market analysts
-
పసిడి పరుగు ఎందాక?
పసిడి అందకుండా పరుగెడుతోంది. జీవితకాల గరిష్ట ధరల్లో ట్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలల్లో సుమారు 20 శాతం బంగారం విలువ ప్రియంగా మారింది. కరోనా సంక్షోభం నుంచి చూస్తే 70 శాతం ఎగసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 దాటింది. భారతీయులకు బంగారం అంటే సహజంగానే ఎంతో మక్కువ. పేద వారి నుంచి, ధనికుల వరకు ఎవరి స్థాయిలో వారు బంగారం కలిగి ఉంటారు. ధర ఇలా పెరిగిపోతుంటే, ఇక తాము కొనలేని స్థాయికి బంగారం చేరుకుంటుందా? అన్న గుబులు కొందరిలో మొదలైంది. ఈ తరుణంలో అసలు పసిడెందుకు ఇలా పరుగులు తీస్తోంది? ఇది ఎంత వరకు? దీనిపై మార్కెట్ అనలిస్టుల విశ్లేషణ చూద్దాం. ఆర్బీఐ దూకుడు గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి వీలుగా, రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ 6 టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. అంతకుముందు జనవరిలో 8.7 టన్నులను కొనుగోలు చేసింది. 2022 జూలై తర్వాత ఒక నెలలో గరిష్ట కొనుగోళ్లు ఇవి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లు అన్నీ కలసి ఫిబ్రవరిలో 19 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అత్యధికంగా చైనా 12 టన్నులు కొంది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా 10 టన్నులు, కజకిస్థాన్ 6.2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంక్‌లు 64 టన్నుల బంగారం కొన్నాయి. 2023 మొదటి 2 నెలలతో పోలిస్తే 43% తక్కువ కాగా, 2022 మొదటి 2 నెలలతో పోల్చితే 4 రెట్లు అధికం. ఇక ముందూ సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి డిమాండ్ కొనసాగొచ్చన్నది అనలిస్టుల అంచనా. అదే సమయంలో మార్కెట్ అంచనా వేసినట్టు ఫెడ్ రేట్ల కోత జూన్ లేదా సమీప కాలంలో లేకపోతే, అది బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ వేయవచ్చని టీడీ సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీస్ హెడ్ వార్ట్ మెలెక్ పేర్కొన్నారు. కాకపోతే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పసిడిలో రాబడికే అవకాశాలు ఉంటాయన్నది అనలిస్టుల అభిప్రాయం. మన దగ్గర కొంచెం ఎక్కువే దేశీయ మార్కెట్ అనే కాదు, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్ బంగారం (31.10 గ్రాములకు సమానం) ధర 2,400 డాలర్లకు చేరింది. రూపాయల్లోకి మార్చి చూస్తే దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.64,370గానే ఉండాలి. కానీ, ఇంతకంటే అధికంగా మన మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. బంగారం దిగుమతి చేసుకునే లోహం. కనుక డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి. ఎందుకంటే..? బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేస్తుండడం వెనుక పలు కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే చలిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ జూన్ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ‘‘పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ బలంగానే ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీని సులభతరం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత క్షీణించడం కూడా కారణమే. బంగారం, వెండి ధరలు ఇటీవల ర్యాలీకి చైనా దూకుడైన కొనుగోళ్లు సైతం మద్దతునిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా ఒక కారణమే. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోంది’’అని ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్దేవ తెలిపారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణమైనందన్నది కొందరు విశ్లేషుకుల అంచనాగా ఉంది. ఎంత వరకు..? మొత్తం మీద బంగారం ధరల ధోరణి బుల్లిష్‌గా ఉన్నట్టు, మధ్యలో ధరలు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చని సుగంధ సచ్దేవ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే దానిపై దృష్టి సారించాలన్నారు. ‘‘బంగారం ధర సాంకేతికంగా రూ.69,600ను ఛేదించి అంతకుపైన ముగిసింది. ఇది పసిడి ర్యాలీకి మద్దతునిచ్చేది. ఇక్కడి నుంచి పసిడి ధర తగ్గితే మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అవకాశంగా చూడొచ్చు’’అని ప్రభుదాస్ లీలాదర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కూత్తుపలక్కల్ సూచించారు. సురక్షిత సాధనం ఆర్థిక అనిశి్చతుల్లో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే అధికమవుతుంది. ఈక్విటీలు, డాలర్ తదితర సాధనాల నుంచి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే ఇతర సాధనాల కంటే బంగారంలో అస్థిరతలు తక్కువ. అందుకే ఆ సమయంలో ఇన్వెస్టర్లు పసిడిని నమ్ముకుంటారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా బంగారం ర్యాలీ చేస్తుండడం సహజంగానే కనిపిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. పైగా ముడి చమురు ధరలు మరోసారి పెరగడం మొదలైంది. ఇది కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం సమయలో పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు హెడ్జింగ్‌గా బంగారం మించిన సాధనం లేదు. చారిత్రకంగా చూస్తే ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలు ర్యాలీ చేసినప్పుడు బంగారం ధరలు తగ్గేవి. కానీ, ఈ విడత ఈక్విటీలతో పాటు బంగారం కూడా ర్యాలీ చేయడానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, డాలర్ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్ బ్యాంకుల్లో నమ్మకం సడలడమే ఒక కారణంగా కనిపిస్తోంది. యూఎస్ ద్రవ్యలోటు 6.2 శాతానికి, రుణం జీడీపీలో 120 శాతానికి చేరడం కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణాల్లో ఒకటి. అమెరికా జీడీపీలో రుణ వడ్డీ వ్యయాలు 2015–2020 కాలంలో సగటున 1.4 శాతంగా ఉంటే, ఇప్పుడు 2.4 శాతానికి చేరాయి. ఈ వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు, గడువు తీరిన రుణాలను తక్కువ రేటుపై రీఫైనాన్స్ చేసుకునేందుకు వీలుగా ఫెడ్ నుంచి రేట్ల కోత రూపంలో సాయాన్ని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని విస్మరించరాదు. రేట్ల కోత ఫిబ్రవరి మధ్య నుంచి ర్యాలీ ఫలితంగా బంగారం సాంకేతికంగా రూ.70,000 మార్క్ (10 గ్రాములు), ఔన్స్ 2,300 డాలర్లను దాటింది. రేట్ల కోతపై యూఎస్ ఫెడ్ మిశ్రమ సంకేతాలే ఇచి్చనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు జూన్‌లోనే రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయిఅని సుగంధ సచ్దేవ తెలిపారు. ముఖ్యంగా ఇటీవలే వెలువడిన అమెరికా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా అంచనాలకు మించి ఉందని (తగ్గిన నిరుద్యోగం), ఇదే బంగారం, వెండి ధరల తాజా ట్రిగ్గర్‌కు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా వెల్లడించారు. అవసరమా–పెట్టుబడా? పెరిగే ధరలు చూసి పసిడి వెంట పరుగులు తీయడం కాకుండా, ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలి. రాబడి కోసం అయితే అది పెట్టుబడి అవుతుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి చేసే కేటాయింపులు 5–10% మించకూడదన్నది నిపుణుల సూచన. పైగా పెట్టుబడులు భౌతిక బంగారంపై ఉండకూడదు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసుకుంటే, పెరిగే విలువకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. ఈటీఎఫ్‌లను రోజువారీ స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆభరణాల కోసం అయితే తమకు కావాల్సినంత మేర బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వెండి సంగతి? చారిత్రకంగా బంగారంతోపాటే వెండి పయనం కూడా సాగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో బంగారం స్థాయిలో వెండి ధరల పెరుగుదల లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ 8 నాటికి వెండి ధరలు 11 శాతం ర్యాలీ చేశాయి. పెట్టుబడుల కోణంలోనే కాకుండా, పారిశ్రామికంగానూ వెండి వినియోగం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ తదితర పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్, ఎల్రక్టానిక్స్‌లో వెండి వినియోగిస్తుంటారు. చైనా మార్కెట్ కోలుకుంటుందన్న అంచనాలు వెండి ర్యాలీకి జోష్‌నిస్తున్నాయి. వెండి విషయంలో తాము బలమైన సానుకూలతతో ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. కిలో వెండి తగ్గితే రూ.75,000 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.92,000–1,00,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఇటీవలే నోట్‌ను విడుదల చేసింది. కొనేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్‌లతోపాటు, వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో ఇనిస్టిట్యూషన్లు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్) బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వ్యక్తులు, ప్రైవేటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌లు అంతర్జాతీయంగా కరెన్సీని పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తున్నాయి. ఇది వాటి కరెన్సీ విలువలకు ప్రతికూలం. పైగా భౌగోళిక ఉద్రిక్తతల ఫలితంగా నాన్ డాలర్ వాణిజ్య చెల్లింపుల వైపు కొన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది డాలర్‌కు ప్రతికూలం. ఈ పరిస్థితుల్లో విదేశీ మారకం నిల్వల్లో ఎక్కువ భాగం కరెన్సీ రూపంలోనే కలిగి ఉండడం అంత శ్రేయస్కరం కాదని ఆర్బీఐ సహా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు భావిస్తున్నాయి. కరెన్సీలతో పోలిస్తే బంగారమే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుండడం గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నారు. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఫలితంగా దేశీయంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. -
బడ్జెట్ 2024.. ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?
మార్కెట్ ఆల్‌టైమ్‌హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ సెషన్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్‌మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ ప్రభావం కీలక మార్కెట్ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్ అగర్వాల్‌తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. -
నష్టాల్లోకి వెళ్లడానికే రిస్క్ తీసుకుంటున్న మదుపర్లు!
స్టాక్‌మార్కెట్ మదుపర్లు కొన్నిసార్లు నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు లాభాల్లో ఉంటారు. కానీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్లే స్టాక్లను మాత్రం వెంటనే అమ్ముతుంటారు. నష్టాల్లో ఉన్న స్టాక్లను మాత్రం ఎప్పటికైనా లాభాల్లోకి రాకపోతుందా అని అట్టే పెట్టుకుంటారు. అలా తాత్కాలికంగా నష్టాలు వచ్చే వాటిల్లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఉంటే ఫరవాలేదు. కానీ సరైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించకుండా నష్టాలను పోస్ట్ చేస్తున్న కంపెనీలకు చెందిన స్టాక్లను కూడా అలాగే ఉంచుకోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా మార్కెట్‌ను గమనిస్తున్న ఆర్థికవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. వారు ప్రతిపాదించిన యుటిలిటీ థియరీ ప్రకారం..మదుపర్లు వివిధ స్వభావాలు కలిగి ఉంటారు. రిస్క్ తీసుకుని కొందరు లాభాల్లోకి వెళితే, మరికొందరు అదే రిస్క్ తీసుకుని నష్టాల్లోకి వెళ్తున్నారు. మొదటి నియమంతో మంచి కంపెనీలు మదుపు చేయడం వల్ల లాభాల్లోకి వెళ్లవచ్చు. ఇదీ చదవండి: బోయింగ్ 777లో సౌకర్యాలు మెరుగుపరిచిన ఎయిర్ ఇండియా కానీ రెండో నియమం ప్రకారం రిస్క్ తీసుకున్నా నష్టాల్లోకి వెళ్లడం ఏమిటనే అనుమానం ఉంటుంది. అయితే కంపెనీపై సరైన అవగాహన, దానికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేయకుండా మార్కెట్లో పెట్టుబడి పెట్టి కొందరు నష్టాల్లోకి జారుకుంటారు. కొద్దిగా నష్టాలు ఉన్నపుడు స్టాక్లను అమ్మకుండా రిస్క్ తీసుకుని వాటిని అలాగే తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంటారు. ఫలితంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా మరింత నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంటుంది. మదుపు చేసేముందు కంపెనీ పూర్వాపరాలు ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ, ఫలానా రంగంలోని పోటీలో ఉన్న సంస్థలు, ముడిసరుకు, మార్కెటింగ్, కంపెనీ అప్పులు తదితర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమై అదేచోట ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ మార్కెట్లకు కొనుగోళ్ల అండ లభించలేదు. వారాంతం కావడంతో మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, కీలక స్టాక్స్‌లో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 66,068 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,895.41 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు కొంద పుంజుకుని 66,282.74 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,654 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,800 మార్క్ దగ్గర ఎగువ స్థాయికి చేరుకుంది. చివరకు గురువారం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు నష్టపోయి 19,751 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, మారుతిసుజుకీ, టీసీఎస్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, బజాన్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ , ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 3,820 షేర్లు ట్రేడ్ అవగా, 1,804 స్టాక్‌లు లాభాలతో ముగిశాయి. గతంతో పోలిస్తే 156 షేర్లు యథాతథంగా ఉన్నాయి. రోజులో 317 షేర్లు వాటి ఎగువ సర్క్యూట్‌ను తాకగా, 157 షేర్లు లోయర్ సర్క్యూట్ స్థాయిలో ట్రేడయ్యాయి. జై కార్ప్, ఐటీఐ, ఏడీఎఫ్ ఫుడ్స్ 20 శాతం చొప్పున పుంజుకోగా, స్పైస్‌జెట్ 19 శాతానికి పైగా లాభపడింది. టెక్స్మాకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోల్డింగ్స్ 16 శాతం ర్యాలీ కాగా, ఏజీఐ గ్రీన్‌పాక్ 15 శాతం పెరిగింది. ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 10 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీమంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్‌లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు నిన్న వెలువడ్డ ఇన్ఫోసిస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. నిఫ్టీలో దీని వాటా అధికంగా ఉండడంతో ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠమైన 5.02 శాతంగా నమోదైంది. ఇది ఒకింత మార్కెట్‌కు పాజిటివ్ విషయం. అయినప్పటికీ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. నిఫ్టీ గత ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు నష్టంతో ప్రారంభమై ఉదయం 9:37 వరకు కొంత పుంజుకుని 19721 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోయి 66,121.52 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22కు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిక్‌బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అక్కడ వెలువడిన సెప్టెంబరు నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మదుపర్లను నిరాశపర్చాయి. ఐరోపా సూచీలు మాత్రం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 86.48 డాలర్లకు చేరింది. టాటా స్టీల్ లాంగ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సాయి సిల్క్స్ కళామందిర్, డెన్ నెట్వర్క్స్, ఆదిత్య బిర్లా మనీ, మిత్తల్ లైఫ్ స్టైల్ కంపెనీలు ఈరోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.66 పాయింట్ల నష్టంతో 66408 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.35 పాయింట్ల నష్టంతో 19794.80 పాయింట్లకు చేరింది. బీపీసీఎల్, కోల్ ఇండియా, మారుతి సుజుకీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, బజాజ్ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాల్లో ట్రేడయ్యాయి. నష్టాల జాబితాలో టెక్ మహింద్రా, అపోలో హాస్పటల్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీ మైండ్‌ట్రీ, సిప్లా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, విప్రో కంపెనీలు ఉన్నాయి. రూపాయి: నేడు రూపాయి డాలర్‌తో పోలిస్తే స్వల్ప నష్టంలో 83.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టీసీఎస్ రిజల్ట్స్..స్వల్పంగా పెరుగనున్న ఆదాయం
ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బుధవారం రానున్నాయి. మరికాసేపట్లో మార్కెట్ టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ క్యూ2 ఫలితాలు విడుదలవుతాయి. అయితే ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ దాదాపు రూ.13.29 లక్షల కోట్లుగా ఉంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ ఫలితాలను అంచనా వేశాయి. దాని ప్రకారం..టీసీఎస్ ఆదాయం త్రైమాసికంలో 1.4శాతం వృద్ధితో రూ.60,218 కోట్లకు చేరుతుంది. వార్షిక వారీగా ఆదాయం దాదాపు 9% పెరుగుతుంది. నికర లాభం త్రైమాసికంలో 3%, వార్షిక వారీగా 9% పైగా పెరిగి రూ.11,404 కోట్లుగా ఉంటుందని అంచనా. టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, టీసీఎస్ డీల్ విన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ కూడా కాసేపట్లో జరుగనుంది. క్యూ2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం వెలువడనుంది. -
లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం డేటా, ఆర్బీఐ మినిట్స్, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 17,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఎగువున 18వేల స్థాయి వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాల దృష్ట్యా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ రంగం ఒత్తిడికి లోనుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల క్యూ4 ఆర్థిక ఫలితాలను స్పందించాల్సి ఉంటుంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్‌తో సహా 50కి పైగా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఎగుమతి ఆధారిత కంపెనీలపై అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం ఏ స్థాయిలో ఉందో మార్చి త్రైమాసిక ఫలితాల ద్వారా తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అలాగే ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం మార్చి డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా సోమవారం(నేడు) విడుదల అవుతుంది. మరుసటి రోజు మంగళవారం చైనా తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి, పారిశ్రామి కోత్పత్తి డేటాతో పాటు యూరోజోన్ ఫిబ్రవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గణాంకాలు వెల్లడి కానున్నా యి. ఇక బుధవారం జపాన్ ఫిబ్రవరి పారిశ్రామి కోత్పత్తి, యూరోజోన్ మార్చి ద్రవ్యోల్బణ విడుదల అవుతుంది. జపాన్ మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అమెరికా ఇళ్ల అమ్మకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపా న్ మార్చి ద్రవ్యోల్బణం, యూరోజోన్ తయారీ రంగ సర్వీసు, అమెరికా తయారీ రంగ సర్వీసు డేటా వెల్లడి కానుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ► విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు గత ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ ఇన్వెస్టర్లు 2023–24ని సానుకూలంగా ప్రారంభించారు. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్‌పీఐ ధోరణి అస్థిరంగా ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. -
మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం
ముంబై: అదానీ గ్రూప్ సంక్షోభం, ద్రవ్యోల్బణ డేటా, కీలక కార్పొరేట్ క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుందని మార్కట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై దృష్టి సారింవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, బాండ్లపై దిగుమతి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. గతవారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనై మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోగా.., నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడింది. ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, మౌలిక, ఫార్మా, కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. ‘‘ఇటీవల ప్రతికూలతలు ఎదుర్కొన్న మార్కెట్ ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ట్రేడవుతుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక బలమైన సానుకూలాంశం కోసం ఎదురు చూస్తోంది. ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్ల కొనుగోలు వ్యూహాన్ని అనుసరించాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్‌సైడ్‌లో నిఫ్టీ 18,000 వద్ద కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17600 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. అదానీ గ్రూప్ సంక్షోభం హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటున్న వివరణలు ఇన్వెస్టర్లకు భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. అలాగే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నాలుగు అదానీ కంపెనీ షేర్లపై దాని రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుండి ‘నెగటివ్’కి తగ్గించింది. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మంగళవారం క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మరింత స్పష్టత వచ్చే వీలుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, గ్రాసీం, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎన్ఎండీసీ, బయోకాన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయిదువేల కోట్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో భారీ ఉపసంహరణ తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్ఐఐల విక్రయాలు కాస్త మందగించాయి. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఈ నెల పదో తేదీకి రూ.5,000 కోట్ల షేర్లను అమ్మేశారు. జనవరిలో రూ.53,887 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు సమాచారం. స్థూల ఆర్థికాంశాల ప్రభావం మార్కెట్ నేడు గతేడాది డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి డేటాకు స్పందించాల్సి ఉంటుంది. దేశీయ జనవరి సీపీఐ ద్రవ్యోల్బణం నేడు, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (మంగళవారం) రేపు విడుదల కానున్నాయి. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం డేటాను మంగళవారం వెల్లడించనుంది. సీపీఐ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలలుగా ఆర్బీఐ నిర్ధేశించుకున్న స్థాయిలోనే నమోదువుతోంది. జనవరిలోనూ స్థిరంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం(ఫిబ్రవరి 15న) విడుదల అవుతాయి. వారాంతాపు రోజు శుక్రవారం ఆర్బీఐ ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు జోష్‌నిచ్చే వీలుంది. వారాంతాన పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా నంబర్ వన్ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో గత వారం(4-8) మార్కెట్లు 2 శాతం ఎగశాయి. వెరసి సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడి 48,782 వద్ద నిలవగా.. నిఫ్టీ 329 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. 2009 తదుపరి వరుసగా 10 వారాలపాటు లాభాలతో నిలిచిన రికార్డును సైతం మార్కెట్లు సాధించాయి. గత వారాంతానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి దాదాపు రూ. 196 లక్షల కోట్లను తాకడం విశేషం! ఇకపై మార్కెట్లు మరింత జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలు ప్రకటించనుండటంతో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు పేర్కొంటున్నారు. చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) జాబితా ఇలా నేడు(9న) డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ3 ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇన్ఫోసిస్, విప్రో 13న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 15న పనితీరును వెల్లడించనున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ 7.7 శాతమే క్షీణించనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దాదాపు ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇది కొంతమేర ఆందోళనకర అంశమే అయినప్పటికీ యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనుండటం, తద్వారా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి తెరతీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. (యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్) ఎఫ్‌పీఐల దన్ను గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ. 8,758 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లోనూ రికార్డు స్థాయిలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పంప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 తొలి వారంలోనూ దేశీ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో కొనసాగుతున్నాయి. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో అంతరర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్ప కరెక్షన్ల నడుమ మార్కెట్లు మరింత వృద్ధి చూపుతున్నట్లు తెలియజేశారు. -
వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాలో సాగుతున్న మార్కెట్లు సమీప భవిష్యత్‌లో కొంతమేర హెచ్చుతగ్గులకు లోనయ్యే వీలున్నట్లు భావిస్తున్నారు. గత వారం(14-18) మార్కెట్లు దాదాపు 2 శాతం జంప్‌చేయడంతో ఇకపై పరిమిత శ్రేణిలోనే కదలవచ్చని చెబుతున్నారు. గత వారం సెన్సెక్స్ 862 పాయింట్లు ఎగసి 46,961 వద్ద ముగిసింది. వారం చివర్లో మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 247 పాయింట్లు జమ చేసుకుని 13,761 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.5 శాతం స్థాయిలో బలపడటం గమనార్హం! కాగా.. క్రిస్మస్ సందర్భంగా వచ్చే వారాంతాన(25న) మార్కెట్లకు సెలవు. దీంతో వచ్చే వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే(21-24) పరిమితంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) ప్రభావిత అంశాలు వచ్చే వారం మార్కెట్లను ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు నిరవధికంగా పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు పేర్కొన్నారు. వీటికితోడు వ్యాక్సిన్ల వార్తలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. అయితే సెకండ్ వేవ్‌లో భాగంగా యూఎస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు వివరించారు. యూరోపియన్ దేశాలలో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో ఆర్థిక రికవరీకి విఘాతం కలగవచ్చని అభిప్రాయపడ్డారు. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ) సాంకేతికంగా ఇలా దేశీ మార్కెట్లలో గత వారం కనిపించిన హుషారు వచ్చే వారంలోనూ కొనసాగవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో వచ్చే వారం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 13,950 వరకూ బలపడవచ్చని అంచనా వేశారు. అయితే ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. అయితే మార్కెట్లు ఓవర్‌బాట్ స్థితికి చేరడంతో కొంతమేర దిద్దుబాటుకు వీలున్నదని వివరించారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. నిఫ్టీకి తొలుత 13,570 పాయింట్ల వద్ద, తదుపరి 13,411 స్థాయిలోనూ మద్దతు(సపోర్ట్) లభించవచ్చని అభిప్రాయపడ్డారు. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్ల కన్సాలిడేషన్‌కూ వీలున్నదని తెలియజేశారు. -
మార్కెట్లు బోర్లా- ఈ షేర్లు సూపర్‌ఫాస్ట్
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లు వెనకడుగు వేసి 36,516కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 10,744 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో క్వాంటమ్ పేపర్స్, సీమెక్ లిమిటెడ్, పైసాలో డిజిటల్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, భారత్ డైనమిక్స్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్ ఐటీ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 27.3 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 44,000 షేర్లు చేతులు మారాయి. క్వాంటమ్ పేపర్స్ పేపర్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 597 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 614 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి. పైసాలో డిజిటల్ ఈ ఎన్బీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 242 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 250 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 600 షేర్లు మాత్రమే చేతులు మారాయి. సీమెక్ లిమిటెడ్ ఆఫ్‌షోర్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 418 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 442 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 23,000 షేర్లు చేతులు మారాయి. భారత్ డైనమిక్స్ ఎన్ఎస్ఈలో ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 415కు ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1.51 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.87 లక్షల షేర్లు చేతులు మారాయి. -
ఇక మార్కెట్లో షేర్ల డీలిస్టింగ్ వేవ్!
దాదాపు దశాబ్ద కాలం తరువాత దేశీ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్లు కంపెనీల డీలిస్టింగ్‌వైపు దృష్టి పెడుతున్నారు. ఇటీవల గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్, బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా డీలిస్టింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ బాటలో ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ సైతం స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ కానున్నట్లు తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు ఇందుకు ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క కంపెనీ సంబంధ అంశాలు సైతం ప్రమోటర్లను డీలిస్టింగ్‌వైపు నడిపిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతక్రితం 2009లో.. దశాబ్ద కాలం క్రితం అంటే 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తాక పతనమైన స్టాక్ మార్కెట్లు ఏడాది తిరిగేసరికల్లా రికవర్ అయ్యాయి. ఆ సమయంలో అంటే 2009లో పలు కంపెనీలు డీలిస్టింగ్‌కు మొగ్గు చూపాయి. తిరిగి గత రెండు నెలల్లో పబ్లిక్ వద్దగల వాటాను కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు వేదాంతా, అదానీ పవర్, హెక్సావేర్ ప్రమోటర్లు ప్రణాళికలు ప్రకటించాయి. ఈ బాటలో దేశీ లిక్కర్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్‌ను డీలిస్ట్ చేసే యోచనలో యూకే దిగ్గజం డియాజియో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఐటీ సేవల యూఎస్ దిగ్గజం ఒరాకిల్ సైతం ఇదే బాటలో నడవనున్నట్లు మార్కెట్లో అంచనాలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. సింగపూర్ బాటలో.. గత రెండేళ్లలో సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి పలు కంపెనీలు డీలిస్టింగ్ బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. 2017- 2019 జులై మధ్య కాలంలో కంపెనీల డీలిస్టింగ్, టేకోవర్ల కారణంగా పలు షేర్లు సగటున 15 శాతం ప్రీమియం సాధించినట్లు డీబీఎస్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. కాగా.. డీలిస్టింగ్ వేవ్‌పై అంచనాలతో ఇటీవల ఒక మ్యూచువల్ ఫండ్ ఇందుకు అవకాశాలున్న కౌంటర్లపై దృష్టిపెట్టినట్లు నిపుణులు ప్రస్తావించారు. కోవిడ్-19 ప్రభావంతో షేర్ల ధరలు దిగిరావడం, నగదు నిల్వలు పుష్కలంగా కలిగి ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొన్ని దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలు డీలిస్టింగ్‌పై చూపు సారించే అవకాశమున్నట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ నిపుణులు చొక్కలింగం ఈ సందర్భంగా వివరించారు. జనవరి- మే నెల మధ్యకాలంలో వేదాంతా, అదానీ పవర్ కౌంటర్లు 40 శాతం వరకూ పతనమైన సంగతి తెలిసిందే. -
కరోనాకు కళ్లెం వేస్తే.. మార్కెట్ ధూమ్‌ధామ్
నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో ఏ ఒక్కరూ మార్కెట్ల భారీ పతనాన్ని ఊహించలేదు. అలాగే మార్చిలో నమోదైన భారీ అమ్మకాల నుంచి వెనువెంటనే మార్కెట్లు(సెన్సెక్స్- నిఫ్టీ) 34,000- 10,000 పాయింట్ల స్థాయికి బౌన్స్ అవుతాయనీ అంచనా వేయలేదంటున్నారు మిరాయ్ అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కో సీఈవో రాహుల్ చద్దా. మార్కెట్ల గమనం, పెట్టుబడి వ్యూహాలు, లిక్విడిటీ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఆటుపోట్లు తప్పవు ఓవైపు కరోనా వైరస్ ముట్టడి.. మరోపక్క యూఎస్, యూరోజోన్ అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా మార్కెట్లు అనుకూల, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇందువల్లనే తొలుత పతనంలోసాగాక.. తిరిగి ర్యాలీ బాట పట్టాయి. ఇకపై మార్కెట్లు వాస్తవికపరిస్థితుల ఆధారంగా స్పందించవచ్చు. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, రంగాలపై విభిన్న ప్రభావాలు కనిపిస్తాయి. రానున్న ఆరు నుంచి 9 నెలల కాలంలో ఈ మార్పులకు అవకాశముంది. తాజాగా చైనాలోని బీజింగ్‌లో రెండో దశ కరోనా కేసులు తలెత్తడంతో ప్రాంతాలవారీగా లాక్‌డవున్ విధిస్తున్నారు. ఇలాంటి వార్తలు మార్కెట్లను దెబ్బతీసే వీలుంది. అయితే మెరుగైన ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాల కారణంగా ప్రజలు కరోనాతో కలసి జీవించగలిగితే.. మార్కెటకు హుషారొస్తుంది. దీర్ఘకాలానికి సమీప కాలంలో అంటే రెండు మూడు త్రైమాసికాలలో మార్కెట్లు, వివిధ రంగాలు అనుకూల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముంది. మూడు, నాలుగేళ్ల కాలానికి చూస్తే.. కంపెనీల ఫండమెంటల్స్‌పై మార్కెట్లు దృష్టిపెడతాయి. కంపెనీలు, స్టాక్స్‌పై దీర్ఘకాలంలో ఫండమెంటల్ అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ప్రతీఒక్కరూ లిక్విడిటీ, చౌక వడ్డీ రేట్లను ప్రస్తావిస్తున్నారు. ఇందువల్లనే మార్కెట్లలో ర్యాలీ వచ్చినప్పటికీ.. ఎల్లవేళలా ఇది పనిచేయదు. 2000 మార్చి, 2007-2008 కాలంలో లిక్విడిటీ ఉన్నప్పటికీ మార్కెట్లు బుడగలా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లు లిక్విడిటీవల్లనే బలపడుతున్నప్పటికీ కంపెనీల పనితీరు సైతం మెరుగుపడనున్న అంచనాలు జత కలుస్తున్నాయి. ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి బయటపడితే.. కంపెనీల ఆర్జనలు, అంచనాలు ప్రభావం చూపగలుగుతాయి. తక్కువ వడ్డీ రేట్లు, చౌక నిధుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు సాధారణ స్థితికి రావలసి ఉంది. అయితే కొన్ని దేశాల మార్కెట్లు, కంపెనీలు వ్యయభరిత స్థాయిలో ట్రేడవుతున్నాయి. రానున్న రెండు, మూడేళ్లలో కోవిడ్‌కు వ్యాక్సిన్లు వెలువడితే.. ప్రోత్సాహకర ఫలితాలు సాధించే రంగాలు, కంపెనీలు వెలుగులో నిలుస్తాయి. బీమా గుడ్ దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇది లాక్‌డవున్ పొడిగింపులకు కారణమవుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పారిశ్రామిక ప్రాంతాలలో సమస్యలు సృష్టిస్తోంది. వెరసి కోవిడ్-19 ప్రభావం అధికంగా కనిపించనుంది. దీంతో బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు ఎదురయ్యే వీలుంది. బీమా రంగానికి మాత్రం అవకాశాలు పెరగనున్నాయి. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఆర్థిక రికవరీ కనిపించింది. వెస్ట్‌లైఫ్ వంటి కంపెనీలు ఆకర్షణీయ అమ్మకాలు సాధించాయి. రియల్టీ సైతం కళకళలాడింది. ఫారెక్స్ నిల్వలు సైతం 18 శాతం పుంజుకున్నాయి. తగినంత లిక్విడిటీ నెలకొంది. అయితే కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించినప్పటికీ ఢిల్లీ, ముంబై, తమిళనాడు వంటి ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడం ద్వారా ఈ సవాళ్లనుంచి బయటపడగలిగితే.. తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడే వీలుంది. రెండేళ్లలో కరోనాను కట్టడి చేయగలిగితే.. ఏడాది, రెండేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధారణ పరిస్థితులకు చేరుకోగలదని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్ట వృద్ధిని అందుకునే చాన్స్ ఉంది. గత దశాబ్ద కాలంలో దేశీ కంపెనీలలో ఎఫ్ఐఐల వాటా తక్కువగా నమోదవుతూ వస్తోంది. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే తక్కువ ప్రీమియంలో ఉంది. ఉత్పాదకత పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి సానుకూల పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో అభివృద్ధి పథాన నడుస్తోంది. కోవిడ్-19కు కళ్లెం వేయగలిగితే.. ఇలాంటి సానుకూలతలు మార్కెట్లకు జోష్నివ్వవచ్చు. అయితే ముంబై, ఢిల్లీ, తమిళనాడు వంటి పరిస్థితులు పెట్టుబడులకు విఘాతం కలిగించవచ్చు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా కృష్టి చేయవలసి ఉంటుంది. -
ఈసారి బూమ్‌లో కొత్త కంపెనీలకు చోటు!
ఇటీవల మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత రెండు వారాల్లోనే 12 శాతం లాభపడ్డాయి. దీంతో ఇకపై కొంతమేర కరెక్షన్కు చాన్స్ ఉన్నదంటున్నారు ఎన్విజన్ క్యాపిటల్ ఎండీ, సీఈవో నీలేష్ షా. భవిష్యత్‌లో మార్కెట్ల గమనం, పెట్టుబడి అవకాశాలు, విభిన్న రంగాలు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. క్యూ1, క్యూ2 వీక్ ఈ ఏడాది ద్వితీయార్థంకంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించకపోవచ్చని అత్యధిక శాతం కార్పొరేట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా మార్కెట్లు పుల్‌బ్యాక్ ర్యాలీలో సాగుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేస్తుండటంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12 శాతం లాభపడ్డాయి. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైతం పెట్టుబడులను కుమ్మరిస్తుండటంతో సెంటిమెంటు బలపడింది. మరోవైపు మిడ్, స్మాల్ క్యాప్స్ ఇటీవల జోరు చూపుతున్నాయి. ఈ ఏడాది(2020-21) తొలి రెండు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు నిరాశపరిచే వీలుంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక ఫలితాలు బలహీనపడనున్నాయి. దీంతో మార్కెట్లు ఇకపై మరింత ర్యాలీ చేయకపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడినుంచీ వెనకడుగువేసే అవకాశముంది. 7,500 చాన్స్ తక్కువే ఇటీవల ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లలో మళ్లీ భారీ కరెక్షన్కు చాన్స్ తక్కువే. వెరసి మార్చి కనిష్టం 7,500 పాయింట్ల స్థాయికి నిఫ్టీ పతనంకాకపోవచ్చు. అయితే కొన్ని రంగాలు ఊహించినదానికంటే అధికంగా దెబ్బతినవచ్చు. ఇదే విధంగా కొన్ని కంపెనీలు నిరుత్సాహకర పనితీరు చూపడంతో కొత్త కనిష్టాలను తాకే వీలుంది. నాయకత్వ పటిమ, పటిష్ట బిజినెస్‌లవైపు మార్కెట్లు దృష్టిసారిస్తాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను విసరనున్నాయి. భవిష్యత్‌లోనూ ఫైనాన్షియల్ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే.. తిరిగి లాక్‌డవున్ పరిస్థితులు తలెత్తవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్లను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. వచ్చే ఏడాదిలోనే ఈ ఏడాది పలు రంగాలలోని కంపెనీలు అంతంతమాత్ర పనితీరునే చూపవచ్చు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో పరిస్థితులు సర్దుకునే వీలుంది. ఏఏ రంగాల నుంచి డిమాండ్ పుట్టవచ్చు లేదా.. ఎలాంటి కంపెనీలు వృద్ధి సాధించవచ్చన్న అంచనాలు కీలకంగా మారనున్నాయి. కొన్ని కంపెనీలు కోవిడ్-19 పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతోపాటు.. పటిష్ట ఫలితాలవైపు సాగవచ్చు. ప్రధానంగా సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా రంగాలు వెలుగులో నిలిచే వీలుంది. ఇదే విధంగా కిచెన్- హోమ్ అప్లయెన్సెస్ విభాగాలకు సైతం డిమాండ్ కనిపించనుంది. ఈ బాటలో ఆరోగ్య పరిరక్షణ(హెల్త్, వెల్నెస్), వ్యక్తిగత సంరక్షణ విభాగాలు పటిష్ట పనితీరు ప్రదర్శించవచ్చని భావిస్తున్నాం. రానున్న రెండేళ్లలో టెక్నాలజీ కౌంటర్లు సైతం బౌన్స్‌బ్యాక్ సాధించవచ్చు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ద్వారా టెక్నాలజీ సర్వీసులకు డిమాండ్ పెరిగే వీలుంది. చిన్న షేర్లు గుడ్ ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేస్తున్నాయి. అయినప్పటికీ 2017-18 గరిష్టాలతో పోలిస్తే 50 శాతం తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే ఈ విభాగంలో నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కన్జూమర్ అప్లయెన్సెస్, హెల్త్, వెల్నెస్ తదితర రంగాలకు చెందిన కొన్ని కౌంటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమర్ధవంత నిర్వహణ, తక్కువ రుణ భారం, పటిష్ట బ్యాలన్స్‌షీట్స్, నగదు నిల్వలు కలిగిన కంపెనీలు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముంది. సరైన రంగాల నుంచి నాణ్యమైన కంపెనీలను ఎంచుకుంటే భారీ ప్రతిఫలాలను పొందవచ్చని ఆశిస్తున్నాం. ఎన్బీఎఫ్సీలు వద్దు మార్చి చివరి వారంలో మార్కెట్లు బాటమవుట్ అయినప్పటికీ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో ఎన్బీఎఫ్సీ విభాగాన్ని తప్పించుకోవడమే మేలు. కొన్ని కంపెనీలు బలమైన యాజమాన్యం, పెట్టుబడులను కలిగి ఉన్నప్పటికీ రుణ నాణ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యే వీలుంది. సమీపకాలంలో రుణ వసూళ్లు, మొండిబకాయిలు వంటి సవాళ్లకు ఆస్కారం ఉంది. మారటోరియం ప్రభావం భవిష్యత్‌లో కనిపించనుంది. ఫలితంగా ఎన్బీఎఫ్సీ రంగానికి ఈ ఏడాది సమస్యాత్మకంగా నిలిచే అవకాశముంది. -
మార్కెట్ల ర్యాలీ- లిక్విడిటీ మాయ!
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిధులతోనే స్టాక్ మార్కెట్లకు జోష్వస్తున్నందటున్నారు మార్కెట్ల స్వతంత్ర విశ్లేషకులు ఆనంద్ టాండన్. దీంతో వాస్తవిక పరిస్థితులను విస్మరిస్తూ ఇండెక్సులు పరుగుతీస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరు, లిక్విడిటీ, కోవిడ్-19 ప్రభావం వంటి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. చివరి దశ..? నిజానికి స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ ప్రభావంతో పరుగుతీస్తున్నాయి. ఇందువల్లనే ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్సైతం ర్యాలీ చేస్తున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని అడ్డుకునేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా చౌక నిధులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రంగాల కంపెనీలు సైతం ఇటీవల జోరు చూపుతున్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ దిగ్గజాలు ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆతిథ్య రంగం, వాహన రంగాలు ఇంకా కోలుకోవలసి ఉంది. ఇక ట్రక్కుల విక్రయాలు ఊపందుకోనప్పటికీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వీటిని పక్కనపెడితే.. పలు మిడ్, స్మాల్ క్యాప్స్ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఫండమెంటల్స్ లేదా కంపెనీల ఆర్జన మెరుగుపడే అంచనాలకంటే లిక్విడిటీ ప్రభావమే ఇందుకు సహకరిస్తోంది. ఆటో రంగాన్నే తీసుకుంటే.. వాణిజ్య వాహన విక్రయాలు వెనకడుగులో ఉన్నాయి. సీవీలు, కార్లతో పోలిస్తే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపించే వీలుంది. నిజానికి అండర్పెర్ఫార్మింగ్ కంపెనీల షేర్లు సైతం బలపడుతున్నాయంటేటే.. ర్యాలీ చివరి దశకు చేరినట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే లిక్విడిటీ కారణంగా పరుగెడుతున్న మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా వ్యవహరించడమే మేలు. తద్వారా స్వల్పకాలంలో కొంతమేర లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. దీర్ఘకాలంలోనూ నిజానికి మార్కెట్లను అధిక సమయాలలో లిక్విడిటీనే నడిపిస్తుంటుంది. గత ఐదు, ఆరేళ్లుగా చూస్తే దేశీయంగా కంపెనీల ఆర్జనలకు మించుతూ మార్కెట్లు లాభపడుతూ వచ్చాయి. ఇందుకు వడ్డీ రేట్లు వంటివి దోహదం చేశాయి. దీంతో ఫండమెంటల్స్కంటే వడ్డీ రేట్లే స్టాక్స్‌కు బలాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు, కంపెనీలు రుణ భారాన్ని అధికంగా మోస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో ఇప్పుడే అంచనా వేయలేము. చౌకగా లభిస్తున్న నిధులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా కంపెనీలు నిలదొక్కుకోవాలనుకుంటే.. డిమాండ్ పెరిగి ధరలు పుంజుకోవలసి ఉంటుంది. ఇది జరిగితే.. ప్రస్తుత స్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగకపోవచ్చు. గైడెన్స్ ఎలా వచ్చే ఏడాది లేదా ఒకటి రెండు త్రైమాసికాలకు ప్రస్తుతం ఏ కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు దీనికి కారణంకాగా.. మార్కెట్లలో సాధారణంగా ఎప్పటికప్పుడు పలువురు నిపుణులు 25 శాతం ఆర్జనలు అంచనా వేస్తూ ఉంటారు. అయితే పలు కంపెనీలు నిరాశను మిగులుస్తుంటాయి. అయితే ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావంతో ఎవరూ సరైన అంచనాలు వేసే పరిస్థితులు లేవు. నిజానికి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంలో కూడా సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల కాలాన్ని అంచనా వేయాలంటే చీకట్లో గురిపెట్టవలసిందే. త్వరలో కోవిడ్-19 చికిత్సకు ఔషధం వెలువడుతుందని ఆశిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంచనాలు అంత సులభంకాదు. ఎందుకంటే కోవిడ్-19కు ముందు సైతం ప్రపంచ దేశాలు మందగమన పరిస్థితులను ఎదర్కొంటూ వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయంగా జీడీపీ 4 శాతానికి పరిమితమైంది. ఇందుకు ప్రభుత్వ ప్యాకేజీసైతం ప్రోత్సాహాన్నివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను మించి భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగుతీస్తుందని చెప్పాలంటే ఎంతో ఆశావహం ధృక్పథం కలిగి ఉండాలి. అయినప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయంటే ఫండమెంటల్స్ లేదా వాస్తవిక పరిస్థితులకంటే లిక్విడిటీయే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పవచ్చు. -
3 వారాలుగా మార్కెట్లు బుల్.. బుల్
దేశవిదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర బ్యాంకులు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బిలియన్లకొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్చేస్తుండటంతో ఈక్విటీలు ర్యాలీ చేస్తున్నాయి. అటు అమెరికా ఇండెక్స్ నాస్డాక్ ఇప్పటికే సరికొత్త గరిష్టాన్ని సాధించగా.. దేశీయంగా గత మూడు వారాల్లో మార్కెట్లు 14 శాతం బలపడ్డాయి. సెన్సెక్స్ 34,000, నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌లను దాటి కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో భాగమైన కౌంటర్లన్నీ దాదాపుగా బలపడటం విశేషం! వివరాలు చూద్దాం.. 93 శాతం బీఎస్ఈ-500 ఇండెక్స్ కంపెనీలలో 95 శాతం అంటే 477 షేర్లు.. గత మూడు వారాల్లో లాభపడుతూ వచ్చాయి. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో వీటి వాటా దాదాపు 93 శాతానికి సమానంకాగా.. ఈసారి ర్యాలీ బ్లూచిప్స్నకే పరిమితంకాకుండా మార్కెట్ అంతటా విస్తరించడం విశేషం. ఈ సమయంలో కేవలం బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో 5 శాతానికి సమానమైన 24 షేర్లు నష్టపోయాయి. మే 18 నుంచి చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ 14 శాతం పుంజుకోగా.. బీఎస్ఈలో యాక్టివ్‌గా ట్రేడయ్యే 2500 కౌంటర్లలో 82 శాతం వరకూ ఎంతోకొంత లాభపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి లభిస్తున్న నిధులు ఎఫ్‌పీఐలు, సావరిన్ వెల్త్ ఫండ్స్ తదితర సంస్థల ద్వారా దేశీ ఈక్విటీలలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇకపై మార్కెట్లపై ఈ ర్యాలీ కొనసాగకపోవచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందని తెలియజేశారు. ఖుషీ ఖుషీగా బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో 70 స్టాక్స్ గత మూడు వారాల్లో 30 శాతం లాభాలు ఆర్జించగా.. 12 స్టాక్స్ అయితే ఏకంగా 50 శాతానికంటే అధికంగా జంప్‌చేశాయి. జాబితాలో పలు కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వొడాఫోన్ ఐడియా 125 శాతం, ఐడీబీఐ బ్యాంక్ 98 శాతం, ఐనాక్స్ లీజర్ 75 శాతం, ఐఎఫ్సీఐ 74 శాతం, క్వెస్ కార్ప్ 67 శాతం చొప్పున దూసుకెళ్లాయి. అయితే సద్భావ్ ఇంజినీరింగ్, క్యాప్రి గ్లోబల్, హిందుస్తాన్ జింక్, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ సిటీ యూనియన్ 11-6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. -
వచ్చే వారం ఆటుపోట్లు తప్పకపోవచ్చు!
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం(25న) మార్కెట్లకు సెలవుకాడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం(28న) ముగియనుంది. దీంతో వచ్చే వారం మొదట్లో ట్రేడర్లు పొజిషన్లను జూన్ నెలకు రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీలో 8800 వద్ద స్ట్రైక్స్‌తో గరిష్ట పుట్ బేస్ 9,000 వద్ద ఉన్నట్లు ఆప్షన్స్ డేటా సూచిస్తోంది. వెరసి నిఫ్టీకి ఈ స్థాయిల వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ లోయర్ టాప్, లోయర్ బాటమ్లను తాకుతుండటంతో అంతర్గతంగా మార్కెట్లు బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. రోజువారీ చార్టుల ప్రకారం శుక్రవారం నిఫ్టీలో డోజీ పేటర్న్ ఏర్పడిందని.. ఇది అటు బుల్స్, ఇటు బేర్స్‌కు ఎలాంటి పట్టునూ ఇవ్వకపోవడాన్ని సూచిస్తున్నట్లు వివరించారు. 8600-9600 గత వారం నిఫ్టీ 9,100 దిగువనే ముగిసింది. వరుసగా మూడో వారం ఆటుపోట్ల మధ్య నష్టాలతో నిలిచింది. చార్టుల ప్రకారం గత వారం నిఫ్టీ కదలికలు హ్యామర్ తరహా కేండిల్‌ను సూచిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టం నుంచి 61.8 శాతం రీట్రేస్మెంట్(8055-9890) స్థాయి 8756 వద్ద నిఫ్టీకి మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 8,600- 9,600 పాయింట్ల పరిధిలో కదిలే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ప్యాకేజీలు, లిక్విడిటీ చర్యలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నట్లు తెలియజేశారు. నిఫ్టీకి 8,800 వద్ద కీలక మద్దతు లభించవచ్చని, ఇదే విధంగా 9,300 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ టెక్నికల్ హెడ్ ధర్మేష్ షా పేర్కొన్నారు. కాగా.. వచ్చే వారం దిగ్గజ కంపెనీలు హెచ్డీఎఫ్సీ, లుపిన్, సన్ ఫార్మా, డీమార్ట్ తదితరాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. -
50% ఇండెక్స్ షేర్లు బేర్ ట్రెండ్‌లోనే
సాధారణంగా బేర్ మార్కెట్లు ఆరు నెలల నుంచి 30 నెలలవరకూ కొనసాగుతాయంటున్నారు టారస్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ ప్రసన్న పథక్. ప్రస్తుతం దేశీ మార్కెట్లు రెండు నెలల బేర్ దశలో ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజానికి ప్రామాణిక ఇండెక్సులు నిఫ్టీ, సెన్సెక్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజాలలో 50 శాతంవరకూ ఏడాది కాలంగా బేర్ ట్రెండ్‌లో కదులుతున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 9,000 స్థాయిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రస్తుతం 9,000 పాయింట్ల స్థాయిలో కదులుతోంది. మిడ్, స్మాల్ క్యాప్స్‌ను సైతం పరిగణిస్తే.. గత రెండేళ్లుగా మొత్తం మార్కెట్లు బేర్ దశలోనే ఉన్నాయి. రానున్న ఆరు నెలల కాలంలో కోవిడ్-19 ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించనుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో మరోసారి పతన పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే ఈసారి పతనంలో మిడ్, స్మాల్ క్యాప్స్ ఔట్పెర్ఫార్మ్ చేసే వీలుంది. కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పలు దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్నాయి. భారీ లిక్విడిటీ చర్యలు చేపడుతున్నాయి. దీంతో దేశాల మధ్య అంతరాలు ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో పెట్టుబడులకు విఘాతం కలిగే వీలుంది. వ్యవస్థలలోకి భారీగా విడుదలవుతున్న చౌక నిధులు ఎటు ప్రవహిస్తాయన్నది వేచి చూడవలసి ఉంది. పోర్ట్‌ఫోలియో ఎలా ఇన్వెస్టర్లు వయసు, రిస్క్ సత్తా, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు 30ఏళ్ల వ్యక్తి ఓమాదిరి రిస్క్‌కు సిద్ధపడితే.. ఈక్విటీలకు 35 శాతం, ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్‌కు 30 శాతం, డెట్ ఫండ్స్‌లో 20 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసే ఆలోచన చేయవచ్చు. ఈ బాటలో పసిడి లేదా రియల్టీకి 15 శాతం కేటాయించవచ్చు. ఇది పెట్టుబడులను విభిన్న ఆస్తులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టభయాలను తగ్గించుకోవడంతోపాటు.. కొంతమేర హామీగల ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. అయితే ఎవరికివారు వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులు, రిస్కు సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఫైనాన్షియల్ సలహాదారులను సంప్రదించడం మేలు. అనుకోని విధంగా మార్కెట్ నిపుణులు వార్షిక ప్రాతిపదికన నిఫ్టీ ఆర్జనలో 14-15 శాతం వృద్ధిని అంచనా వేస్తుంటారు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను, ఎన్బీఎఫ్సీ సంక్షోభం వంటి ఊహించని సవాళ్లు ఎదురైతే అంచనాలు తలకిందులుకావచ్చు. ఇక ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో అంచనాల్లేవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోంది. అయితే కరోనా వైరస్ కట్టడికి ఔషధాన్ని కనుగొంటే.. స్టాక్ మార్కెట్లకు ఒక్కసారిగా జోష్రావచ్చు. వెరసి 6-12 కాలానికి మార్కెట్లను అంచనా వేయడం కష్టం. రెండు, మూడేళ్ల వ్యవధిని పరిగణిస్తే.. మంచి రిటర్నులకు అవకాశమున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ రంగాలు ఓకే చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా దేశీ కంపెనీలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. చైనాకు బదులుగా స్థానిక తయారీకి ప్రోత్సాహం లభించవచ్చు. ప్రధానంగా పటిష్ట బ్యాలన్స్‌షీట్లు కలిగి ఎగుమతులు నిర్వహించే కంపెనీలు లబ్ది పొందే వీలుంది. దేశీయంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ, డయాగ్నోస్టిక్, కన్జూమర్ ఆధారిత రంగాలు, కంపెనీలు బలపడే అవకాశముంది. -
‘కరోనా’, గణాంకాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ కదలికలకు కీలకమని వారంటున్నారు. కరోనా కలకలం... కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002–03లో ప్రబలిన సార్స్ వైరస్ మరణాల కంటే అధికం. కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. గణాంకాల ప్రభావం... ఈ నెల 12న డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, జనవరి నెల రిటైల్ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయి. ఇక శుక్రవారం(ఈనెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈనెల 11 (మంగళవారం)న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. చివరి దశ క్యూ3 ఫలితాలు... డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్సీ, సెయిల్, అశోక్ లేలాండ్, తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కరోనాపై మార్కెట్ కన్ను...: వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని శామ్కో ఎనలిస్ట్ ఉమేశ్ గుప్తా పేర్కొన్నారు. వరుసగా ఆరో నెలా ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ప్రవాహం వరుసగా ఆరో నెలా కొనసాగుతోంది. డిపాజిటరీల డేటా ప్రకారం.. ఫిబ్రవరి 3–7 మధ్య ఎఫ్‌పీఐలు డెట్ సెగ్మెంట్లో రూ. 6,350 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే వ్యవధిలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 1,173 కోట్లు ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ. 5,177 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా ఎకానమీ, ప్రపంచ వృద్ధిపై కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ ఎనలిస్టు మేనేజరు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. -
అయోధ్య తీర్పు : దలాల్ స్ట్రీట్‌లో ఇక మెరుపులే
సాక్షి,ముంబై: వివాదాస్పద అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పుపై సర్వత్రా ఆమోదం లభించింది. దీనిపై దలాల్ స్ట్రీట్ నిపుణులు కూడా పాజిటివ్‌గా స్పందించారు. సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని మార్కెట్ పండితులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్టాక్మార్కెట్లో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడి, కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ మరింత దూసుకుపోనుందని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, ఖచ్చితంగా ఉత్తర ప్రదేశ్ వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలి’ అని సీనియర్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా అభిప్రాయపడ్డారు. వ్యవస్థను సరళతరం చేసే ఎటువంటి నిర్ణయమైనా, ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది’ అని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఎండీ దివాన్ చోక్సి అన్నారు. ‘మొదట కశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు, అనంతరం అయోధ్యం తీర్పు దేశీయ వ్యవస్థకు మంచిదనీ, ఎల్టీసీజీ, వ్యక్తిగత పన్ను రేట్లను మార్చడం వంటి సంస్కరణలు మరిన్ని వస్తాయని సంజయ్ భాసిన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నానని, బెంచ్ మార్క్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఇక సులభమని తెలిపారు. ఈ తీర్పు వలన అయోధ్యను సందర్శించి దేశీయ, విదేశీ టూరిస్ట్‌లు రోజుకు 50,000 నుంచి 1 లక్షకు చేరుకుంటారని కేడియా అన్నారు. ‘ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైష్ణోదేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లానే అయోధ్య కూడా మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ 2.0 అమల్లోకి తేవాలి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2–3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. ‘జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. మరోవైపు రిటర్నుల ఫైలింగ్ల్లోనూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేక జీఎస్టీ వ్యవస్థను రూపొందించినట్లు కుమార్ చెప్పారు. ఐటీసీ క్లెయిమ్‌లు, రిటర్నుల్లో తేడాలున్న పక్షంలో ఆయా అసెసీలకు అలర్ట్‌లు పంపడంతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీఆర్–3బి దాఖలు చేయని సంస్థలకు ఆగస్టు 22 నుంచి ఈ–వే బిల్లుల జారీ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.22 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదయ్యాయి. -
పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి
జనవరి కంటే ఫిబ్రవరి ఆదాయం రూ.100 కోట్లు అధికం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కోలుకుంటోంది. జనవరి ఆదాయం కంటే ఫిబ్రవరిలో దాదాపు రూ.100 కోట్లు ఎక్కువగా ఆదాయం లభించడం రిజిస్ట్రేషన్ వర్గాలకు ఊరట కలిగిస్తోంది. జనవరిలో రిజిస్ట్రేసన్ల శాఖకు రూ.175.04 కోట్ల ఆదాయం లభించగా, ఫిబ్రవరి ఆదాయం రూ.274.87 కోట్లకు చేరడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పంట సొమ్ము చేతికి రావడం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు నగదు విత్‌డ్రా పరిమితులను బ్యాంకులు సడలించడంతో అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాలను రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధం చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల వినియోగదారులు తమ స్థిరాస్తులను ఐటీ రిటర్నుల్లో తప్పనిసరిగా చూపించాల్సి ఉన్నందున, తమ ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇదే తీరు కొనసాగితే మార్చిలో మరింత రాబడి వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.