luxury products
-
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సంచలన ఆవిష్కరణ: బుల్లెట్లను తట్టుకునే స్మార్ట్‌ఫోన్
Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్‌ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా. సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్‌ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్‌ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్‌తో పని చేయడం. బుల్లెట్‌ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్‌గా తేలడం విశేషం. ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్‌ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!. 2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్‌లతో పాటు పలు రకాల బ్రాండ్లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్‌గా ముద్రను సంపాదించుకుంది. చదవండి: వారం పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్! ఏదంటే.. -
కొనే ముందే ఆలోచించాలి..
మార్కెట్లోకి వచ్చే కొంగొత్త గ్యాడ్జెట్స్.. లగ్జరీ ఉత్పత్తులు మనసుకు నచ్చితే ఒకోసారి ఖరీదెంతయినా కొనేస్తుంటాము. కొత్తల్లో బాగానే ఉంటుంది. కొన్నాళ్లు గడిచాక.. వాటిని ఎప్పుడో గానీఉపయోగించకుండా ఓ మూలన పడి మూలుగుతున్నప్పుడో లేదా జాగ్రత్తపెట్టడానికి తగినంత జాగా లేనప్పుడోఅనిపిస్తుంది.. అనవసరంగా కొన్నామేమోనని. ఇలా అత్యుత్సాహంతో కొనేసి.. ఆ తర్వాత తీరిగ్గా బాధపడకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అలాంటివే ఇవి. ఏదైనా సరే తక్కువకి లభిస్తోందంటే.. అవసరమున్నా, లేకున్నా కొనేయాలనిపించడం సహజమే. నిజానికి మనకు ఆదా అయ్యేది తక్కువే అయినా కూడా సేల్‌లో కొనుక్కోకపోతే ప్రయోజనాలు కోల్పోతున్నామేమో అని బాధగా ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడే సంయమనం పాటించాలి. కొనేసేయడానికి ముందు సదరు వస్తువు అవసరమా, తీసుకుంటే ఎంత వరకూ ఉపయోగపడుతుంది అన్నది కాస్త ఆలోచించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఒకవేళ ఆఫర్ లేకపోయినా దాన్ని కొని ఉండే వారమా అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటే అనవసర కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. రేప్పొద్దున్న కోసం కొనొద్దు.. భవిష్యత్ గురించి ప్రణాళిక వేసుకోవడం మంచిదే. అయితే, ఎప్పుడో ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో సంవత్సరాల తరబడి ముందుగా కొని పెట్టుకోవడం మాత్రం అంత సరికాదు. పెపైచ్చు వాటిని ఏళ్ల తరబడి దాచిపెట్టడం ఒక పెద్ద పని కాగా.. నిజంగా వాడే సమయం వచ్చేటప్పటికి అవి పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. అవసరాన్ని బట్టే షాపింగ్.. నిత్యావసరాల కొనుగోలుకు బైల్దేరే ముందు ఇంట్లో ఏవేవి ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూసుకోవడం ఉత్తమం. లేకపోతే..షాపుకి వెళ్లిన తర్వాత తడుముకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాటినే మళ్లీ కొనే అవకాశమూ ఉంది. ఫలితంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుంది. అలాగే టేబుల్ క్లాత్ లాంటివి కొనడానికి వెడుతున్న పక్షంలో ముందుగా ఎంత సైజువి తీసుకోవాలో ఇంటి దగ్గరే ఆయా వస్తువుల కొలతలు తీసుకెళ్లాలి. అలా చేయకుండా ఏదో ఒకటి కొని తెచ్చుకుని, తీరా అది సరిపోకపోతే తలపట్టుకోవాల్సి వస్తుంది. కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే సమయమూ, డబ్బూ ఆదా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్‌తో జాగ్రత్త.. బ్రెడ్ మేకర్లు, ఐస్‌క్రీమ్ మేకర్లు, జ్యూసర్లులాంటి ఫ్యాన్సీ ఉత్పత్తులతో పని చాలా సులువవుతుంది కానీ.. వీటిని ఎప్పుడో తప్ప ఎక్కువగా ఉపయోగించము. మొదట్లో ముచ్చట కొద్దీ బాగానే ఉపయోగించినా .. ఆ తర్వాత మాత్రం చాలా రోజుల పాటు ఇవి అటకెక్కి దుమ్ముకొట్టుకుంటూ ఉంటాయి. ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు చేసుకోవడం అప్పుడప్పుడు సరదాగా అనిపించినా.. అంత కష్టపడనక్కర్లేకుండా సులభంగా షాపు నుంచి కొనుక్కొచ్చుకోవడానికే ఓటేస్తుంటాం. కనుక, ఇలాంటివి కొనుక్కోవడానికి ముందుగా ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాటిని కొద్ది రోజుల కోసం తీసుకుని వాడి చూడండి. అది మీకు నచ్చి, మీ ఇంట్లో తగినంత జాగా కేటాయించగలిగిన పక్షంలో కొనుక్కోవడంపై నిర్ణయం తీసుకోండి. అప్‌గ్రేడ్.. ఇది అన్ని కొనుగోళ్లకూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు. ఏదైనా వస్తువును పూర్తిగా ఉపయోగించిన తర్వాతే దాని అప్‌గ్రేడ్ గురించి ఆలోచించండి. చేతిలో ఉన్న దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకున్న తర్వాతే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొనడంపై దృష్టి పెట్టొచ్చు. అప్‌గ్రేడ్ కోసం ఒకటి తీసుకుంటున్న పక్షంలో దాని పాత వెర్షన్‌ని ఏదో రకంగా సాగనంపడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు పాత టీవీలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని దాచడానికి జాగా కోసం వెతుక్కోనక్కర్లేదు. ఇక, చివరిగా డిస్కౌంటు ఆఫర్లిస్తున్నారని కొనేయడమూ, కొంగొత్త ఉత్పత్తులతో ప్రయోగాలు చేయడమూ అప్పుడప్పుడైతే ఫర్వాలేదు కానీ.. ఇదే అలవాటుగా మారితే మాత్రం కష్టమేనని గుర్తుంచుకోవాలి. అవసరం లేనివి ఎడాపెడా కొనేస్తుంటే డబ్బు వృథా కావడంతో పాటు వాటిని సరిగ్గా భద్రపర్చలేకపోతే ఇల్లంతా గందరగోళంగా మారే అవకాశమూ ఉంది.