న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో నకిలీ రివ్యూల కట్టడి దిశగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) 19000:2022’ను తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో వినియోగదారుల నుంచి సేకరించే రివ్యూలు, ఆ రివ్యూల సేకరణకు అనుసరించే అవసరాలు, ప్రమాణాలు, వాటి ప్రచురణకు కచ్చితంగా బీఐఎస్ ప్రమాణాలను ఈ కామర్స్ సంస్థలు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ మేరకు బీఐఎస్ ప్రకటన విడుదల చేసింది.
ఆన్‌లైన్ వేదికగా కస్టమర్ల రివ్యూలు (అభిప్రాయాలు, సమీక్ష) సమీకరించే అన్ని సంస్థలు, ఉత్పత్తులు, సేవలను విక్రయించే, సరఫరాచేసే సంస్థలు, రివ్యూలను సమీకరించేందుకు మూడో పార్టీని ఏర్పాటు చేసుకునే సరఫరాదారులు, విక్రయదారులు వీటిని పాటించాల్సి ఉంటుందని బీఐఎస్ తెలిపింది. ముఖ్యంగా రివ్యూ తీసుకునే విషయంలో అనుసరించాల్సిన ప్రమాణాలు, సూత్రాలను ఇండియన్ స్టాండర్డ్ సూచిస్తుంది. రివ్యూని రాసే, రివ్యూని సమీక్షించే వారిపై ఉండే బాధ్యతలను కూడా తెలియజేస్తుంది. ‘‘ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే వారిలో ఇది విశ్వాసాన్ని కలిగిస్తుంది. మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సాయపడుతుంది. ఈ కామర్స్ ఎకోసిస్టమ్, వినియోగదారులు, ఈ కామర్స్ వేదికలు, విక్రేతలు ఇలా భాగస్వాములు అందరికీ ఇండియన్ స్టాండర్డ్ 19000:2022 ప్రయోజనం కలిగిస్తుంది’’అని బీఐఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment