మార్కెట్లోకి వచ్చే కొంగొత్త గ్యాడ్జెట్స్.. లగ్జరీ ఉత్పత్తులు మనసుకు నచ్చితే ఒకోసారి ఖరీదెంతయినా కొనేస్తుంటాము. కొత్తల్లో బాగానే ఉంటుంది. కొన్నాళ్లు గడిచాక.. వాటిని ఎప్పుడో గానీఉపయోగించకుండా ఓ మూలన పడి మూలుగుతున్నప్పుడో లేదా జాగ్రత్తపెట్టడానికి తగినంత జాగా లేనప్పుడోఅనిపిస్తుంది.. అనవసరంగా కొన్నామేమోనని. ఇలా అత్యుత్సాహంతో కొనేసి.. ఆ తర్వాత తీరిగ్గా బాధపడకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అలాంటివే ఇవి.
ఏదైనా సరే తక్కువకి లభిస్తోందంటే.. అవసరమున్నా, లేకున్నా కొనేయాలనిపించడం సహజమే. నిజానికి మనకు ఆదా అయ్యేది తక్కువే అయినా కూడా సేల్‌లో కొనుక్కోకపోతే ప్రయోజనాలు కోల్పోతున్నామేమో అని బాధగా ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడే సంయమనం పాటించాలి. కొనేసేయడానికి ముందు సదరు వస్తువు అవసరమా, తీసుకుంటే ఎంత వరకూ ఉపయోగపడుతుంది అన్నది కాస్త ఆలోచించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఒకవేళ ఆఫర్ లేకపోయినా దాన్ని కొని ఉండే వారమా అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటే అనవసర కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు.
రేప్పొద్దున్న కోసం కొనొద్దు..
భవిష్యత్ గురించి ప్రణాళిక వేసుకోవడం మంచిదే. అయితే, ఎప్పుడో ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో సంవత్సరాల తరబడి ముందుగా కొని పెట్టుకోవడం మాత్రం అంత సరికాదు. పెపైచ్చు వాటిని ఏళ్ల తరబడి దాచిపెట్టడం ఒక పెద్ద పని కాగా.. నిజంగా వాడే సమయం వచ్చేటప్పటికి అవి పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది.
అవసరాన్ని బట్టే షాపింగ్..
నిత్యావసరాల కొనుగోలుకు బైల్దేరే ముందు ఇంట్లో ఏవేవి ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూసుకోవడం ఉత్తమం. లేకపోతే..షాపుకి వెళ్లిన తర్వాత తడుముకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాటినే మళ్లీ కొనే అవకాశమూ ఉంది. ఫలితంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుంది. అలాగే టేబుల్ క్లాత్ లాంటివి కొనడానికి వెడుతున్న పక్షంలో ముందుగా ఎంత సైజువి తీసుకోవాలో ఇంటి దగ్గరే ఆయా వస్తువుల కొలతలు తీసుకెళ్లాలి. అలా చేయకుండా ఏదో ఒకటి కొని తెచ్చుకుని, తీరా అది సరిపోకపోతే తలపట్టుకోవాల్సి వస్తుంది. కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే సమయమూ, డబ్బూ ఆదా చేసుకోవచ్చు.
ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్‌తో జాగ్రత్త..
బ్రెడ్ మేకర్లు, ఐస్‌క్రీమ్ మేకర్లు, జ్యూసర్లులాంటి ఫ్యాన్సీ ఉత్పత్తులతో పని చాలా సులువవుతుంది కానీ.. వీటిని ఎప్పుడో తప్ప ఎక్కువగా ఉపయోగించము. మొదట్లో ముచ్చట కొద్దీ బాగానే ఉపయోగించినా .. ఆ తర్వాత మాత్రం చాలా రోజుల పాటు ఇవి అటకెక్కి దుమ్ముకొట్టుకుంటూ ఉంటాయి. ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు చేసుకోవడం అప్పుడప్పుడు సరదాగా అనిపించినా.. అంత కష్టపడనక్కర్లేకుండా సులభంగా షాపు నుంచి కొనుక్కొచ్చుకోవడానికే ఓటేస్తుంటాం. కనుక, ఇలాంటివి కొనుక్కోవడానికి ముందుగా ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాటిని కొద్ది రోజుల కోసం తీసుకుని వాడి చూడండి. అది మీకు నచ్చి, మీ ఇంట్లో తగినంత జాగా కేటాయించగలిగిన పక్షంలో కొనుక్కోవడంపై నిర్ణయం తీసుకోండి.
అప్‌గ్రేడ్..
ఇది అన్ని కొనుగోళ్లకూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు. ఏదైనా వస్తువును పూర్తిగా ఉపయోగించిన తర్వాతే దాని అప్‌గ్రేడ్ గురించి ఆలోచించండి. చేతిలో ఉన్న దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకున్న తర్వాతే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొనడంపై దృష్టి పెట్టొచ్చు. అప్‌గ్రేడ్ కోసం ఒకటి తీసుకుంటున్న పక్షంలో దాని పాత వెర్షన్‌ని ఏదో రకంగా సాగనంపడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు పాత టీవీలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని దాచడానికి జాగా కోసం వెతుక్కోనక్కర్లేదు. ఇక, చివరిగా డిస్కౌంటు ఆఫర్లిస్తున్నారని కొనేయడమూ, కొంగొత్త ఉత్పత్తులతో ప్రయోగాలు చేయడమూ అప్పుడప్పుడైతే ఫర్వాలేదు కానీ.. ఇదే అలవాటుగా మారితే మాత్రం కష్టమేనని గుర్తుంచుకోవాలి. అవసరం లేనివి ఎడాపెడా కొనేస్తుంటే డబ్బు వృథా కావడంతో పాటు వాటిని సరిగ్గా భద్రపర్చలేకపోతే ఇల్లంతా గందరగోళంగా మారే అవకాశమూ ఉంది.
కొనే ముందే ఆలోచించాలి..
Published Fri, Jul 18 2014 10:58 PM | Last Updated on Sat, Aug 25 2018 5:22 PM
Advertisement