భారత ఆర్థిక వ్యవస్థపై (Indian economy) ఐక్యరాజ్యసమితి ఆశావహ దృక్పథాన్ని ప్రకటించింది. 2025లో భారత్ జీడీపీ (GDP) 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.
మౌలికరంగ వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2025’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను (UN report) విడుదల చేసింది. భారత్ జీడీపీ 2024లో 6.8 శాతం వృద్ధి చెందగా, 2025లో 6.6 శాతం, 2026లో 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది.
సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రకాల వస్తు ఎగుమతుల్లో బలమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని తెలిపింది. 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉండడం 2025లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొంది. భారత్‌లో భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, ఫిజికల్, డిజిటల్ అనుసంధానత, సోషల్ ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు 2025లోనూ బలంగా కొనసాగుతాయని అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం దిగొస్తుంది..
భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో 4.8 శాతం ఉండగా, 2025లో 4.3 శాతానికి దిగొస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. మధ్యకాలానికి ఆర్‌బీఐ లకి‡్ష్యత పరిధి అయిన 2–6 శాతం మధ్యే ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఉపాధి మార్కెట్ 2024 వ్యాప్తంగా బలంగా ఉన్నట్టు, కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.
పట్టణ ప్రాంత నిరుద్యోగం 2023లో 6.7 శాతంగా ఉంటే, 2024లో 6.6 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడినట్టు తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.8 శాతం, 2026లో 2.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2023, 2024లో 2.8 శాతంగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment