
పచ్చని చెట్లు, రకరకాల విదేశీ పూల మొక్కలు, ఇంటిని పెనవేసుకున్న తీగలతో చినవంక గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వజ్రపుకొత్తూరు రూరల్: ఆ ఊరంతా పూలతోటే. దారులన్నీ పూల బాటలే. పచ్చని చెట్లు, రకరకాల విదేశీ పూల మొక్కలు, ఇంటిని పెనవేసుకున్న తీగలతో చినవంక గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యానవనంలా కనిపించే ఈ ఊరు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. స్థానికంగా లభించే మొక్కలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రకరకాల అందమైన పూల మొక్కలను తెప్పించుకొని ఎంతో ఆసక్తితో పెంచుతున్నారు.
ప్రతి ఇంట రకరకాల పూల, ఔషధ, తీగ మొక్కలను పెంచుతూ అందంగా అలంకరించుకుంటున్నారు. సుమారు 220 గడప ఉన్న ఈ గ్రామంలో అడుగు పెడితే పూల ప్రపంచంలో అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంలో కనువిందు చేస్తున్న అందమైన మొక్కలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.