన్న ఉత్పత్తులతో కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది. ‘‘ఒయెస్టర్ మష్రూమ్ పౌడర్ థైరాయిడ్ నయం చేయడంలో మంచి ఫలితాన్నిస్తోంది. విక్రయం కాకుండా మిగిలిన మష్రూమ్లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తాం. పెద్ద విక్రయ సదస్సుల్లో వాటిని విక్రయిస్తుంటాం’’అని నహోమి వ్యవస్థాపకురాలు మినిమోల్ మ్యాథ్యూ తెలిపారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో వితుర ప్రాంతానికి చెందిన ఆమె దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ వ్యాపార మేళాల్లో ఆమె పాల్గొంటుంటారు. ► కేరళలోని కలపెట్టా ప్రాంతానికి చెందిన గీత.. ‘వెస్ట్ మౌంట్ కేఫ్’ పేరుతో వ్యాపార వెంచర్ ప్రారంభించి.. నాణ్యమైన కాఫీ రుచులను ‘అరబికా కాఫీ’ బ్రాండ్‌పై ఫైవ్ స్టార్ హోటళ్లకు, దుబాయి మార్కెట్‌కు అందిస్తున్నారు. అరబికా కాఫీ ప్రీమియం బ్రాండ్. సంపన్న రెస్టారెంట్లు, బ్రాండెడ్ సూపర్ మార్కెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ► తలగడలు, పరుపులు తయారు చేసే ‘విఫ్లవర్స్’ ఆవిష్కర్త అరుణాక్షి కాసర్‌గఢ్‌కు చెందిన మహిళ. కరోనా సమయంలో ఏర్పాటైంది ఈ సంస్థ. గతేడాది రూ.50 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశారు. ‘‘నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అందరూ మహిళలే. కర్ణాటక, కేరళ మా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి’’అని అరుణాక్షి తెలిపారు. ► శాఖాహార, మాంసాహార పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ‘టేస్ట్ ఆఫ్ ట్రావెన్కోర్’ అధినేత సుమారేజి పతనం తిట్టకు చెందిన వారు. 25 రకాల పచ్చళ్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు కలపకుండా సహజ విధానంలో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం టేస్ట్ ఆఫ్ ట్రావెన్ కోర్ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లే లులూ గ్రూపు హైపర్మార్కెట్లో తమ ఉత్పత్తులకు చోటు దక్కిందంటారు ఆమె. వ్యాపార సదస్సు 2022 ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు ఎన్నో పలకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. ► ఇంజనీరింగ్ చదివిన వందనా జుబిన్ ఏదో ఒక మంచి ఉద్యోగానికి అతుక్కుపోలేదు. ‘మినీఎం’ పేరుతో చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. చాక్లెట్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అలాగే, చక్కెర రూపంలో కీడు కూడా ఉంది. జుబిన్ ఆ చక్కెరను వేరు చేశారు. చక్కెర రహిత చాక్లెట్లతో ఎక్కువ మందిని చేరుకుంటున్నారు. షుగర్ బదులు తీపినిచ్చే స్టీవియాను ఆమె వినియోగిస్తున్నారు. 25 రకాల చాక్లెట్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. పెద్ద ఈ కామర్స్ సంస్థలతో టైఅప్ చేసుకుని ఎక్కువ మందిని చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. -
తప్పుదోవ పట్టిస్తున్న ఈ-కామర్స్ ఉత్పత్తులు
తరచుగా పునరావృతమయ్యే సామెత - పరిశుభ్రతే దైవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రత సారాంశం.. ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, శుభ్రంగా ఉండటమనేది భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. తొలుత, ప్రజలు అందంగా కనబడేందుకు ఈ ఆధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు లేని వేళ సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడుతుండేవారు. అయితే, శాస్త్రీయ ఆవిష్కరణల కారణంగా విస్తృతశ్రేణిలో అత్యాధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తల్లులు, శిశువుల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో తమదైన వాటాను ఆక్రమించుకుంటున్నాయి. వృద్ధి చెందుతున్న ఆదాయం, స్థిరమైన జీవితంతో ప్రజలు ఇప్పుడు ఈ తరహా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అవి సహజసిద్ధంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరొందిన కంపెనీలు అయిన హిమాలయ, డాబర్, ఇమామీ మరియు ఈ విభాగంలో ఇతర ఆయుర్వేద కంపెనీలు ఉన్నప్పటికీ, స్థిరంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్అదే తరహా వృద్ధి అవకాశాలను నూతన కంపెనీలకు కూడా అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నూతన ఈకామర్స్బ్రాండ్స్, తమ తల్లులు, పిల్లల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యంత సహజమైనవని వాదిస్తుండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, తమకు అత్యంత ప్రజాదరణ తీసుకువచ్చిన ఈ వాదనలలోని ఆధీకృత ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా వరకూ ఉత్పత్తులలో లేబులింగ్ మరియు ధృవీకరణలలో పారదర్శకత అనేది లోపించింది. బహుశా, తమ ఉత్పత్తులను మార్కెట్చేయడం, తమ వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం మరియు అమ్మకాలను రెట్టింపు చేసుకోవడానికి నూతన తరపు కంపెనీలు తమ ఉత్పత్తులను సహజసిద్ధమైనవని తప్పుగా పేర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులలో రసాయనాలు ఉన్నప్పటికీ అవి శాస్త్రీయంగా హానికారకం కాదని నిరూపితం కాలేదు. వాటినే వారు సహజసిద్ధమని వెల్లడిస్తున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఓ ఉత్పత్తి సహజసిద్ధమైనది ఎందుకు అవుతుంది ? దీనికి సరైన నియంత్రణ వ్యవస్థ మరియు ధృవీకరణ ప్రక్రియ లేకపోవడం కూడా కారణమే అని డాక్టర్శర్మ అన్నారు. వినియోగదారు స్నేహ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిలోని కొన్ని పదార్థాలు హానికారకమైనవి. కానీ బాధ పడే అంశం ఏమిటంటే, చాలామంది ప్రజలకు ఈ ఉత్పత్తులు చేసే హాని గురించి తెలియకపోవడం మరియు ఆ ప్రకటనలను చూసి చాలామంది వాటిని వినియోగిస్తుంటారు. బేబీ ఉత్పత్తులను వినియోగించడమన్నది వ్యక్తిగత ఎంపిక. నేను మా పిల్లలకు టాల్కమ్ పౌడర్రాయను. ఎందుకంటే చిన్నారుల చర్మానికి టాల్క్ మంచిది కాదు. చిన్నారుల చర్మం మృదువైనది. అందువల్ల ఉత్పత్తుల ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మంపై ర్యాషెస్వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉత్పత్తులు ఖచ్చితంగా అతి తక్కువ రసాయనాలు మాత్రమే కలిగి ఉండాలి. సాధారణంగా ప్రజలు ఆ ఉత్పత్తుల యొక్క ఆధీకృతను పరిశీలించరు. లేబుల్స్చూసి వాటిని కొంటుంటారు. కానీ ఎన్నో సార్లు ఈ తరహా ఉత్పత్తులు మీ పాపాయి చర్మంపై హానికారక ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ప్రతి వినియోగదారుడూ ఈ ఉత్పత్తులు సహజసిద్ధమైనవా లేదా అని పరిశీలించడంతో పాటుగా కొనేందుకు ముందు వాటిని పరిశీలించాలి’ అని అన్నారు. మార్కెట్లో ఇప్పుడు ఈ తరహా ఈ- కామర్స్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తమ ఉత్పత్తులు సహజసిద్ధమైనవని వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తి మార్కెట్లో ప్రతి కంపెనీకీ ఎదిగేందుకు హక్కు ఉంది. కానీ తప్పుడు వాదనలు వాంఛనీయం కాదు. ప్రకటనలు, ప్యాకేజింగ్మరియు లేబులింగ్వంటివి వినియోగదారులకు ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ఉత్పత్తి సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినవి. అందువల్ల వారు సమాచారయుక్త ప్రాధాన్యతలను అందించాల్సి ఉంది. అయితే, దురుద్దేశ్యంతో చేసే లేబులింగ్‌ను ఖచ్చితంగా నివారించాలి. అంతేకాదు, వినియోగదారులు సమాచారంతో కూడిన కొనుగోలుదారుడు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల, మనమంతా కూడా ఓ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు పలు కోణాల్లో దానిని పరిశీలించాల్సి ఉంది. ప్రకటనలు, లేబులింగ్‌పై ఆధారపడి వాటిని కొనకూడదు. ఈ ఉత్పత్తులలోని వ్యత్యాసాలు మనకు అంటే వినియోగదారులకు హానికలిగిస్తాయి. -
లాక్డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట
సాక్షి, ముంబై : కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోయిన ఈ కామర్స్ దిగ్గజాలకు తాజాగా భారీ ఊరట లభించనుంది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల ఆన్ లైన్ వ్యాపారానికి కొన్ని ఆంక్షలతో అనుమతి లభించింది. నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. రెడ్ జోన్లు మినహా తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ అనుమతి నిత్యావసర వస్తువులను మాత్రమే పరిమితమైంది. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా తాజాగా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. సంబంధిత నిబంధనలను పాటిస్తూ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులకు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేయవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. అయితే రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మందులు లాంటి నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి వుంది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) చదవండి: అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట -
ఇ-కామర్స్ కంపెనీలకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19, లాక్డౌన్ సమయంలో ఇ-కామర్స్ సంస్థలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవరసమైన సరుకులు తప్ప, మిగిలిన సరుకు పంపిణీ కుదరదని తేల్చి చెప్పింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయంపై నిషేధం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే నివాస ప్రాంతాల్లోని, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని అన్ని దుకాణాలను తిరిగి తెరుచుకునేందుకు శనివారంనుంచి అవకాశం కల్పించింది. ఇ-కామర్స్ సంబంధించి అవసరమైన వస్తువుల విక్రయాలకు మాత్రమే అనుమతి వుంటుందని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అయితే ప్రభుత్వం ఆయా వెబ్సైట్ల గురించి ప్రస్తావించనప్పటికీ, ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు దెబ్బే. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్) లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని కేంద్రం తెలిపింది. అయితే ఈ సడలింపులు, కరోనావైరస్ హాట్స్పాట్లు లేదా కంటైన్మెంట్ జోన్లకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మందులు లాంటి నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్, డ్రైక్లీనర్స్, ఎలక్టికల్ దుకాణాలకు తెరుచుకునేందుకు అవకావం వుంది. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. (కరోనా : టాప్-10 నుంచి స్టాక్ మార్కెట్ ఔట్) లాక్డౌన్ కారణంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత వారం మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, బట్టలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం మరికొన్నింటిపై ఆంక్షలు కొనసాగించడం గందరగోళానికి దారితీసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్ లేఖ రాశారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రవీణ్ స్వాగతించారు కూడా. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్మార్ట్ఫోన్ల కోసం కొత్త ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించడం గమనార్హం. కాగా దేశంలో లాక్డౌన్.2 మే 3వ తేదీవరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్) చదవండి : కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్ కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం! 5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు! -
నిత్యావసరాలకు మాత్రమే ఓకే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ–కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. ‘నిత్యావసరాలు, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్, మొబైల్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము‘ అని పేటీఎం మాల్ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీలు సత్వరం చేసేందుకు వెసులుబాటు లభించేలా ప్రభుత్వ వర్గాలు, లాజిస్టిక్స్ సంస్థలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు వివరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, హ్యాండ్ శానిటైజర్లు మొదలైనవి తక్షణం సరఫరా చేయగలిగే విక్రేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆర్డర్ల డెలివరీల్లో జాప్యం: అమెజాన్ లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా ఆర్డర్ల డెలివరీల్లో మరికాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ‘ప్రీపెయిడ్ పేమెంట్ విధానంలో అత్యవసర ఉత్పత్తులకు మాత్రమే కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటూ, సాధ్యమైనంత త్వరగా డెలివరీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం..: ఫ్లిప్‌కార్ట్.. నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించింది. ‘ఆర్డర్ల ప్రాధాన్యాన్ని బట్టి సాధ్యమైనంత త్వరగా మీకు డెలివర్ చేస్తాము. ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తాత్కాలికంగా తీసుకోవడం లేదు. కానీ వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము‘ అని తమ వెబ్సైట్లో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్థానిక అధికారుల తోడ్పాటుతో కార్యకలాపాలన్నీ యథావిధిగా ప్రారంభించినట్లు ఆన్లైన్ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్ వెల్లడించింది. అయితే, గ్రోఫర్స్ పోటీ సంస్థ అయిన బిగ్‌బాస్కెట్ వెబ్సైట్ మాత్రం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు. -
పండుగల్లో 1.40 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థలు పండుగల సీజన్లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల అమ్మకాల కోసం 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది. మరో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్లో తాత్కాలికంగా 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో వీరి అవసరం ఉందని తెలిపింది. -
తిరోగామి నిబంధనలివి..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడంపై పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) స్పందించింది. ఇవి ‘తిరోగామి‘ నిబంధనలంటూ శుక్రవారం వ్యాఖ్యానించింది. వీటివల్ల కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలగడంతో పాటు అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. ఫలితంగా భారత్‌లో ఆన్లైన్ రిటైల్ వృద్ధిపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అభిప్రాయపడింది. ప్రభుత్వాలు... వ్యాపారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం తగదని యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేష్ అఘి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. పరిశ్రమ వర్గాలెవరితోనూ చర్చించకుండా నిబంధనలను మధ్యలో మార్చేయడం సరికాదన్నారు. ‘ఈ–కామర్స్ విధానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన సవరణలు తిరోగామి చర్యలుగా ఉన్నాయి. రిటైల్ రంగానికి కీలకమైన కొనుగోలుదారు ప్రయోజనాలకు ఇవి ప్రతికూలం. ఈ సవరణ కారణంగా భారతీయ తయారీదారులు, విక్రేతలు.. అంతర్జాతీయ ఆన్లైన్ రంగంలో సమర్థంగా పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుంది‘ అని ముకేష్ తెలిపారు. పాలసీ విధానంలో పారదర్శకత లోపించడాన్ని ఇది సూచిస్తుందని, అనిశ్చితికి దారితీస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, తాము నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు సాగిస్తున్నామని, తాజా సవరణలపై మరింత స్పష్టత కోసం ప్రభుత్వాన్ని సంప్రతిస్తామని అమెజాన్ ఇండియా పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఉన్న ఈ–కామర్స్ సంస్థలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. ఇటీవలే మోర్ సూపర్ మార్కెట్లో వాటా కొనుగోలు చేసిన అమెజాన్, దాదాపు 16 బిలియన్ డాలర్లతో ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ లాంటి అమెరికన్ దిగ్గజాలకు ఈ నిబంధనలు సమస్యాత్మకంగా మారనున్నాయి. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది. -
ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి దిగ్గజాలు...
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో దేశీ ఆన్లైన్ షాపింగ్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న దిగ్గజ ఈ–కామర్స్ సంస్థలు తాజాగా ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను కొనేయడమో లేదా పెట్టుబడులు పెట్టడమో, వాటాలు తీసుకోవటమో చేసే పనిలో పడ్డాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పాటు బిగ్‌బాస్కెట్, స్విగ్గీ వంటి సంస్థలూ బరిలోకి దిగడంతో ఆన్లైన్ ఫార్మా రంగంలో పోటీ మరింత తీవ్రం కానుంది. దేశీయంగా ఔషధాల అమ్మకాలు 2020 నాటికల్లా 55 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం 2017లో రూ. 1,19,641 కోట్ల (17.5 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.10,215 కోట్ల (1.49 బిలియన్ డాలర్లు) విలువ చేసే ఔషధాలు దేశీయంగా అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 8.6 శాతం అధికం. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఫార్మాలో పెద్దగా డిస్కౌంట్ల ఊసుండదు. దీంతో మార్జిన్లు భారీగానే (సుమారు 20–30 శాతం దాకా) ఉంటాయి. కొన్ని స్టార్టప్‌లు డిస్కౌంట్లు, ఆఫర్లతో ఆన్లైన్ ఫార్మసీలు ప్రారంభించినప్పటికీ... ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ అంశాలే ఈ–కామర్స్ దిగ్గజాలను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మా సంస్థలతో అమెజాన్ చర్చలు ప్రస్తుతం దేశీయంగా మెడ్‌ప్లస్, 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మీజీ, మైరా, అపోలో, నెట్‌మెడ్స్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మెడ్‌ప్లస్ వంటి 3–4 సంస్థలతో అమెజాన్ చర్చలు జరిపినట్లు సమాచారం. దేశీయంగా రెండో అతి పెద్ద ఫార్మసీ చెయిన్ అయిన మెడ్‌ప్లస్‌పై అమెజాన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెడ్‌ప్లస్‌కు ఆన్లైన్ ఫార్మసీతో పాటు దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే... ఈ స్టోర్స్‌ని అమెజాన్ డెలివరీ సెంటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించవచ్చు. అమెజాన్ నిర్దిష్టంగా ఎంత మేర వాటాలు కొనుగోలు చేసేదీ తెలియనప్పటికీ.. మెడ్ప్లస్తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెడ్‌ప్లస్‌లో వ్యవస్థాపకుడు మధుకర్ గంగాడికి దాదాపు 90% వాటాలున్నాయి. 2006లో ప్రారంభమైన మెడ్‌ప్లస్.. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. మెడ్‌ప్లస్ ఆదాయాలు 2014–15లో రూ. 1,361 కోట్లు, 2015–16లో రూ. 1,726 కోట్లుగా ఉన్నాయి. రెండేళ్లలో లాభాలు రూ. 7–9 కోట్లుగా ఉన్నాయి. మెడ్లైఫ్పై ఫ్లిప్‌కార్ట్ దృష్టి.. అమెజాన్‌కు పోటీదారైన దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఆన్లైన్ ఫార్మాలో ప్రవేశించేందుకు చకచకా పావులు కదుపుతోంది. అల్కెమ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు నిర్వహించే మెడ్‌లైఫ్ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పేర్లు వెల్లడించనప్పటికీ.. రెండు భారీ ఈ–కామర్స్ సంస్థలతో చర్చలు జరిపినట్లు, ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు మెడ్‌లైఫ్ వర్గాలు పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. ఇక ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న బెంగళూరు సంస్థ స్విగ్గీ .. ఔషధాల డెలివరీ సర్వీసులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఈ–ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. అటు ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ సంస్థ.. కొత్తగా ఫార్మాను కూడా తమ లిస్టులో చేర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐవోసీడీ ఆందోళన.. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏఐవోసీడీ ఆగస్టు 1 నుంచి 14 దాకా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం గానీ తమ డిమాండ్లను పట్టించుకోకపోయిన పక్షంలో రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే షాపులు తెరిచేలా వర్క్–టు–రూల్ విధానాన్ని అమలు చేస్తామని ఏఐవోసీడీ హెచ్చరిస్తోంది. ఇందులో 8.5 లక్షల మంది కెమిస్టులు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉన్నారు. పిల్‌ప్యాక్ కొనుగోలుతో అమెజాన్ సంచలనం.. అమెరికాలో పిల్‌ప్యాక్ అనే ఆన్లైన్ ఫార్మా కంపెనీని దాదాపు 1 బిలియన్ డాలర్లకు అమెజాన్ కొనుగోలు చేయడం అక్కడి ఫార్మా మార్కెట్‌ను కుదిపేసింది. ఈ డీల్ వార్తతో అమెరికా ఫార్మసీ/డ్రగ్‌స్టోర్ పరిశ్రమ మార్కెట్ క్యాప్ ఏకంగా 13 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఇలాంటి భారీ సంచలనాన్నే భారత్‌లోనూ పునరావృతం చేసేందుకు అమెజాన్ కసరత్తు చేస్తోంది. నిజానికి అమెజాన్‌కి ఆన్లైన్ ఫార్మా వ్యాపారం కొత్తేమీ కాదు. 1998లో డ్రగ్స్టోర్డాట్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కానీ, 2000లో టెక్నాలజీ సంస్థలు కుదేలవడంతో.. ఇది మూతబడింది. ఆకర్షణీయమైన భారత మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమెజాన్ మళ్లీ రంగంలోకి దిగుతోంది. -
ఈ-కామర్స్ మార్కెట్లోకి యోగా గురు
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే పలు మార్కెట్లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు రాందేవ్ బాబా, ఈ-కామర్స్ మార్కెట్‌పైనా కన్నేశారు. త్వరలోనే ఈ-కామర్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను ఈ-కామర్స్ ఇండస్ట్రిలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఎనిమిది దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలతో జతకట్టాలని కంపెనీ చూస్తోందని తెలిసింది. ''భారీ మొత్తంలో ఆన్లైన్ పుష్ కోసం పతంజలి ఆయుర్వేదం పనిచేయడం ప్రారంభించింది. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుంది. పలు పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తుల ఆన్లైన్ షాపింగ్, కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది'' అని రాందేవ్ బాబా అధికార ప్రతినిధి ఎస్కే టిజరవాలా ట్విట్టర్ అకౌంట్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు గట్టి పోటీగా డైపర్, శానిటరీ నాప్కిన్ పరిశ్రమలోకి ప్రవేశించనున్నట్టు కూడా డిసెంబర్ 26న కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పతంజలి అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న కంపెనీల్లో ఒకటి. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ వార్షిక ఇండియా రిచ్ లిస్టులో 45వ స్థానంలో ఉన్న పతంజలి కంపెనీ, ఈ ఏడాది 19వ స్థానంలోకి ఎగిసింది. -
కేంద్రం వార్నింగ్ : ఆ డేటా షేర్ చేస్తే ఇక అంతే
న్యూఢిల్లీ : వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం కంపెనీలకు షేర్ చేస్తే, తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ-కామర్స్ కంపెనీలు వాణిజ్య ప్రయోజనాల కింద వ్యక్తిగత డేటాను కంపెనీలకు షేర్ చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న క్రమంలో వినియోగదారుల సంరక్షణ బిల్లులో ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ప్రజలు ఈ అన్యాపూర్వకమైన వాణిజ్య విధానాన్ని వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ వీటిపై చర్యలు తీసుకునే హక్కులను కలిగి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశముందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వన్ తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలో ప్రతి దేశం వినియోగదారులను కాపాడటానికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను షేర్ చేసుకుంటున్నాయన్నారు. ఇతర దేశాల నుంచి నేర్చుకున్న అంశాలతో తమ పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. వినియోగదారుల ప్రైవసీని కాపాడాలంటూ అంతకముందు కూడా వినియోగదారుల హక్కుల కార్యకర్తలు, ఎన్సీడీఆర్సీ సభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్ కిరాణా.. నువ్వానేనా!
మార్కెట్లో పట్టు కోసం ఈ కామర్స్ సంస్థల పెట్టుబడి అస్త్రాలు ► గ్రోఫర్స్లో వాటాపై అమెజాన్ ఆసక్తి ► ఎంట్రీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నద్ధం ► అండగా సాఫ్ట్ బ్యాంకు నిధులు ► ఇప్పటికే బిగ్ బాస్కెట్లోకి పేటీఎం ఎంట్రీ న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. భారీ మార్కెట్ అవకాశాల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎంలు ఈ విభాగంలో పట్టు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రోఫర్స్లో మైనారిటీ వాటా పొందేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఆసక్తితో ఉంది. ఆన్లైన్ గ్రోసరీ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో వాటా తీసుకోవాలని అమేజాన్ ప్రయత్నించినప్పటికీ చర్చలు సఫలీకృతం కాలేదు. దీంతో సాఫ్ట్‌బ్యాంకు మద్దతు గల గ్రోఫర్స్లో వాటా తీసుకునే యోచనతో అమెజాన్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు బిగ్ బాస్కెట్లో చైనాకు చెందిన అలీబాబా గ్రూపు ఏకంగా 200 మిలియన్ డాలర్ల (రూ.1,280 కోట్లు)ను పేటీఎం మాల్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమేజాన్ నుంచి తాజా పెట్టుబడులు వస్తే గ్రోసరీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. గ్రోఫర్స్లో ఇన్వెస్టర్లు అయిన జపాన్ సాఫ్ట్ బ్యాంకు, టైగర్ గ్లోబల్ ఆశ్చర్యంగా ఫ్లిప్‌కార్ట్ లోనూ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లోకి ఇటీవలే సాఫ్ట్‌బ్యాంకు 2.5 బిలియన డాలర్ల (రూ.16,000 కోట్లు)ను విజన్ ఫండ్ ద్వారా పంప్ చేసింది. ఈ నిధుల ప్రోత్సాహంతో దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఆన్లైన్ గ్రోసరీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, గ్రోఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం కూడా నడుస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రోఫర్స్లోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు అమెజాన్ 100 మిలియన్ డాలర్లు (రూ.690 కోట్లు) మేర ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో ఉందని తెలుస్తోంది. కాగా, గ్రోఫర్స్లో వాటాల విషయమై గతంలో ఆ సంస్థతో పేటీఎం సైతం చర్చలు నిర్వహించింది. కానీ, ముందడుగు పడలేదు. ఊరిస్తున్న భారీ అవకాశాలు... మన దేశంలో మొత్తం మీద గ్రోసరీ, ఆహార (ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు సైతం) మార్కెట్ 400 బిలియన్ డాలర్లు (రూ.25.60లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో వ్యవస్థీకృత రిటైలర్ల వాటా 5 శాతంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్ అధ్యయనం ఆధారంగా తెలుస్తోంది. అంటే ఈ విభాగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బిగ్ బాస్కెట్ 2017లో రూ.1,400 కోట్ల అమ్మకాలను సాధించగా, గ్రోఫర్స్ సైతం ఇటీవలే తాము నెలవారీ విక్రయాలు రూ.65 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. వార్షిక విక్రయాలు రూ.760 కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది. బిగ్ బాస్కెట్ 16–18 శాతం మార్జిన్‌తో, గ్రోఫర్స్ 12 శాతం మార్జిన్‌తో నడుస్తున్నాయి. గ్రోసరీ విభాగంలో అమెజాన్ నౌ, అమెజాన్ ప్యాంట్రీ పేరుతో గత రెండేళ్లుగా కార్యకలాపాలు నడుపుతోంది. 2015లో గ్రోఫర్స్ సంస్థ గ్రోసరీలో హైపర్ లోకల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించగా, భారీ మార్కెట్ అవకాశాలున్నాయనే అంచనాలతో ఈ సంస్థలోకి పెట్టుబడులు వచ్చి పడ్డాయి. గతేడాది దీపావళి సమయంలో అమెజాన్ ఈ మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. రెట్టింపు అమ్మకాలు నిర్వహించింది. అంతకు కొన్ని నెలల ముందే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టడంతో చందాదారులు అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీంతో అధిక విక్రయాలు సాధ్యమయ్యాయి. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు ఉచిత షిప్పింగ్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్కెట్లోకి పేటీఎం ఎంట్రీ, సాఫ్ట్‌బ్యాంకు ఫండింగ్‌తో ఫ్లిప్‌కార్ట్ సైతం ఈ మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటికితోడు అమెజాన్ తాజా ప్రణాళికలతో మున్ముందు ఈ గ్రోసరీ మార్కెట్ మరింత పోటీని సంతరించుకోనుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈ–కామర్స్ దిగ్గజాల మెగాసేల్
వరుసలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. 8 రోజులపాటు కస్టమర్లకు అదిరే ఆఫర్లు న్యూఢిల్లీ: మన కోసం ఈ–కామర్స్ సంస్థలు పండుగ సీజన్‌ను ముందే తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటికే వాటి మెగా సేల్ తేదీలను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కస్టమర్ల ఆకర్షణే లక్ష్యంగా భారీ డిస్కౌంట్లకు, డీల్స్‌కు తెరలేపనున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్స్‌లో కస్టమర్లు ప్రధానంగా ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టెలివిజన్లు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను పొందొచ్చు. మార్కెట్లో అగ్రస్థానం కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలు ఇండియన్ మార్కెట్లో భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. చాలా మంది విక్రయదారులను, కొనుగోలుదారులను వాటి వాటి ప్లాట్ఫామ్లలోకి తెచ్చుకునేందుకు వీలుగా ఇరు సంస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ముందు అమెజాన్ సందడి.. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, డీల్స్‌తో అమెజాన్ ముందుగా కస్టమర్లను పలకరించనుంది. మే నెల 11 నుంచి 14 వరకు ‘గ్రేట్ ఇండియా సేల్’ను నిర్వహిస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది. మే 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ 10’ సేల్ ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ 10’ సేల్‌ను మే నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ‘బిగ్ 10’ సేల్.. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్కు భిన్నమైనదని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ‘బిగ్ 10’ సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ తర్వాత అదేతరహాలో అంతే స్థాయిలో ‘బిగ్ 10’ సేల్‌ను తీసుకువస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. -
‘కార్డు’తో పండుగ చేస్కో.. కానీ!
పండుగలొచ్చేస్తున్నాయి. దసరా, దీపావళి పండుగలకు అందరూ వస్తువులపై ఖర్చు పెడుతుంటారు కనక ఈ-కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ స్టోర్లు... అన్నీ ఆఫర్లతో సిద్ధమైపోయాయి. ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాయి కూడా. చాలా వస్తువులపై డిస్కౌంట్ల వెల్లువ కురుస్తోంది. ఇది చాలు కదా.. మనం కొనటానికని అనుకుంటున్నారా...?? చేతిలో డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డులున్నాయి కదా బేఫికర్ అనుకుంటున్నారా!! కాస్త ఆగండి. ఇలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించే ముందు కొంచెం ఆర్థికంగా లెక్కలు వేసుకోండి. లేకపోతే రుణ వలయంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే... ఈ సమయంలో క్రెడిట్ కార్డును ఎలా వాడాలనే సూచనలే ఈ ‘ప్రాఫిట్’ ప్రత్యేక కథనం... ⇒ ఆఫర్లున్నాయని శక్తికి మించి కొంటే అంతే ⇒ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టే క్రెడిట్ కార్డు వాడకం ⇒ ఈజీ చెల్లింపులకే కార్డు... రుణ సాధనంగా చూడొద్దు ⇒ బకాయి మొత్తం ఒకేసారి తీరిస్తేనే బెటర్ ⇒ కనీస మొత్తం కట్టుకుంటూ పోతే దశాబ్దాలు చెల్లించాలి ⇒ కొత్తగా కార్డు చేతికొస్తే మరింత జాగ్రత్తగా ఉండండి నిజమే! ఎవరెన్ని చెప్పినా క్రెడిట్ కార్డులనేవి ‘భలే మంచి చౌకబేరము’ లాంటివి. ఎందుకంటే చేతిలో పెద్ద మొత్తం లేకున్నా... ఆ స్థాయిలో కొనుగోళ్లు ఈజీగా చేసేయొచ్చు. పెపైచ్చు ఇప్పుడు కొనటం... తరవాత చెల్లించటం అనే సూత్రం ఎటూ తోడుంటుంది. కాకపోతే కొంచెం అతి చేశారనుకోండి!! ఒకవంక మీ కార్డుపై వాడకం పెరిగిపోయి మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. ఎలాగూ నెలనెలా చెల్లిస్తాం కదా అనుకున్నా... దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో మీకు ఇతరత్రా కావాల్సిన రుణ అవకాశాలు దెబ్బతింటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం... చిరకాలంగా క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికంటే కొత్తగా కార్డు చేతిలోకి వచ్చినవారు ఈ రకమైన ఆఫర్లకు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. తాహతుకు మించి కొనుగోళ్లు చేస్తుంటారు. వారి క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వాడేయటం, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కావటం కూడా జరుగుతుంటుంది. అదే ఏడెనిమిదేళ్లుగా కార్డు వాడుతున్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉంటారు. ‘‘కొత్తగా కార్డు తీసుకున్నవారు తమ చేతిలో ఇన్స్టంట్ రుణాన్నిచ్చే అద్భుత సాధనం ఉన్నట్టుగా భావిస్తారు. అంతేతప్ప దానిపై భారీ వడ్డీ పడుతుందన్న విషయాన్ని గమనించరు’’ అని ఫైనాన్షియల్ సాధనాల్ని ఆన్లైన్లో విక్రయించే ‘రుబిక్’ వ్యవస్థాపకుడు, సీఈఓ మానవ్‌జీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. కార్డుదారులు చేసే తప్పిదాలు... రుణం భారీగా పేరుకుపోవటానికి కార్డుదారులు చేసే ప్రధానమైన తప్పిదమేంటంటే వాయిదాలు చెల్లించటం. కనీస మొత్తంగా ఎంత చెల్లించాలని కార్డు కంపెనీ సూచిస్తుందో... అంతే మొత్తాన్ని చెల్లించి ఊరుకుంటారు. ఒకోసారి నెలవారీ చెల్లింపుల్ని చేయకుండా కూడా వదిలేస్తుంటారు. దీంతో అలా చెల్లించని మొత్తం... తదుపరి నెల బిల్లుకు జత అవుతుంది. ఈ రెండిటికీ భారీ అపరాధ రుసుములు, వడ్డీ కలుస్తాయి. ఒకోసారి వడ్డీ వార్షికంగా లెక్కిస్తే 30-40 శాతం కూడా ఉంటుంది. నిజానికి కనీస మొత్తం చెల్లించటం, లేదా కొంత మొత్తాన్ని చెల్లించటం వంటి చర్యల వల్ల అపరాధ రుసుమును తప్పించుకోవచ్చు. క్రెడిట్ స్కోరు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. కాకపోతే మిగిలిన మొత్తంపై భారీ వడ్డీని మాత్రం చెల్లించక తప్పదు. దీంతో పాటు వడ్డీ లేకుండా చెల్లించే వ్యవధిని (ఇంట్రస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్) కూడా కోల్పోవటం జరుగుతుంది. చాలామంది క్రెడిట్ కార్డుదారులు తమ కార్డులపై రుణాలు కూడా తీసుకుంటుంటారు. నిజానికి తక్షణం నగదు కావాల్సి వచ్చినపుడే ఇలాంటివి తీసుకోవాలి. అంటే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినపుడో, తమ వారికోసం ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి వచ్చినపుడో అన్న మాట. ఎందుకంటే మామూలు వ్యక్తిగత రుణాలపై కన్నా ఈ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రుణాలపై వడ్డీ ఎక్కువ. మీరు తీసుకున్న రుణం మొత్తాన్ని బట్టి... దానికి సమానంగా కార్డుపై మీ క్రెడిట్ లిమిట్ కూడా బ్లాక్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇంకొందరు ఒక కార్డుపై చేసిన రుణాన్ని తీర్చటానికి వేరొక కార్డును వినియోగించటం వంటివి చేస్తుంటారు. అలా చేయటం వల్ల చెల్లించాల్సిన మొత్తం తగ్గిపోతుందని, తాము తెలివైన పని చేశామని వారు భావిస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయటం వల్ల వారు రుణ ఊబిలో కూరుకుపోతున్నారనేది సుస్పష్టం. దీన్లోంచి బయటపడటం ఎలా? ఒక్కటి గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డనేది చెల్లింపులు ఈజీగా చేయటానికి మీ దగ్గరుండే ఓ సాధనం. అంతేతప్ప దీన్నో రుణ సాధనంగా భావించొద్దు. ‘‘మీ ఖర్చులన్నీ మీ చెల్లించే సామర్థ్యానికి మించకుండా ఉండేటట్లు చూసుకోండి. మీ ఆదాయానికి తగ్గ ఖర్చులు చేసి... బిల్లును మొత్తం ఒకేసారి చెల్లించేయండి. ఒకవేళ అలా చేయలేనివారు మీ డెబిట్ కార్డును మాత్రమే వినియోగించటం నేర్చుకోండి. అపుడు మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని మాత్రమే వాడే వీలుంటుంది’’ అని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పంజా సూచించారు. ఒకవేళ మీరు మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు... మీ దగ్గర ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే గనక ఎక్కువ వడ్డీని వసూలు చేసే రుణాన్ని మొత్తంగా తీర్చేయండి. అందుకు తక్కువ వడ్డీ వసూలు చేసే కార్డును ఉపయోగించండి. కాని పక్షంలో 12-15 శాతం మధ్య లభించే పర్సనల్ లోన్లు తీసుకుని క్రెడిట్ కార్డు రుణాలను పూర్తిగా తీర్చేయండి. ఇవన్నీ కానపుడు మీ క్రెడిట్ కార్డు రుణాన్ని ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై నెలకు 1.2 నుంచి 2 శాతం వడ్డీ వసూలు చేస్తుంటారు. అంటే ఏడాదికి 24 శాతం మించకపోవచ్చు. ఇలా చేయటం వల్ల చెల్లింపులకు కొంత సమయం దొరకటంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. చెల్లింపులు జరిగినపుడల్లా మీ క్రెడిట్ లిమిట్ పెరుగుతుంటుంది. ఇక చివరిగా మీ బ్యాంకుతో మాట్లాడుకుని వడ్డీ రేటు తగ్గించమని అడిగే అవకాశాన్ని పరిశీలించండి. మీకు ఆ బ్యాంకుతో ఇతరత్రా లావాదేవీలున్నపుడు, మీరు గనక ఓల్డ్ కస్టమర్ అయినప్పుడు బ్యాంకులు తప్పకుండా ఇలాంటి అభ్యర్థనను పరిశీలిస్తాయి. వడ్డీ రేటు తగ్గిస్తాయి. ఎక్కువ చెల్లింపు... తక్కువ ఖర్చు మోహన్ తన కార్డుపై రూ.2 లక్షలు ఖర్చుచేశాడు. నెలకు 3 శాతం వడ్డీ చెల్లించాలి. ఎంతెంత చెల్లిస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం.. మోహన్ ప్రతినెలా కనీస మొత్తంగా చెల్లించాల్సిన 5 శాతాన్నీ చెల్లిస్తున్నాడు. తదుపరి ఆ కార్డును వినియోగించటం మానేశాడు. మోహన్ గనక ఇలా చేస్తే మొదటి నెల రూ.10,000 చెల్లించాల్సి వస్తుంది. తరవాత కొంచెం తగ్గుతుంది. కానీ ఇలా 35 సంవత్సరాల 4 నెలలపాటు వాయిదాలు కడుతూనే ఉండాలి. మొత్తంగా మోహన్ చెల్లించేదెంతో తెలుసా? రూ.4,65,089. మోహన్ నెలకు బిల్లులో 25 శాతాన్ని చెల్లించటం మొదలెట్టాడు. కానీ ప్రతినెలా మరో 10 శాతం వాడుతున్నాడు. మిగిలిపోయిన బకాయికి, నెలనెలా పెట్టే ఖర్చుకు వడ్డీ వేస్తారు కనక మోహన్ మొదటినెల రూ.50,000 చెల్లిస్తాడు. అది కాస్తకాస్త తగ్గుతూ పూర్తిగా చెల్లించటానికి ఐదున్నరేళ్లు పడుతుంది. మొత్తంగా రూ.2,29,508 చెల్లిస్తాడు. అంటే ఒకరకంగా వడ్డీ తక్కువే. మోహన్ నెలకు 50 శాతం చొప్పున తీర్చేయటమే కాకుండా... మిగిలిన మొత్తంలో 25 శాతాన్ని నెలనెలా అదనంగా వాడటం మొదలెట్టాడు. మొదటి నెల రూ.లక్ష చెల్లిస్తాడు కాబట్టి మూడేళ్లలో అప్పు పూర్తిగా తీరిపోతుంది. మొత్తంగా చెల్లించేది రూ.2,08,333. అంటే వడ్డీ రూ.8,333 మాత్రమే. మోహన్ ఒకేసారి పూర్తిగా చెల్లించాడనుకోండి. రూపాయి కూడా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. పెపైచ్చు మరుసటి నెల ఎంత వాడినా... దానిక్కూడా వడ్డీలేని వ్యవధి ఉంటుంది. దానిపైనా వడ్డీ పడదు. -
ఆన్లైన్లో ‘ఖరీదు’ చేద్దామా..!
నేటి తరానికి చెందిన ఐటీ ఉద్యోగి మాధవీ గణేషన్‌కి ఆన్లైన్ షాపింగ్ అంటే మహా క్రేజీ. ఇంటిలోని కిరాణ వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొంటుంది. కానీ ఖరీదైన వస్తువుల విషయానికి వస్తే వెనుకంజ వేస్తోంది. దీనికి కారణం ‘ఆన్లైన్లో దొరికే లగ్జరీ వస్తువులపై పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే. లగ్జరీ వస్తువుల విషయంలో కొంతమంది ఆన్లైన్ రిటైలర్లు మోసాలకు పాల్పడుతున్నారని, అసలుదా, నకిలీదా అన్నది గుర్తుపట్టడం కష్టం’ అని అంటున్నారామె. ఒక్క మాధవినే కాదు చాలా మంది లగ్జరీ వస్తువుల విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారట. ఖరీదైన వస్తువులకు సంబంధించిన వివరాలను, వాటి సమీక్షలను తెలుసుకోవడానికే ఆన్‌లైన్‌కు పరిమితమవుతున్నారని, చివరకు వస్తువు కొనే సరికి నేరుగా షోరూంకు వెళ్ళి కొంటున్నారట. తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉందని, ఇది 2020 నాటికి 12 శాతానికి చేరుతుందని రీసెర్చ్ సంస్థ మెకిన్సే అంచనా వేస్తోంది. కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే ఆన్లైన్లో కూడా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో లగ్జరీ వస్తువులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం.. ఇవి గమనించండి.. ఈ-కామర్స్ కంపెనీల రిటర్న్ పాలసీ, డిస్క్లైమర్ను పూర్తిగా వినియోగదార్లు చదవాలి అని రిటైల్ నిపుణులు కలిశెట్టి నాయుడు సూచించారు. ధ్రువీకరణ, డెలివరీ హామీ, కస్టమర్ కేర్ నంబరు ప్రముఖంగా ఉన్నదీ లేనిదీ కస్టమర్లు గమనించాలి. విక్రయిస్తున్న బ్రాండ్స్ వివరాలు, ఉత్పత్తుల ఫొటోలు, కస్టమర్ల కామెంట్లు, రేటింగ్స్, తాజా ఫ్యాషన్ తీరు, డిజైనర్ల గురించిన సమాచారం ఉంటే ఆ వెబ్‌సైట్‌కు విశ్వసనీయత ఉంటుంది. తాము ఏకైక అధికారిక రిటైలర్ అని ఏదైనా వెబ్సైట్ ప్రకటించుకున్నట్టయితే ఆ బ్రాండ్ ఉత్పత్తులు మరేదైనా వెబ్సైట్లో లభిస్తున్నాయా లేదా పరిశీలించండి. బ్రాండ్ అధీకృత వెబ్సైట్ అయితే నడుస్తున్న సీజన్ కలెక్షన్‌ను గుర్తించవచ్చు. ప్రయోజనం ఏమిటంటే.. సాధారణంగా లగ్జరీ వస్తువులకు సంబంధించిన షోరూంలు పెద్ద పెద్ద నగరాలు, పట్ణణాలకే పరిమతమవుతాయి. దీనివల్ల మీకు వీటిని కొనాలని ఉన్నా అవి అందుబాటులో ఉండవు. అదే ఆన్లైన్లో అయితే ఎక్కడి నుంచైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. మీకు నచ్చిన సమయంలో కొనే వెసులుబాటు ఉంటుంది. ఇక లగ్జరీ షోరూంల నిర్వహణ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. సాధారణంగా లగ్జరీ షాపులు సంపన్నులు అధికంగా ఉండే ఖరీదైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు అమ్ముతున్న వస్తువులకు తగ్గట్టుగా షాపును సుందరంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఈ వ్యయాలన్నీ మన నుంచే ముక్కు పిండి వసూలు చేస్తారు. అదే ఆన్లైన్లో అయితే ఈ ఖర్చులేమీ ఉండవు. దీనితో చౌకగా ఈ వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం దొరుకుతుంది. సాధారణంగా బ్రాండెడ్ షోరూంతో పోలిస్తే ఆన్లైన్లో 10 శాతం తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు లభిస్తాయని ఆన్లైన్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఉత్పాదన నకిలీదైతే.. మీరు స్వీకరించిన ఉత్పాదన నకిలీదైతే కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పాదనను వెనక్కి తీసుకుంటాయి. వెనక్కి తీసుకోకపోతేనే అసలు సమస్య. కంన్సూమర్ ఫోరంలో ఆ వెబ్‌సైట్‌పై ఫిర్యాదు చేయవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను నలుగురికి తెలియజేయండి. గౌరవానికి భంగం కలుగుతుందన్న భయంతోనైనా ఆ వెబ్సైట్ నుంచి మీ డబ్బులు మీకు రావొచ్చు. నకిలీది కాబట్టి బ్రాండ్లు ఈ విషయంలో ఏమీ సహాయం చేయవు. అందుకే బ్రాండ్స్‌కు చెందిన సొంత వెబ్సైట్లు లేదా పాపులర్ వెబ్సైట్ల ద్వారా షాపింగ్ చేయడం ఉత్తమం. ధర విషయంలో.. కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంటాయి. లగ్జరీ బ్రాండ్ల విషయంలో ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. బ్రాండ్ షాపులో లేదా ఆ బ్రాండ్ వెబ్సైట్లో ఉన్న ధర కంటేతక్కువకే అమ్మితే ప్రామాణికతను పరిశీలించాలి అని క్లాసిక్ పోలో తెలంగాణ పంపిణీదారు గుండుబోయిన శ్రీకాంత్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రెడీమేడ్స్ విషయంలో 4 నెలలకోసారి కొత్త సరుకు మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు పాత సరుకుపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. సరుకును కొన్న వ్యాపారి ఆన్లైన్ విక్రేతలు లేదా రిటైలర్లకు కొంత ధర తగ్గించి విక్రయిస్తారు’ అని వివరించారు. భారత్‌లో ధరపై నియంత్రణ లేదు. స్టాక్ చాలా మిగిలిపోతే కంపెనీలు భారీగా డిస్కౌంట్ ఇవ్వడం సహజం. కానీ లగ్జరీ వస్తువుల విషయంలో డిస్కౌంట్ అనేది అంత ఎక్కువ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తనిఖీ చేయండి.. ఆన్లైన్లో ఉత్పాదన స్వీకరించగానే ట్యాగ్, డస్ట్ బ్యాగ్, వారంటీ కార్డ్‌ను పరిశీలించండి. బ్రాండెడ్ గూడ్స్ ముఖ్యంగా లగ్జరీ ఉత్పత్తులు ఇవి లేకుండా విక్రయించవు. కొన్ని బ్రాండ్లు ఉత్పత్తి లేదా ప్యాక్‌పై ఒక కోడ్‌ను ముద్రిస్తాయి. ఈ కోడ్ ఆధారంగా అసలుదా, నకిలీదా ట్రాక్ చేయవచ్చు. విక్రయానంతర సేవను ఈ బ్రాండ్లు ఆఫర్ చేస్తాయి. ఇవేవీ లేవంటే మీరు నకిలీ ఉత్పాదనను కొన్నారన్న మాట. దుస్తులైతే వస్త్రం, కుట్లు (స్టిచ్చింగ్) ఎలా ఉన్నాయో గమనించాలి. వినియోగదార్లు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవాలి. మార్కెట్ ప్లేస్ విధానంతో.. సాధారణంగా లగ్జరీ బ్రాండ్లు చాలామటుకు సొంత ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారానే విక్రయిస్తున్నాయి. సొంతంగా ఈకామర్స్ వెబ్‌సైట్స్ లేకపోతే మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ఈ-కామర్స్ కంపెనీలతో చేతులు కలిపిన రిటైల్ విక్రేతలే ఉత్పత్తులను సరఫరా చేయడాన్ని మార్కెట్ ప్లేస్ విధానం అంటారు. ఇలాంటి సమయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రిటైల్ సంస్థలు మోసాలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలుదా నకిలీదా అన్ని గుర్తుపట్టలేనంతగా వీటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ రిటైల్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నాయి. అందుకే మీరు ఆర్డరు ఇచ్చే ఆన్లైన్ రిటైల్ సంస్థ ఎంత నమ్మకమైనదన్న విషయం కూడా ఇక్కడ ముఖ్యమే. -
రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..!
లాజిస్టిక్స్‌కు చేయూతనిస్తున్న ఈ- కామర్స్ బూమ్ - నిపుణులతో పాటు క్షేత్ర స్థాయిలో భారీగా వేకెన్సీలు... - అనుభవాన్ని బట్టి చక్కని జీతభత్యాలు - సొంత లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్న దిగ్గజాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు దేనికైనా ఈ-కామర్సే. మాల్ గానీ... మండీ గానీ... ఏదైనా చేతిలోని స్మార్ట్ ఫోనే. సింపుల్‌గా ఫోన్‌పైన క్లిక్ చేస్తే చాలు. కావాల్సిన కూరగాయలు, సరుకులు, ఉపకరణాలు, ఇతర వస్తువులు నేరుగా ఇంటికొచ్చి వాలిపోతున్నాయి. దీనికోసం ఇ-కామర్స్ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇక నిధులంటారా! ఆ సమస్యే లేదు. ఎంతంటే అంత పెట్టుబడికి విదేశీ దిగ్గజాలు రెడీగా ఉన్నాయి. భారత్‌లోనూ పెట్టుబడిదారులకు కొదవ లేదు. ఇంత వరకూ బాగానే ఉన్నా... ఇవేమీ డిజిటల్ ఉత్పత్తులు కాదు కదా నేరుగా ఫోన్లోనే డెలివరీ చేయడానికి. మరి ఈ వస్తువుల్ని కస్టమర్‌కు చేరవేసేదెవరు? ఇదిగో... ఈ అంశమే ఇపుడు ప్రపంచ ఈ-కామర్స్ రంగాన్ని శాసిస్తోంది. చెప్పిన టైముకు డెలివరీ చేయకపోతే కస్టమర్ ఆగ్రహానికి గురి కావాల్సిందే. రేటింగ్ తగ్గిందా ఇక ఆ కంపెనీ మనుగడ పెద్ద సవాలే. అదీ లాజిస్టిక్స్ పాత్ర. కాకపోతే సరుకుల డెలివరీకి అమెరికాలో డ్రోన్ల వంటివి ఉపయోగించాలని చూస్తున్నా... దానిలో ఉండే ఇబ్బందుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం అనుమతివ్వలేదు. అవి సాకారం దాల్చటం అంత ఈజీ కాదు కూడా. అందుకే ఈ రంగంలో మానవ వనరుల అవసరం విపరీతంగా కనిపిస్తోంది. అది ఎంతంటే... వచ్చే రెండేళ్లలో ఒక్క భారతదేశంలోనే కోటి మంది సిబ్బంది అదనంగా అవసరమవుతారనే స్థాయిలో!!. ప్రధాన భూమిక లాజిస్టిక్స్‌దే... ఇ-కామర్స్ రంగంలో విక్రయానికి లక్షలాది ఉత్పత్తులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ వస్తువు ఎక్కడున్నా తెప్పించి ఇక్కడి కస్టమర్‌కు విక్రయించే కంపెనీలూ ఉన్నాయి. కంపెనీతో కస్టమర్‌ను అనుసంధానించేందుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇదంతా ఒక ఎత్తై ఇ-కామర్స్ కంపెనీ వ్యవహారాల్లో 70 శాతానికి పైగా భూమిక లాజిస్టిక్స్‌దే. దీనికంతటికీ కారణం చాలా కంపెనీలు మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే సరుకులను కొనుగోలు చేసి తమ గిడ్డంగుల్లో నిల్వ చేయవు. స్థానిక విక్రేతలతో చేతులు కలుపుతూ... అక్కడి నుంచే నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేస్తాయన్న మాట. ఈ విధానంలో సరుకులను నిల్వ చేసే బాధ్యత విక్రేతలదే. ఆర్డరు ఇవ్వగానే విక్రేత స్వయంగా కస్టమర్‌కు ఆ ఉత్పాదనను చేరవేస్తారు. ఇప్పుడు ఆస్క్‌మీ బజార్, పెప్పర్‌ట్యాప్ వంటి చాలా కంపెనీలు అగ్రిగేటర్ల అవతారం ఎత్తాయి. విక్రేతల నుంచి సరుకులను తీసుకుని కస్టమర్‌కు చేరవేయడం వీటి పని. ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ కోసం డెలివరీ బాయ్స్‌ను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. కస్టమర్ ఎంచుకున్న సమయంలో వేగంగా సరుకులను చేరవేయడం వీరి బాధ్యత. మంచి వేతనాలూ ఉన్నాయి.. ఉపాధి అవకాశాల పరంగా లాజిస్టిక్స్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాలు రానున్న రోజుల్లో అత్యంత కీలకంగా ఉంటాయని హెచ్ఆర్ రంగ నిపుణులు, టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి తెలిపారు. ఇ-కామర్స్ కంపెనీలు కొన్ని సొంతంగా లాజిస్టిక్స్ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి మంచి వేతనాలను చెల్లిస్తున్నాయి కూడా. లాజిస్టిక్స్ రంగంలో క్షేత్రస్థాయి ఉద్యోగాలు చాలా శ్రమతో కూడుకున్నవి. అందుకే ఈ రంగంలో ఏడాది కూడా పూర్తి కాకముందే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య 50 శాతం ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అయితే కార్మిక చట్టాలను అనుసరించి ఇ-కామర్స్ కంపెనీలు వేతనాలు చెల్లిస్తున్నాయని హ్యూసిస్ వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి వెల్లడించారు. ‘టెండర్ డాక్యుమెంట్లూ కొరియర్ ద్వారానే చేరుతున్నాయి. ఏ మాత్రం ఆలస్యమైనా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు చేజారతాయి. కొరియర్ బాయ్‌కి టెండర్ విలువ తెలిసినప్పుడే అతను విజయవంతం అవుతాడు. నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంది. వీరికి వచ్చే రెండేళ్లలో మూడున్నర రెట్ల వేతనాలు పెరగడం ఖాయం’ అని ఆయన పేర్కొన్నారు. మరో కోటి మంది.. రవాణా, పంపిణీ రంగం లో భారత్‌లో ప్రస్తు తం 80 లక్షల మంది దాకా ఉపాధి పొందుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరో కోటి మంది ఈ రంగంలో అవసరమవుతారని అంచనాలున్నాయని 24 ఏళ్లుగా లాజిస్టిక్స్ రంగంలో సేవలందించి, టెలికం వ్యాపారంలోకి ప్రవేశించిన హైదరాబాద్‌కు చెందిన జైపాల్ రెడ్డి వెల్లడించారు. లాజిస్టిక్స్ కంపెనీలు 10 ఏళ్ల క్రితం ఒకరిని నియమించుకుంటే, ఇప్పుడు 100 మందిని నియమించుకోవాల్సి వస్తోందని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇచ్చే సంస్థలు కేవలం ఆదాయంపైనే దృష్టిసారిస్తున్నాయి. ఏ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో శిక్షణ సంస్థలకు తెలియడం లేదు. 100 శాతం అవకాశాలు ఉన్నా, ఒక్కో శిక్షణ సంస్థలో 30-40 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. పరిశ్రమతో కలిసి పనిచేస్తేనే ఈ గ్యాప్ తగ్గుతుంది’ అని జి.ఆర్.రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, టైమ్స్‌జాబ్స్.కామ్ రిక్రూట్మెంట్ ఇండెక్స్ ‘రిక్రూట్‌ఎక్స్’, మాన్స్టర్.కామ్ మంత్లీ ఇండెక్స్ ప్రకారం జూలైలో అధిక ఉద్యోగాలను కల్పించిన రంగాల్లో లాజిస్టిక్స్ కూడా ఉంది. -
ఆన్లైన్లో అదిరే డిస్కౌంట్లు..
ఫ్యాషన్ వస్తువుల నుంచి ట్రావెల్ ప్యాకేజీల వరకూ - హైదరాబాదీ స్టార్టప్ ‘షాపింగ్ పైరేట్స్’ సేవలు - దేశ, విదేశాల్లోని 600 ఈ-కామర్స్ కంపెనీలతో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లిప్కార్ట్లోనో, అమెజాన్‌లోనో షాపింగ్ చేసినపుడు డిస్కౌంట్ దొరికిందా? మరి ఎందులో ఎంత డిస్కౌంట్ వస్తోందో తెలిసేదెలా? ఇందుకోసమే కొన్ని ‘కూపన్’ సైట్లు ఆరంభమయ్యాయి. అలాంటిదే షాపింగ్ పైరేట్స్ కూడా. ఇండియాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ ఈ తరహా సేవలందిస్తున్న షాపింగ్ పైరేట్స్‌ను ఆరంభించింది హైదరాబాద్‌కు చెందిన కుల్‌ప్రీత్ మార్వా. ఈ వారం స్టార్టప్ డైరీలో వస్తున్న ఈ కంపెనీ గురించి మార్వా ఏమంటున్నారో చూస్తే... మా స్వస్థలం భోపాల్. మా వారి ఉద్యోగరీత్యా పదిహేనేళ్ల క్రితమే హైదరాబాద్‌కి వచ్చి స్థిరపడ్డాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి... ఐబీ సొల్యూషన్స్‌లో కొన్నేళ్లు ఉద్యోగం చేశాను. కానీ, జాబ్ సంతృప్తినివ్వట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో నా అనుభవమే ఈ కంపెనీకి బీజం వేసింది. ఎందుకంటే నాకు షాపింగంటే ఇష్టం. కానీ మాల్స్‌కు వెళ్లాలంటే కాస్త భయం. పోనీ, ఆన్లైన్లో చేద్దామంటే ఏ సైట్లో చౌకగా లభిస్తున్నాయో తెలిసేది కాదు. ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకోవడానికే చాలా సమయం పట్టేది. అప్పుడే అనిపించింది! ఇలాంటి చిక్కులేవీ లేకుండా ఆఫర్లు, డిస్కౌంట్లు అందించే కూపన్స్ సైట్‌ను ఆరంభిస్తే బాగుంటుందని. ఈ ఆలోచనను ఫండింగ్ సంస్థల ముందుంచాను. రూ.50 లక్షల పెట్టుబడిగా లభించాయి. 2014 జూన్‌లో జ్ట్టిఞ://ఠీఠీఠీ.టజిౌఞఞజీట్చ్ట్ఛ.జీ పేరిట కూపన్స్ కంపెనీని ప్రారంభించా. 600 ఈ-కామర్స్ కంపెనీలతో.. కూపన్లు అందించే కొన్ని సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. అవి కేవలం ఫ్యాషన్ వస్తువులు, దుస్తుల వంటి వాటికే పరిమితం. షాపింగ్ పైరేట్స్‌లో ఫ్యాషన్, హెల్త్, ట్రావెల్, ఫుడ్ ఇలా అన్ని విభాగాల కూపన్లూ లభిస్తాయి. దీనికోసం యాత్రా, రెడ్‌బస్, జబాంగ్, అమెజాన్, ఈబే, ఫ్యాబ్‌ఫర్నిష్, ఫ్లిప్‌కార్ట్, హెల్త్‌కార్ట్, హోమ్షాప్, మేక్‌మై ట్రిప్, మింత్ర, పేటీఎం, సేఫ్టీకార్ట్ వంటి 600 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నా. వీటిలో ఎక్స్‌క్లూజివ్ సంస్థలు 20-30 వరకూ ఉన్నాయి. అంటే వాటి కూపన్లు మా సైట్లో మాత్రమే దొరుకుతాయన్న మాట. త్వరలో యూఎస్, ఆస్ట్రేలియాలోనూ.. ప్రస్తుతం షాపింగ్ పైరేట్స్ కూపన్లను ఇండియా, కెనడాల్లో అందిస్తున్నాం. రెండు వారాల్లో యూఎస్, ఆస్ట్రేలియాల్లోనూ సేవలు ప్రారంభించనున్నాం. ఆన్లైన్ కొనుగోళ్లు ఎక్కువగా జరిగే ప్రతి దేశంలోనూ విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మా కంపెనీలో 15 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే వీరి సంఖ్యను 30కి పెంచుతాం. నెలకు 20-30 లక్షల ఆదాయం.. ఈ-కామర్స్ కంపెనీలకు కొనుగోలుదారులను అందిస్తే ఆయా కంపెనీలు షాపింగ్ పైరేట్స్‌కు కొంత మొత్తం చెల్లిస్తాయి. షాపింగ్ ఖర్చును బట్టి ఈ మొత్తం మారుతుంది. నెలకు దాదాపుగా 20-30 లక్షలు ఆర్జిస్తున్నాం. మా కూపన్లు పొం దటం చాలా తేలిక. ఆన్లైన్లో షాపింగ్ మొత్తం పూర్తయ్యాక.. మా సైట్ లోకి వెళ్లి అక్కడున్న కూపన్లలో సరిపోయేదాన్ని ఎంచుకొని దాన్ని తిరిగి ఈ-కామర్స్ సైట్లో బిల్లింగ్ సమయంలో పేస్ట్ చేస్తే చాలు. మాసైట్ను రోజుకు 50 వేల మంది సందర్శిస్తున్నా రు. వీరిలో 70%పైగా కూపన్లను వినియోగించుకుంటున్నారు. ఒక్కో షాపింగ్‌పై 20-30% రాయితీ పొం దవచ్చు. పండుగ సీజన్లో 50%పైనే రాయితీ పొం దొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో షాపింగ్ చేసేవారికోసం 4 నెలల క్రితమే యాప్‌ను తయారు చేశాం. -
నెట్లోనే కాదు... కొట్లోనూ
⇒ రెండింటా ఉండాలనుకుంటున్న రిటైల్ సంస్థలు ⇒ ఈ-కామర్స్ సంస్థల ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ⇒ ఆన్లైన్ వ్యాపారంలోకి రిటైల్ చైన్లు ⇒ భవిష్యత్తుపై బెంగతోనే ఈ వైఖరి! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముప్పై ఎనిమిది లక్షల కోట్ల విలువైన భారత రిటైల్ రంగంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థల్ని విస్తరణ భయం ఆవరించింది. దీంతో అవి అటూ-ఇటూ విస్తరించడానికి సిద్ధమవుతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు బిగ్ ఫార్మాట్ రిటైల్ సంస్థల ద్వారా ఉత్పత్తులు విక్రయించిన రిటైల్ కంపెనీలు... కొత్త వ్యాపార వేదికైన ఆన్లైన్ బాటపడుతున్నాయి. ఆన్లైన్ కంపెనీలేమో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి. ఉదాహరణకు కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు మేక్ మై ట్రిప్, కార్ ట్రేడ్, ఫస్ట్ క్రై, లెన్స్ కార్ట్ వంటి ఆన్లైన్ దిగ్గజాలు దేశవ్యాప్తంగా స్టోర్లు తెరుస్తున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ రంగంలో ఉన్న మేక్ మై ట్రిప్ ఇప్పటికే 18 ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు తెరిచింది. టికెట్ల డబ్బులు చెల్లించేందుకు తమ సిబ్బందిని కలవాలని కస్టమర్లు భావిస్తుండడమే స్టోర్లు తెరవడానికి ప్రధాన కారణమని కంపెనీ సీఎంవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. ఆన్లైన్ ఆటో క్లాసిఫైడ్స్ సేవల్లో ఉన్న ‘కార్ ట్రేడ్’ పలు నగరాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది. ఆరు నెలల్లో ఈ సంఖ్యను రెండింతలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఫర్నీచర్ విక్రయ కంపెనీ ‘ఫ్యాబ్ ఫర్నిష్’ ఇప్పటికే 4 స్టోర్లను తెరిచింది. బ్రాండ్‌ను విస్తరించడానికే ఇదంతా చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. పెళ్లి సంబంధాల సేవల్లో ఉన్న ‘భారత్ మ్యాట్రిమోనీ’కి 20 నగరాల్లో 180కి పైగా కార్యాలయాలున్నాయి. టెక్నాలజీ పరంగా ముందుండే యూఎస్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఇవి విస్తరించాయి. షాదీ.కామ్ హైదరాబాద్‌తో సహా 87 నగరాల్లో 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కళ్లద్దాల వ్యాపారంలో ఉన్న లెన్స్‌కార్ట్ 68 స్టోర్లను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా కొత్తగా 10 ఔట్లెట్లు ప్రారంభిస్తోంది. పిల్లల దుస్తులు, బొమ్మలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘ఫస్ట్ క్రె’ై 22 రాష్ట్రాల్లో 100కుపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 9 స్టోర్లున్నాయి. విజయవాడతో సహా వివిధ నగరాల్లో 19 స్టోర్లను త్వరలో తెరుస్తోంది. ఈ ఏడాదిలో మరో 100కుపైగా స్టోర్లను తెరవాలన్నది కంపెనీ లక్ష్యం. ఆన్లైన్ షాపింగ్ వల్ల టచ్ అండ్ ఫీల్ అనుభూతి ఉండదని, అందుకే స్టోర్లను ప్రారంభించామని ఫస్ట్ క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి తెలియజేశారు. స్టోర్ల నుంచి ఆన్‌లైన్‌కు.. కొత్త మాల్ ఎక్కడ వచ్చినా స్టోర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఒకే నగరంలో విరివిగా ఔట్లెట్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఈ-కామర్స్ ధాటికి కొన్ని స్టోర్లను మూసివేయడం, మాల్స్‌లో స్థలాన్ని తగ్గించుకోవడం చేశాయి. భారత్‌లో ఆన్లైన్ కొనుగోలు దార్లు 2014లో 3.5 కోట్ల మంది ఉన్నారని, 2016లో ఈ సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశముందని గూగుల్ వంటి సంస్థలు అంచనా వేయటంతో ఈ రిటైల్ చైన్లు ఆన్లైన్ బాట పట్టాయి. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ బిగ్ బజార్, షాపర్స్ స్టాప్, పాంటలూన్స్ సైతం ఆన్లైన్ బాట పట్టాయి. రిటైల్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన టైటన్... తనిష్క్, ఫాస్ట్ ట్రాక్, టైటన్ ఐ ప్లస్, సొనాటా తదితర బ్రాండ్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఉన్న శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, వర్ల్‌పూల్, డెల్, హెచ్‌పీ, లెనోవో, హెచ్‌సీఎల్, మైక్రోమ్యాక్స్, కార్బన్ తదితర కంపెనీలు ఈ-కామర్స్‌కు సై అన్నాయి. మొబైల్స్ విక్రయంలో ఉన్న బిగ్ సి, లాట్, యూనివర్సెల్, సంగీత కూడా వీటి సరసన చేరాయి. ‘‘దేశంలో కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారు. అందుకే ఇంకా ఆన్లైన్ రిటైల్ వ్యాపారం దేశంలో రూ.24,000 కోట్లుగానే ఉంది. ఐదేళ్ల తరవాత కూడా 85 శాతం వ్యాపారం రిటైల్ దుకాణాల (ఆఫ్‌లైన్‌లో) ద్వారానే జరుగుతుంది. వినియోగదార్లకు ఆన్లైన్ షాపింగ్ చాలా అనువుగా ఉంటోంది కానీ వారు కోరుకునే టచ్ అండ్ ఫీల్ అనుభూతి రావటం లేదు. కొన్ని రకాల ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో అమ్మాలంటే కస్టమర్లకు చేరువగా దుకాణాలు ఉండాల్సిందే’’. - ఇదీ... దేశంలోని ఆన్లైన్ కంపెనీల ధోరణి ‘‘దేశంలో ఈ-కామర్స్ విజృంభణ మామూలుగా లేదు. దాని ధాటికి చిన్న చిన్న దుకాణాలు కనుమరుగైపోతున్నాయి. ఇంటర్నెట్ బూమ్‌తో ఈ-కామర్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆన్లైన్ వ్యాపారంలో నిర్వహణ వ్యయాలూ తక్కువే. భారత్‌లో నాలుగేళ్లలో ఇది నాలుగు రెట్లు పెరగబోతోంది. అందుకే విస్తరణ విషయంలో బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా ఆచితూచి అడుగేస్తున్నాయి. కంపెనీలు అద్దె చెల్లిస్తే తప్ప ఫ్రాంచైజీలు కొనసాగలేకపోతున్నాయి. అందుకని ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకోవాల్సిందే.’’ - ఇదీ... ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల ఆలోచన