Market Trends
-
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 384.55 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 81,748.57 వద్ద, నిఫ్టీ 100.05 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 24,668.25 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 63.95 పాయింట్లు లేదా 0.08 శాతం క్షీణించి 82,069 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,770 వద్ద చలిస్తున్నాయి.ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు జాగ్రత్తగా కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ఇవే కీలకం!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.ఆర్థిక గణాంకాలునేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది. గత వారమిలా శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్‌కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్‌యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది. -
మళ్లీ మార్కెట్ల పతనానికి చాన్స్!
ప్రస్తుత స్థాయిల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ద్వితీయార్థంలో పతనమయ్యే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు కొంతమంది భావిస్తున్నారు. అయితే మార్చిలో నమోదైన కనిష్ట స్థాయి 7,500కు నిఫ్టీ చేరకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఇటీవల కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు దిగితే మార్కెట్లు మరోసారి మార్చి కనిష్టాలను పరీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ద్వితీయార్ధంలో మార్కెట్ల గమనం ఎలా ఉంటుందన్న అంశంపై కొంతమంది మార్కెట్ నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. లాక్డవున్లు దేశీయంగా కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతుండటంతో ఇప్పటికే చెన్నై, గువాహటి తదితర ప్రాంతాలలో లాక్‌డవున్ ప్రకటించారు. ఈ బాటలో ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలలోనూ మరోసారి లాక్‌డవున్ ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొద్ది వారాల్లోనే దేశీయంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరగడంతో అమెరికా, బ్రెజిల్, రష్యా తదుపరి స్థానానికి దేశం చేరుకుంది. నిజానికి మార్చి నుంచి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న అంచనాలతో మార్కెట్లు 35 శాతం ఎగశాయి. ఎఫ్‌పీఐలు సైతం పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి లాక్‌డవున్ విధింపు వార్తలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చు. నిపుణులు ఇలా.. అమెరికా, చైనా వంటి దేశాలలో కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యే వీలున్నట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ సీఐవో నవీన్ కులకర్ణి అభిప్రాయపడుతున్నారు. అయితే నిఫ్టీ మార్చి కనిష్టాలకు చేరకపోవచ్చని చెబుతున్నారు. నిఫ్టీ 7500 పాయింట్ల వద్ద స్వల్పకాలిక బాటమ్‌ను చవిచూసిందని మోతీలాల్ ఓస్వాల్ నిపుణులు హేమంగ్ జానీ పేర్కొంటున్నారు. ఆటుపోట్లను తెలిపే ఇండియా విక్స్ 11 ఏళ్ల గరిష్టం 87ను మార్చిలో తాకిన పిదప 30కు తగ్గడం ద్వారా ఈ అంశం ప్రతిఫలిస్తున్నట్లు వివరించారు. గ్లోబల్ ఎకానమీతోపాటు, ఫైనాన్షియల్ మార్కెట్లకు కోవిడ్-19 తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలియజేశారు. ముందుముందు సవాళ్లు ఎదురుకావచ్చని కంపెనీల ఫలితాల సందర్భంగా యాజమాన్యాలు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు మార్కెట్లకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్టీ వీక్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిద్రవ్యోల్బణం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బలహీనపడిందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు చొక్కలింగం పేర్కొన్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోగా.. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్గాల ద్వారా అతితక్కువ రిటర్నులే వస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు ఆకర్షణీయంకాకపోవడంతో లిక్విడిటీ అంతా స్టాక్స్‌లోకే ప్రవహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు 15-20 శాతం పతనమైతే పెట్టుబడులు ఊపందుకునే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఎఫ్‌పీఐలు తమ హోల్డింగ్స్‌లో 5 శాతం వాటాను విక్రయించినప్పటికీ నిఫ్టీ మార్చి కనిష్టానికి సులభంగా చేరుతుందని అంచనా వేశారు. లేమన్ బ్రదర్స్ సంక్షోభంలో ఎఫ్ఐఐలు 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో సెన్సెక్స్ 60 శాతం పతనమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ బాటలో 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. ఇటీవల మార్కెట్లు 38 శాతం పతనమైనట్లు వివరించారు. ఇక సమీప భవిష్యత్‌లో మార్కెట్లు కరెక్షన్కు లోనయ్యే వీలున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు ఉమేష్ షా చెప్పారు. అయితే మార్చి కనిష్టాలను తాకే అంశంపై అంచనాల్లేవని తెలియజేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ లేదా చైనాతో వివాదాలు లేదా కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావడం వంటి అంశాలు మార్కెట్లలో అమ్మకాలకు దారిచూపవచ్చని విశ్లేషించారు. మార్చి కనిష్టాలకు నో సమీప భవిష్యత్‌లో మార్కెట్లు మార్చి కనిష్టాలకు పతనంకాకపోవచ్చని.. బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ షేర్స్ నిపుణులు సిద్ధార్ధ్ సెడానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయిర్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
సెన్సెక్స్ కీలక మద్దతు 38,380
పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్ కార్పొరేట్ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా–చైనాల వాణిజ్య చర్చల పురోగతి కూడా ఈక్విటీలపై ప్రభావం చూపించవచ్చు. ఈ వారాంతంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయం, అక్టోబర్1న వెలువడే ఆటోమొబైల్స్ అమ్మకాల డేటా వంటివి మార్కెట్‌ను పరిమితంగా ఊగిసలాటకు లోనుచేయవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో తొలిరోజున 39,441 గరిష్టస్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్ అటుతర్వాత మిగిలిన నాలుగురోజులూ పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 808 పాయింట్ల లాభంతో 38,823 వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లో కన్సాలిడేషన్ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 38,670 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 38,380 వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది ఈ స్థాయిని కూడా వదులుకుంటే క్రమేపీ 38,000 స్థాయి వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, బలంగా ప్రారంభమైనా 39,160 స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 39,440 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే వేగంగా 39,650 వద్దకు చేరవచ్చు. నిఫ్టీకి 11,380 పాయింట్ల మద్దతు కీలకం... క్రితం సోమవారం 11,695 గరిష్టం వరకూ పెరిగిన నిఫ్టీ...మిగతా 4 రోజులూ 1.5% శ్రేణిలో హెచ్చుతగ్గులకులోనై, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 11,512 వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 11,465 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని వదులుకుంటే 11,380 వద్ద లభించబోయే మద్దతు నిఫ్టీకి కీలకం. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 11,250 సమీపానికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకున్నా, పాజిటివ్‌గా ప్రారంభమైనా నిఫ్టీ తొలుత 11,610 వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే 11,690 వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 11,750 వరకూ ర్యాలీ జరపవచ్చు. – పి. సత్యప్రసాద్ -
పాలకొల్లులో షూటింగ్ సందడి
ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్): పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో సోడా.. గోలీ సోడా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్బీ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్లో భాగంగా శుక్రవారం ఉల్లంపర్రు మాంటిస్సోరీ స్కూల్లో పలు సన్నివేశాలను హీరో మానస్ (కాయ్ రాజా కాయ్ ఫేం), హీరోయిన్ నిత్యా నరేష్ (నందిని నర్శింగ్ హోం ఫేం), ఆర్తి (చెన్నై)లపై దర్శకుడు మల్లూరి హరిబాబు తెరకెక్కించారు. కుటుంబ హాస్య కథా చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నట్టు దర్శకుడు మల్లూరి హరిబాబు తెలిపారు. ఈ నెల 28 వరకు పాలకొల్లు పరిసర ప్రాంతాలతో పాటు, అమలాపురం, రాజమండ్రి, పాపికొండల్లో సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జూన్‌లో చిత్రీకరించి డబ్బింగ్, ఇతర పనులు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ప్రముఖ సినీ, మాటల రచయిత తోటపల్లి మధు గ్రామ సర్పంచ్‌గా ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారన్నారు. అలాగే హీరో మిత్రులుగా గాదె రాంబాబు, కిర్లంపూడి అచ్చిరాజు, హీరోయిన్ ఫ్రెండ్స్‌గా ఆర్తి (చెన్నై), భవాని నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, మాధవి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారని వెల్లడించారు. భువనగిరి సత్యసింధూజ, భువనగిరి శ్రీనివాసమూర్తి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
17 నుంచి పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం : గోకుల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మ న్ బిక్కిన సత్యనారాయణ, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 17న సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ట కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 18న పుణ్యాహవచనం, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం, సాయంత్రం 8 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 19 న నిత్యహోమంతో పాటు నీరాజనం, తీర్థ ప్రసాదగోష్టి జరుగుతాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు హనుమదుత్సవం చేపడుతున్నట్టు తెలిపారు. 20న శనివారం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం కోలాటం, భజన, విచిత్ర వేషధారణలతో గరుడ వాహన సేవ (గ్రామోత్సవం) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 22 సోమవారం వసంతోత్సవం, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రికి గజవాహన సేవ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు రుత్విక్కుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 23 మంగళవారం ఉదయం ధృవమూర్తికి పంచామృతాభిషేకం, నవకలశ స్నపనము, రాత్రి ద్వాదశారాధ న, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా 17న ఉదయం 11 గంటలకు 108 మంది దంపతులతో సామూహిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయన, గుళ్లపూడి శ్రీదేవి, యిళ్ల రామ్మోహనరావు, మారిశెట్టి బాలకృష్ణ, తోట రామకృష్ణ, బోడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల : వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు చిన వెంకన్న క్షేత్రం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈనెల 12 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో స్వామి రోజుకో అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సంగీత కచేరీ, సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ, రాత్రి 8 గంటలకు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఈఓ వెల్లడించారు. -
హెచ్‌యూఎల్‌లో ఉద్యోగాల కోత
ముంబై: దేశీయ వినియోగ వస్తువుల సంస్థ, మల్టీ నేషనల్ కంపెనీ హిందూస్థాన్ యునిలివర్ ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఏప్రిల్ చివరికనాటికి 10-15శాతం ఉద్యోగాలు తొలగించేందుకు యోచిస్తోంది. డచ్‌కు చెందిన పేరెంటల్ కంపెనీ మాండేటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా మొత్తం మార్కెట్లలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో కన్జూమర్ గూడ్స్ కంపెనీ హెచ్ యూఎల్ ఉద్యోగులను ఇంటికి పంపనుంది. దీంతోపాటు కొత్త నియామకాల్లో కూడా కోత పెట్టనుంది. అయితే ఈ వార్తలపై స్పందించడానికి హెచ్‌యూఎల్ నిరాకరించింది. మరోవైపు హెచ్‌యూఎల్ కంపెనీలనుంచి దరఖాస్తులను అందినట్టుగా కొన్ని మల్టీ నేషనల్ కంపనీలు దృవీకరించాయి. మార్జిన్ టార్గెట్లను పెంచుతున్నట్టు హెచ్‌యూఎల్ పేరెంటల్ కంపెనీ గురువారం ప్రకటించింది. యూకే, నెదర్లాండ్స్‌లో రెండు విడి కంపెనీలుగా ఆంగ్లో డచ్ కంపెనీ నిర్మాణాన్ని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. కాగా 2015-16 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కంపెనీలోమొత్తం 18వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15వందల మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు -
నేటి నుంచి అఖిల భారత స్థాయి నాటిక పోటీలు
వీరవాసరం : తెలుగుజాతి గర్వించదగిన జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీ నర్సింహం పంతులు నడయాడిన వీరవాసరంలో చిలకమర్తి పేరుతో ఏర్పాటు చేసిన కళా ప్రాంగణంలో వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి నాటిక పోటీల అష్టమ వార్షికోత్సవానికి సర్వం సన్నద్ధం చేశారు. కళాత్మక, సందేశాత్మక నాటకాలను పోషిస్తూ సీనియర్ జర్నలిస్ట్ గుండా రామకృష్ణ ఎనిమిదేళ్ల నుంచి ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు సినీ దర్శక, నిర్మాతలు, నటులను సన్మానిస్తూ నాటకోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం నుంచి పదో తేదీ వరకు శ్రీ గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తారు. -
భారత్ డిమాండ్ బంగారం!
♦ 2020 నాటికి 950 టన్నులకు అప్ ♦ ప్రపంచ స్వర్ణ మండలి అంచనా ముంబై: భారత్ పసిడి డిమాండ్ 2020 నాటికి 950 టన్నులకు చేరుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థికవృద్ధి, పసిడి మార్కెట్లో పారదర్శకత పసిడికి దేశంలో డిమాండ్‌ను గణనీయంగా పెంచుతాయని డబ్ల్యూజీసీ నివేదిక బుధవారం పేర్కొంది. గత ఏడాదిగా పసిడి డిమాండ్ తగ్గుతూ వస్తున్నా... భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందని వివరించింది. కరెంట్ అకౌంట్ లోటు ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పసిడికి డిమాండ్‌ను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆయా ప్రయత్నాలు ఫలించబోవని వివరించింది. సమాజంలో ఈ మెటల్ పట్ల ఉన్న ఆకర్షణే దీనికి కారణమని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. 2017లో డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉండవచ్చు. అయితే 2020 నాటికి మాత్రం 850 టన్నుల నుంచి 950 టన్నులకు చేరే వీలుంది. ♦ ప్రస్తుతం పసిడి డిమాండ్ తగ్గడానికి డీమోనిటైజేషన్ ప్రభావం కూడా ఉంది. ♦ మేము 2016 మొదటి త్రైమాసికంలో ఒక వినియోగ సర్వే నిర్వహించాం. కరెన్సీలతో పోల్చితే, పసిడి పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉందని 63 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో తెలిపారు. దీర్ఘకాలంలో పసిడే తమ భరోసాకు పటిష్టమైనదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసాలను డీమోనిటైజేషన్ మరింత పెంచింది. ♦ ప్రజలు ఒకసారి డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడినప్పుడు, ఈ ధోరణి పసిడి కొనుగోళ్లు పెరగడానికీ దోహదపడుతుంది. ఆర్థికవృద్ధి, పారదర్శకత అంశాలు ఇక్కడ పసిడి డిమాండ్ పెరగడానికి దోహదపడే అంశాలు. ఫిబ్రవరిలో మూడింతల దిగుమతులు.. కాగా పెళ్లిళ్ల సీజన్ పసిడి డిమాండ్ భారీగా ఉందని ఫిబ్రవరిలో ఆ మెటల్ దిగుమతులు వివరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే 175 శాతం పెరిగి 96.4 మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ గడచిన 11 నెలల కాలంలో విదేశీ కొనుగోళ్లు 32 శాతం పెరుగుదలతో 595.5 టన్నులకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో– ఆభరణాలకు ఏప్రిల్‌లో భారీ డిమాండ్ ఉంటుందని తాము భావిస్తున్నట్లు గీతాంజలి జమ్స్ లిమిటెడ్ చైర్మన్ మెహుల్ చోక్సీ పేర్కొన్నారు. ఈ ఏడాది డిమాండ్ 725 టన్నులు: సిటీగ్రూప్ మరోవైపు, 2017లో పసిడి డిమాండ్ వార్షికంగా పుంజుకుంటుందని ఆర్థిక సేవల సంస్థ– సిటీగ్రూప్ కూడా విశ్లేషించింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను దీనికి కారణంగా వివరించింది. అంతర్జాతీయంగా నెల కనిష్ట స్థాయి... అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు వార్తలు, దీనితో మార్చి 14–15 సమావేశాల సందర్భంగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేటును (ప్రస్తుతం 0.50 శాతం) పెంచుతుందన్న ఊహాగానాలు పసిడికి అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్‌లో నెల కనిష్ట స్థాయికి చేర్చాయి. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా)కు 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండు వారాల్లో పసిడి దాదాపు 40 డాలర్లు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.29 వేల దిగువన ట్రేడవుతోంది. -
గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్
ముంబై: ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ మొబైల్స్ గూగుల్ పిక్సెల్ , గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లపై భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది. కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.29వేల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ.57 వేలు ఉన్న 32 జీబీ వేరియంట్ పై రూ.9 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అలాగే పాత స్మార్ట్ ఫోన్ మార్పిడి ద్వారా రూ.20వేల దాకా డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. ఇలా మొత్తం భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎక్స్ఛేంజి ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. రూ.66 వేల 128జీబీ గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను రూ. 37,000 లకే విక్రయిస్తోంది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం రాయితీ. అయితే గరిష్ట డిస్కౌంట్ రూ.200 గా ఉంది. రిలయన్స్ డిజిటల్, క్రోమాలాంటి రీటైలర్స్ లో కూడా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ అందుబాటులోఉంది. క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వారికి రూ.9 వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్ ఆ మొత్తం జూన్ 5, 2017తరువాత మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. ఎక్స్ఛేంజి ద్వారా కొనుగులు చేసే వారికి ఫోన్‌ను బట్టి రూ.20,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 5.5 ఇంచెస్, 2560x1440 రిజల్యూషన్, 5 అంగుళాల(1920x1080రిజల్యూషన్) డబుల్ స్క్రీన్ వేరియంట్, 32జీబీ, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీతో బ్లాక్ అండ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు గతేడాది అక్టోబరులోనే భారత మార్కెట్లోకి వచ్చాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్, 12.3-మెగాపిక్సెల్ వెనుక కెమెరా , 2,770 ఎమ్ఏహెచ్ , 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్స్ వీటిల్లో ఉన్నాయి. మరిన్ని వివరాలకోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్ ను పరిశీలించగలరు. -
ఈ కార్ల ధరలు 3శాతం పెంపు
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకెఎం) తమ కంపెనీ మోడల్ కార్ల ధరలను 3 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. జపాన్ దిగుమతులతో పాటు ముడిపదార్థాల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఫారిన్ ఎక్సేంజ్ ధరలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఆరు మాసాల కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి , రబ్బరు వంటి ముడిపదార్థ వస్తువుల ధరలు భారీగా పెరిగినట్టు పేర్కొంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ముడి పదార్థాల ధరలతో పాటు జపాన్ యెన్ పెరగడంతో తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. డాలర్ మారకపు విలువలో దేశీయ కరెన్సీ రూ.68 కిందికి దిగజారడం కూడా ధరల పెంపుపై ప్రభావితం చేసినట్టు చెప్పారు. అయితే తమ వినియోగదారులకోసం ఆన్ రోడ్ ఫైనాన్సింగ్తోపాటు, కొన్ని ప్రత్యేక మోడళ్ల వాహనాలపై స్పెషల్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. అలాగే బై నౌ అంట్ పే ఇన్ మార్చి 2017(ఇపుడు కొని, 2017మార్చిలో చెల్లించేలా) ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. -
ఫోన్ల తయారీ హబ్‌గా ఉత్తరప్రదేశ్
దేశంలో తయారవుతున్న మొబైళ్లలో సగం ఇక్కడి నుంచే న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉత్తరప్రదేశ్ (యూపీ) అవతరించింది. భారత్‌లో తయారవుతున్న మొత్తం మొబైల్ హ్యాండ్సెట్లలో యూపీ వాటా సగం వరకు ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నారుు. దీని ప్రకారం.. 2015 సెప్టెంబర్ నుంచి దేశంలో 38 కొత్త మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యారుు. వీటి సామర్థ్యం నెలకు రెండు కోట్ల యూనిట్ల పైమాటే. ఈ రెండు కోట్ల యూనిట్లలో యూపీ వాటానే కోటిగా ఉంది. ఇక యూపీ తర్వాతి స్థానంలో 25 లక్షల యూనిట్ల వాటాతో హరియాణ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా ఏర్పాటైన 38 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో 13 వరకు యూపీలోనే ఉన్నారుు. ఢిల్లీలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు యూనిట్ల స్థాపన జరిగింది. హరియాణ, ఉత్తరఖండ్‌లలో మూడు చొప్పున, మహరాష్ట్ర, తెలంగాణలలో రెండు చొప్పున ఏర్పాటయ్యారుు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున ఉన్నారుు. యూనిట్లు 38 కాదు.. 39: ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) మాత్రం దేశంలో ఈ ఏడాది జూలై నాటికి 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెబుతోంది. దీని ప్రకారం.. యూపీలో 15 యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక ఏపీలో ఐదు ఉన్నారుు. హరియాణలో మూడు యూనిట్లు ఉన్నారుు. ఉత్తరఖండ్, ఢిల్లీలలో నాలుగు చొప్పున, తెలంగాణ, మహరాష్ట్రలలో రెండు చొప్పున యూనిట్లు ఏర్పాటయ్యారుు. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దామన్‌లలో ఒకటి చొప్పున యూనిట్లు ఉన్నారుు. -
ఎస్సారెస్పీకి పెరుగుతున్న నీటిమట్టం
జగిత్యాల అగ్రికల్చర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద పెరుగుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1076.10 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 54 వేల క్యూసెక్కులు ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు శనివారం రాత్రి విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఎయిర్ టెల్ మరో భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4 జీ సేవల ఆవిష్కరణతో ప్రముఖ టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్, ఐడియాతోపాటూ, వోడాఫోన్ డేటా చార్జీలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకనే ప్రయత్నం చేస్తున్న భారతి ఎయిర్ టెల్ తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4 జీ సేవల ధరను భారీగా తగ్గించేసింది. ఈ స్పెషల్ స్కీం కింద ధరలను 80 శాతం తగ్గించింది. కేవలం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికి ఢిల్లీలో ఉన్న ఈ ఆఫర్ ఈనెల (ఆగస్లు) 31 కల్లా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందనీ, భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా), అజయ్ పూరి చెప్పారు అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 12 నెలల వరకు వర్తించనుంది. ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
పతంజలికి పోటీగా నెస్లే తిరిగి పుంజుకుంటుందా?
ముంబై: వేలకోట్ల టర్నోవర్ లక్ష్యంతో భారత మార్కెట్లోకి దూసుకు వస్తున్న పతంజలి పోటీని తట్టుకొనేందుకు నెస్లే ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో కొత్త ప్రధాన ప్రత్యర్థి పతంజలి ఆహార ఉత్పత్తులకు దీటుగా తన నూతన 25 కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తోంది. తద్వారా మ్యాగీ వివాదంతో కుదేలైన తన వ్యాపారాన్ని తిరిగి కొల్లగొట్టాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో 25 కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టెంట్ నూడుల్స్ మార్కెట్లో 55.5శాతం వాటాతో నెస్లే ఉత్పత్తులదే హవా. అయితే రాబోయే రోజుల్లో రూ.500కోట్ల టర్నోవర్ లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో మరింత ముందుకు వెళ్లడానికి ఇదే మాకు సరైన సమయమని నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ పిటిఐకి చెప్పారు.గతేడాది మేము తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నానీ, ఇంకా రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మ్యాగీ నూడుల్స్ లో అనేక రకాల ప్లావర్స్ ను కంపెనీ కొత్త ఉత్పత్తులను కొన్నింటిని విడుదల చేసిన నారాయణ్ ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను నాణ్యంగా వినియోగదారులకు అందించటంతో పాటు ముఖ్యగా పసిపిల్లలు, మహిళలు, పెద్దలు, అర్బన్ మార్కెట్ లోని వినియోగదారులను ఆకట్టుకునేలా తన ఉత్పత్తులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఇందులో 20-25 వరకు ఉత్పత్తులు ఉంటాయన్నారు. వీటిలో మరికొన్నింటిని రాబోయే నాలుగు ఆరువారాల్లో రిలీజ్ చేస్తామన్నారు. దీంతో సింగిల్ లార్జెస్ట్ విండో గా అవతరించనున్నామని ప్రకటించారు. ఇకముందు ఈ కామర్స్ లోకి, అలాగే పానీయాల రంగంలోకి అడుగిడుతున్నట్టు తెలిపారు. కాగా మోతాదుకు మించి లెడ్ ఉన్న కారణం ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియషన్ ఆఫ్ ఇండియా గత ఏడావి మ్యాగీ నూడల్సు ను నిషేధించిన సంగతి తెలిసిందే. మరి కొత్త ఉత్పత్తులతో వస్తున్న నెస్లే కు వినియోగదారులనుంచి పూర్వ ఆదరణ లభిస్తుందా.. అనుకున్నమార్కెట్ షేర్ ను కొల్లగొడుతుందా... వేచి చూడాల్సిందే.. -
భారీగా తగ్గిన నిస్సాన్ మైక్రా కార్ల ధరలు
న్యూఢిల్లీ: జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తమ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గించింది. భారతదేశం లో విక్రయించే మైక్రా ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేరియంట్ కార్ల ధరల్లో యాభైవేలకు పైగా కోత పెడుతున్నట్టు ప్రకటించింది. మైక్రా సీవీటీ ఆటోమేటిక్ ఎక్స్ ఎల్ వేరియంట్ కార్ ను రూ 54, 252 లకు తగ్గించింది. దీంతో గతంలో రూ 6,53,252కు లభ్యమయ్యే ఈ కారు ప్రస్తుతం రూ 5,99,000 కే అందుబాటులో ఉంటుంది. మైక్రా ఆలోమేటిక్ సీవీటీ-ఎక్స్ వీ ని రూ రూ 45.713 మేర తగ్గించింది. దీంతో ఈ వెహికల్ ధర రూ 7,19,213 నుంచి కింది దిగి 6,73,500 దగ్గర లభ్యమవుతోంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలని నిస్సాన్ ప్రకటించింది. దీనిపై నిస్సాన్ మోటార్ వ్యాఖ్యానిస్తూ మెరుగైన స్థానికీకరణ నేపథ్యంలో డెలివరీ పరంగా, మంచి వేగవంతమైన, మరింత సమర్థవంతమైన మార్కెట్ సేవలు అందించకలుగుతున్నామని పేర్కొంది.మైక్రా ఉత్పత్తి ఇపుడు ఇండియాలోనే సాధ్యమవుతోందని ,అందుకే తమ కస్టమర్ల సౌకర్యార్ధం రివైజ్డ్ ధరలను అందుబాటులోకి తెచ్చామని నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఇక ముందు పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్స్ లో మరింత పోటీ ధరలను ప్రవేశపెట్టనున్నామన్నారు. ఏఆర్ఏఐ పరీక్షలు ప్రకారం తమ మైక్రా సీవీటీ 19.34 కెఎంపీల్ మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ మోడల్ మైక్రా ఉత్పత్తి రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో చెన్నై ప్లాంట్‌లో 2010 లో మొదలైన సంగతి తెలిసిందే. -
ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం!
బ్రెసీలియా: అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారిలోనే కొంత మంది జీవితంలో తమ సొంతకాళ్లపై నిలబడలేరు. ప్రపంచాన్ని తల కిందులుగా అర్థం చేసుకుంటారు. జీవితంలో నిరాశా నిస్పృహలకు గురవుతారు. చివరకు పనికి రాకుండా పోతారు. కానీ ఈ తల కిందులుగా ఉన్న మనిషి ప్రపంచాన్ని సరిగ్గానే చూస్తున్నారు. తలను వెనక్కి విరిచి వేలాడేసినట్లుగా ఉన్న 40 ఏళ్ల క్లాడియో వియెర్రా డీ అలవీరకు చేతులు, కాళ్లు కూడా సరిగ్గాలేక అష్టావక్రగా కనిపిస్తారు. కానీ ఏనాడూ నిరాశా నిస్పృహలకు గురికాలేదు. వ్యక్తిగత పనులకు గానీ, సామాజిక జీవనానికి గానీ ఎవరి మీదా ఆధారపడడం లేదు. నోట్లో పెన్ను పెట్టుకొని రాస్తారు. పెదవులతోనే ఫోన్ పట్టుకోగలరు, మాట్లాడగలరు. నోటితోనే మౌజ్ పట్టుకొని కంప్యూటర్ ఆపరేట్ చేయగలరు. ఇంట్లో తన అన్ని పనులు తానే చేసుకోగలరు. చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చిన అలవీర ఇప్పుడు బ్రెజిల్‌లోని ఓ యూనివర్శిటీలో అకౌంటెంట్ ఉద్యోగానికి క్వాలిఫై అయ్యారు. అంతర్జాతీయ వేదికలపై అకౌంటెన్సీ, ఇతర అంశాలపై అలవోకగా మాట్లాడుతూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. జీవితంలో తన అనుభవాలను తాజాగా ఓ పుస్తకంగా రాసి అరుదైన వ్యక్తిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కారు. బ్రెజిల్‌లోని మాంటే సాంటేలో పుట్టిన అలవీరను పురిట్లోనే చంపేయమని డాక్టర్లే ఆయన తల్లి మారియా జోస్ మార్టిన్‌కు సలహా ఇచ్చారు. ఏ అవయం సరిగ్గా లేకుండా అష్టావక్రగా ఉన్న అలవీరను తిండి పెట్టకుండా చంపేయమంటూ ఇరుగు పొరుగువారు కూడా పోరు పెట్టారు. అయినా వారెవరి మాటలను పట్టించుకోలేదు మారియా. పురిటి బిడ్డను అల్లారు ముద్దుగానే పెంచుతూ వచ్చింది. ఎనిమిదేళ్ల వరకు తల్లి మీద ఆధారపడి బతికిన అలవీర ఆ తర్వాత తన పనులు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత బడికెళ్లి చదువుకుంటానని మొండి కేశారు. తోటి పిల్లలు ఎలా చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదువుకున్నారు. తన కొడుకు తన పనులు తాను చేసుకునేందుకు వీలు ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌లన్నీ కిందకు ఏర్పాటు చేశానని, టీవీ, రేడియోలు కూడా అందుబాటులో ఉంచానని తల్లి మారియా తెలిపారు. సరిగ్గా పనిచేయని కాళ్లకు గాయాలు కాకుండా ఇంటి ఫ్లోరింగ్‌ను కూడా మర్పించానని ఆమె చెప్పారు. ఇలా ఎదుగుతూ వచ్చిన తాను ఏనాడు నిరాశా నిస్పహలకు గురికాలేదని, వీధిలోకి వెళ్లేందుకు కూడా ఏనాడూ సిగ్గు పడలేదని, జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఎప్పుడు సాధారణ వ్యక్తికి తనకు తేడా ఉందని అనుకోలేదని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి లెక్చర్లు ఇవ్వాల్సిందిగా తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, జీవితం తనకు ఎందో అనందంగా ఉందని అలవీర తన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు. సావో పావులోని ఆర్ట్ మ్యూజియంలో ఆయన రాసిన ‘ఎల్ ముండో ఎస్టా ఏ కాంట్రమానో (ది వరల్డ్ ఈజ్ రాంగ్ వే అరౌండ్)’ను ఇటీవల ఆవిష్కరించారు. కనీసం వీల్ చైర్లో కూడా కూర్చోలేని అలవీర ‘ఆర్దోగ్రిపోసిస్’ అనే అరుదైన జబ్బు కారణంగా అష్టావక్రగా జన్మించారు. ఈ జబ్బు కారణంగా అన్ని జాయింట్ల వద్ద శరీరం ముడుచుకుపోయి కుంచించుకుపోతుంది. పిల్లలు ఇలా పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. తల్లి గర్భాశయం చాలా చిన్నగా ఉండడం లేదా కండరాలు, నరాల సమస్యలు ఉన్న కారణంగా ఇలా జన్మిస్తారు. చిన్నప్పుడు ఫిజియో థెరపీ, సర్జరీల వల్ల వారిలో కొందరు కోలుకుంటారు. అలా కోలుకోని అలవీర అన్నీ అవయవాలున్న మనబోటి వారికి మేలుకొల్పు అవుతున్నారు. -
రాబడికి కేటాయింపే కీలకం..
పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు చాలా సందర్భాల్లో మార్కెట్ ట్రెండ్స్‌నే నమ్ముకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా కొన్ని సాధనాల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, ఇది అంత సరైన వ్యూహం కాదు. ఎందుకంటే.. ఏ సాధనంలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం షేర్లు, ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు ఎఫ్డీలు, బంగారం..వెండి వంటి కమోడిటీలు మొదలైన అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ ఆల్‌టైం గరిష్ట స్థాయుల్లో తిరుగాడుతుంటే.. 10 ఏళ్ల బాండ్లపై రాబడులు మాత్రం 15 నెలల కనిష్ట స్థాయుల్లో కదలాడుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలా లేక బాండ్లవైపు మొగ్గు చూపాలా అన్న మీమాంస తలెత్తుతుంది. సాధారణంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఇది అన్ని వేళలా సరికాదు. ఉదాహరణకు 2007లో మార్కెట్లు గరిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు.. ఇన్వెస్టర్లు భారీ ఎత్తున స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. కానీ 2008 నాటి ఆర్థిక సంక్షోభ కాలంలో అందులో చాలా మటుకు పోగొట్టుకున్నారు. 2013లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతుండటమే ఇందుకు కారణం. రాజకీయపరమైనవి కావొచ్చు..ప్రకృతి వైపరీత్యాలు కావొచ్చు ఏదైనా సరే ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారినా.. వివిధ సాధనాల పనితీరుపై ప్రభావం పడుతుంటుంది. మార్పు నిర్మాణాత్మకమైనదైతే.. సదరు సాధనం విలువ పెరుగుతుంది. అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం తగ్గిపోతుంది. ఇందువల్లే షేర్లు, బంగారం, డెట్ సాధనాలు ఒక్కో సమయంలో మాత్రమే పెరుగుతుంటాయి. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే.. గతకాలపు పనితీరును చూసి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేకానేక సాధనాల్లో దేనికెంత కేటాయించవచ్చన్నది.. రిస్కు సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాలు, జీవితంలో వివిధ దశల్లో నిర్దేశించుకునే లక్ష్యాలు మొదలైన వాటిని బట్టి ఉంటుంది. ఒకే దాంట్లో కాకుండా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కును కొంత తగ్గించుకునే వీలవుతుంది. ఒక్కసారి సాధనాలను, కేటాయింపులను నిర్ణయించుకున్న తర్వాత పదే పదే మార్పులు, చేర్పులు చేయడం కాకుండా.. పెట్టుబడి పెడుతూ ముందుకు సాగడం మంచిది. లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్‌ను బట్టి కాకుండా సరైన కేటాయింపు వ్యూహాలను క్రమం తప్పకుండా అనుసరించినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలను సునాయాసంగా సాధించగలమని ఇన్వెస్టర్లు గుర్తించాలి. మార్కెట్లో స్వల్పకాలికంగా చోటు చేసుకునే మార్పులను బట్టి .. పోర్ట్‌ఫోలియోనూ మార్చేస్తూ పోతే ప్రయోజనం ఉండదు. ఇలా ఇన్వెస్టర్లు అనుసరించతగిన వ్యూహాల్లో కొన్ని ఇవి.. దీర్ఘకాలిక ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టికోణంతోనే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. రిస్కు సామర్ధ్యాలను బట్టి సరైన సాధనంలో ..సరైన స్థాయిలో కేటాయింపుల ప్రణాళికకు కట్టుబడి ముందుకు సాగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ తరహా దీర్ఘకాలిక ప్రణాళికలు 5-20 సంవత్సరాల దాకా లక్ష్యాలకు సంబంధించినవై ఉంటాయి. ఇలాంటి వాటివల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. సెంటిమెంటు పెట్టుకోవద్దు .. ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనాన్నైనా ఎంచుకున్నప్పడు దానిపై భవిష్యత్‌లో ఎంత మేర రాబడులు రాగలవన్నది నిష్పాక్షికంగా, సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. అంతే తప్ప భావావేశాలకు ఇక్కడ తావుండకూడదు. సదరు సాధనం గతంలో భారీ రాబడులు ఇచ్చింది కదా అని.. భవిష్యత్‌లోనూ అలాగే ఉంటుందని అనుకోవద్దు. అధ్యయనం చేయండి.. వివిధ కారణాల వల్ల ఒక్కో సాధనం ఒక్కోసారి పెరుగుతుంది..ఒక్కోసారి తగ్గుతుంటుంది. కనుక.. వ్యక్తిగత స్థాయిలో మార్కెట్ స్థితిగతులను ఇన్వెస్టరు అంచనా వేయడం కష్టం. కనుక ఇందుకోసం మీ వంతుగా పరిశోధన చేయండి. మార్కెట్ ధోరణిని బట్టి నిర్ణయాలు తీసేసుకోకుండా.. కొనుగోలు చేసేటప్పుడు ఓపికగా వేచి చూడండి. మార్కెట్లు పెరిగినా, తగ్గినా.. స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా సరైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుంది. పోర్ట్‌ఫోలియో మదింపు.. మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలంటే.. మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు, ఎంతకాలంలోగా సాధించాలనుకుంటున్నదీ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వాటి ఆధారంగానే ఆర్థిక విజయాలు సాధ్యమవుతాయని గుర్తెరగాలి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలు, వాటి సాధనకు పట్టే సమయం, మీరు తీసుకోగలిగే రిస్కు అంశాల ఆధారంగా ఏ సాధనానికి ఎంత మేర కేటాయించవచ్చన్నది ఒక అంచనాకు రండి. మీ లక్ష్యాలు, రిస్కు సామర్ధ్యాలు మారుతున్న కొద్దీ తదనుగుణంగా మధ్యమధ్యలో కేటాయింపులను సవరించుకుంటూ ముందుకు సాగాలి. కనీసం 12 నెలలకోసారైనా .. పోర్ట్‌ఫోలియోను మదింపు చేసుకోవాలి. చివరగా చెప్పేదేమిటంటే.. మంచి రాబడులను సాధించాలంటే పోర్ట్‌ఫోలియోలో కేటాయింపులే చాలా ముఖ్యం. మీ రిస్కు సామర్ధ్యాన్ని బట్టి సరైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. దాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను పెద్దగా రిస్కు లేకుండా సాధించవచ్చు. పాటించాల్సిన సూత్రాలు.. * మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నంత కాలం వ్యూహాలను క్రమం తప్పకుండా అమలు చేయండి. * పోర్ట్‌ఫోలియో నుంచి ఒక మోస్తరు స్థాయిలో రాబడులను ఆశించండి. దీనివల్ల మెరుగైన ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుంది. * పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆయా సాధనాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి * పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మదింపు చేసు కుంటూ.. తగిన మార్పులు, చేర్పులూ చేస్తుండండి. -
కొనే ముందే ఆలోచించాలి..
మార్కెట్లోకి వచ్చే కొంగొత్త గ్యాడ్జెట్స్.. లగ్జరీ ఉత్పత్తులు మనసుకు నచ్చితే ఒకోసారి ఖరీదెంతయినా కొనేస్తుంటాము. కొత్తల్లో బాగానే ఉంటుంది. కొన్నాళ్లు గడిచాక.. వాటిని ఎప్పుడో గానీఉపయోగించకుండా ఓ మూలన పడి మూలుగుతున్నప్పుడో లేదా జాగ్రత్తపెట్టడానికి తగినంత జాగా లేనప్పుడోఅనిపిస్తుంది.. అనవసరంగా కొన్నామేమోనని. ఇలా అత్యుత్సాహంతో కొనేసి.. ఆ తర్వాత తీరిగ్గా బాధపడకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అలాంటివే ఇవి. ఏదైనా సరే తక్కువకి లభిస్తోందంటే.. అవసరమున్నా, లేకున్నా కొనేయాలనిపించడం సహజమే. నిజానికి మనకు ఆదా అయ్యేది తక్కువే అయినా కూడా సేల్‌లో కొనుక్కోకపోతే ప్రయోజనాలు కోల్పోతున్నామేమో అని బాధగా ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడే సంయమనం పాటించాలి. కొనేసేయడానికి ముందు సదరు వస్తువు అవసరమా, తీసుకుంటే ఎంత వరకూ ఉపయోగపడుతుంది అన్నది కాస్త ఆలోచించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఒకవేళ ఆఫర్ లేకపోయినా దాన్ని కొని ఉండే వారమా అన్నది ఒకసారి బేరీజు వేసుకుంటే అనవసర కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. రేప్పొద్దున్న కోసం కొనొద్దు.. భవిష్యత్ గురించి ప్రణాళిక వేసుకోవడం మంచిదే. అయితే, ఎప్పుడో ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో సంవత్సరాల తరబడి ముందుగా కొని పెట్టుకోవడం మాత్రం అంత సరికాదు. పెపైచ్చు వాటిని ఏళ్ల తరబడి దాచిపెట్టడం ఒక పెద్ద పని కాగా.. నిజంగా వాడే సమయం వచ్చేటప్పటికి అవి పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. అవసరాన్ని బట్టే షాపింగ్.. నిత్యావసరాల కొనుగోలుకు బైల్దేరే ముందు ఇంట్లో ఏవేవి ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూసుకోవడం ఉత్తమం. లేకపోతే..షాపుకి వెళ్లిన తర్వాత తడుముకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాటినే మళ్లీ కొనే అవకాశమూ ఉంది. ఫలితంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుంది. అలాగే టేబుల్ క్లాత్ లాంటివి కొనడానికి వెడుతున్న పక్షంలో ముందుగా ఎంత సైజువి తీసుకోవాలో ఇంటి దగ్గరే ఆయా వస్తువుల కొలతలు తీసుకెళ్లాలి. అలా చేయకుండా ఏదో ఒకటి కొని తెచ్చుకుని, తీరా అది సరిపోకపోతే తలపట్టుకోవాల్సి వస్తుంది. కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే సమయమూ, డబ్బూ ఆదా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్‌తో జాగ్రత్త.. బ్రెడ్ మేకర్లు, ఐస్‌క్రీమ్ మేకర్లు, జ్యూసర్లులాంటి ఫ్యాన్సీ ఉత్పత్తులతో పని చాలా సులువవుతుంది కానీ.. వీటిని ఎప్పుడో తప్ప ఎక్కువగా ఉపయోగించము. మొదట్లో ముచ్చట కొద్దీ బాగానే ఉపయోగించినా .. ఆ తర్వాత మాత్రం చాలా రోజుల పాటు ఇవి అటకెక్కి దుమ్ముకొట్టుకుంటూ ఉంటాయి. ఇంటి దగ్గరే ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు చేసుకోవడం అప్పుడప్పుడు సరదాగా అనిపించినా.. అంత కష్టపడనక్కర్లేకుండా సులభంగా షాపు నుంచి కొనుక్కొచ్చుకోవడానికే ఓటేస్తుంటాం. కనుక, ఇలాంటివి కొనుక్కోవడానికి ముందుగా ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాటిని కొద్ది రోజుల కోసం తీసుకుని వాడి చూడండి. అది మీకు నచ్చి, మీ ఇంట్లో తగినంత జాగా కేటాయించగలిగిన పక్షంలో కొనుక్కోవడంపై నిర్ణయం తీసుకోండి. అప్‌గ్రేడ్.. ఇది అన్ని కొనుగోళ్లకూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు. ఏదైనా వస్తువును పూర్తిగా ఉపయోగించిన తర్వాతే దాని అప్‌గ్రేడ్ గురించి ఆలోచించండి. చేతిలో ఉన్న దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకున్న తర్వాతే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొనడంపై దృష్టి పెట్టొచ్చు. అప్‌గ్రేడ్ కోసం ఒకటి తీసుకుంటున్న పక్షంలో దాని పాత వెర్షన్‌ని ఏదో రకంగా సాగనంపడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు పాత టీవీలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని దాచడానికి జాగా కోసం వెతుక్కోనక్కర్లేదు. ఇక, చివరిగా డిస్కౌంటు ఆఫర్లిస్తున్నారని కొనేయడమూ, కొంగొత్త ఉత్పత్తులతో ప్రయోగాలు చేయడమూ అప్పుడప్పుడైతే ఫర్వాలేదు కానీ.. ఇదే అలవాటుగా మారితే మాత్రం కష్టమేనని గుర్తుంచుకోవాలి. అవసరం లేనివి ఎడాపెడా కొనేస్తుంటే డబ్బు వృథా కావడంతో పాటు వాటిని సరిగ్గా భద్రపర్చలేకపోతే ఇల్లంతా గందరగోళంగా మారే అవకాశమూ ఉంది. -
స్టాక్ మార్కెట్లకు ఇన్ఫోసిస్ దెబ్బ