న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ కదలికలకు కీలకమని వారంటున్నారు.
కరోనా కలకలం...
కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002–03లో ప్రబలిన సార్స్ వైరస్ మరణాల కంటే అధికం. కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
గణాంకాల ప్రభావం...
ఈ నెల 12న డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, జనవరి నెల రిటైల్‌ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయి. ఇక శుక్రవారం(ఈనెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈనెల 11 (మంగళవారం)న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
చివరి దశ క్యూ3 ఫలితాలు...
డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్‌సీ, సెయిల్, అశోక్ లేలాండ్, తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
కరోనాపై మార్కెట్ కన్ను...: వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. బడ్జెట్, ఆర్‌బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని శామ్‌కో ఎనలిస్ట్ ఉమేశ్ గుప్తా పేర్కొన్నారు.
వరుసగా ఆరో నెలా ఎఫ్‌పీఐల పెట్టుబడులు
భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ప్రవాహం వరుసగా ఆరో నెలా కొనసాగుతోంది. డిపాజిటరీల డేటా ప్రకారం.. ఫిబ్రవరి 3–7 మధ్య ఎఫ్‌పీఐలు డెట్ సెగ్మెంట్‌లో రూ. 6,350 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే వ్యవధిలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 1,173 కోట్లు ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ. 5,177 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా ఎకానమీ, ప్రపంచ వృద్ధిపై కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ సీనియర్ ఎనలిస్టు మేనేజరు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు.
‘కరోనా’, గణాంకాలు కీలకం
Published Mon, Feb 10 2020 5:03 AM | Last Updated on Mon, Feb 10 2020 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment