వృద్ధులకు ఆసరా... ప్రశాంతి వృద్ధాశ్రమం
ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలన..పాలన
వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. ఎంతోమంది తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో రాయవరం మండలం పసలపూడి ప్రశాంతి వృద్ధాశ్రమం ఒకటి. కాకినాడ-రావులపాలెం రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ప్రశాంతి ఆశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా ఉంది.
ఆధ్యాత్మిక చింతనతో పాటు...
పసలపూడిలో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితం... ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ప్రశాంతి ఆశ్రమంగా వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడివారికి మనఃశాంతి లభించడంతో పాటు.. రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింత లేదు.
16 ఏళ్లుగా వృద్ధుల సేవలో...
అమ్మా.. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. మేమూ మీతోనే ఉంటాం.. అంటూ వచ్చిన పేదలను చూసి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రశాంతి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వృద్దాశ్రమంపై వివరించి ఇక్కడకు రావాలని అప్పట్లో నిర్వహకులు ఆహ్వానించారు. ఒకరిద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇప్పుడు 25 మందితో కొనసాగుతోంది. ఉదయం మెడిటేషన్‌తో ప్రారంభమైన అనంతరం ఆధ్యాత్మిక తరగతులు కొనసాగుతాయి. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.
ఒకరికొకరు తోడుగా...
ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే బ్రహ్మకుమారీ అక్కయ్యలకు తెలియజేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు.
ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకుల సెల్ నెంబర్లు
9290100871, 9441006599 - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ
ఐదేళ్లుగా ఉంటున్నా...
ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఆశ్రమంలో చాలా బాగుంటుంది. బ్రహ్మకుమారీ అక్కలు ప్రేమగా మా ఆలనా పాలన చూస్తున్నారు.
- వై.రమణమ్మ, రాజమండ్రి
ఇక్కడ నుంచి వెళ్లను...
ఆధ్యాత్మిక బోధనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దూరాభారం అని ఆలోచించకుండా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. - ఆరుమిల్లి బాలాత్రిపురసుందరి మహబూబ్‌నగర్