ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం! | claudio vieira de oliveira an up side down head man inspiring to many people | Sakshi
Sakshi News home page

ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం!

Published Tue, May 17 2016 11:41 PM | Last Updated on Sat, Aug 25 2018 5:22 PM

ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం! - Sakshi

ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం!

బ్రెసీలియా: అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారిలోనే కొంత మంది జీవితంలో తమ సొంతకాళ్లపై నిలబడలేరు. ప్రపంచాన్ని తల కిందులుగా అర్థం చేసుకుంటారు. జీవితంలో నిరాశా నిస్పృహలకు గురవుతారు. చివరకు పనికి రాకుండా పోతారు. కానీ ఈ తల కిందులుగా ఉన్న మనిషి ప్రపంచాన్ని సరిగ్గానే చూస్తున్నారు. తలను వెనక్కి విరిచి వేలాడేసినట్లుగా ఉన్న 40 ఏళ్ల క్లాడియో వియెర్రా డీ అలవీరకు చేతులు, కాళ్లు కూడా సరిగ్గాలేక అష్టావక్రగా కనిపిస్తారు. కానీ ఏనాడూ నిరాశా నిస్పృహలకు గురికాలేదు. వ్యక్తిగత పనులకు గానీ, సామాజిక జీవనానికి గానీ ఎవరి మీదా ఆధారపడడం లేదు.

నోట్లో పెన్ను పెట్టుకొని రాస్తారు. పెదవులతోనే ఫోన్‌ పట్టుకోగలరు, మాట్లాడగలరు. నోటితోనే మౌజ్‌ పట్టుకొని కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయగలరు. ఇంట్లో తన అన్ని పనులు తానే చేసుకోగలరు. చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చిన అలవీర ఇప్పుడు బ్రెజిల్‌లోని ఓ యూనివర్శిటీలో అకౌంటెంట్‌ ఉద్యోగానికి క్వాలిఫై అయ్యారు. అంతర్జాతీయ వేదికలపై అకౌంటెన్సీ, ఇతర అంశాలపై అలవోకగా మాట్లాడుతూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. జీవితంలో తన అనుభవాలను తాజాగా ఓ పుస్తకంగా రాసి అరుదైన వ్యక్తిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కారు.

బ్రెజిల్‌లోని మాంటే సాంటేలో పుట్టిన అలవీరను పురిట్లోనే చంపేయమని డాక్టర్లే ఆయన తల్లి మారియా జోస్‌ మార్టిన్‌కు సలహా ఇచ్చారు. ఏ అవయం సరిగ్గా లేకుండా అష్టావక్రగా ఉన్న అలవీరను తిండి పెట్టకుండా చంపేయమంటూ  ఇరుగు పొరుగువారు కూడా పోరు పెట్టారు. అయినా వారెవరి మాటలను పట్టించుకోలేదు మారియా. పురిటి బిడ్డను అల్లారు ముద్దుగానే పెంచుతూ వచ్చింది. ఎనిమిదేళ్ల వరకు తల్లి మీద ఆధారపడి బతికిన అలవీర ఆ తర్వాత తన పనులు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత బడికెళ్లి చదువుకుంటానని మొండి కేశారు. తోటి పిల్లలు ఎలా చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదువుకున్నారు. తన కొడుకు తన పనులు తాను చేసుకునేందుకు వీలు ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ స్విచ్‌లన్నీ కిందకు ఏర్పాటు చేశానని, టీవీ, రేడియోలు కూడా అందుబాటులో ఉంచానని తల్లి మారియా తెలిపారు. సరిగ్గా పనిచేయని కాళ్లకు గాయాలు కాకుండా ఇంటి ఫ్లోరింగ్‌ను కూడా మర్పించానని ఆమె చెప్పారు.

ఇలా ఎదుగుతూ వచ్చిన తాను ఏనాడు నిరాశా నిస్పహలకు గురికాలేదని, వీధిలోకి వెళ్లేందుకు కూడా ఏనాడూ సిగ్గు పడలేదని, జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఎప్పుడు సాధారణ వ్యక్తికి తనకు తేడా ఉందని అనుకోలేదని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి లెక్చర్లు ఇవ్వాల్సిందిగా తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, జీవితం తనకు ఎందో అనందంగా ఉందని అలవీర తన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు.

సావో పావులోని ఆర్ట్‌ మ్యూజియంలో ఆయన రాసిన ‘ఎల్‌ ముండో ఎస్టా ఏ కాంట్రమానో (ది వరల్డ్‌ ఈజ్‌ రాంగ్‌ వే అరౌండ్‌)’ను ఇటీవల ఆవిష్కరించారు. కనీసం వీల్‌ చైర్లో కూడా కూర్చోలేని అలవీర ‘ఆర్దోగ్రిపోసిస్‌’ అనే అరుదైన జబ్బు కారణంగా అష్టావక్రగా జన్మించారు. ఈ జబ్బు కారణంగా అన్ని జాయింట్ల వద్ద శరీరం ముడుచుకుపోయి కుంచించుకుపోతుంది. పిల్లలు ఇలా పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. తల్లి గర్భాశయం చాలా చిన్నగా ఉండడం లేదా కండరాలు, నరాల సమస్యలు ఉన్న కారణంగా ఇలా జన్మిస్తారు. చిన్నప్పుడు ఫిజియో థెరపీ, సర్జరీల వల్ల వారిలో కొందరు కోలుకుంటారు. అలా కోలుకోని అలవీర అన్నీ అవయవాలున్న మనబోటి వారికి మేలుకొల్పు అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement