తమను ఇండియాకు తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మాట్లాడుతున్న యువకులు
సాక్షి, శ్రీకాకుళం(వజ్రపుకొత్తూరు): దేశం కాని దేశంలో మన కుర్రాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్, మలేషియా, మాల్దీవులు.. దేశాల పేర్లు మారుతున్నాయి గానీ మన వాళ్ల అవస్థలు మారడం లేదు. విదేశీ ఉద్యోగాల ఎరలో చిక్కుకుని శల్యమైపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన యువత మాల్దీవుల్లో జీతభత్యాలు లేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తమను ఇండియాకు పంపాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ బుధవారం పత్రికలకు వీడియోలు, మెసేజీలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
తిండి లేదు.. జీతం రాదు
ఆరు నెలల కిందట సుమారు 60 మంది యువకులు విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన మురళీరెడ్డి, ఇచ్ఛాపురానికి చెందిన పండు అనే ఏజెంట్‌ల ద్వారా మాల్దీవుల్లోని జాయ్‌షా కన్‌స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్‌లకు తామంతా రూ.70 వేలు నుంచి రూ.85 వేలు వరకు చెల్లించామని, రూ.40వేలు వరకు జీతం వస్తుందని వారు చెప్పారని, ఇక్కడికి వ చ్చాక మోసపోయామని వారు తెలిపారు. వీరితో పాటు అప్పటికే విశాఖ, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు రాక, తిండి లేక అనారోగ్యం పాలయ్యారు.
ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా లేదని, పాస్‌పోర్టులు కూడా కంపెనీ తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పూండికి చెందిన ఢిల్లేశ్వరరావు, జిల్లాకు చెందిన రుద్రయ్య, సీహెచ్ మురళీకృష్ణ, రంజిత్‌కుమార్, శివకృష్ణ, టి.సింహాచలం, జి.శంకర్, బి. నరిసింహులు, సీహెచ్ రామారావుతో పాటు 60 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment