ఆధ్యాత్మిక‘థ’
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.
దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు.
‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.
మనకు మిత్రులెవరు....
మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.
కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment