
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు.
ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.
చాటింపు వేసి.. వివరాలు సేకరించి
అంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.
వధూవరులది ఒకే ఊరు
గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.
మూడు రోజుల పెళ్లి పండగ
సామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.
ఊరంత కుటుంబం
వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.
వరకట్నానికి దూరం
నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ముందు వరుడు.. ఆ తర్వాత వధువు
పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.
– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం