‘శత’మానం భవతి..!
శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవులో ఒక్కటైన వంద జంటలు
వజ్రపుకొత్తూరు రూరల్: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆదివారం వంద జంటలు ఒక్కటయ్యాయి. ప్రతి మూడేళ్లకు ఓ సారి సామూహిక వివాహాలు చేయడం ఈ గ్రామ ప్రత్యేకత. ఈ సారి కూడా సామూహిక వివాహాలను విభిన్నంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ హోలీ ఆడారు. ఆ తర్వాత పెళ్లి కుమారులు గ్రామ దేవతకు పూజలు చేసి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లి తలపై నీళ్లు చల్లుకున్నారు.
వధూవరుల తల్లిదండ్రులు కూడా కొత్త కుండల్లో నీటిని తీసుకుని ఒక కుండలో పోశారు. ఈ ప్రక్రియ రెండు కుటుంబాల ఐక్యతకు సూచిక అని వీరు నమ్ముతారు. అప్పటికే 200 మంది పంతుళ్లు గ్రామానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీని కోసం ముందే గ్రామ పెద్దలు పంతుళ్లతో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించారు. ఇక వీధివీధినా విద్యుత్ అలంకరణలు, పెళ్లి పందిళ్లు కొలువుదీరాయి. ఆ తర్వాత వేద మంత్రాల నడుమ వంద జంటలు ఒకేసారి వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. వధువులు చీర, పసుపు, కుంకుమ నిండైన తిలకంతో, చేతులకు సగం వరకు గోరింటాకుతో ముస్తాబవగా వరుడు పట్టు పంచె శార్వాణి ధరించి మెడలో డబ్బుల హారం, కళ్లద్దాలు, పాగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.