గణాంకాలే కీలకం...
దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ వెలువడే వివిధ గణాంకాల తీరును బట్టి ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు తదితర అంశాల ప్రభావం కూడా ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు.
స్వల్ప రికవరీ...
ఇంధన ధరల సవరణ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులో ఉంటాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. డిసెంబర్ నెల వాహన విక్రయాలను వెల్లడించనున్న నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని వారంటున్నారు. సెలవుల కారణంగా ఎఫ్‌ఐఐల లావాదేవీలు తక్కువ స్థాయిలో ఉంటాయని, దాంతో మార్కెట్ స్తబ్దుగానే ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం అమెరికా, కొన్ని ఇతర ప్రపంచ మార్కెట్లు పనిచేయవు. నగదు కొరత ఈ వారం కొంత తీరుతుందని, దీంతో స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక రికవరీ సాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూడో నెలా వెనక్కే..
విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి 400 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఇలా పెట్టుబడులను ఉపసంహరించడం ఇది వరుసగా మూడో నెల. విదేశీ ఇన్వెస్టర్లు అధికంగా డెట్ మార్కెట్‌నుంచి తమ నిధులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.8,176 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.18,935 కోట్ల చొప్పున మొత్తం రూ.27,111 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఇక గత ఏడాది పరంగా చూస్తే, విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.20,566 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.43,645 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
కీలక గణాంకాలు
జనవరి 2 యూరోజోన్ తయారీ రంగం
జనవరి 3 అమెరికా, చైనా తయారీ రంగం
జనవరి 4 యూరోజోన్ కాంపొజిట్,
అమెరికా ఫెడ్ మినట్స్, అమెరికా
ప్రైవేట్ రంగ ఉద్యోగ వివరాలు
జనవరి 5 అమెరికా, చైనా సేవల రంగం
జనవరి 6 అమెరికా ఉద్యోగ గణాంకాలు