
జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, మారుతీ
యూఎస్ టారిఫ్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు
గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలే ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు యూఎస్ టారిఫ్ వార్తలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన వెలువడిన వర్షపాత అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ దిగ్గజాల క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల ఆధారంగా కదలనున్నాయి. క్యూ4తోపాటు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది పనితీరును సైతం వెల్లడించనున్నాయి. కొన్ని రంగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభావిత అంశాలు, పనితీరుపై అంచనాలు సైతం వెలువరించనున్నాయి. ఈ జాబితాలో కార్ల దిగ్గజం మారుతీసహా.. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐటీ బ్లూచిప్ ఇన్ఫోసిస్‌తోపాటు వారాంతాన(19న) ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐసహా యస్ బ్యాంక్ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో నేడు(21న) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
ఇతర అంశాలు
ప్రపంచ ప్రధాన(ఆరు) కరెన్సీలతో మారంకలో ఇటీవల డాలరు బలహీనపడుతుండటంతో దేశీ కరెన్సీ బలపడుతోంది. డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా 104 స్థాయి నుంచి 99కు నీరసించడం రూపాయికి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీ స్టాక్స్‌లో తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా పెట్టుబడులు చేపడుతుండటం మరింత మద్దతిస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ముడిచమురు ధరలు బ్యారల్ 65–60 డాలర్ల స్థాయికి దిగిరావడం దేశీయంగా సానుకూల అంశమని, ఇది ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.
గత వారమిలా
కేవలం మూడు రోజులు జరిగిన గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 4 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం తోడ్పాటునిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ నికరంగా 3,396 పాయింట్లు(4.5 శాతం)దూసుకెళ్లగా, నిఫ్టీ సైతం 1,023 పాయింట్లు(4.5 శాతం) ఎగసింది. వెరసి సెన్సెక్స్ 78,553 వద్ద, నిఫ్టీ 23,852 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ ఇదేస్థాయిలో ర్యాలీ చేయడం గమనార్హం!
సాంకేతికంగా
గత వారం సెలవుల నేపథ్యంలో సాంకేతికంగా మార్కెట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా బలపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,600 పాయింట్ల స్థాయిలో బలమైన మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి నిఫ్టీకి ఈ స్థాయి సపోర్ట్‌గా నిలిచే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 24,550 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వెరసి సమీప భవిష్యత్‌లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్‌లను అధిగమిస్తే మార్కెట్ల తీరు వెల్లడికావచ్చని అభిప్రాయపడ్డారు.
రుతుపవనాల ఎఫెక్ట్
ఈ ఏడాది సాధారణానికంటే అధిక వర్షపాతానికి వీలున్నట్లు దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇది ధరల(ద్రవ్యోల్బణ) క్షీణతకు దారి చూపవచ్చని పేర్కొన్నారు. అయితే యూఎస్ టారిఫ్ వార్తలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని విశ్లేషించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల యూఎస్, చైనా సుంకాల విధింపులో పోటాపోటీగా వ్యవహరిస్తుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇకపై టారిఫ్‌ల యుద్ధం మరింత వేడెక్కడం లేదా చల్లబడటం అనే అంశాలపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.
ఎఫ్‌పీఐల దన్ను 3 రోజుల్లో రూ. 8,500 కోట్లు
గత వారం మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 8,472 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. నిజానికి ఈ నెల మొదట్లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ బాటలో గత వారం తొలి రోజు రూ. 2,352 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తదుపరి రెండు సెషన్లలో ఏకంగా రూ. 10,824 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్ నుంచి రూ. 23,103 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంటే 2025 జనవరి నుంచి రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు.