ముంబై: కీలక వడ్డీ రేట్ల కోతను ఆర్‌బీఐ(RBI) ఈ వారంలో జరిగే సమీక్షతో షురూ చేయొచ్చని ప్రముఖ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త ఆర్‌బీఐ గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య భేటీ కానుంది. ఈ సందర్భంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించొచ్చని భావిస్తున్నారు.
రెండేళ్లుగా కీలక రెపో, రివర్స్ రెపో (ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో వినియోగానికి మద్దతుగా ఆదాయపన్ను విషయంలో పెద్ద ఎత్తున ఊరట కల్పించినందున, దీనికి కొనసాగింపుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట నియంత్రణ పరిధి 6 శాతం లోపే ఉన్నందున రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉందని నిపుణులు అంటున్నారు. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు కనిష్టాల త్రైమాసిక స్థాయిలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల జోరు
ఇవీ సానుకూలతలు..
‘రేట్ల తగ్గింపునకు రెండు బలమైన కారణాలున్నాయి. ఆర్‌బీఐ ఇప్పటికే లిక్విడిటీ పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది రేట్ల కోత ముందస్తు సూచికగా ఉంది’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో చర్యలకు మద్దతుగా రెపో రేటును తగ్గించొచ్చన్నారు. ‘కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యపరమైన ఉద్దీపనలు ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని భావించడం లేదు. కనుక 2025 ఫిబ్రవరి సమీక్షలో రేట్ల కోతకు సానుకూలతలు ఉన్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ రీసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ వారంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అంతర్జాతీయ పరిణామాలు చోటుచేసుకుంటే రేట్ల కోత వాయిదా పడొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment