ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.
వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు.
విదేశీ అంశాలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.
ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.
ఆర్థిక గణాంకాలు
నేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది.
గత వారమిలా
శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.
దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్‌కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్‌ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్‌యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment