తల్లి గారి ఊరైన కుంభకోణంలో రామానుజన్ హైస్కూలులో చదువుకుంటున్న రోజుల్లోనే జి.ఎస్. కార్ పుస్తకం ‘ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మేథమెటిక్స్’ ని అధ్యయనం చేసేశారు! కళాశాలలో చదివిన సమయంలోనే లెక్కల్లో మునిగిపోయి, ఇతర సబ్జెక్టులను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆయన పట్టభద్రులు కాలేకపోయారు. దాంతో మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఆయన తల్లి 1909లో తొమ్మిదేళ్ల అమ్మాయి జానకీ అమ్మాళ్‌తో ఆయనకు పెళ్లి నిశ్చయం చేయడంతో బతుకు తెరువు కోసం ఆయన ప్రయత్నించవలసి వచ్చింది.
మద్రాసు పోర్ట్ ట్రస్టులో అకౌంట్స్ గుమాస్తాగా ఉద్యోగం లభించింది. అదృష్టవశాత్తూ పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఎస్.నారాయణ రావు ఒక గణితవేత్త. గణితంలో రామానుజన్ ప్రతిభను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ దృష్టికి తీసుకెళ్లారు. రామానుజన్ అప్పటికే రాబట్టిన గణిత సూత్రాల విలువను నిగ్గు తేల్చడానికి వాటిని ఇంగ్లండ్‌లోని గణిత నిపుణుల దృష్టికి తీసుకెళ్లాలని మద్రాసులోని గణిత వేత్తలు ఆయనను ప్రోత్సహించారు. కానీ పట్టభద్రుడు కూడా కాని రామానుజన్ రాతలను చాలామంది నిర్లక్ష్యంగా అవతల పారేశారు. కనీసం ఆయనకు జవాబు కూడా ఇవ్వని వారెందరో. అయితే కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌కి చెందిన సుప్రసిద్ధ గణిత ఆచార్యులు జి.హెచ్. హార్డీ మాత్రం రామానుజన్ రాసి పంపిన 120 గణిత సూత్రాలను చూసి ఆశ్చర్యపోయారు.
వాటిన సలు అతను ఎలా రాబట్టాడో కూడా ఆయనకు అంతుచిక్కలేదు. తదుపరి అధ్యయనం కోసం కేంబ్రిడ్జికి రావాలని రామానుజన్‌ని హార్డీ ఆహ్వానించారు. గణితంలో పట్టభద్రుడైనా కాని రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రవేశం కల్పించడానికి హార్డీ, ఆయన సహోద్యోగి జె.ఇ.. లిటిల్‌వుడ్ ప్రత్యేకంగా కృషి చేశారు. రామానుజన్ విదేశాలకు వెళ్లడానికి మతపరమైన ఆచారాలు అడ్డు వచ్చాయి. చివరకు రామానుజన్ 1914 లో కేంబ్రిడ్జ్ చేరుకున్నారు. ఆయన పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. 1916 లో రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పట్టా ప్రదానం చేసింది.
తరువాత 1919లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా చేసింది. బహుశా ఆహారం విషయంలో అశ్రద్ధ, నిరంతర పరిశోధనల వల్ల కావచ్చు, ఆయనకు క్షయ వ్యాధి సోకింది. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామానుజన్ మరుసటి ఏడాదే కుంభకోణంలో కన్ను మూశారు. రామానుజన్ తన నోట్ పుస్తకాలలో రాసుకున్న సూత్రాలు ఎంతోమంది గణిత పరిశోధకుల మెదడుకు మేత కల్పించాయి.
– మోహన్ శ్రీఖండే, మేథమెటిక్స్ ప్రొఫెసర్
(చదవండి: చైతన్య భారతి: సమ్మిళిత శాస్త్రజ్ఞుడు... జీవశాస్త్ర పితామహుడు)
Comments
Please login to add a commentAdd a comment