మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం | Macro data, global cues, Adani Group crisis to guide markets | Sakshi
Sakshi News home page

మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం

Published Mon, Feb 13 2023 6:21 AM | Last Updated on Mon, Feb 13 2023 6:21 AM

Macro data, global cues, Adani Group crisis to guide markets - Sakshi

ముంబై: అదానీ గ్రూప్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణ డేటా, కీలక కార్పొరేట్‌ క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుందని మార్కట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై దృష్టి సారింవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్, రూపాయి విలువ, బాండ్లపై దిగుమతి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు.  

గతవారం మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనై మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్‌ 159 పాయింట్లు నష్టపోగా.., నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడింది. ఆటో, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, మౌలిక, ఫార్మా, కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది.  

‘‘ఇటీవల ప్రతికూలతలు ఎదుర్కొన్న మార్కెట్‌ ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ట్రేడవుతుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక బలమైన సానుకూలాంశం కోసం ఎదురు చూస్తోంది.
ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్ల కొనుగోలు వ్యూహాన్ని అనుసరించాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్‌సైడ్‌లో నిఫ్టీ 18,000 వద్ద కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17600 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ అడ్వైజరీ ఇన్వెస్టర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ అపూర్వ సేత్‌ తెలిపారు.   

అదానీ గ్రూప్‌ సంక్షోభం
హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ గ్రూప్‌ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటున్న వివరణలు ఇన్వెస్టర్లకు భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్‌ షేర్ల ట్రేడింగ్‌ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ శుక్రవారం ప్రకటించింది. అలాగే మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ నాలుగు అదానీ కంపెనీ షేర్లపై దాని రేటింగ్‌ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్‌’ నుండి ‘నెగటివ్‌’కి తగ్గించింది. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మంగళవారం క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మరింత స్పష్టత వచ్చే వీలుంది.   

కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు
దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఓఎన్‌జీసీ, గ్రాసీం, ఐషర్‌ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎన్‌ఎండీసీ, బయోకాన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

అయిదువేల కోట్ల అమ్మకాలు  
ఈ ఏడాది జనవరిలో భారీ ఉపసంహరణ తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఐల విక్రయాలు కాస్త మందగించాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం  ఈ నెల పదో తేదీకి రూ.5,000 కోట్ల షేర్లను అమ్మేశారు. జనవరిలో రూ.53,887 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ వంటి మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు సమాచారం.

స్థూల ఆర్థికాంశాల ప్రభావం
మార్కెట్‌ నేడు గతేడాది డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి డేటాకు స్పందించాల్సి ఉంటుంది. దేశీయ జనవరి సీపీఐ ద్రవ్యోల్బణం నేడు, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (మంగళవారం) రేపు విడుదల కానున్నాయి. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం డేటాను మంగళవారం వెల్లడించనుంది. సీపీఐ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలలుగా ఆర్‌బీఐ నిర్ధేశించుకున్న స్థాయిలోనే నమోదువుతోంది. జనవరిలోనూ స్థిరంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం(ఫిబ్రవరి 15న) విడుదల అవుతాయి. వారాంతాపు రోజు శుక్రవారం ఆర్‌బీఐ ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement