Spiritual Thought
-
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన..!
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న కుగ్రామం అది. అక్కడినుంచి ఓ యువకుడు స్వామి వారి దర్శనార్థం తిరుమల బయలుదేరాడు. ఏడు పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తానన్నాడు. అయితే, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేక పోతున్నందులకు తండ్రి చాలా బాధపడ్డాడు. ఇంటిలోని స్వామి వారి పటాన్ని చూస్తూ ‘‘మహిమలున్న స్వామివారి కొండనుంచి ఎన్నాళ్ళయినా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకుని రా! అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి!!’’ అని చెప్పాడు.‘‘అలాగే నాన్నా!’’ అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు స్వామివారు. గురువారం మాత్రమే కనిపించే ‘నేత్ర దర్శనం’ తృప్తిగా చేసుకున్న ఆ యువకుడు ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు. లడ్డూ ప్రసాదాలూ, కలకండ, తులసి చెట్టు లాంటివి తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే, తండ్రి చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది, ఏదై ఉంటుందా?’ అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ‘ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా’ అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ‘ఇది నీటిలో సులభంగా కరిగి΄ోతుంది కదా’ అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. ‘కొన్నేళ్ళకైనా చెట్టు వాడినొతుంది కదా’ అని తలచాడు. ‘మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా?’ అని మాడ వీధుల్లో వెదికాడు. ఆలాంటి వస్తువు ఏదీ అతడికి కనిపించలేదు. ‘నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ, అది నేరవేర్చలేకపోతున్నానే...’ అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. ‘పరిష్కారం ఏమిటా?’ అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడినుంచి శిలా తోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజసిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారత దేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్ళకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.తిరుమల కొండలోని చెట్టూ పుట్టా, రాయీ ర΄్పా... అన్నీ పవిత్రమైనవే! ఈ నేలంతా స్వామి వారి పాద స్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకెళ్ళి నాన్నకి ఇస్తాను. నాన్న చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది... పవిత్రమైనదీ ఇదే’ అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. గోవింద నామ స్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, నామాలు పెట్టి, తులసి మాల వేసి దేవుడి గదిలో ఉంచారు. ‘స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు!’’ అనుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
స్ఫూర్తి సుధ
ప్రాథమికం, భౌతికం – అదే, ‘ప్రస్థాన’, ఆధ్యాత్మికం! యోగాలలో మొదటిది – కర్మయోగమే, సుమా! కాదంటే మిగిలేది – కాలక్షేప, కథనాలే! భూమి వున్నది, సాగుకే – కర్మకే, జీవితం! గ్రహించి వాస్తవాన్ని – ప్రారంభించు, ప్రాథమికాన్ని! ‘‘క్రమం లేని బ్రతుకు – వక్రమార్గాన్ని వెతుకును భక్తిలేని భయం – పిరికితనాన్ని పెంచును భయం లేని భక్తి – మూర్ఖపు మొరటుతనంను ఉంచును భక్తులకే కాదు – వ్యక్తులకు కూడా కావాలి భయం, భక్తి – శిక్షణ మనస్సుతో...’’ – శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి -
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే..
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే, మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది. వెంటనే, ‘బతికేనురా జీవుడా’ అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కానీ, సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ చీమ ‘ఏం మిత్రమా అలా అయిపోయేవు? క్షేమమేనా?’ అని అడిగింది. ‘ఏం క్షేమం? అంతా క్షామమే’ అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం. ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే ‘వెగటుగా ఉంది’ అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది. కారణం అంతు బట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమ నోరు తెరిచి అందులో ఉన్న ఉప్పు కణాలను తీసేసింది. అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు. అలాగే మనిషిలో పంచవికారాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం. – బ్రహ్మాకుమార్ రాజేష్ -
వాటికయితే వారంటీలు అడుగుతాం కదా!
ఆయనకు దేవాలయానికి వెళ్ళడమంటే ఇష్టం. రామాయణ, భారత భాగవతాలు చదువుకోవడమంటే ఇష్టం. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ఇష్టం. ఇప్పుడు ఆయనకు భార్యగా వచ్చే పిల్ల కంటికి అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. జీవితంలో సంతోషంగా గడపడానికి అవకాశం ఇవ్వదు. అందం కొంత కాలం ఉంటుంది. తరువాత జర్జరీ భూతమయిపోతుంది. ఆయన స్వభావానికి తగిన పిల్ల పక్కన ఉన్నప్పుడు ఆయన జీవితం పండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పిల్ల జీవితం కూడా. ఆ పిల్ల భక్తి కలిగిన పిల్ల. పూజలు చేసుకోవడం ఇష్టం. అతిథిని పిల్చి అన్నం పెట్టడం ఇష్టం. సాత్వికంగా మాట్లాడడం ఇష్టం. కానీ భర్త ధూర్తుడు. స్వార్థపరుడు. బాగా డబ్బున్నవాడనీ, బాగా చదువుకున్నవాడనీ ఇచ్చి పెళ్ళి చేసారనుకోండి. ఈ పిల్ల జీవితంలో సంతోషాన్ని ఎలా పొందుతుంది? అందుకే ఎవరికి ఎవరిని ఇచ్చి చేయాలో... స్వభావ పరిశీలన చేయగలవారు పరిణతి కలిగిన పెద్దలు. అదే శీల పరిశీలనం. అంటే పెద్దలు వారి నిర్ణయానికి శాస్త్రం చెప్పిన ప్రాతిపదికల్లో మొదటిది శీలం. మిగిలినవి వరుసగా వయస్సు, వృత్తం, అభివంజం, లక్షణం. మగపిల్లలకు ఆడపిల్లలకంటే ఎక్కువ వయస్సుండాలి. గురువుగా, దైవంగా భావించి భర్తను అనుగమించాలంటే తన భర్త అనుభవం రీత్యా పరిణతి గలవాడై ఉండాలి. వయస్సు ఎక్కువ అంటే ఏ పదో, ఇరవయ్యో అని కాదు. దాంపత్యజీవనం గడపడానికి ఎంత వయోభేదం ఉంటే ఉపయుక్తం అవుతుందో అంతే వయోభేదాన్ని పాటించాల్సి ఉంటుంది. తరువాత వృత్తం. అంటే నడవడి. ఆయనకు పంచె కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమెకు పంచెలు, ఉత్తరీయాలు నచ్చవు. దేవాలయాలకు వెళ్లడం ఇష్టం ఉండదు. మరో పిల్లకు తన అమ్మానాన్నలు తనతో ఉండాలనీ, తనను ఎప్పుడూ ప్రేమగా చూడాలని ఉంటుంది. మరొక ఆమెకు అత్తామామలు కూడా తమతోనే ఉండాలనీ, వారిని బాగా చూసుకోవాలని ఉంటుంది. మంచి నడవడిక కలిగిన వారు జీవిత భాగస్వామిగా వస్తే పదిమందికి ఆ దాంపత్యం ఆదర్శం అవుతుంది. ఘర్షణలకు అవకాశం ఉండదు. ఘర్షణ మొదలయితే అది వాళ్ళిద్దరితో, వాళ్ళపిల్లలతో, వాళ్ల కుటుంబంతో సరిపోదు. ‘‘మా ఇంట్లో మా అమ్మగారు, నాన్నగారు ఎప్పుడూ కీచులాడుకుంటూంటారు. మీ అమ్మగారిని, నాన్న గారిని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో..బాబోయ్ ..మా అమ్మానాన్నలను చూస్తే భయమేస్తుంది’’ అని పిల్లలు అనే పరిస్థితి రాకూడదు. దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. చుట్టుపక్కల ఉండే పిల్లలకు, పెళ్లంటేనే భయపడి పారిపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. తరువాత చూడాల్సిన అంశం–అభివంజనము.. అంటే వెనక ఉన్న వంశం. ఉభయపక్షాల వంశ చరిత్రలలోని సానుకూలతలను బట్టి వియ్యమందాలి. చివరి అంశం – లక్షణం. అంటే ఒకరికొకరు తగినవారయి ఉండాలి. పెళ్ళికి వచ్చిన అతిథులు వధూవరులలో ఒకరిని చూసి మరొకరిపై జాలిపడేంత దయనీయంగా ఉండకూడదు. చూడచక్కని జంటగా కనిపించాలి. అంటే అంగసౌష్ఠవం, శరీరాకృతులు చక్కగా ఉండాలి. ఏదో ఒక ఫ్యాను, ఒక చేతి గడియారం కొనుక్కుంటేనే ఎన్నాళ్ళు పనిచేస్తుందని గ్యారంటీలు, వారంటీలు అడుగుతాం. అటువంటిది వంశంలో చిరస్థాయిగా కీర్తి పొందవలసిన ఇద్దరిని జత కూర్చాలంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వివాహాలు కుదిర్చేటప్పడు శాస్త్రం చెప్పిన ఈ ఐదు లక్షణాలను ప్రాతిపదికగా తీసుకుని పెద్దలు మాత్రమే జీవిత భాగస్వాములను నిర్ణయించాల్సి ఉంటుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వృద్ధులకు ఆసరా... ప్రశాంతి వృద్ధాశ్రమం
ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలన..పాలన వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. ఎంతోమంది తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో రాయవరం మండలం పసలపూడి ప్రశాంతి వృద్ధాశ్రమం ఒకటి. కాకినాడ-రావులపాలెం రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ప్రశాంతి ఆశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు... పసలపూడిలో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితం... ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ప్రశాంతి ఆశ్రమంగా వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడివారికి మనఃశాంతి లభించడంతో పాటు.. రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింత లేదు. 16 ఏళ్లుగా వృద్ధుల సేవలో... అమ్మా.. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. మేమూ మీతోనే ఉంటాం.. అంటూ వచ్చిన పేదలను చూసి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రశాంతి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వృద్దాశ్రమంపై వివరించి ఇక్కడకు రావాలని అప్పట్లో నిర్వహకులు ఆహ్వానించారు. ఒకరిద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇప్పుడు 25 మందితో కొనసాగుతోంది. ఉదయం మెడిటేషన్‌తో ప్రారంభమైన అనంతరం ఆధ్యాత్మిక తరగతులు కొనసాగుతాయి. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరికొకరు తోడుగా... ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే బ్రహ్మకుమారీ అక్కయ్యలకు తెలియజేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు. ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకుల సెల్ నెంబర్లు 9290100871, 9441006599 - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఐదేళ్లుగా ఉంటున్నా... ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఆశ్రమంలో చాలా బాగుంటుంది. బ్రహ్మకుమారీ అక్కలు ప్రేమగా మా ఆలనా పాలన చూస్తున్నారు. - వై.రమణమ్మ, రాజమండ్రి ఇక్కడ నుంచి వెళ్లను... ఆధ్యాత్మిక బోధనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అందుకే దూరాభారం అని ఆలోచించకుండా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. - ఆరుమిల్లి బాలాత్రిపురసుందరి మహబూబ్‌నగర్