క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే! | Cryptocurrency market crash 2022 | Sakshi
Sakshi News home page

క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!

Published Mon, Jul 18 2022 1:21 AM | Last Updated on Mon, Jul 18 2022 1:23 AM

Cryptocurrency market crash 2022 - Sakshi

క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్‌ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్‌ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ 620 బిలియన్‌ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్‌ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్‌ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్‌ 11న బిట్‌ కాయిన్‌ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది.
   
గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి.  కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు.

అసలు వీటికి ఫండమెంటల్స్‌ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

భారీ ర్యాలీకి కారణం..  
అంతర్జాతీయ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్‌ చేజ్, బ్లాక్‌రాక్‌ పెద్ద ఎత్తున బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్‌ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్‌ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్‌ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది.

ఇదే అదనుగా ఆల్ట్‌ కాయిన్లకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్‌ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది.

ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం...
క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్‌ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్‌ పరిమాణం 39 మిలియన్‌ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్‌లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది.



పన్ను పిడుగు
క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి.

ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్‌ చాహర్‌ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే.

బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్‌ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్‌ క్లబ్‌ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు కరణ్‌ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్‌ కట్‌ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్‌ చేసే వారికి టీడీఎస్‌ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్‌ అవుతుంది. పైగా స్టాక్‌ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్‌ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు.

విదేశాలకు మకాం
క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్‌ఎక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజగోపాల్‌ మీనన్‌ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్‌ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్‌ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్‌ నిలిపివేశారు’’అని వివరించారు.

తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్‌ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్‌ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు.

నియంత్రణలు..
ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్‌ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్‌బుక్‌ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్‌ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారిత ‘టాన్‌’ను నిలిపివేయాలని యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించింది’’అని వజీర్‌ఎక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజగోపాల్‌ మీనన్‌ వివరించారు.

2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్‌బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి.

ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక?
క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్‌ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు.  2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ వోలటిలిటీ, బిట్‌కాయిన్‌ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది.

దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్‌ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి.

భవిష్యత్తు..
క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి.

ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్‌ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్‌ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్‌ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్‌మెంట్‌ సంస్థ కాసియో సీటీవో అనుజ్‌ యాదవ్‌ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్‌ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్‌ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్‌ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement