మళ్లీ మార్కెట్ల పతనానికి చాన్స్‌! | Market may correct in near future: Experts | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్కెట్ల పతనానికి చాన్స్‌!

Published Tue, Jun 30 2020 2:59 PM | Last Updated on Tue, Jun 30 2020 3:04 PM

Market may correct in near future: Experts - Sakshi

ప్రస్తుత స్థాయిల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ ఏడాది ద్వితీయార్థంలో పతనమయ్యే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు కొంతమంది భావిస్తున్నారు. అయితే మార్చిలో నమోదైన కనిష్ట స్థాయి 7,500కు నిఫ్టీ చేరకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఇటీవల కోవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు దిగితే మార్కెట్లు మరోసారి మార్చి కనిష్టాలను పరీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ద్వితీయార్ధంలో మార్కెట్ల గమనం ఎలా ఉంటుందన్న అంశంపై కొంతమంది మార్కెట్‌ నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

లాక్‌డవున్‌లు
దేశీయంగా కరోనా వైరస్‌ కేసులు ఉధృతమవుతుండటంతో ఇప్పటికే చెన్నై, గువాహటి తదితర ప్రాంతాలలో లాక్‌డవున్‌ ప్రకటించారు. ఈ బాటలో ముంబై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలలోనూ మరోసారి లాక్‌డవున్‌ ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొద్ది వారాల్లోనే దేశీయంగా కోవిడ్‌-19 కేసులు భారీగా పెరగడంతో అమెరికా, బ్రెజిల్‌, రష్యా తదుపరి స్థానానికి దేశం చేరుకుంది. నిజానికి మార్చి నుంచి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న అంచనాలతో మార్కెట్లు 35 శాతం ఎగశాయి. ఎఫ్‌పీఐలు సైతం పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి లాక్‌డవున్‌ విధింపు వార్తలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చు. 

నిపుణులు ఇలా..
అమెరికా, చైనా వంటి దేశాలలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కేసులు తలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో దిద్దుబాటుకు లోనయ్యే వీలున్నట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సీఐవో నవీన్‌ కులకర్ణి అభిప్రాయపడుతున్నారు. అయితే నిఫ్టీ మార్చి కనిష్టాలకు చేరకపోవచ్చని చెబుతున్నారు. నిఫ్టీ 7500 పాయింట్ల వద్ద స్వల్పకాలిక బాటమ్‌ను చవిచూసిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ నిపుణులు హేమంగ్‌ జానీ పేర్కొంటున్నారు. ఆటుపోట్లను తెలిపే ఇండియా విక్స్‌ 11 ఏళ్ల గరిష్టం 87ను మార్చిలో తాకిన పిదప 30కు తగ్గడం ద్వారా ఈ అంశం ప్రతిఫలిస్తున్నట్లు వివరించారు. గ్లోబల్‌ ఎకానమీతోపాటు, ఫైనాన్షియల్‌ మార్కెట్లకు కోవిడ్‌-19 తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలియజేశారు. ముందుముందు సవాళ్లు ఎదురుకావచ్చని కంపెనీల ఫలితాల సందర్భంగా యాజమాన్యాలు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు మార్కెట్లకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 

రియల్టీ వీక్‌
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిద్రవ్యోల్బణం కారణంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ బలహీనపడిందని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు చొక్కలింగం పేర్కొన్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోగా.. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్గాల ద్వారా అతితక్కువ రిటర్నులే వస్తున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు ఆకర్షణీయంకాకపోవడంతో లిక్విడిటీ అంతా స్టాక్స్‌లోకే ప్రవహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు 15-20 శాతం పతనమైతే పెట్టుబడులు ఊపందుకునే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే ఎఫ్‌పీఐలు తమ హోల్డింగ్స్‌లో 5 శాతం వాటాను విక్రయించినప్పటికీ నిఫ్టీ మార్చి కనిష్టానికి సులభంగా చేరుతుందని అంచనా వేశారు. లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభంలో ఎఫ్‌ఐఐలు 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో సెన్సెక్స్‌ 60 శాతం పతనమైన విషయాన్ని ప్రస్తావించారు. ఈ బాటలో 8 బిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ విక్రయిస్తే.. ఇటీవల మార్కెట్లు 38 శాతం పతనమైనట్లు వివరించారు. ఇక సమీప భవిష్యత్‌లో మార్కెట్లు కరెక‌్షన్‌కు లోనయ్యే వీలున్నట్లు శామ్‌కో సెక్యూరిటీస్‌ నిపుణులు ఉమేష్‌ షా చెప్పారు. అయితే మార్చి కనిష్టాలను తాకే అంశంపై అంచనాల్లేవని తెలియజేశారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ లేదా చైనాతో వివాదాలు లేదా కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఆలస్యంకావడం వంటి అంశాలు మార్కెట్లలో అమ్మకాలకు దారిచూపవచ్చని విశ్లేషించారు.

మార్చి కనిష్టాలకు నో
సమీప భవిష్యత్‌లో మార్కెట్లు మార్చి కనిష్టాలకు పతనంకాకపోవచ్చని.. బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠీ షేర్స్‌ నిపుణులు సిద్ధార్ధ్‌ సెడానీ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నిపుణులు దీపక్‌ జసానీ, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషకులు వినోద్‌ నాయిర్‌ తదితరులు అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement