Vajrapukotturu
-
విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దేశం కాని దేశంలో.. మన కుర్రాళ్ల ఇబ్బందులు
సాక్షి, శ్రీకాకుళం(వజ్రపుకొత్తూరు): దేశం కాని దేశంలో మన కుర్రాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్, మలేషియా, మాల్దీవులు.. దేశాల పేర్లు మారుతున్నాయి గానీ మన వాళ్ల అవస్థలు మారడం లేదు. విదేశీ ఉద్యోగాల ఎరలో చిక్కుకుని శల్యమైపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన యువత మాల్దీవుల్లో జీతభత్యాలు లేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తమను ఇండియాకు పంపాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ బుధవారం పత్రికలకు వీడియోలు, మెసేజీలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తిండి లేదు.. జీతం రాదు ఆరు నెలల కిందట సుమారు 60 మంది యువకులు విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన మురళీరెడ్డి, ఇచ్ఛాపురానికి చెందిన పండు అనే ఏజెంట్ల ద్వారా మాల్దీవుల్లోని జాయ్‌షా కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్లకు తామంతా రూ.70 వేలు నుంచి రూ.85 వేలు వరకు చెల్లించామని, రూ.40వేలు వరకు జీతం వస్తుందని వారు చెప్పారని, ఇక్కడికి వ చ్చాక మోసపోయామని వారు తెలిపారు. వీరితో పాటు అప్పటికే విశాఖ, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు రాక, తిండి లేక అనారోగ్యం పాలయ్యారు. ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా లేదని, పాస్‌పోర్టులు కూడా కంపెనీ తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పూండికి చెందిన ఢిల్లేశ్వరరావు, జిల్లాకు చెందిన రుద్రయ్య, సీహెచ్ మురళీకృష్ణ, రంజిత్‌కుమార్, శివకృష్ణ, టి.సింహాచలం, జి.శంకర్, బి. నరిసింహులు, సీహెచ్ రామారావుతో పాటు 60 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. -
బాగున్నావా అవ్వా..!
శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బాతుపురం పంచాయతీ పెదవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు(ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు) కుటుంబ సభ్యులను ఎస్పీ జి.ఆర్.రాధిక కలిశారు. వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం పర్యటించిన ఆమె రాజాంలో ఉంటున్న నారాయణరావు తల్లి నీలమ్మను కలిసి అవ్వా.. నీ అరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ఉండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. అనంతరం కొంత నగదు, పండ్లు అందజేశారు. ఆమెతో పాటు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కాశీబుగ్గ సీఐ డి.రాము, ఎస్సై కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. -
మూడురోజులు ముప్పుతిప్పలు.. ఎలుగుబంటి అనూహ్య మృతి!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆదివారం కిడిసింగిలో జీడి రైతు కోదండరావుపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఈ ఎలుగుబంటి సోమవారం ఆరుగురిని గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
శ్రీకాకుళం జిల్లాలో భయబ్రాంతులకు గురిచేసిన ఎలుగుబంటి మృతి
-
శ్రీకాకుళంలో ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
-
ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన రెస్క్యూ టీమ్.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్ రెస్క్యూ సెంటర్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి కిడిసింగి శారదా పురం తోటలో నివసిస్తున్న ప్రజల్ని ఎలుగుబంటి భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలోనే పలువురిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. రెస్క్యూ టీమ్ సహాయంతో చివరకు దాన్ని పట్టుకున్నారు. ముందుగా ఓ ఇంట్లో ఎలుగుబంటి ఉన్నట్టు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. అందుకోసం స్పెషల్ టీమ్‌ను రప్పించారు. ఆ తోటలో నివసిస్తు వారిని అప్రమత్తం చేసి వారి చేత ఇళ్లు ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఎలుగుబంటిని ప్రాణాలతో పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
Chinavanka Village: ఊరే ఉద్యానవనం...
వజ్రపుకొత్తూరు రూరల్: ఆ ఊరంతా పూలతోటే. దారులన్నీ పూల బాటలే. పచ్చని చెట్లు, రకరకాల విదేశీ పూల మొక్కలు, ఇంటిని పెనవేసుకున్న తీగలతో చినవంక గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యానవనంలా కనిపించే ఈ ఊరు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. స్థానికంగా లభించే మొక్కలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రకరకాల అందమైన పూల మొక్కలను తెప్పించుకొని ఎంతో ఆసక్తితో పెంచుతున్నారు. ప్రతి ఇంట రకరకాల పూల, ఔషధ, తీగ మొక్కలను పెంచుతూ అందంగా అలంకరించుకుంటున్నారు. సుమారు 220 గడప ఉన్న ఈ గ్రామంలో అడుగు పెడితే పూల ప్రపంచంలో అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంలో కనువిందు చేస్తున్న అందమైన మొక్కలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. -
నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్
వజ్రపుకొత్తూరు: బీసీలను చట్ట సభలు, స్థానిక సంస్థల్లో నాడు ఎన్టీఆర్ అగ్ర భాగాన నిలిపితే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 62 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పార్లమెంట్లో 54 శాతం సీట్లను ఇచ్చారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పూండి సాయివినీత్ విద్యా సంస్థల ప్రాంగణంలో మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మత్స్యకార సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభ, విశాఖ–ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటీకరణ దుర్మార్గమని, 2000 సంవత్సరంలో గంగవరం పోర్టును సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. సీఎం జగన్ అలాంటి పనులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?
సాక్షి, శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బహిర్భూమి కోసం వెళ్లి శుక్రవారం రాత్రి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నపల్లివూరు గ్రామానికి చెందిన వివాహిత రచ్చ స్వాతి (24) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉన్న ఉద్దానం ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నట్టు భావిస్తున్న ఉద్దానం రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ఐదారుగురుని కూడా పోలీసులు స్టేషన్‌కు రప్పించి విచారణ చేపడుతున్నారు. స్వాతి వాడిన సెల్ ఫోన్ మాత్రం లభ్యం కాలేదు. ఫోన్ దొరికి.. కాల్ డేటా పరిశీలిస్తే నిందితులు పట్టుబడే అవకాశం ఉంది. చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం) సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్‌తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికని వెళ్లిన స్వాతి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకుంది. గొర్రెలు, ఆవులను మేత కోసం తీసుకొని వెళ్లిన ఆమె అత్తమామలు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటికి చేరగా.. అప్పటికే పొయ్యిపై అన్నం వండుతున్న స్వాతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి మందలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ సీఐ శంకరరావు, ఎస్సై గోవిందరావు అనంతరం బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) సెల్‌ఫోన్ మాయం స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్ సేకరించారు. అక్కడకు కాసింత దూరంలో రక్తపు మరకలతో పాటు ఖాళీ క్వార్టర్ మద్యం సీసాను కూడా క్లూస్ టీమ్ సీజ్ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్‌ఫోన్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు పోలీసులు కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు. పోలీసులు ఏమన్నారంటే.. శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరకున్న వజ్రపుకొత్తూరు ఎస్సై కూన గోవిందరావు, కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు, క్లూస్ టీం వివరాలు సేకరించారు. క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మామ అప్పన్న ఆడపడుచు, అనుమానితులను విచారించారు. హంతకుల ఆనవాలు దొరకలేదని, డాగ్ స్క్వాడ్ పరిశీలించినా ఫలితం లేకపోయిందని, అత్యాచారం జరిగినట్లు ఆనవాలు కూడా దొరకలేదని తెలిపారు. రిమ్స్‌లో పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బల్బులో భారతదేశం
సాక్షి, వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన యువకుడు తామాడ జోగారావు భారత దేశ చిత్ర పటం, జాతీయ జెండా చిత్రాలను విద్యుత్ బల్బులో నిక్షిప్తం చేసి దేశ భక్తిని చాటుకున్నాడు. తన చేతి నైపుణ్యంతో రూపొందించిన అపురూప క్రాఫ్ట్ అందరికీ ఆకట్టుకుంది. పలాస ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ చదువుకున్న యువకుడు వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
అంతా మా ఇష్టం!
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): కొంతమంది ఉద్యోగుల చేతివాటం రైతులకు శాపంగా మారింది. డబ్బులిచ్చిన వారికే పనిచేయడం, మిగిలిన వారికి వివిధ కారణాలు చెప్పి రోజుల తరబడి తిప్పించడం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పరిపాటిగా మారింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో భూ యాజమాన్య రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఒక సర్వే నెంబర్లను..మరొకరికి కేటాయించి నిజమైన రైతులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పంట రుణాలు కోసం రైతులు బ్యాంకులకు అడంగల్, 1బీ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్‌లో లోపాలను ఆసరాగా చేసుకుని అడంగల్ మంజూరులో సాంకేతిక సమస్యలు సృష్టించి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొందరు వీఆర్ఓల కనుసన్నల్లో అడంగల్ వసూళ్ల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఏసీబీ దాడులు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. సర్వేయర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఖాతరు చేయడం లేదు. తహసీల్దార్ డిజిటల్ సైన్ మిస్‌మ్యాచ్‌గా చూపి కార్యాలయం చుట్టూ రైతులతో ప్రదక్షిణలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడా లేనివిధంగా వజ్రపుకొత్తూరు మండలంలోనే ఇలా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడంగల్, 1బీ కావాలంటే సర్వే నెంబరుకి రూ.500 వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి.. వజ్రపుకొత్తూరు తహశీల్దార్ కార్యాలయంలో సర్వే నెంబర్ల ట్యాంపరింగ్ యథేచ్ఛగా సాగుతోంది. మ్యూటేషన్లను పరిశీలించకుండానే అవి పరిష్కరిస్తుండటంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. రైతుకు గత ఏడాది మంజూరైన అడంగల్, 1బీ ఈ ఏడాది మంజూరు కాని పరిస్థితి నెలకొం ది. అంటే ఒకరి సర్వే నెంబర్లను మరొకరి పేరిటి అధికారులు, వీఆర్ఓలు కలిసి ఇష్టారాజ్యంగా ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తేనే రైతులుకార్యాలయా నికి వచ్చి ఎంతో కొంత ముట్టజెప్పక తప్పరనే భావనతో ఏటా రుణాలు ఇచ్చే సీజన్లో ట్యాంపరింగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. లుగేళ్లు కిందట ఓ వీఆర్ఓ.. రైతు తనకు అడిగినంత ఇవ్వలేదనే కారణంతో ఏకంగా అతని పట్టాదార్ పాస్ పుస్తకంలో సర్వే నెంబర్లను రెడ్ ఇంక్‌తో రౌండ్ చేసేశారు. మరో వీఆర్ఓ అడంగల్, 1బీను కరెక్షన్ చేయాలని కోరి తే సీతాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ నుంచి రూ.5వేలు వసూలు చేసి చివరకు ఆ పని చేయకుండా తిప్పి పంపించేశారు. మరో వీఆర్ఓ ఏకంగా బీసీకి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మం జూరు చేసి విచారణను ఎదుర్కొన్నారు. ఒక్క అడంగల్ మాత్రమే కాకుండా ఓబీసీ, కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకం వరకు, మ్యూటేషన్ ఓకే చేయాలన్నా విస్తీర్ణం బట్టి రూ.2 వేలు నుంచి రూ.20 వేలు వరకు కొందరు వసూళ్ల పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. నా దృష్టికి తీసుకురండి.. అడంగల్, 1బీల మంజూరు విషయంలో వసూళ్లు, అవినీతికి పాల్పడితే రైతులు నా దృష్టికి తీసుకురావాలి. అటువంటి వీఆర్ఓలను ఉపేక్షించం. ఇప్పటికే సమావేశం పెట్టి హెచ్చరించాను. ఎవరి వద్ద నుంచైనా డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవు. విజయవాడ సీసీఎల్ఏలో ఏటా భూరికార్డుల వివరాలు రీఫ్రెష్ అవుతాయి. ఆ సమస్య కారణంగా కొంత మంది రైతుల సర్వే నెంబర్లకు డిజిటల్ సైన్ మిస్ మ్యాచ్ అవడం, పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. రైతులు తమకున్న హక్కు పత్రాలతో నేరుగా నన్ను కలిస్తే అడంగల్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాను. – జి. కల్పవల్లి , తహసీల్దార్, వజ్రపుకొత్తూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా.. గత ఏడాది నాలుగు గ్రామా ల పరిధిలో ఉన్న భూములకు అడంగల్, 1బీ వచ్చిం ది. ఈ ఏడాది మీ సేవా కేంద్రానికి వెళితే ధ్రువపత్రాలు రాలేదు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించినా ఎవరూ స్పందిం చడం లేదు. ఏటా ఇదే పరిస్థిత. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారు. మ్యూటేషన్న్లు సక్రమంగా తనిఖీ చేయడం లేదు. విచారణ చేపట్టకుండా డబ్బులిస్తే పని జరిగిపోతోంది. మీసేవలో డిజిటల్ సైన్ మిస్‌మ్యాచ్ అయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి నాతో పాటు 20 మంది వరకు రైతులకు ఎదురైంది. నా భూములకు 1బీ రాకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. – బగాది బాలకృష్ణ, రైతు, గుళ్లలపాడు, వజ్రపుకొత్తూరు మండలం అన్నీ అవకతవకలే.. తహసీల్దార్ కార్యాలయంలో అన్నీ అవకతవకలే. నాకు ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాలకు అడంగల్, 1బీ రావడం లేదు. సర్వే చేయించాను. మ్యూటేషన్ దరఖాస్తు చేశారు. అయినప్పటికీ స్పం దించడం లేదు. అభ్యంతరాలేంటో చెప్పడం లేదు. ఇక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయకుంటే అవకతవకలు తారస్థాయికి చేరే అవకాశం ఉంది. కార్యాలయంలో సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ ఇష్ట పడటం లేదు. – కొర్ల త్రినాథ్ చౌదరి, ఉండ్రుకుడియా, వజ్రపుకొత్తూరు మండలం -
వచ్చాడయ్యో సామీ. . ఇచ్చాడయ్యా హామీ
అనారోగ్యంతో..ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పని చేయకపోతే మందులు కూడా ఖరీదు చేసుకోలేని పరిస్థితి వారిది. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని దుస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి. నాయకులు వస్తున్నారు. పోతున్నారు. ఇన్నాళ్లూ ఈ దీనుల ఆవేదనను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎవరో వస్తారని..ఏదో చేసి ఆదుకుంటారని అలసిసొలసి బతుకులీడుస్తున్న ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తుల వెతలు చూసి చలించిపోయారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిపై రీసెర్చ్ సెంటర్‌ను, రోగులకు దగ్గరలోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి రోగికి మందుల నిమిత్తం నెలకు రూ.10 వేలు పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చి వారికి ధైర్యం కల్పించారు. సాక్షి, వజ్రపుకొత్తూరు: జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉద్దానంలో బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికపోవడం ఓ ఎత్తైతే.. ఆయా ప్రాంతాల్లో నిత్యం కిడ్నీ మహమ్మారి కారణంగా చావు డప్పు మోగుతోంది. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేసుకునే రోగులకు కనీసం ఉచిత మందులు కూడా అందడం లేదు. టీడీపీ పాలనలో ఆరోగ్య శ్రీ పథకాన్ని సవాలక్ష కత్తిరింపుల నడుమ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మార్చారు. డయాలసిస్ రోగుల ఆర్థిక బాధలను టీడీపీ ప్రభుత్వం గట్టెక్కించే ప్రయత్నం ఏదీ చేయలేదు. జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లో దాదాపు 16 వేల మందికి పైగా కిడ్నీరోగులు ఉండగా అందులో మందస మండలం లోహరిబందలో దాదాపు 1500 మంది వరకు ఉన్నారు. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ బాధితులు జిల్లాలో దాదాపు 4,260 మంది వరకు ఉంటే ఇప్పటి వరకు 1,400 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. వారిలో కేవలం 370 మందికి మాత్రమే ముష్టి వేసినట్లు రూ.2,500 పింఛన్‌ను టీడీపీ ప్రభుత్వం ఇస్తోంది. నెలకు రూ.7వేల వరకు ఖర్చయ్యే రోగులకు ఈ పింఛన్ ఏ మూలకు సరిపోతుంది. దీంతో కిడ్నీ రోగులు తమపొలాలు, ఇళ్లు అమ్ముకుని బతుకుపై ఆశతో నిత్యం వైజాగ్ వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు. డయాలసిస్ రోగుల లెక్కింపులో సైతం టీడీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యహరించి రోగుల లెక్కను కుదించే ఎత్తులు వేసింది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో పూటగడవడమే కష్టంగా మారింది. ఇటువంటి తరుణంలో ఇటీవల జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘నేనున్నానని’ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క కిడ్నీ రోగికి తాను ముఖ్యమంత్రి కాగానే రూ.10వేలు పింఛన్ ఇస్తానని, మీకు దగ్గరలోనే డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసి కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి హామీ తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని కిడ్నీ రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కిడ్నీ రోగులకు జగన్ భరోసా ఇలా.. ‘ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య తీవ్రంగా ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలో 200 పడకలతో కూడిన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతాం. అధికారంలోకి రాగానే పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసి రెండేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం. వైద్యులను గ్రామాలకు పంపించి రక్త పరీక్షలు చేసి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి ప్రతి పేదవాడికీ తోడుగా ఉంటాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ రూ.10 వేలు ఇస్తాం స్పెషలిస్ట్ వైద్యులను నియమిస్తాం ఈ ప్రాంతంలో తాగునీరు కలుషితమైనందున కిడ్నీ రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే కలుషిత నీటిని శ్వాశ్వతంగా నివారించేందుకు వంశధార, మహేంద్రతనయ, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ల ద్వారా పైప్‌లైన్ వేసి ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందిస్తాం. బోర్లపై ఆధారపడకుండా సర్ఫేస్ వాటర్ తీసుకొస్తాం. చక్కటి ఆలోచన కిడ్నీ బాధిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని రూ.10 వేలు పింఛన్ నెలకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని కిడ్నీ రోగుల కష్టాలకు ఆయన పాదయాత్రలో కళ్లారా చూసి చలించిపోయారు. అందులో రీసెర్చ్ కేంద్రం 200 పడకలతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదో మంచి ఆలోచన. వేలాది మంది కిడ్నీ రోగులకు ఈ ప్రకటన ఊరట కలిగించింది. అంతా ఆయనకు అండగా నిలవాలి. –సంగారు రామయ్య, డయాలసిస్ రోగి సైనూరు, వజ్రపుకొత్తూరు మండలం ఆర్ధిక భరోసా కిడ్నీ రోగులు డయాలసిస్ చేసుకుంటే ప్రాణాలతో ఉండగలరు. రక్త శుద్ధి సమయంలో ప్రాణాలకు గ్యారంటీ లేదు. నేను నెలకు నాలుగుసార్లు డయాలసిస్ చేసుకుంటున్నాను. నెలకు రూ.5వేల వరకు ఖర్చవుతోంది. భోజనం తినబుద్ధి కాదు. మందులు కొనుగోలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. మంచిదే. –ఎస్.రామూర్తి, డయాలసిస్ రోగి, యూఆర్‌కేపురం వజ్రపుకొత్తూరు మండలం కష్టాలు తీరుతాయి కిడ్నీ రోగుల్లో ధనికులు, పేదలు ఉన్నారు. పేదవారికే కష్టాలన్నీ. 200 పడకలతో రోగుల కోసం ఆసుపత్రి కడతామన్న ఆలోచన మంచిది. రూ.10వేలు పింఛన్ ఇస్తే రోగులకు కొంత ఊరట లభిస్తుంది. విశాఖపట్నం వెళ్లి చికిత్స చేసుకోవాల్సిన దుస్థితి. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆసుపత్రి కట్టిస్తామని చెప్పారు. బాగుంది. కట్టి తీరాలి. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. మాకు నమ్మకం ఉంది. –ఎస్. గంగయ్య, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ,వజ్రపుకొత్తూరు మండలం -
ఉప్పు రైతు కుదేలు
వజ్రపుకొత్తూరు(పలాస) : అకాల వర్షాలు ఉప్పు రైతుల ఆశలను ఆవిరిచేస్తున్నాయి. మండుటెండలో ఒళ్లు గుళ్ల చేసుకుని పండించిన ఉప్పు పంట మొ త్తం సోమవారం రాత్రి కురిసిన జల్లులకు నాశనమైపోయింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉప్పు పంట దిగుబడి బాగుందని ఆశించిన తరుణంలో అకాల వర్షం కురవడంతో ఈసారి తీవ్ర నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వజ్రపుకొత్తూరు మండలంలోనే సుమారు రూ.5 లక్షల నష్టం సంభవించినట్లు ఉప్పు అధికారులు, రైతులు చెబుతున్నారు. తాజా వర్షాలతో ఉప్పు రాశులన్నీ వర్షార్పణం అయ్యాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. మడుల్లోనే ఉప్పు.. వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూరు, నగరంపల్లి, పూండి గల్లీ పరిధిలో సుమారు 350 ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. 520 మంది రైతులు, కార్మికులు ఉప్పు పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్నారు. ఒక రైతు ఏడాదికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.45 వేలు వరకు సంపాదిస్తాడు. ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో విక్రయాలు ప్రాంభం అవుతాయనుకునే సమయంలో అకాల వర్షం కురవడంతో ఉప్పంతా మడుల్లోనే ఉండిపోయింది. ఉప్పు రాశులు తడిసిపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ప్రారంభంలోనే రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కో రైతుకు దాదాపు రూ.2 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వజ్రపుకొత్తూరు మండలంలో ఏటా సుమారు 675 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి ఒడిశాకు తరలిస్తుంటారు. ఈ ఏడాది ఎగుమతి సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ప్రభుత్వం స్పందించి తమకు రుణాలు ఇప్పించాలని, వరికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా ఉప్పు పంట నష్టానికి పరిహారం మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షుడు కొరికాన అప్పారావు, వై.కోదండరావు, గోపి, తదితరులు కోరుతున్నారు -
ఉప్పుటేరు... గుండె బేజారు!
పూండి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఉప్పుటేరు పొంగి పొర్లుతుండటంతో వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక కాలిబాట వంతెన కొన్నిచోట్ల కొట్టుకుపోయింది. దీంతో పూడిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. 120 ఇళ్లు, 136 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి వంతెన నిర్మించాలన్న డిమాండ్ 50 ఏళ్లుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే సమస్యపై గత ఏడాది ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన ఫొటో కథనానికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. అప్పట్లో కొంత హడావుడి చేసిన అధికారులు, తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశారు. గతంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించినా చర్యలు లేవు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతులు కూడా అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన ఫై లీన్ తుపాను సందర్భంగా కొండవూరు నుంచి గ్రామానికి గ్రావెల్ రహదారి మంజూరు చేస్తామని నిన్నటి వరకు కలెక్టర్‌గా ఉన్న సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే ఉప్పుటేరు పొంగింది. కాలిబాట మూడు చోట్ల తెగిపోయింది. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయింది. వర్షాల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే భారీవర్షాలు పడితే తమ గతి ఏమిటని సర్పంచ్ తిమ్మల పవిత్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్ లో మంటలు
శ్రీకాకుళం: గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల మధ్య మంటలు ఎగిసిపడడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును వజ్రపుకొత్తూరు మండలం పూండి వద్ద నిలిపివేశారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్టు సమాచారం లేదు. గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.