సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): కొంతమంది ఉద్యోగుల చేతివాటం రైతులకు శాపంగా మారింది. డబ్బులిచ్చిన వారికే పనిచేయడం, మిగిలిన వారికి వివిధ కారణాలు చెప్పి రోజుల తరబడి తిప్పించడం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పరిపాటిగా మారింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో భూ యాజమాన్య రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఒక సర్వే నెంబర్లను..మరొకరికి కేటాయించి నిజమైన రైతులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పంట రుణాలు కోసం రైతులు బ్యాంకులకు అడంగల్, 1బీ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంది.
సాఫ్ట్‌వేర్‌లో లోపాలను ఆసరాగా చేసుకుని అడంగల్ మంజూరులో సాంకేతిక సమస్యలు సృష్టించి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొందరు వీఆర్‌ఓల కనుసన్నల్లో అడంగల్ వసూళ్ల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఏసీబీ దాడులు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. సర్వేయర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఖాతరు చేయడం లేదు. తహసీల్దార్ డిజిటల్ సైన్ మిస్‌మ్యాచ్‌గా చూపి కార్యాలయం చుట్టూ రైతులతో ప్రదక్షిణలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడా లేనివిధంగా వజ్రపుకొత్తూరు మండలంలోనే ఇలా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడంగల్, 1బీ కావాలంటే సర్వే నెంబరుకి రూ.500 వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏటా ఇదే పరిస్థితి..
వజ్రపుకొత్తూరు తహశీల్దార్ కార్యాలయంలో సర్వే నెంబర్ల ట్యాంపరింగ్ యథేచ్ఛగా సాగుతోంది. మ్యూటేషన్‌లను పరిశీలించకుండానే అవి పరిష్కరిస్తుండటంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. రైతుకు గత ఏడాది మంజూరైన అడంగల్, 1బీ ఈ ఏడాది మంజూరు కాని పరిస్థితి నెలకొం ది. అంటే ఒకరి సర్వే నెంబర్లను మరొకరి పేరిటి అధికారులు, వీఆర్‌ఓలు కలిసి ఇష్టారాజ్యంగా ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తేనే రైతులుకార్యాలయా నికి వచ్చి ఎంతో కొంత ముట్టజెప్పక తప్పరనే భావనతో ఏటా రుణాలు ఇచ్చే సీజన్‌లో ట్యాంపరింగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
లుగేళ్లు కిందట ఓ వీఆర్‌ఓ.. రైతు తనకు అడిగినంత ఇవ్వలేదనే కారణంతో ఏకంగా అతని పట్టాదార్ పాస్ పుస్తకంలో సర్వే నెంబర్లను రెడ్ ఇంక్‌తో రౌండ్ చేసేశారు. మరో వీఆర్‌ఓ అడంగల్, 1బీను కరెక్షన్ చేయాలని కోరి తే సీతాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ నుంచి రూ.5వేలు వసూలు చేసి చివరకు ఆ పని చేయకుండా తిప్పి పంపించేశారు. మరో వీఆర్‌ఓ ఏకంగా బీసీకి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మం జూరు చేసి విచారణను ఎదుర్కొన్నారు. ఒక్క అడంగల్ మాత్రమే కాకుండా ఓబీసీ, కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకం వరకు, మ్యూటేషన్ ఓకే చేయాలన్నా విస్తీర్ణం బట్టి రూ.2 వేలు నుంచి రూ.20 వేలు వరకు కొందరు వసూళ్ల పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
నా దృష్టికి తీసుకురండి..
అడంగల్, 1బీల మంజూరు విషయంలో వసూళ్లు, అవినీతికి పాల్పడితే రైతులు నా దృష్టికి తీసుకురావాలి. అటువంటి వీఆర్‌ఓలను ఉపేక్షించం. ఇప్పటికే సమావేశం పెట్టి హెచ్చరించాను. ఎవరి వద్ద నుంచైనా డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవు. విజయవాడ సీసీఎల్‌ఏలో ఏటా భూరికార్డుల వివరాలు రీఫ్రెష్ అవుతాయి. ఆ సమస్య కారణంగా కొంత మంది రైతుల సర్వే నెంబర్లకు డిజిటల్ సైన్ మిస్ మ్యాచ్ అవడం, పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. రైతులు తమకున్న హక్కు పత్రాలతో నేరుగా నన్ను కలిస్తే అడంగల్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాను.
– జి. కల్పవల్లి , తహసీల్దార్, వజ్రపుకొత్తూరు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా..
గత ఏడాది నాలుగు గ్రామా ల పరిధిలో ఉన్న భూములకు అడంగల్, 1బీ వచ్చిం ది. ఈ ఏడాది మీ సేవా కేంద్రానికి వెళితే ధ్రువపత్రాలు రాలేదు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించినా ఎవరూ స్పందిం చడం లేదు. ఏటా ఇదే పరిస్థిత. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారు. మ్యూటేషన్‌న్‌లు సక్రమంగా తనిఖీ చేయడం లేదు. విచారణ చేపట్టకుండా డబ్బులిస్తే పని జరిగిపోతోంది. మీసేవలో డిజిటల్ సైన్ మిస్‌మ్యాచ్ అయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి నాతో పాటు 20 మంది వరకు రైతులకు ఎదురైంది. నా భూములకు 1బీ రాకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను.
– బగాది బాలకృష్ణ, రైతు, గుళ్లలపాడు, వజ్రపుకొత్తూరు మండలం
అన్నీ అవకతవకలే..
తహసీల్దార్ కార్యాలయంలో అన్నీ అవకతవకలే. నాకు ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాలకు అడంగల్, 1బీ రావడం లేదు. సర్వే చేయించాను. మ్యూటేషన్ దరఖాస్తు చేశారు. అయినప్పటికీ స్పం దించడం లేదు. అభ్యంతరాలేంటో చెప్పడం లేదు. ఇక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయకుంటే అవకతవకలు తారస్థాయికి చేరే అవకాశం ఉంది. కార్యాలయంలో సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ ఇష్ట పడటం లేదు.
– కొర్ల త్రినాథ్ చౌదరి, ఉండ్రుకుడియా, వజ్రపుకొత్తూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment