Forecasts
-
ఆగ్రోకెమికల్స్ ఆదాయం డౌన్! దశాబ్దకాలంలో ఇదే తొలిసారి..
ముంబై: ఉత్పత్తుల ధరల తగ్గుదల, డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, రబీ పంట సీజన్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ ఆగ్రోకెమికల్స్ రంగం ఆదాయం 3 శాతం మేర క్షీణించనుంది. క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనాలు వేసింది. దశాబ్దకాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. చైనా నుంచి సరఫరా వెల్లువెత్తడంతో అంతర్జాతీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు పడిపోయాయని, ఎగుమతులకు డిమాండ్ తగ్గిందని క్రిసిల్ తెలిపింది. అటు అమ్మకాల పరిమాణం, వసూళ్లు తగ్గడం వల్ల నిర్వహణ మార్జిన్లు 400–450 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర క్షీణించి దశాబ్దపు కనిష్టమైన 10–11 శాతానికి పడిపోవచ్చని వివరించింది. డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటంతో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాల ప్రణాళికలను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొందని క్రిసిల్ పేర్కొంది. లాటిన్ అమెరికా, అమెరికాలో పంటల సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి అంతర్జాతీయంగా తయారీ సంస్థలు తిరిగి నిల్వలను పెంచుకోవడం మొదలెట్టాక నవంబర్ నుంచి ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎగుమతుల్లో ఆ రెండు మార్కెట్ల వాటా 55 శాతం ఉంటుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ఎగుమతులు మందగించడంతో దేశీ తయారీ సంస్థల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దేశీయంగా అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉండొచ్చు. వర్షపాతం ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆగ్రోకెమికల్స్ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా దేశీయంగా క్రిమిసంహారకాల వినియోగంలో ఈ సీజన్ వాటా 35 శాతం ఉంటుంది. అటు ఎగుమతులు మందగించడం, ఇటు దేశీయంగా డిమాండ్ నెమ్మదించడం వంటి అంశాల కారణంగా ఆగ్రోకెమికల్స్ తయారీ సంస్థల నిర్వహణ లాభదాయకత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో వాటి ఆపరేటింగ్ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 700–1,000 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే, మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకునే అవకాశం ఉండటం వల్ల నిర్వహణ లాభదాయకత సీక్వెన్షియల్‌గా మెరుగుపడవచ్చు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తక్కువగా 10–11 శాతానికే పరిమితం కావచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 15.2 శాతంగా నమోదైంది. రాబోయే రోజుల్లో డిమాండు, కీలక ఎగుమతి మార్కెట్లలో వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తులు.. ముడిసరుకు ధరలు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!
ముంబై: భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత విధించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంకాగా, తాజాగా 7 నుంచి 7.2 శాతం శ్రేణికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వినియోగదారు సెంటిమెంట్ బలహీనత దీనికి కారణమని పేర్కొంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత ఎకానమీపై కనబడుతుందని విశ్లేషించింది. ఇప్పుడే చెప్పడం కష్టం... చక్రవర్తి ఇదిలావుండగా, యుద్ధం ప్రభావం భారత్ ఎకానమీపై ఏ మేరకు ఉంటుందన్న విషయం ఇప్పడే చెప్పడం కష్టమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి పేర్కొన్నారు. పలు ప్రపంచ దేశాలకు ఇప్పుడు ధరల పెరుగుదల తీవ్రత సవాలుగా ఉందని అన్నారు. -
రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోమోరిన్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతోపాటు ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో శనివా రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు పేర్కొన్నారు. తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో నిజామాబాద్‌లో 7.3 డిగ్రీలు అధికంగా 21.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 6.2 డిగ్రీలు అధికంగా 20.6 డిగ్రీలు, నల్లగొండలో 1.2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈశాన్యం నుంచి వచ్చే చలి గాలుల తీవ్రత భూమిని తాకే పరిస్థితి లేకపోవడంతో చలి అంతగా లేదని వివరించింది. -
ఇక ముద్రా ‘మొండి’ భారం..!
ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ‘ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం నుంచి బైటపడి ఉండవచ్చు. అయితే, ఈ రుణాల్లో మొండిబాకీలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించేదిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే రుణాలు తీసుకోబోయే వారి చెల్లింపు సామర్ధ్యాలను బ్యాంకులు మరింత మెరుగ్గా మదింపు చేయాలి. సదరు ఖాతాలను చివరిదాకా పరిశీలిస్తూనే ఉండాలి‘ అని సూక్ష్మ రుణాలపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంత సులువుగా అప్పు దొరకని చిన్న వ్యాపార సంస్థలకు .. రుణ లభ్యత పెరిగేలా చూసేందుకు 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముద్రా స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, స్కీమ్ ప్రారంభించిన ఏడాదిలోనే .. ముద్రా రుణాల్లో మొండి బాకీల సమస్య గురించి అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని తోసిపుచ్చారు. ఈ ఏడాది జూలై నాటి గణాంకాల ప్రకారం ముద్రా స్కీమ్ కింద ఇచ్చిన రుణాలు రూ. 3.21 లక్షల కోట్లకు చే రాయి. ఇందులో మొండి బాకీలు 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో 2.52 శాతం నుంచి 2.68 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది జూన్ దాకా మొత్తం 19 కోట్ల రుణాలు మంజూరు కాగా .. సుమారు 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు సమాచార హక్కు చట్టం కింద బైటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,277 కోట్లుగా ఉన్న మొండి బాకీలు ఏకంగా 126 శాతం ఎగిసి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,481 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎకానమీపై జీఎస్టీ దెబ్బ.. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని జైన్ చెప్పారు. డిజిటల్ సాంకేతికత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి.. చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఎంఎస్ఎంఈలకు రుణాలపై అధిక వడ్డీ భారం తప్పుతుందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు.. ప్రధానంగా డిజిటల్ ఫైనాన్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని.. అదే సమయంలో డేటా భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
అంచనాలను మించిన అమెరికా జాబ్ గ్రోత్
అమెరికా ఉద్యోగాలు పెరుగుదల అంచనాలకు మించి గణాంకాలను నమోదు చేసింది. జూలై జాబ్ గ్రోత్ లో బలమైన వృద్ధిని సాధించి 255,000 ఉద్యోగాలను జోడించింది. జూన్ మాసంలోని 292,000 ఉద్యోగాలతో పోలిస్తే వృద్ధిలో క్షీణించినప్పటికీ ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువ నమోదు చేసింది. ఇది 175,000- 180,000 మధ్య ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. దీంతో ఫెడ్ సంవత్సరాంతానికి వడ్డీరేట్లను పెంచనుందనే ఊహాగానాలను మరింత పెంచింది. అయితే అన్ ఎంప్లాయ్ మెంట్ రేట్ (నిరుద్యోగుల )4.9% వద్ద స్థిరంగా ఉండిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ అద్భుతంగా లేదని విశ్లేషకుడు డెన్నిస్ డె జాంగ్ అభిప్రాయపడ్డారు. మొదటి ఆరు నెలల లెక్కలే సంవత్సరం మొత్తం ఫలితాలను ప్రతిబింబిస్తాయన్నారు. క్షీణించిన ఉపాధి అవకాశాలతో వడ్డీ రేట్లను పెంచాలనే సంకేతాలను ఫెడ్ అందించిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండవ త్రైమాసికంలో అంచనాలకన్నా కంటే నెమ్మదిగా వృద్ధి చెందిందని ఆ తర్వాతి డేటా వెల్లడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఫెడ్ తదుపరి పాలసీ రివ్యూ సెప్టెంబర్ లో జరగనుంది. అయితే మందకొడిగా ఉన్న ఆర్థిక వృద్ధి, దిగజారుతున్న ఉత్పాదకత, అధ్యక్ష ఎన్నికలతో నెలకొన్న అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ వరకు ఆలస్యం కావచ్చని మరో ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. ఉద్యోగ మార్కెట్ అభివృద్ధితో మళ్ళీ ఈ సంవత్సరం ఫెడ్ రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. బ్యాంక ఆఫ్ ఇంగ్లాండ్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయం లాంటి ప్రపంచ పరిణామాలను ఫెడ్ నిశితంగా పరిశీలిస్తోందని వాషింగ్టన్ ఆర్థిక వేత్త తెలిపారు. బ్రెగ్జిట్ పరిణామాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై బలంగా ఉంటాయనీ, ఇది యూరోపియన్ బ్యాంకులపై కూడా ఉండనుందని పేర్కొన్నారు. -
వృద్ధులకు ఆసరా... ప్రశాంతి వృద్ధాశ్రమం
ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలన..పాలన వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. ఎంతోమంది తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో రాయవరం మండలం పసలపూడి ప్రశాంతి వృద్ధాశ్రమం ఒకటి. కాకినాడ-రావులపాలెం రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ప్రశాంతి ఆశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు... పసలపూడిలో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితం... ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ప్రశాంతి ఆశ్రమంగా వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడివారికి మనఃశాంతి లభించడంతో పాటు.. రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింత లేదు. 16 ఏళ్లుగా వృద్ధుల సేవలో... అమ్మా.. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. మేమూ మీతోనే ఉంటాం.. అంటూ వచ్చిన పేదలను చూసి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రశాంతి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వృద్దాశ్రమంపై వివరించి ఇక్కడకు రావాలని అప్పట్లో నిర్వహకులు ఆహ్వానించారు. ఒకరిద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇప్పుడు 25 మందితో కొనసాగుతోంది. ఉదయం మెడిటేషన్‌తో ప్రారంభమైన అనంతరం ఆధ్యాత్మిక తరగతులు కొనసాగుతాయి. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరికొకరు తోడుగా... ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే బ్రహ్మకుమారీ అక్కయ్యలకు తెలియజేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు. ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకుల సెల్ నెంబర్లు 9290100871, 9441006599 - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఐదేళ్లుగా ఉంటున్నా... ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఆశ్రమంలో చాలా బాగుంటుంది. బ్రహ్మకుమారీ అక్కలు ప్రేమగా మా ఆలనా పాలన చూస్తున్నారు. - వై.రమణమ్మ, రాజమండ్రి ఇక్కడ నుంచి వెళ్లను... ఆధ్యాత్మిక బోధనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దూరాభారం అని ఆలోచించకుండా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. - ఆరుమిల్లి బాలాత్రిపురసుందరి మహబూబ్‌నగర్