
చిన్న పట్టణాల్లోనూ లగ్జరీ ఉత్పత్తులకు సై..
ఖరీదైన పాదరక్షలు, వాచీలు, వస్త్రాల కొనుగోళ్లు
టాటా క్లిక్ లగ్జరీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: విలాసవంతమైన ఉత్పత్తుల పట్ల అభిరుచి చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. ఖరీదైన పాదరక్షలు, వాచీలు, వ్రస్తాలు, యాక్సెసరీల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల పట్టణ వాసులు సైతం ఆర్డర్ చేస్తున్నారు. దీంతో లగర్జీ ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రోలకే పరిమితం అన్న అభిప్రాయం క్రమంగా చెరిగిపోతోంది. గుజరాత్‌లో 2 లక్షల జనాభా కూడా లేని బోటాడ్ నుంచి వీటి కోసం ఆర్డర్లు వస్తుండడమే ఇందుకు నిదర్శనం.
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఇందుకు వారధిగా నిలుస్తున్నాయి. టాటా క్లిక్ లగ్జరీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. ‘‘లగ్జరీ అన్నది ఇక ఎంత మాత్రం అధిక ధనవంతులకు సంబంధించిన విభాగం కాబోదు. టైర్–2, 3 పట్టణ వాసులు, మెట్రో పరిధిలో కొత్త భౌగోళిక ప్రదేశాలు పరిశ్రమకు కొత్త పునరుజ్జీవాన్నిస్తున్నాయి’’అని టాటా క్లిక్ లగ్జరీ నివేదికలో అనలిస్టులు పేర్కొన్నారు. సంపన్నులు కాని అధిక ఆదాయ వర్గాలతో (హెన్రీ) కూడిన వినియోగ వర్గం గురించి ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. వీరు లగ్జరీ ఉత్పత్తుల అనుభవాన్ని కోరుకుంటున్నట్టు తెలిపింది.
నాన్ మెట్రోల్లోనే అధిక అమ్మకాలు..
టాటా క్లిక్‌లో లగ్జరీ ఉత్పత్తుల ప్రత్యేక విభాగమైన ‘టాటా క్లిక్ లగ్జరీ’పై జరిగే విక్రయాల్లో 55 శాతం నాన్ మెట్రోలైన పంచకుల, మైసూరు తదితర పట్టణాల నుంచే ఉంటున్నాయి. ‘‘ఇలా కొనుగోలు చేసే వారంతా ఉద్యోగాలు చేస్తూ, అధిక ఆదాయం సంపాదిస్తున్న వారు. విలాస అనుభం, ఉత్పత్తుల వినియోగాన్ని కోరుకుంటున్నారు. దీంతో సౌందర్య ఉత్పత్తులు, యాక్సెసరీలు, వస్త్రాలు, పాదరక్షల విక్రయాల్లో అధిక విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నారు.
మెట్రో వినియోగదారుల మాదిరే వీరి కొనుగోళ్ల విలువ కూడా ఉంటోంది’’అని టాటా క్లిక్ లగ్జరీ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. సంపన్నులే కాకుండా చిన్న పట్టణాల్లోని వృత్తి నిపుణులు సైతం లగ్జరీ వస్తువులకు వినియోగదారులుగా మారుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బల్గరీ తదితర అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల సహకారంతో భారత్‌లో కొత్త కస్టమర్లను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అజియో లగ్జే సైతం అంతర్జాతీయ బ్రాండ్లకు చిన్న పట్టణాల్లో భౌతిక స్టోర్లు తెరవాల్సిన అవసరాన్ని తప్పిస్తోంది. సంప్రదాయ లగ్జరీ షాపర్లకు భిన్నంగా.. కొత్త కస్టమర్లు తగిన పరిశోధన తర్వాతే ఆర్డర్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా వేదికలు, వెబ్‌సైట్లు, కస్టమర్ల రివ్యూలను ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఆరేడు బ్రాండ్ల ఉత్పత్తులను పరిశీలించిన తర్వాతే చివరికి ఒకటి ఎంపిక చేసుకుంటున్నారు.
→ అధిక ఆదాయంతో మెరుగైన అనుభవానికి మొగ్గు
→ పలు బ్రాండ్లను పరిశీలించిన తర్వాత కొనుగోలు
→ సరైన పరిశోధన తర్వాతే ఉత్పత్తి ఎంపిక
→ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా భవిష్యత్ లగ్జరీ కస్టమర్లు
→ ఈ కామర్స్ రూట్‌లో అంతర్జాతీయ బ్రాండ్లు
→ నాన్ మెట్రోల నుంచే 55 శాతం అమ్మకాలు
Comments
Please login to add a commentAdd a comment