రామానుజుని రక్షించిన కంచి వరదుడు | Kanni Varadu who was saved by Ramanuju | Sakshi
Sakshi News home page

రామానుజుని రక్షించిన కంచి వరదుడు

Published Sun, Dec 10 2017 12:21 AM | Last Updated on Sun, Dec 10 2017 12:21 AM

Kanni Varadu who was saved by Ramanuju - Sakshi

ఇది రెండో సారి... రామానుజుడు తన వ్యాఖ్యానాన్ని తప్పుబట్టడం.... అయినా నేనేమీ తప్పు చెప్పలేదే... ‘‘నేను ఆ వాక్యంలోని పదాలకు మన నిఘంటువుల్లో... వాడుకలో ఉన్న సామాన్యమయిన అర్థం చెప్పాను. ఆ అర్థం లేదంటావా? దాంతోపాటు ఇంకే అర్థమయినా నీకు తోస్తున్నదా.... నీ అభిప్రాయం ప్రకారం ఇంకేదయినా అర్థం ఉంటే అది నీవు చెప్పవచ్చు కదా.... దానికీవిధంగా కన్నీళ్లు కార్చడం ఎందుకు... నేనేదో ఘోరం చేసినట్టు....’’ అన్నారు గురువు.రామానుజుడు స్థిమితంగా చెప్పడానికి ఉపక్రమించాడు. మొహమాటానికి పోయి చెప్పకపోతే తప్పవుతుంది. తన బుద్ధికి తోచిన అన్వయాన్ని తను చెప్పక తప్పదు. గురువు గారి అనుజ్ఞ కూడా అయింది కనుక చెప్పడం ప్రారంభించాడు.‘‘క..పి..మాటలో ‘క’ అంటే నీరు, పి అంటే పిబతి, అంటే తాగునది, నీటిని తాగేవాడు సూర్యుడు, కప్యాసం అనే సమాసానికి అర్థం సూర్యకిరణముల తాకిడిచేత వికసించినది అనే భావం. ఆ విధంగా రవికిరణ స్పర్శ చేత వికసిత పులకితమయ్యే పుష్పం తామర. పురుషోత్తముని కన్నులు సూర్యకిరణ స్పర్శచేత వికసించిన తామరల వలె ఉబ్బుగా, ఎఱుపుగా మెరుస్తున్నాయని అర్థం అని నేననుకుంటున్నాను. ఈ భావనా జాలంలోకి  కోతి పిర్రలు వచ్చే అవకాశాలే లేవు. సందర్భం, సమయం, ఔచిత్యం ప్రకారం పదాలను విశ్లేషించి ఆ బ్రహ్మవాక్యంలో ఉన్న పోలికను అర్థం చేసుకోవాలని నేననుకుంటున్నాను గురువర్యా...’’ అని చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యాఖ్యానాన్ని రామానుజుడు వివరించాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే నీటిని తాగుతున్న ఎర్రని తామర తూండ్ల వలె, గులాబీ వర్ణఛాయలతో ఆర్ద్రంగా ఉన్న మనోహర నేత్రాలని ఆ వాక్యాన్ని సందర్భోచితంగా అన్వయించవలసి ఉంటుంది. కన్నులలో ఎప్పుడూ నీరు ఉంటుంది. సరస్సులో నీరు సూర్యుడి కిరణాలతో మెరిసినప్పుడు అక్కడే అప్పుడే వికసిస్తున్న తామర పూరేకుల వలె ఆర్ద్రయుతంగా ఆయన నేత్రాలు కనిపించాయి, పరమాత్ముని కన్నులో లేత ఎఱుపుదనాన్ని కలువల లేలేత ఎర్రదనంతో పోల్చడం సముచితంగా ఉంటుంది కాని, కేవలం ఎఱుపురంగులో ఉన్నంత మాత్రాన కోతి పిర్రలతో పోల్చడమా. ఆ పదాలకు ఆ అర్థాలు ఉన్న మాట నిజమే అయినా ఇంత అనుచితంగా, అసందర్భంగా అర్థ రహితంగా.. పోల్చడం న్యాయం కాదని రామానుజుడు వివరించాడు. భగవన్నేత్రాలు పుండరీకములనే భావన భక్తిని ప్రేరేపిస్తుంది కాని, కోతి పిర్రల పోలిక నకారాత్మకమైన విపరీత ఆలోచనలను ప్రేరేపించి, వర్ణన హాస్యాస్పదంగా మారి, రచయిత లక్ష్యం వాక్యపు ఉద్దేశ్యం దెబ్బతింటాయి. పోలిక అనేది శబ్దార్థ వివరణలో ఒక అలంకారం. ఉన్నతమైన ఉత్తమమైన భావాలను ప్రేరేపించే అర్థాలకోసం పోలికలుంటాయి కాని నీచమైన ఆలోచనలను జనింపచేయడానికి కాదు.  రామానుజుని వివరణ మరోసారి సహాధ్యాయుల మనసు గెలుచుకుంది, మన్ననలు అందుకుంది. అందులో సమన్వయత, భక్తి, ఔచిత్యం, సందర్భం కలిసి ఉన్నాయి. అందులో రసం ఉంది రక్తి ఉంది. ప్రేమజనించే శక్తి ఉంది. గురువర్యులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో అని కూడా తోటి విద్యార్థులు ఆలోచించడం మొదలు పెట్టారు.శిష్యులు ఈ విధంగా ఆలోచిస్తారనేదే గురువుగారి బాధ. తాను చెప్పిన పోలిక ఎంత దారుణంగా ఉందో అప్పుడు అర్థమయింది. తోచింది తోచినట్టు చెప్పడం కన్నా కాస్త ఆలోచించి వివరిస్తే బాగుండేదని బాధ పడ్డారు. కాని మళ్లీ పెద్దరికం అడ్డొచ్చింది. మరోసారి తన అహం దెబ్బ తిన్నది. ఇంత ప్రతిభావంతమైన అన్వయం ముందు తన పాండిత్యం వెలవెల పోవడం ఖాయం. తన పరువు ప్రతిష్టలు రామానుజుని విజ్ఞాన తేజస్సుముందు పతనమవడం ఇది రెండో సారి. గురువుగా తనకు ఇది ఎదురు దెబ్బ. అందరి ముందూ జరిగింది కనుక, తన గురుకులానికి తీవ్ర అప్రతిష్ట. వ్యక్తిగతంగా తట్టుకోలేనంత తీవ్రమైన అవమానం అని యాదవప్రకాశుడి మనస్సు పరితపిస్తున్నది. కాని పైకి ఏమనగలడు? గురుశిష్యులుగా తమ పొందిక ఇక పొసగదని అనిపించిందాయనకు.

కొంత సేపటి తరువాత, గురువు మాటలు బయటకు వచ్చాయి.‘‘నా బోధన నీకు సరిపడకపోతే నీవు ఈ గురుకులాన్ని వదలి వెళ్లవచ్చు’’ అని యాదవ ప్రకాశుడు రామానుజునితో అన్నారు. అందులో కోపం దాచడం సాధ్యం కాదు.గురువుగారి అహం దెబ్బ తిన్నదని గ్రహించాడు. కాని అందుకోసం విష్ణు దూషణయైన విపరీత వ్యాఖ్యానం సహించడం సాధ్యం కాదు. ఏమీ అనలేక పోయాడు. ఈ ఉద్రిక్త ఉద్వేగ సమయంలో గురుకులంలో ఉండడం, వదలడం గురించి వాదనకు దిగడం అప్రస్తుతమవుతుందనీ, మౌనమే శ్రేయస్కరమని భావించి వినయంగా నమస్కరించి ఊరుకున్నాడు రామానుజుడు.గురువులు లేదా సహాధ్యాయులు, లేదా ఇతర పండితులు చర్చాగోష్టిలో వ్యక్తం చేసిన భావనకన్నా విభిన్నమయిన అభిప్రాయాన్ని చెప్పడం అవిధేయత కాకూడదు. విశ్లేషణ విజ్ఞానాలకు సంబంధించిన అంశాలపైన చర్చ ఎన్నటికీ నేరం కారాదు. సముచితమైన అన్వయం సందర్భాన్ని బట్టి వివరించడమే విద్యావికాసం, అది తప్పుకానేకాదు అని రామానుజుడు మళ్లీ చెప్పదలచుకోలేదు. ఆ విధంగా సాగదీస్తే వాదం ప్రతివాదం పెరిగి వివాదం అవుతుంది. ప్రమాదం అవుతుంది. దాని పర్యవసానాలు  ఏ విధంగా ఉంటాయనేది వెంటనే చెప్పడం కష్టం. కనుక నోరుమూసుకున్నాడు. అదీ విజ్ఞతే కదా.సహాధ్యాయులందరికీ రామానుజుని అన్వయం అర్థవంతంగా ఉందని తోచింది. ఇదే సరైనదని ప్రశంసించారు. యాదవ ప్రకాశునికి ఆగ్రహం కలిగిందని వారికీ అర్థమయింది. కాని గురువుగారి ఆగ్రహానికి అర్థం లేదు. దాన్ని ప్రకటించడం కూడా సరికాదని శిష్యులూ అనుకున్నారు, గురువుగారికీ అర్థమైంది.  కాని అది అంతటితో ఆగలేదు. అది క్రమేణా అవమాన భావనగా పెరిగి పెరిగి అసూయగా మారి ప్రతీకారేచ్ఛకు దారితీస్తున్నది. ఆలోచిస్తే రామానుజుని పోలిక అన్వయం సమయోచితంగా ఉన్నాయని తనకూ అనిపిస్తున్నది. ఆ వివరణ ముందు తన అర్థం వివరణ నిలబడే అవకాశమే లేదు.  కాని ఈ పరాజయాన్ని అంగీకరించడం సాధ్యం కావడం లేదు. ఆగ్రహం అసూయగా పరిణమిస్తూ పగగా ప్రజ్వలిస్తూ ఉన్నది.

విభేదాల విషజ్వాల
అయితే లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం కొన్ని వాక్యాల అన్వయానికి సంబంధించిన విభేదం మాత్రమే కాదని. మౌలికమైన సైద్ధాంతిక అవగాహనకు సంబంధించిన అంశమనీ తెలుస్తుంది. అద్వైత సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. అంటే ఆయనకు ఏ ఆకారాలూ వికారాలు ఉండవు. మానవులకు ఉన్నట్టు మంచీ చెడు వంటి గుణాలను ఆపాదించడానికి వీలు కాదు. కాని పరమాత్ముడు సుగుణుడనీ సాకారుడనీ రామానుజుడు అంటున్నాడు. అక్కడే సైద్ధాంతిక విభేదాలు మొదలైనాయి. దివ్యలక్షణ గుణవైభవాలున్న జగన్మోహనాకారాన్ని ఆరాధనా సాధనంగా దైవతత్వాన్ని వివరిస్తున్నాడు రామానుజుడు.  నిరాకార నిర్గుణ పరబ్రహ్మకు భౌతిక లక్షణాలతో భేదాలేమిటనే ఆలోచన గురువుగారిది. ఈ విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అని గురువుగారికి సందేహం మొదలైంది. తన వాదాన్ని ఓడించి రామానుజుడు గెలుస్తాడేమో. యాదవ ప్రకాశుడి అద్వైత సిద్ధాంతమే పరాస్తమవుతుందేమో. అని భయంలో పడిపోయాడు. తన సిద్ధాంతాన్ని నిలబెట్టడం తన గురుతరమైన బాధ్యత, అందుకు రామానుజుడు అడ్డు వస్తున్నాడనీ అనుకున్నాడు గురువు. ఇటువంటి రామానుజుడిని తన శిష్యుడిగా ఇంకా కొనసాగించడం మంచిది కాదనే భావం ప్రబలమవుతూ వచ్చింది.

తన మార్గానికి అడ్డు తగులుతున్నాడని అనుకుంటున్నాడు కనుక రామానుజుడి అడ్డును తొలగించడమే  ఒక మార్గమేమో అనే తీవ్రమైన ఆలోచన కూడా వచ్చింది. తానా అంటే తందానా అనే శిష్యవర్గం ఈ వాదనను బలపరిచింది.  గంగాయాత్రకని బయలు దేరి వారణాసి చేరి అక్కడ మణికర్ణిక ఘాట్‌ లో రామానుజుని ముంచి వేయడం సరైన ఆలోచన అని అనుకున్నారు. ఈ పథకం ప్రకారం తమ లక్ష్యం నెరవేరుతుంది, గంగా స్నానం వల్ల పాపం అంటదు, రామానుజుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడని నమ్మించవచ్చు అని యాదవప్రకాశుని అతని అనుయాయులు ఒప్పించారు. తీర్థయాత్రకు శిష్యబృందంతో బయలుదేరారు. రామానుజుడికి గోవింద మిశ్రుడికి ఈ పన్నాగం తెలియదు. పుణ్య క్షేత్ర సందర్శన గంగా స్నాన భాగ్యం కలుగుతుందని అమాయకంగా వారు నమ్మారు.  కనుక వారూ గురువుగారితో పయనమయ్యారు. దారిలో శిష్యుల సంభాషణల ద్వారా గోవిందుడికి కుట్ర స్వరూపం కొంత అర్థమయింది. ఇంకా కొన్నాళ్ల తరువాత అది లోతైన కుట్ర అనే విషయం గోవిందుడికి అర్థమయింది. ఈ  ప్రమాదం నుంచి రామానుజుని తప్పించాల్సిందే. వింధ్య పర్వతాల దాకా యాత్ర సాగింది. గోవిందుడికి ఏకాంతంగా రామానుజుడితో మాట్లాడే అవకాశం అంతగా దొరకడం లేదు. దొరికిన వెంటనే చాలా క్లుప్తంగా ప్రమాదాన్ని రామానుజుని చెవిన వేసినాడు.

రామానుజుడు ఆవేదన చెందాడు. ఏ తప్పూ చేయలేదు. గురువు పట్ల ఏ అపచారమూ చేయలేదు. అయినా తనను గురువు గారు అనుమానిస్తున్నారు. శాస్త్ర అన్వయంలో విభేదించినందుకు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు తనకు ఈ శిక్ష అన్నమాట. ఇది తనకు పరీక్ష అనుకున్నాడు. గురువుగారి బృందం నుంచి వేరయిపోవడం ఒక్కటే మార్గం.  వారితో నడవలేక వెనుకబడినట్లు నటించి తన సహాధ్యాయ బృందం నుంచి తప్పుకున్నాడు. కానీ దారి దొరకడం లేదు. ఎటు వెళితే ఏ ప్రాంతానికి చేరుకుంటాడో అర్థం కావడం లేదు. దట్టమైన అడవి. దిక్కు తోచడం లేదు. ఒంటరి తనం. అడగడానికి ఎవరూ కనిపించడం లేదు. దారి కూడా లేదు. ముళ్లతో కాళ్లు గీరుకుపోయినాయి. అలసట, దాహం, నిరాశ, సూర్యతాపం మించిపోతున్నది. ఆకలి దహించుకుపోతున్నది.ఇతరుల సొమ్ము అపహరించిన వాడికి నీరు దొరకని వింధ్యపర్వత ప్రాంతాల్లో జన్మిస్తాడని విన్నాను. నేనెవరి సొమ్ము తీసుకోకపోయినా నాకు ఆ పరిస్థితి ఎదురైందని రామానుజుడు విచారించాడు. ఇంత కష్టమైనా తన కర్మను తిట్టుకున్నాడే కానీ గురువుగారిని నిందించలేదు. నారాయణ నామమే శరణ్యమని ధ్యానిస్తూ ఉన్నాడు. వీలయినంత వరకు ముందుకు నడుస్తూ ఉన్నాడు.

వరదుని దయ
అంతలో ఒక జంట వస్తున్నట్టు గమనించాడు. ముచ్చట్లు చెప్పుకుంటూ యువదంపతులు వస్తున్నారు. దగ్గరికి చేరుకుంటూ ఉంటే అర్థమయింది వారు కోయ దంపతులని.  ఈ కారడవిలో తనకోసమే దేవుడు పంపినట్టు వస్తున్నారనిపించింది. కనీసం దారైనా చూపకపోతారా?‘‘అయ్యా మీరు ఎక్కడనుంచి వస్తున్నారు, ఎటువైపు మీ ప్రయాణం...’’ అని రామానుజుడు వారిని ప్రశ్నించాడు.‘‘మేము సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాం. సత్యవ్రత క్షేత్రానికి (కాంచీపురం) వెళ్లాలని సంకల్పం.  చాలా దూరం కదా..’’ అన్నాడా యువకుడు.‘‘మీ వెంట నేనూ రావచ్చా, నాకు ఇక్కడ దారి దొరకడం లేదు. నా గురువుగారు, సహాధ్యాయుల బృందంనుంచి తప్పిపోయాను. ముందుకు వెళ్తున్నానో వెనక్కు వెళ్తున్నానో కూడా తెలియడం లేదు’’.  అని రామానుజుడు అడిగాడు.‘‘అదేం భాగ్యం నాయనా, మనం కలిసే వెళ్దాం. రండి’’ అని యువకుడు అన్నాడు. ఇద్దరూ మాటల్లో పడిపోయారు. కలిసి నడుస్తూ ఉన్నారు.సాయంకాలమైంది. దారిలో ఒక చెలిమె కనిపించింది. రామానుజుడు సాయంకాల సంధ్యావందనం ఆచరించాడు. ధ్యానం ముగిసింది. ముఖమూ, కాళ్లూ చేతులు కడుక్కుని, నీళ్లు తాగి సేద దీరారు. ఇంతలో కోయ యువదంపతులు ఫలాలు తెచ్చి పెట్టినారు. ఆ ఫలాలు తిని అక్కడ ఒక పెద్ద వటవృక్షం నీడన విశ్రమించారు.  బాగా అలసి పోయినాడో ఏమో రామానుజుడికి తెల్లవారుజాము దాకా గాఢమైన నిద్రపట్టింది.

మెలకువ వచ్చి చూసే సరికి పక్కన కోయ దంపతులు లేరు. అటూ ఇటూ కాస్త తిరిగి చూసినా వారి జాడ లేదు. తెల తెల వారుతున్నది. దూరంగా జనం మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తున్నది. ముందుకు వెళితే అక్కడో జలాశయం ఉంది. నీళ్లను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అక్కడ కొందరు స్నానాలు చేస్తున్నారు.‘‘అయ్యా ఇదే ప్రాంతం... దగ్గరలో ఏదైనా గ్రామంగానీ... పట్టణంగానీ ఉన్నాయా.. ’’అని అడిగారు.‘‘అయ్యా తమరు పుణ్యకోటి విమానం (కంచి గోపురం) చూచుటలేదా’’ అని ఎదురు ప్రశ్నించారు అక్కడి వారు.అవును దూరంగా అదే కాంచీపురం, వరదరాజుని గోపురం. ఆశ్చర్యం. తన గమ్యం చేరుకున్నాడు రామానుజుడు. కాదు కాదు తనను ఆ భిల్లు దంపతులు గమ్యం చేర్చారు. ఇంతకూ వారెవరు? ...ఎవరేమిటి? ఒక్క రాత్రిలో వింధ్య పర్వత ప్రాంతం నుంచి కాంచీపురానికి తనను తరలించిన తండ్రి కంచి వరదుడే, ఆ తల్లి లక్ష్మీతాయారే. సందేహం లేదు. తనను కరుణించి తల్లిదండ్రులై తరలి వచ్చిన ఆది దంపతులనే గుర్తించలేకపోయానే అని మధన పడ్డారు రామానుజుడు. ఇంటికి చేరుకుని తల్లి పాదాలకు నమస్కరించినాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement