Ego
-
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
ట్విన్ టవర్ల కూల్చివేత, ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈరోజు నోయిడా జంట టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆయన ప్రత్యేకత ఉంది. అహాన్ని జయించకపోతే... అది జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలిపే అద్భుత సందేశంతో టవర్ల కూల్చివేత వీడియోను షేర్ చేశారు. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు కూల్చివేతను జీవిత సత్యంతో అన్వయించారు. నోయిడా టవర్ల కూల్చివేతను మండే మోటివేషన్‌కు ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, మనలోని ఈగో కొండలా పేరుకుపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన తనకు గుర్తు చేసిందన్నారు. కొండంత ఎత్తుకు చేరిపోయిన అహాన్ని అంతం చేయడానికి పేలుడు పదార్థాల అవససరం పడుతుందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద్ర ఆలోచింపజేసే పోస్ట్‌తో ఏకీభవిస్తున్న ట్విటర్ యూజర్లు ఆయనను ప్రశంసించారు. మండే మోటివేషన్ ట్వీట్‌పై తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది. వాస్తవానికి ఏ సమస్యకైనా తొలి పరిష్కారం అహాన్ని జయించడం. అలాకాకుండా ఈగో తిష్టవేసుకుని కూచుందో ఇహ..దాన్ని కూల్చేందుకు విస్ఫోటనం తప్పదు అని మరొక యూజర్ కమెంట్ చేశారు. Why am I using the demolition of the Noida towers for #MondayMotivation ? Because it reminds me of the dangers of letting our egos get too tall. Sometimes we need explosives to demolish the excess ego. pic.twitter.com/qSMl2qSera — anand mahindra (@anandmahindra) August 29, 2022 -
మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తూ కల్లోలం రేపుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి ప్రజల ప్రాణాల కన్నా అతడి స్వార్థమే ముఖ్యమని తెలిపారు. సెంట్రల్ విస్టాలో భాగంగా 2022 డిసెంబర్‌లోపు ప్రధానమంత్రి నివాసం సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా వాటిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ నరేంద్రమోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఓ ట్వీట్ చేశారు. సెంట్రల్ విస్టాకు ఖర్చు చేసే రూ.13,450 కోట్లతో ప్రస్తుతం కరోనా సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ‘ఆ నిధులతో 45 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయవచ్చు. లేదా ఒక కోటి ఆక్సిజన్ సిలిండర్లకు ఉపయోగపడుతుంది. లేదా రెండు కోట్ల ప్రజలకు నెలకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిచవచ్చు. కానీ ఇవేవీ కాకుండా ప్రధానికి ప్రజల కన్నా అతడి స్వార్థం చాలా ముఖ్యం’ అని రాహుల్ మండిపడ్డారు. ప్రస్తుతం దేశం తీవ్ర కష్టాల్లో ఉందని.. ఈ సమయంలో ప్రధానమంత్రి తన నివాసం సిద్ధం చేయడానికి గడువు విధించడం అందరూ విమర్శిస్తున్నారు. ఈ సమయంలో అలాంటి పనులపై దృష్టి సారించాల్న అని నిలదీస్తున్నారు. ప్రజలకు వైద్య సదుపాయాలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా వంటి వాటిపై ప్రధాని దృష్టి సారించాలని సూచిస్తున్నారు. చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ ₹13450 crores for Central Vista. Or, for fully vaccinating 45 crore Indians. Or, for 1 crore oxygen cylinders. Or, to give 2 crore families NYAY of ₹6000. But, PM’s ego is bigger than people’s lives. — Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021 -
ఆలోచనలే ఆదేశాలైపోతాయి...
ఫొటోను కాస్త జాగ్రత్తగా చూడండి.. ఆ వ్యక్తి చెవి దగ్గర మొదలై మెడ, నోటివరకూ విస్తరించిన గాడ్జెట్‌ను ఇంకొన్నేళ్లలో మీరూ తగిలించుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకలా? ఏమిటి దాని స్పెషాలిటీ అంటారా? సింపుల్. మీరు మనసులో అనుకునే మాటలనే ఆదేశాలుగా మార్చి సమాచారం అందిస్తుంది ఇది. అర్థం కాలేదు కదూ.. ఉదాహరణతో చూద్దాం. రోడ్డుపై వెళుతున్నారు... షాపు గాజు కిటికీలోంచి ఓ మంచి షర్ట్ కనిపించింది. భలే ఉందే షర్టు అనుకుంటే చాలు.. ఈ గాడ్జెట్ ఆ షర్ట్‌పై ఉండే బార్కోడ్నో లేదా షాపు వెబ్సైట్లోకి వెళ్లి ఆ డిజైన్ షర్ట్‌ను గుర్తించో.. లేకపోతే ఇంకో మార్గం ద్వారానో దాని రేటు కనుక్కుని తెలియజేస్తుంది. మామూలుగానైతే.. ఈ పనులన్నీ మనం కీబోర్డు సాయంతో చేయాల్సినవి. అవేవీ లేకుండానే మన ఆలోచనలతోనే చేసేస్తుందన్నమాట. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ నమూనా యంత్రం పేరు ‘ఆల్టర్ ఈగో’. మనుషులు, కంప్యూటర్ల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోయేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త అర్ణవ్ కపూర్ అంటున్నారు. గాడ్జెట్‌లోని ఎలక్ట్రోడ్లు, మెషీన్ లెర్నింగ్ వ్యవస్థ, బోన్ కండక్షన్ హెడ్ఫోన్ల వంటివన్నీ కలిసి ఈ పనులు చేస్తాయన్నమాట. ఆల్టర్ ఈగో పనితీరును వివరిస్తూ ఎంఐటీ ఒక వీడియోను సిద్ధం చేసింది. ఇందులో అర్ణవ్ కపూర్ ఓ సూపర్ మార్కెట్లో తిరుగుతూ నచ్చిన ఉత్పత్తివైపు చూస్తే చాలు.. దాని ధర, వివరాలు వినిపిస్తూంటాయి. బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చే సమయానికి మీరు తీసుకున్న వస్తువుల తాలూకూ మొత్తం బిల్లు రెడీగా ఉంటుంది. -
ప్రియా వారియర్ తెలుగులో..
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మత్తుగొలిపే కళ్లతో ముద్దుల తూటాలను పేల్చి యువతకు ఆరాధ్యం అయిపోయిందీ పద్దెనిమిదేళ్ల కేరళ అందం. సోషల్ మీడియాలో‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ రొమాంటిక్ వీడియో క్లిప్ హల్చల్ చేయడంతో..రాత్రికి రాత్రే ప్రియా పాపులర్ అయింది. ఈ వీడియో క్లిప్ ఆమెకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఒక్క దెబ్బతో ‘ఒరు అదార్ లవ్’ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి. దాంతో అటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నిర్మాతలు, ఇటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రియా కాల్షీట్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తెలుగులో తాజాగా విడుదలైన ‘ఇగో’ సినిమా నిర్మాతలు తమ తదుపరి సినిమా కోసం ఆమెకు భారీ పారీతోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. చూడాలి మరి తెలుగులోనూ ప్రియ తన కళ్లతో ఏ భావాలు పలికిస్తుందో...!! -
మోదీకి అహం బాగా పెరిగిపోయింది
సాక్షి, ముంబై : ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మాటల తుటాలు పేల్చారు. ప్రధాని అయ్యాక మోదీకి అహం బాగా పెరిగిపోయిందంటూ హజారే విరుచుకుపడ్డారు. సంగలి జిల్లా అట్పది మండలంలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ ర్యాలీలో హజారే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ మూడేళ్లలో ప్రధాని మోదీకి 30కి పైగా లేఖలు రాశాను. ఒక్కదానికి కూడా బదులు ఇవ్వలేదు. ప్రధాని పదవి చేపట్టాక మోదీకి అహం బాగా పెరిగిపోయింది. అందులో నా లేఖలను బదులు ఇవ్వటం లేదు’’ అని హజారే విమర్శించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన రావటం ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చి 23 నుంచి మరోసారి ఆయన జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్, లోకాయుక్తా నియామకం, రైతులకు 5 వేల పెన్షన్, పంట ఉత్పత్తులకు అధిక రేట్ల విధింపు తదితర డిమాండ్లతో ఆయన ఉద్యమం చేపట్టబోతున్నారు. ఈలోగా మూడు ప్రజా ర్యాలీలను నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి ర్యాలీని నిర్వహించారు. ఇక ఢిల్లీ రాజకీయ పరిణామాల గురించి(ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం) ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు హజారే విముఖత వ్యక్తం చేశారు. -
ఆ రోజు వచ్చింది
‘‘ఆకతాయి’ సినిమాలో కాలేజ్ కుర్రాడిలా నటించాను. ‘ఇగో’లో బాధ్యతలను నిర్లక్ష్యం చేసి లైఫ్‌ను ఎంజాయ్ చేసే గోపీ పాత్రలో నటించాను. ఎమోషన్స్‌తో రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్ రాజ్. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఆయన హీరోగా విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన చిత్రం ‘ఇగో’. సిమ్రాన్ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్ రాజ్ చెప్పిన విశేషాలు. ► ఇగో ఫీలయ్యే ఇద్దరు (గోపీ, ఇందు) వ్యక్తుల మధ్య ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో విలేజ్, సిటీ కల్చర్ మిక్సై ఉంటుంది. నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. అమలాపురం యాసలో నేను చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కైరాదత్ చేసిన స్పెషల్ సాంగ్ సూపర్‌గా ఉంటుంది. దర్శకుడు సుబ్రహ్మణ్యం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ► చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చదువు పూరై్తన తర్వాత మా నాన్నగారు ప్రోత్సహించారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. కానీ నాకు దేవుడి అండ తోడుగా ఉంటుందనుకుంటున్నాను. మహేశ్‌బాబుతో ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దేవుడా.. నా కంటూ ఓ రోజు రావాలని మనసులో అనుకున్నాను. అదే నిజమైంది. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమి అనుకోలేదు. ఆశిష్ నా బర్త్‌డే గిఫ్ట్! ‘ఇగో’ చిత్రదర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘మా హీరోనే నా పుట్టినరోజు కానుక. ఆశిష్ రాజ్ సూపర్‌గా నటించాడు. హీరోయిన్ సిమ్రాన్ బాగా నటించింది. మా సినిమాలో నటించిన సీనియర్ యాక్టర్స్ అందరూ ఎంతగానో హెల్ప్ చేశారు. వారిని మర్చిపోలేను. కథ విషయానికొస్తే.. పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చే ప్రేమకథ ఇది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
ఇగో అంటే అహం కాదు
‘ఆకతాయి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరి యమైన ఆశిష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘ఇగో’ (ఇందు–గోపి). విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకుడు. సాయికార్తీక్ స్వరకర్త. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీని ఆవిష్కరించి, దర్శకుడు నక్కిన త్రినాథరావుకు అందించారు. ‘‘ఈ మధ్యకాలంలో క్యారక్టరైజేషన్ను బేస్ చేసుకుని వస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఆశిష్‌రాజ్ మొదటి సినిమాతో పోల్చితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు’’ అన్నారు త్రినాథరావు. సుబ్రమణ్యం తమకు మంచి రోల్స్ ఇవ్వటంతో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఆశిష్‌రాజ్, సిమ్రాన్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ జి.కె. -
రామానుజుని రక్షించిన కంచి వరదుడు
ఇది రెండో సారి... రామానుజుడు తన వ్యాఖ్యానాన్ని తప్పుబట్టడం.... అయినా నేనేమీ తప్పు చెప్పలేదే... ‘‘నేను ఆ వాక్యంలోని పదాలకు మన నిఘంటువుల్లో... వాడుకలో ఉన్న సామాన్యమయిన అర్థం చెప్పాను. ఆ అర్థం లేదంటావా? దాంతోపాటు ఇంకే అర్థమయినా నీకు తోస్తున్నదా.... నీ అభిప్రాయం ప్రకారం ఇంకేదయినా అర్థం ఉంటే అది నీవు చెప్పవచ్చు కదా.... దానికీవిధంగా కన్నీళ్లు కార్చడం ఎందుకు... నేనేదో ఘోరం చేసినట్టు....’’ అన్నారు గురువు.రామానుజుడు స్థిమితంగా చెప్పడానికి ఉపక్రమించాడు. మొహమాటానికి పోయి చెప్పకపోతే తప్పవుతుంది. తన బుద్ధికి తోచిన అన్వయాన్ని తను చెప్పక తప్పదు. గురువు గారి అనుజ్ఞ కూడా అయింది కనుక చెప్పడం ప్రారంభించాడు.‘‘క..పి..మాటలో ‘క’ అంటే నీరు, పి అంటే పిబతి, అంటే తాగునది, నీటిని తాగేవాడు సూర్యుడు, కప్యాసం అనే సమాసానికి అర్థం సూర్యకిరణముల తాకిడిచేత వికసించినది అనే భావం. ఆ విధంగా రవికిరణ స్పర్శ చేత వికసిత పులకితమయ్యే పుష్పం తామర. పురుషోత్తముని కన్నులు సూర్యకిరణ స్పర్శచేత వికసించిన తామరల వలె ఉబ్బుగా, ఎఱుపుగా మెరుస్తున్నాయని అర్థం అని నేననుకుంటున్నాను. ఈ భావనా జాలంలోకి కోతి పిర్రలు వచ్చే అవకాశాలే లేవు. సందర్భం, సమయం, ఔచిత్యం ప్రకారం పదాలను విశ్లేషించి ఆ బ్రహ్మవాక్యంలో ఉన్న పోలికను అర్థం చేసుకోవాలని నేననుకుంటున్నాను గురువర్యా...’’ అని చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యాఖ్యానాన్ని రామానుజుడు వివరించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే నీటిని తాగుతున్న ఎర్రని తామర తూండ్ల వలె, గులాబీ వర్ణఛాయలతో ఆర్ద్రంగా ఉన్న మనోహర నేత్రాలని ఆ వాక్యాన్ని సందర్భోచితంగా అన్వయించవలసి ఉంటుంది. కన్నులలో ఎప్పుడూ నీరు ఉంటుంది. సరస్సులో నీరు సూర్యుడి కిరణాలతో మెరిసినప్పుడు అక్కడే అప్పుడే వికసిస్తున్న తామర పూరేకుల వలె ఆర్ద్రయుతంగా ఆయన నేత్రాలు కనిపించాయి, పరమాత్ముని కన్నులో లేత ఎఱుపుదనాన్ని కలువల లేలేత ఎర్రదనంతో పోల్చడం సముచితంగా ఉంటుంది కాని, కేవలం ఎఱుపురంగులో ఉన్నంత మాత్రాన కోతి పిర్రలతో పోల్చడమా. ఆ పదాలకు ఆ అర్థాలు ఉన్న మాట నిజమే అయినా ఇంత అనుచితంగా, అసందర్భంగా అర్థ రహితంగా.. పోల్చడం న్యాయం కాదని రామానుజుడు వివరించాడు. భగవన్నేత్రాలు పుండరీకములనే భావన భక్తిని ప్రేరేపిస్తుంది కాని, కోతి పిర్రల పోలిక నకారాత్మకమైన విపరీత ఆలోచనలను ప్రేరేపించి, వర్ణన హాస్యాస్పదంగా మారి, రచయిత లక్ష్యం వాక్యపు ఉద్దేశ్యం దెబ్బతింటాయి. పోలిక అనేది శబ్దార్థ వివరణలో ఒక అలంకారం. ఉన్నతమైన ఉత్తమమైన భావాలను ప్రేరేపించే అర్థాలకోసం పోలికలుంటాయి కాని నీచమైన ఆలోచనలను జనింపచేయడానికి కాదు. రామానుజుని వివరణ మరోసారి సహాధ్యాయుల మనసు గెలుచుకుంది, మన్ననలు అందుకుంది. అందులో సమన్వయత, భక్తి, ఔచిత్యం, సందర్భం కలిసి ఉన్నాయి. అందులో రసం ఉంది రక్తి ఉంది. ప్రేమజనించే శక్తి ఉంది. గురువర్యులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో అని కూడా తోటి విద్యార్థులు ఆలోచించడం మొదలు పెట్టారు.శిష్యులు ఈ విధంగా ఆలోచిస్తారనేదే గురువుగారి బాధ. తాను చెప్పిన పోలిక ఎంత దారుణంగా ఉందో అప్పుడు అర్థమయింది. తోచింది తోచినట్టు చెప్పడం కన్నా కాస్త ఆలోచించి వివరిస్తే బాగుండేదని బాధ పడ్డారు. కాని మళ్లీ పెద్దరికం అడ్డొచ్చింది. మరోసారి తన అహం దెబ్బ తిన్నది. ఇంత ప్రతిభావంతమైన అన్వయం ముందు తన పాండిత్యం వెలవెల పోవడం ఖాయం. తన పరువు ప్రతిష్టలు రామానుజుని విజ్ఞాన తేజస్సుముందు పతనమవడం ఇది రెండో సారి. గురువుగా తనకు ఇది ఎదురు దెబ్బ. అందరి ముందూ జరిగింది కనుక, తన గురుకులానికి తీవ్ర అప్రతిష్ట. వ్యక్తిగతంగా తట్టుకోలేనంత తీవ్రమైన అవమానం అని యాదవప్రకాశుడి మనస్సు పరితపిస్తున్నది. కాని పైకి ఏమనగలడు? గురుశిష్యులుగా తమ పొందిక ఇక పొసగదని అనిపించిందాయనకు. కొంత సేపటి తరువాత, గురువు మాటలు బయటకు వచ్చాయి.‘‘నా బోధన నీకు సరిపడకపోతే నీవు ఈ గురుకులాన్ని వదలి వెళ్లవచ్చు’’ అని యాదవ ప్రకాశుడు రామానుజునితో అన్నారు. అందులో కోపం దాచడం సాధ్యం కాదు.గురువుగారి అహం దెబ్బ తిన్నదని గ్రహించాడు. కాని అందుకోసం విష్ణు దూషణయైన విపరీత వ్యాఖ్యానం సహించడం సాధ్యం కాదు. ఏమీ అనలేక పోయాడు. ఈ ఉద్రిక్త ఉద్వేగ సమయంలో గురుకులంలో ఉండడం, వదలడం గురించి వాదనకు దిగడం అప్రస్తుతమవుతుందనీ, మౌనమే శ్రేయస్కరమని భావించి వినయంగా నమస్కరించి ఊరుకున్నాడు రామానుజుడు.గురువులు లేదా సహాధ్యాయులు, లేదా ఇతర పండితులు చర్చాగోష్టిలో వ్యక్తం చేసిన భావనకన్నా విభిన్నమయిన అభిప్రాయాన్ని చెప్పడం అవిధేయత కాకూడదు. విశ్లేషణ విజ్ఞానాలకు సంబంధించిన అంశాలపైన చర్చ ఎన్నటికీ నేరం కారాదు. సముచితమైన అన్వయం సందర్భాన్ని బట్టి వివరించడమే విద్యావికాసం, అది తప్పుకానేకాదు అని రామానుజుడు మళ్లీ చెప్పదలచుకోలేదు. ఆ విధంగా సాగదీస్తే వాదం ప్రతివాదం పెరిగి వివాదం అవుతుంది. ప్రమాదం అవుతుంది. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది వెంటనే చెప్పడం కష్టం. కనుక నోరుమూసుకున్నాడు. అదీ విజ్ఞతే కదా.సహాధ్యాయులందరికీ రామానుజుని అన్వయం అర్థవంతంగా ఉందని తోచింది. ఇదే సరైనదని ప్రశంసించారు. యాదవ ప్రకాశునికి ఆగ్రహం కలిగిందని వారికీ అర్థమయింది. కాని గురువుగారి ఆగ్రహానికి అర్థం లేదు. దాన్ని ప్రకటించడం కూడా సరికాదని శిష్యులూ అనుకున్నారు, గురువుగారికీ అర్థమైంది. కాని అది అంతటితో ఆగలేదు. అది క్రమేణా అవమాన భావనగా పెరిగి పెరిగి అసూయగా మారి ప్రతీకారేచ్ఛకు దారితీస్తున్నది. ఆలోచిస్తే రామానుజుని పోలిక అన్వయం సమయోచితంగా ఉన్నాయని తనకూ అనిపిస్తున్నది. ఆ వివరణ ముందు తన అర్థం వివరణ నిలబడే అవకాశమే లేదు. కాని ఈ పరాజయాన్ని అంగీకరించడం సాధ్యం కావడం లేదు. ఆగ్రహం అసూయగా పరిణమిస్తూ పగగా ప్రజ్వలిస్తూ ఉన్నది. విభేదాల విషజ్వాల అయితే లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం కొన్ని వాక్యాల అన్వయానికి సంబంధించిన విభేదం మాత్రమే కాదని. మౌలికమైన సైద్ధాంతిక అవగాహనకు సంబంధించిన అంశమనీ తెలుస్తుంది. అద్వైత సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. అంటే ఆయనకు ఏ ఆకారాలూ వికారాలు ఉండవు. మానవులకు ఉన్నట్టు మంచీ చెడు వంటి గుణాలను ఆపాదించడానికి వీలు కాదు. కాని పరమాత్ముడు సుగుణుడనీ సాకారుడనీ రామానుజుడు అంటున్నాడు. అక్కడే సైద్ధాంతిక విభేదాలు మొదలైనాయి. దివ్యలక్షణ గుణవైభవాలున్న జగన్మోహనాకారాన్ని ఆరాధనా సాధనంగా దైవతత్వాన్ని వివరిస్తున్నాడు రామానుజుడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మకు భౌతిక లక్షణాలతో భేదాలేమిటనే ఆలోచన గురువుగారిది. ఈ విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అని గురువుగారికి సందేహం మొదలైంది. తన వాదాన్ని ఓడించి రామానుజుడు గెలుస్తాడేమో. యాదవ ప్రకాశుడి అద్వైత సిద్ధాంతమే పరాస్తమవుతుందేమో. అని భయంలో పడిపోయాడు. తన సిద్ధాంతాన్ని నిలబెట్టడం తన గురుతరమైన బాధ్యత, అందుకు రామానుజుడు అడ్డు వస్తున్నాడనీ అనుకున్నాడు గురువు. ఇటువంటి రామానుజుడిని తన శిష్యుడిగా ఇంకా కొనసాగించడం మంచిది కాదనే భావం ప్రబలమవుతూ వచ్చింది. తన మార్గానికి అడ్డు తగులుతున్నాడని అనుకుంటున్నాడు కనుక రామానుజుడి అడ్డును తొలగించడమే ఒక మార్గమేమో అనే తీవ్రమైన ఆలోచన కూడా వచ్చింది. తానా అంటే తందానా అనే శిష్యవర్గం ఈ వాదనను బలపరిచింది. గంగాయాత్రకని బయలు దేరి వారణాసి చేరి అక్కడ మణికర్ణిక ఘాట్ లో రామానుజుని ముంచి వేయడం సరైన ఆలోచన అని అనుకున్నారు. ఈ పథకం ప్రకారం తమ లక్ష్యం నెరవేరుతుంది, గంగా స్నానం వల్ల పాపం అంటదు, రామానుజుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడని నమ్మించవచ్చు అని యాదవప్రకాశుని అతని అనుయాయులు ఒప్పించారు. తీర్థయాత్రకు శిష్యబృందంతో బయలుదేరారు. రామానుజుడికి గోవింద మిశ్రుడికి ఈ పన్నాగం తెలియదు. పుణ్య క్షేత్ర సందర్శన గంగా స్నాన భాగ్యం కలుగుతుందని అమాయకంగా వారు నమ్మారు. కనుక వారూ గురువుగారితో పయనమయ్యారు. దారిలో శిష్యుల సంభాషణల ద్వారా గోవిందుడికి కుట్ర స్వరూపం కొంత అర్థమయింది. ఇంకా కొన్నాళ్ల తరువాత అది లోతైన కుట్ర అనే విషయం గోవిందుడికి అర్థమయింది. ఈ ప్రమాదం నుంచి రామానుజుని తప్పించాల్సిందే. వింధ్య పర్వతాల దాకా యాత్ర సాగింది. గోవిందుడికి ఏకాంతంగా రామానుజుడితో మాట్లాడే అవకాశం అంతగా దొరకడం లేదు. దొరికిన వెంటనే చాలా క్లుప్తంగా ప్రమాదాన్ని రామానుజుని చెవిన వేసినాడు. రామానుజుడు ఆవేదన చెందాడు. ఏ తప్పూ చేయలేదు. గురువు పట్ల ఏ అపచారమూ చేయలేదు. అయినా తనను గురువు గారు అనుమానిస్తున్నారు. శాస్త్ర అన్వయంలో విభేదించినందుకు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు తనకు ఈ శిక్ష అన్నమాట. ఇది తనకు పరీక్ష అనుకున్నాడు. గురువుగారి బృందం నుంచి వేరయిపోవడం ఒక్కటే మార్గం. వారితో నడవలేక వెనుకబడినట్లు నటించి తన సహాధ్యాయ బృందం నుంచి తప్పుకున్నాడు. కానీ దారి దొరకడం లేదు. ఎటు వెళితే ఏ ప్రాంతానికి చేరుకుంటాడో అర్థం కావడం లేదు. దట్టమైన అడవి. దిక్కు తోచడం లేదు. ఒంటరి తనం. అడగడానికి ఎవరూ కనిపించడం లేదు. దారి కూడా లేదు. ముళ్లతో కాళ్లు గీరుకుపోయినాయి. అలసట, దాహం, నిరాశ, సూర్యతాపం మించిపోతున్నది. ఆకలి దహించుకుపోతున్నది.ఇతరుల సొమ్ము అపహరించిన వాడికి నీరు దొరకని వింధ్యపర్వత ప్రాంతాల్లో జన్మిస్తాడని విన్నాను. నేనెవరి సొమ్ము తీసుకోకపోయినా నాకు ఆ పరిస్థితి ఎదురైందని రామానుజుడు విచారించాడు. ఇంత కష్టమైనా తన కర్మను తిట్టుకున్నాడే కానీ గురువుగారిని నిందించలేదు. నారాయణ నామమే శరణ్యమని ధ్యానిస్తూ ఉన్నాడు. వీలయినంత వరకు ముందుకు నడుస్తూ ఉన్నాడు. వరదుని దయ అంతలో ఒక జంట వస్తున్నట్టు గమనించాడు. ముచ్చట్లు చెప్పుకుంటూ యువదంపతులు వస్తున్నారు. దగ్గరికి చేరుకుంటూ ఉంటే అర్థమయింది వారు కోయ దంపతులని. ఈ కారడవిలో తనకోసమే దేవుడు పంపినట్టు వస్తున్నారనిపించింది. కనీసం దారైనా చూపకపోతారా?‘‘అయ్యా మీరు ఎక్కడనుంచి వస్తున్నారు, ఎటువైపు మీ ప్రయాణం...’’ అని రామానుజుడు వారిని ప్రశ్నించాడు.‘‘మేము సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాం. సత్యవ్రత క్షేత్రానికి (కాంచీపురం) వెళ్లాలని సంకల్పం. చాలా దూరం కదా..’’ అన్నాడా యువకుడు.‘‘మీ వెంట నేనూ రావచ్చా, నాకు ఇక్కడ దారి దొరకడం లేదు. నా గురువుగారు, సహాధ్యాయుల బృందంనుంచి తప్పిపోయాను. ముందుకు వెళ్తున్నానో వెనక్కు వెళ్తున్నానో కూడా తెలియడం లేదు’’. అని రామానుజుడు అడిగాడు.‘‘అదేం భాగ్యం నాయనా, మనం కలిసే వెళ్దాం. రండి’’ అని యువకుడు అన్నాడు. ఇద్దరూ మాటల్లో పడిపోయారు. కలిసి నడుస్తూ ఉన్నారు.సాయంకాలమైంది. దారిలో ఒక చెలిమె కనిపించింది. రామానుజుడు సాయంకాల సంధ్యావందనం ఆచరించాడు. ధ్యానం ముగిసింది. ముఖమూ, కాళ్లూ చేతులు కడుక్కుని, నీళ్లు తాగి సేద దీరారు. ఇంతలో కోయ యువదంపతులు ఫలాలు తెచ్చి పెట్టినారు. ఆ ఫలాలు తిని అక్కడ ఒక పెద్ద వటవృక్షం నీడన విశ్రమించారు. బాగా అలసి పోయినాడో ఏమో రామానుజుడికి తెల్లవారుజాము దాకా గాఢమైన నిద్రపట్టింది. మెలకువ వచ్చి చూసే సరికి పక్కన కోయ దంపతులు లేరు. అటూ ఇటూ కాస్త తిరిగి చూసినా వారి జాడ లేదు. తెల తెల వారుతున్నది. దూరంగా జనం మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తున్నది. ముందుకు వెళితే అక్కడో జలాశయం ఉంది. నీళ్లను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అక్కడ కొందరు స్నానాలు చేస్తున్నారు.‘‘అయ్యా ఇదే ప్రాంతం... దగ్గరలో ఏదైనా గ్రామంగానీ... పట్టణంగానీ ఉన్నాయా.. ’’అని అడిగారు.‘‘అయ్యా తమరు పుణ్యకోటి విమానం (కంచి గోపురం) చూచుటలేదా’’ అని ఎదురు ప్రశ్నించారు అక్కడి వారు.అవును దూరంగా అదే కాంచీపురం, వరదరాజుని గోపురం. ఆశ్చర్యం. తన గమ్యం చేరుకున్నాడు రామానుజుడు. కాదు కాదు తనను ఆ భిల్లు దంపతులు గమ్యం చేర్చారు. ఇంతకూ వారెవరు? ...ఎవరేమిటి? ఒక్క రాత్రిలో వింధ్య పర్వత ప్రాంతం నుంచి కాంచీపురానికి తనను తరలించిన తండ్రి కంచి వరదుడే, ఆ తల్లి లక్ష్మీతాయారే. సందేహం లేదు. తనను కరుణించి తల్లిదండ్రులై తరలి వచ్చిన ఆది దంపతులనే గుర్తించలేకపోయానే అని మధన పడ్డారు రామానుజుడు. ఇంటికి చేరుకుని తల్లి పాదాలకు నమస్కరించినాడు. -
ఇగోయిస్ట్తో కైరా స్టెప్పులు!
‘ఆకతాయి’ ఫేమ్ ఆశిష్‌రాజ్ హీరోగా సుబ్రమణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇగో’. సిమ్రన్ కథానాయిక. విజయ్ కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కైరా దత్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, బాలకృష్ణ ‘పైసా వసూల్’ చిత్రాల్లో కైరా దత్ స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ – ‘‘నా సెకండ్ ఫిల్మ్ ఇది. నా కథను, నన్ను నమ్మి సినిమా తీస్తున్నందుకు నిర్మాతలకు రుణపడి ఉంటాను. టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. మూడు పాటలను గోదావరి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించబోతున్నాం’’ అన్నారు. ‘‘సుబ్రమణ్యం అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అవుట్‌పుట్ బాగా వస్తోంది. ‘ఆకతాయి’ తర్వాత మా సంస్థలో ‘ఇగో’ చిత్రం మంచి హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘పాట చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు కైరాదత్. ‘‘ఈ సంస్థలో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. కథకు తగినట్లుగానే ‘ఇగో’ అనే టైటిల్ పెట్టాం. హీరోగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్‌రాజ్. ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో నా పాత్ర నిడివి తక్కువైనా నటనకు ప్రాధాన్యముంది’’ అన్నారు దీక్షాపంత్. -
ఆకతాయి కుర్రాడి ఇగో
‘ఆకతాయి’ సినిమా ఫేమ్ ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా ‘ఇగో’. సుబ్రమణ్యం దర్శకత్వంలో ‘ఆకతాయి’ నిర్మాతలు విజయ్ కరణ్–కౌసల్ కరణ్–అనిల్ కరణ్ నిర్మిస్తున్న ‘ఇగో’ మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఇది. మూడు షెడ్యూల్స్‌లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేశాం. లాస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో పాత్ర సరికొత్తగా ఉంటుంది. క్వాలిటీ ఔట్పుట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దీక్షాపంత్, రావు రమేశ్, పోసాని, పృధ్వి, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె. -
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'ఇగో'
'ఆకతాయి' సినిమా తరువాత 'వికెఎ ఫిలిమ్స్' నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇగో'. విజయ్ కరణ్, కౌసల్ కరణ్, అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. నవతరం ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ను గోదారి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'ఇగో' రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేయనున్నాం' అన్నారు. -
ఆకతాయికి ఇగో
‘ఆకతాయి’ సినిమాతో యువతను ఆకట్టుకున్న ఆశిష్ రాజ్ హీరోగా తెరకెక్కుతోన్న ద్వితీయ చిత్రం ‘ఇగో’. సిమ్రన్ కథానాయిక. ‘ప్రేమా గీమా జాన్తా నయ్’ ఫేమ్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం (సుబ్బు) దర్శకత్వంలో వి.కె.ఎ. ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు సాయికార్తీక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అహంభావం ఉన్న గోపీ, ఇందు ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రమిది. పల్లెటూరు, పట్టణ సంస్కృతుల నేపథ్యంలో ఉంటుంది. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తాం. హైదరాబాద్, పాలకొల్లులో ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తాం. దసరాకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె. -
'ఈగో దెబ్బతింటుందని పాక్ అలా చేస్తోంది'
జమ్మూ: తన అహంకారం సంతృప్తి చెందేందుకే భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాకిస్థాన్ అబద్ధం చెబుతోందని బీజేపీ ఆరోపించింది. పాక్ ఆర్మీ ఎప్పుడూ ఈగోతోనే ఉంటుందని, దానికి అహంకారం తక్కువ చేసుకోవడం ఇష్టం ఉండదని పేర్కొంది.అసలు భారత్ తమ ప్రాంతంలో ఎలాంటి సర్జికల్ దాడులు నిర్వహించలేదని పాక్ ఆరోపించడంపై జమ్మూలోని బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా ఖండిస్తూ.. 'భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులను అంగీకరించపోవడం వెనుక వాస్తవం ఏమిటంటే పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ తమ అహంకారంను ఎప్పుడూ తక్కువకానివ్వవు. వారి అహంకారం దెబ్బతింటుందనే ఇలా చేస్తున్నారు. ఇక ఆ దేశ ఆర్మీ అధికారి దిగిపోతున్న ఈ సమయంలో ఇలాంటిని అస్సలు అంగీకరించకదు' అని మండిపడ్డారు. ఈ సందర్భంగా భారత ఆర్మీని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, కశ్మీర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'స్మృతి ఇరానీ... ఈగో పక్కనపెట్టు'
న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. స్మృతి అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ధ్వజమెత్తారు. అహం తగ్గించుకుని, తన శాఖపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. 'అధికారంలో ఉన్నవారికి అహం పనికిరాదు. పాలకులకు ఈగో పెద్ద శత్రువు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం మానేసి తన శాఖపై దృష్టి పెట్టాలని స్మృతి ఇరానీని సవియనంగా కోరుతున్నామ'ని రణదీప్ సూర్జివాలా పేర్కొన్నారు. ఇరాని బాగా చదువుకున్నారని, అయితే అన్ని యూనివర్సిటీల నుంచి ఆమె పట్టాలు ఎలా సాధించారో తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, స్మృతి ఇరానీ మధ్య ట్విటర్ లో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: అధికారులు అహం వీడి పనిచేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు సత్వర సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలకం కావాలన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం నూతన డైరీ-2016ని మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ‘గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని జనం మా వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే వెబ్‌ల్యాండ్ ద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలోనే అంతరం!
► జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలవని సీఈఓ ► మర్యాదపూర్వకంగా కూడా కలవని వైనం ► చర్చనీయాంశమైన అధికారి తీరు ► పాలనపై ప్రభావం చూపే అవకాశం సాక్షి, సంగారెడ్డి: ఇద్దరూ మహిళలే.. వాళ్లకు అహం అడ్డొచ్చింది. ఒకరు ఐఏఎస్‌కాగా, మరొకరు జిల్లా పరిషత్తు చైర్మన్. కానీ ఇప్పటి వరకు ఒకరికొకరు ఎదురు పడలేదు. పలకరించుకోలేదు. ఇద్దరి మధ్య ఏర్పడిన అంతరం అప్పుడే చర్చనీయాంశ మైంది. జెడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అధికారిణి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలవకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జెడ్పీ సీఈఓగా ఏ అధికారి బాధ్యతలు స్వీకరించినా ముందుగా చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలవటం ఆనవాయితీ.. కాగా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వర్షిణి ఇంత వరకు జెడ్పీ చైర్పర్సన్ రాజమణిని కలవలేదని సమాచారం. నూతన సీఈఓగా ఐఏఎస్ అధికారి రాకతో జిల్లా పరిషత్‌లో పాలన వ్యవహారాల్లో మార్పులు వస్తాయని అందరూ భావించారు. అయితే సీఈఓ తీరుపై జెడ్పీటీసీలు, రాజకీయ నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వయంగా సీఈఓ తీరుపై కినుకువహించినట్లు సమాచారం. గతంలో సీఈఓగా పనిచేసిన మధు వ్యవహారశైలి నచ్చక జెడ్పీ చైర్పర్సన్ రాజమణి ఆయనను జిల్లా నుంచి బదిలీ చేయాల్సిందిగా మంత్రి హరీశ్‌రావును కోరింది. దీంతో ప్రభుత్వం మధును బదిలీ చేసి ఆయన స్థానంలో మహిళా ఐఎఎస్ అధికారి వర్షిణిని సీఈఓగా నియమించింది. ఈనెల 11న వర్షిణి జెడ్పీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను కలిశారు. అయితే రాజమణితో మాత్రం భేటీ కాకపోవటం గమనార్హం. సీఈఓ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను సమన్వయం పరుచుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లా పరిషత్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని లేనిపక్షంలో పాలన దెబ్బతినే అవకాశం ఉంటుందని జెడ్పీటీసీలు, ప్రజలు అంటున్నారు. -
'నాకైతే ఇగో లేదు'
దుబాయ్: సెలిబ్రెటీ రేంజ్ కు వెళితే ఎవరికైనా కాస్తా కూస్తో ఇగో కూడా ఉంటుంది. అయితే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్(72) కు అసలు ఇగోనే లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. షమితాబ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తన అధికారిక బ్లాగ్ లో అమితాబ్ తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, అక్షర, అమితాబచ్చన్ లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ స్పందిస్తూ.. తన వృత్తిలో ఎప్పుడూ ఇగోను దరిచేరనీయలేదన్నాడు. తనకు సొంత ప్రయోజనాలు, సొంత అభిప్రాయాల గురించి తెలియదన్నాడు. అసలు ఆ విషయాన్ని కొస్తే తన సొంత ప్రయోజనాలకు ఏనాడు పెద్ద పీట వేయలేదని అమితాబ్ స్పష్టం చేశాడు. మిగతా వారికి ఇగో ఉందా?లేదా అనేది తనకు తెలియదన్నాడు. -
సారీ.. మాస్టారూ..
మన సన్నిహితులను అనవసరంగా తిట్టేశాం లేదా మన మాటలతో వారిని నొప్పించాం.. సారీ చెప్పాలి. కానీ ఈగో అడ్డొస్తోంది. మరెలా? జపాన్‌లో అయితే దీనికో సులువైన పరిష్కారం ఉంది. ఎందుకంటే.. ఇక్కడ మన తరఫున క్షమాపణలు చెప్పేందుకూ ప్రత్యేకమైన సంస్థలున్నాయి! ఈ అపాలజీ ఏజెన్సీలకు కొంత మొత్తం ముట్టజెబితే.. మన తరఫున వారు సారీ చెబుతారన్నమాట. ఇందుకోసం సదరు సంస్థలు తమ సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తాయి. వారు పక్కా ప్రొఫెషనల్స్ అట. పరిస్థితి తీవ్రతను బట్టి క్షమాపణలు చెప్పే విధానాల్లో తేడాలుంటాయి. ఇందులో బోరున ఏడుస్తూ.. సారీ చెప్పే విధానమూ ఉంది. కొన్నిసార్లయితే.. ఈ సంస్థ తరఫున సారీ చెప్పడానికి వెళ్లేవారు.. వారు మన బంధువో లేక స్నేహితుడో అని అవతలవాళ్లకు చె ప్పి.. మనం చాలా బాధపడుతున్నామని.. అందుకే మన తరఫున సారీ చెప్పడానికి వచ్చామని నమ్మిస్తారు. ఇలా చేయడం మోసమంటూ పలువురు ఈ సంస్థలను విమర్శిస్తున్నా.. వీరి బిజినెస్ తగ్గడం లేదు. వీరికి వచ్చేవి కూడా ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నాయట. నేరుగా మనిషిని పంపి సారీ చెప్పాలంటే రూ.15 వేలు, ఫోన్,ఈమెయిల్ ద్వారా క్షమాపణలకు రూ.5 వేలు వసూలు చేస్తామని షాజాయియా ఐగా ప్రో ఏజెన్సీ సంస్థ తెలిపింది.