
ప్రేమ ఉండును... ప్రేమే ఉండును.
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్‌లైన్‌కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లాగా రోజుకో కొత్త రిలేషన్‌షిప్ లాంచ్ అవుతోంది!
బ్రెడ్‌క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్‌షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్‌క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు.
రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్‌లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్‌గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!
బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్‌మెంట్ ఇవ్వకుండా, సీరియస్‌నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్‌లు, మెసేజ్‌లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.
కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!
కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ï
డ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్‌కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్‌కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్‌షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు.
కిటెన్‌ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్‌లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.
లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్‌తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం
సిట్యుయేషన్‌షిప్.. ఇది ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ.. రిలేషన్‌షిప్‌కి తక్కువ! అటాచ్‌మెంట్ ఉంటుంది. కానీ కమిట్‌మెంట్ ఉండదు.
నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్‌లు, పబ్‌లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!
ఇంకా..
ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉండే ‘టెక్స్‌టేషన్‌షిప్’లాంటి బంధాలు, ఫోన్‌కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్‌ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్‌లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్‌లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్‌షిప్స్!’
పారదర్శకంగా ఉండాలి
ప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది.
– సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment