Ramanujan
-
ఆ రెండింటి కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నా: 'కిక్' నటి
సీనియర్ నటి నళిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. 1980-90ల్లో క్రేజీ బ్యూటీగా మారింది. అలాంటి సమయంలోనే నటుడు, దర్శకుడు రామరాజన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) ప్రస్తుతం సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు చేస్తున్న నళిని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు.. కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, విడాకులు గురించి మాట్లాడింది. 'హీరోయిన్గా నేను బిజీగా ఉన్నప్పుడు ఏడాదికి 24 సినిమాల్లో నటించా. తినడం, నిద్రపోవడం కోసమే పెళ్లి చేసుకోవాలని భావించాను. అలాంటప్పుడు నటుడు రామరాజన్ని లవ్ చేశాను' 'కొన్నాళ్లకు మా ప్రేమ వ్యవహారం నా తల్లిదండ్రులకు చెప్పడంతో అప్పటినుంచి రామరాజన్‌తో నటించడానికి వాళ్లు ఒప్పుకోలేదు. రామరాజన్ మంచి నటుడు, తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆయన బంగారు లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో సెట్ కాలేదు. దీంతో విడిపోయాం. పెళ్లి రద్దయినా ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు' అని నటి నళిని తన ఆవేదన బయటపెట్టింది. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) -
చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి
తల్లి గారి ఊరైన కుంభకోణంలో రామానుజన్ హైస్కూలులో చదువుకుంటున్న రోజుల్లోనే జి.ఎస్. కార్ పుస్తకం ‘ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మేథమెటిక్స్’ ని అధ్యయనం చేసేశారు! కళాశాలలో చదివిన సమయంలోనే లెక్కల్లో మునిగిపోయి, ఇతర సబ్జెక్టులను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆయన పట్టభద్రులు కాలేకపోయారు. దాంతో మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఆయన తల్లి 1909లో తొమ్మిదేళ్ల అమ్మాయి జానకీ అమ్మాళ్తో ఆయనకు పెళ్లి నిశ్చయం చేయడంతో బతుకు తెరువు కోసం ఆయన ప్రయత్నించవలసి వచ్చింది. మద్రాసు పోర్ట్ ట్రస్టులో అకౌంట్స్ గుమాస్తాగా ఉద్యోగం లభించింది. అదృష్టవశాత్తూ పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఎస్.నారాయణ రావు ఒక గణితవేత్త. గణితంలో రామానుజన్ ప్రతిభను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ దృష్టికి తీసుకెళ్లారు. రామానుజన్ అప్పటికే రాబట్టిన గణిత సూత్రాల విలువను నిగ్గు తేల్చడానికి వాటిని ఇంగ్లండ్‌లోని గణిత నిపుణుల దృష్టికి తీసుకెళ్లాలని మద్రాసులోని గణిత వేత్తలు ఆయనను ప్రోత్సహించారు. కానీ పట్టభద్రుడు కూడా కాని రామానుజన్ రాతలను చాలామంది నిర్లక్ష్యంగా అవతల పారేశారు. కనీసం ఆయనకు జవాబు కూడా ఇవ్వని వారెందరో. అయితే కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌కి చెందిన సుప్రసిద్ధ గణిత ఆచార్యులు జి.హెచ్. హార్డీ మాత్రం రామానుజన్ రాసి పంపిన 120 గణిత సూత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిన సలు అతను ఎలా రాబట్టాడో కూడా ఆయనకు అంతుచిక్కలేదు. తదుపరి అధ్యయనం కోసం కేంబ్రిడ్జికి రావాలని రామానుజన్ని హార్డీ ఆహ్వానించారు. గణితంలో పట్టభద్రుడైనా కాని రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రవేశం కల్పించడానికి హార్డీ, ఆయన సహోద్యోగి జె.ఇ.. లిటిల్‌వుడ్ ప్రత్యేకంగా కృషి చేశారు. రామానుజన్ విదేశాలకు వెళ్లడానికి మతపరమైన ఆచారాలు అడ్డు వచ్చాయి. చివరకు రామానుజన్ 1914 లో కేంబ్రిడ్జ్ చేరుకున్నారు. ఆయన పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. 1916 లో రామానుజన్‌కి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పట్టా ప్రదానం చేసింది. తరువాత 1919లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా చేసింది. బహుశా ఆహారం విషయంలో అశ్రద్ధ, నిరంతర పరిశోధనల వల్ల కావచ్చు, ఆయనకు క్షయ వ్యాధి సోకింది. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామానుజన్ మరుసటి ఏడాదే కుంభకోణంలో కన్ను మూశారు. రామానుజన్ తన నోట్ పుస్తకాలలో రాసుకున్న సూత్రాలు ఎంతోమంది గణిత పరిశోధకుల మెదడుకు మేత కల్పించాయి. – మోహన్ శ్రీఖండే, మేథమెటిక్స్ ప్రొఫెసర్ (చదవండి: చైతన్య భారతి: సమ్మిళిత శాస్త్రజ్ఞుడు... జీవశాస్త్ర పితామహుడు) -
సమతామూర్తి సందర్శనకు టికెట్.. పెద్దలకు రూ.150.. పిల్లల టికెట్ ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు. తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు. ♦ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. పనులు పూర్తయ్యాక ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతించనున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షోను తాత్కాలికంగా ఆపేశారు. ♦ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ♦50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, బయటకు తిరిగి ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెండు సంఖ్యలు సరిపోలకుంటే లోపలే అనుమానితులు ఉండిపోయారని భావించి క్షుణ్ణంగా తనిఖీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ♦ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించాలి. ఫుడ్‌కోర్టు దగ్గర నిష్క్రమణ మార్గం ఉంటుంది. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్ బెల్టు ద్వారా ఎగ్జిట్ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. ♦వాహనాలను స్కానర్లతో తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్ బారియర్స్, బొల్లార్డ్స్ ఉంటాయి. వాటిని ఛేదించుకుని వెళ్లే ప్రయత్నం చేసే వాహనాల టైర్లను చీల్చే టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ♦ఈ కేంద్రంలో 250 మంది అర్చకులను నియమించనున్నారు. దివ్యదేశాలుగా పేర్కొనే 108 ఆలయాలకు ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని అంచనా. -
ఆమె... అగణిత మేధావి
గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) సంస్థ నుంచే పీహెచ్డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు. అకడమిక్ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితిలో, కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి అఫైన్ స్పేస్‌ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 యంగ్ సైంటిస్ట్స్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్నారామె. గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్ కీలకం, అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్.ఎల్. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్–తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్ రామానుజన్ పేరు మీద ఉన్న ‘రామానుజన్ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. డాక్టర్ టి. నాగయ్య వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్ : 97012 75354 (నేడు జాతీయ గణిత దినోత్సవం) -
Neena Gupta: లెక్కలంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం! అందుకే ఇలా
Neena Gupta: లెక్కలు అంటే భయపడని పిల్లలు తక్కువ. అయితే తన బాల్యంలో లెక్కలు అంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం. ఆ సంబరమే ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికైంది. ప్రతి సంవత్సరం నలభై ఐదేళ్ల వయసులోపు వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ–ఇండియా), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియెరిటికల్ ఫిజిక్స్ (ఐసీటిపి)లు ఈ పురస్కారం అందజేస్తాయి. మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకుంటున్న నాలుగో వ్యక్తి, మహిళలలో మూడో వ్యక్తి నీనా గుప్తా. 2014లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2019లో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఆమె బడిరోజుల్లోకి వెళదాం. ఖాల్సా హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తన అద్భుతమైన గణితప్రతిభ తో టీచర్లను ఆకట్టుకునేది నీనా. ‘ఈ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేస్తారు?’ అని టీచర్ పిల్లల వైపు చూసేవారు. పిల్లలు మాత్రం నీనా వైపు చూసేవారు. ‘నీనా సంగతి సరే మీ సంగతి ఏమిటి?’ అడిగేవారు టీచర్. అలా అని తల గర్వంగా ఎగరేసేది కాదు నీనా. డౌట్ల మీద డౌట్లు వచ్చే పిల్లల దగ్గరకు వెళ్లి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేది. జూనియర్స్ కూడా రకరకాల ‘ప్రాబ్లమ్స్’తో ఆమె దగ్గరికి వచ్చేవారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా వారికి చెప్పేది. తరాలు మారుతున్నా... సాంకేతిక జ్ఞానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా... చాలామంది పిల్లల్లో ‘మ్యాథ్స్ ఫోబియా’ పోవడం లేదు. ఒక వైపు తన పరిశోధనలకు టైమ్‌ను వెచ్చిస్తూనే అలాంటి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది ‘ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్–కోల్‌కతా’ ప్రొఫెసర్ అయిన నీనా. ‘ఈ అంకెలను చూడండి....ఎంత అమాయకంగా ఉన్నాయో. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు!’ అని అడుగుతుంది ఆమె. పిల్లలు గట్టిగా నవ్వుతారు. ‘ఈ ప్రాబ్లమ్‌ను ఎంత ఈజీగా సాల్వ్ చేయవచ్చో ఒకసారి చూడండి’ అని బ్లాక్‌బోర్డ్ వైపు వెళుతుంది. పిల్లలో ఎక్కడిలేని ధైర్యం వస్తుంది! ‘మ్యాథ్‌మెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్’పై జరిగిన ఆన్లైన్ చర్చా వేదికలో విలువైన సూచనలు ఇచ్చింది. ‘ఇండియన్ వుమెన్ అండ్ మ్యాథమెటిక్స్’ అంశంపై అద్భుత ప్రసంగం చేసింది. 70 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక గణితసమస్యను పరిష్కరించి ‘భేష్’ అనిపించుకుంది. అయితే గణితాన్ని చూసి గజగజలాడుతున్న పిల్లలు, గణితాన్నే పెద్ద సమస్య అనుకుంటున్న పిల్లలు ఉన్నారు. వారి భయాలను తొలగించి గణితం అంటే అంతులేని ప్రేమను కలిగించే పుస్తకం ఒకటి రాస్తే... తనలాంటి జీనియస్‌లు మరెంతోమంది వస్తారనడంలో సందేహం లేదు కదా! చదవండి: Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా? అయితే.. -
విగ్రహంగా ఘనీభవించిన రామానుజులు
శ్రీరంగం వైపు నడుస్తున్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే.మహాపూర్ణుల గురించి తపనే. ఏ సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని విడిచిపోవలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణులవారు కూడా పరమ పదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్ సంస్కారాలు నిర్వహించారని తెలిసింది. కళ్యాణి పుష్కరంలో స్నానం చేసి, మంటపంలో తిరుమణి కాపుచేసుకుని, తిరునారాయణుని ధ్యానిస్తూ కూర్చున్న రామానుజుడికి ఇద్దరు వైష్ణవులు శ్రీరంగం నుంచి వచ్చారని చెప్పగానే ఆయన కళ్లుతెరిచి చూసాడు. ఎన్నాళ్లయింది శ్రీరంగానికి దూరమై, అని కళ్లు చెమర్చాయి.‘స్వామీ అడియేన్’ అని పాదాలపై బడి ‘కులోత్తుంగ చోళుడి కంఠంలో క్రిములు పుట్టి ఏమీ భుజించలేని పరిస్థితుల్లో నానాటికి క్షీణించి చివరకు అంతరించాడు. శ్రీవైష్ణవులకు ఉపద్రవం కూడా అంతరించింది ఆచార్యవర్యా’ అని చెప్పారు. ‘ఓహో కళ్యాణి పుష్కరిణి కళ్యాణిదాన్ అయింది’ (అంటే శుభం కలిగింపజేసిందని) అని రామానుజులు సంతోషించారు. శెల్వనారాయణుని అనుమతి గ్రహించి శ్రీరంగానికి రామానుజుడు బయలుదేరాడు. ‘మీరు వెళ్లిపోతే మేమంతా ఏం కావాలి? మేమూ వస్తాం’ అని శిష్యులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ‘మీరంతా వస్తే ఇక్కడి ఆచార ఆరాధనా విధులు ఎవరు చేస్తారు నాయనా’ అని రామానుజులు అంటే ‘ఏమో మేము మాత్రం మీ నుంచి దూరం కాలేము స్వామీ’ అన్నారు వారు.రామానుజుడు తన విగ్రహాన్ని ఒకటి రూపొందింపజేసి తన తపోశక్తితో అందులో తన జీవశక్తిని కొంత నిక్షిప్తం చేసి, ‘ఇదిగో ఈ విగ్రహమే నేను, నన్ను ప్రేమతో పిలిచిన వారికి నేను బదులు పలుకుతాను. ఇక నన్ను శ్రీరంగని సన్నిధానానికి వెళ్లనివ్వండి’ అని వారిని ఒప్పించారు. ఈ విగ్రహానికి తమర్ ఉగన్ద తిరుమేని (శిష్యులు ప్రేమతో ఆదరించిన శ్రీ విగ్రహం) అని పేరు. తిరునారాయణపురంలో సర్వవిధ సేవలు సక్రమంగా జరిగేందుకు కట్టుదిట్టం చేశారు. 52 కుటుంబీకులను పిలిచి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. శెల్వపిళ్లైని బావిగట్టు మీద ఉన్న బిడ్డను తల్లి చూసుకునేంత జాగ్రత్తగా ప్రేమతో, ఆప్యాయతతో చూచుకోవాలని ఉపదేశించారు. బావిగట్టుమీద ఏ శిశువునూ తల్లి కూర్చోబెట్టదు. కానీ వాడు మారాం చేస్తే గట్టుమీద నుంచి బావిని చూపించి నవ్విస్తుంది. పాలుపడుతుంది. గోరుముద్దలు పెడుతుంది. పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. సనత్ కుమారులు తిరునారాయణ పెరుమాళ్లను ప్రతిష్టించడం వలన ఇది తిరునారాయణ పురమై భాసిల్లింది. ఈ నారాయణ క్షేత్రం కొండపై ఉంది కనుక నారాయణాద్రి అయింది. త్రేతాయుగంలో దత్తాత్రేయ మహర్షి వేదపఠనంతో పుష్కరిణి ఏర్పడినందున వేదాద్రి అయింది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఇక్కడ కొన్నాళ్లుండటం వలన సీతారామ క్షేత్రమయింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణబలరాములు ఉత్సవమూర్తిని ప్రతిష్టించడం వలన యాదవాద్రి అయింది. రామానుజులు తిరిగి ప్రతిష్టించినందున యతిశైలమైంది. దీని చుట్టూ మేలైన కోటను కట్టించడం వల్ల మేల్కోట అయింది. శ్రీరంగం వైపు నడుస్తున్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే. మహాపూర్ణుల గురించి తపనే. ఏ సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని విడిచిపోవలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణులవారు కూడా పరమపదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్ సంస్కారాలు నిర్వహించారని తెలిసింది. దాదాపు అదే కాలంలో తిరుమలై అండన్, తిరువరంగప్పెరుమాళ్ అఱైయార్, శ్రీశైల పూర్ణులు, కాంచీపూర్ణులు కూడా పరమపదం చేరారని తెలిసింది. ఆర్ద్రమైన మనస్సుతో తన గురువులందరికీ రామానుజులు అంజలి ఘటించారు. తనను నడిపిన అపురూప ఆచార్య సంపద తనకు దక్కినందుకు జన్మ ధన్యమైందని భావించారు. ఆ గురువులు పెట్టిన అక్షయ అక్షర సంపదే తన జీవితమని అది వారికే అంకితమని అంతరంగభావన చేశారు. శ్రీరంగం చేరకముందే కూరేశుని ఇంటికి వెళ్లారు రామానుజులు. పాదాలపై బడిన కూరేశుని ఆదరించి ‘నాకోసం కళ్లు పెరుక్కున్నావా కూరేశా! అయ్యో ఎంత పని జరిగింది’ అని పరితపించారు. గాఢ పరిష్వంగంతో ఓదార్చారు. ‘నేను ఒక వైష్ణవుడు ధరించిన నామాలు వంకరగా ఉన్నాయని విమర్శించాను స్వామీ! అందుకే నాకీ శిక్ష కాబోలు!’’ అని కూరేశుడు అన్నారు. ‘‘కూరేశా రా ముందుగా కాంచీపురం వెళ్దాం. అక్కడ వరదుడిని ప్రార్థించు’’ అని అక్కడికి తీసుకువెళ్లారు. కూరేశుడు వరదరాజస్తవం అనే అద్భుత స్తోత్రాన్ని చేశారు. వరదుడు ప్రత్యక్షమైతే నాలూరన్ను అనుగ్రహించాలని కోరారు. ‘ఒక్క నాలూరన్ ఏమిటి కూరేశా, నీతో సంబంధం ఉన్న వారందరికీ నా దగ్గర శాశ్వత నివాసాన్ని, మోక్షాన్ని ఇస్తున్నాను’ అని వరదుడు అన్నాడు. అది విని రామానుజులు ‘తిరుగోష్ఠియూర్ నంబి ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు నాకు నరకమే కలుగుతుంది. కాని నీ వల్ల నీతో సంబంధం ఉన్న వారందరికీ వరదుడు మోక్షం ఇవ్వడం వల్ల నాకు కూడా మోక్షం లభిస్తున్నది’ అని సంతోషించారు. తనకు నేత్రాలను మాత్రం కూరేశులు కోరుకోలేదు. కూరేశునికి చూపును ప్రసాదించమని రామానుజులు వరదుని ప్రార్థించారు. ఆచార్యుని సేవించుటకు మాత్రం సర్పదృష్టిని కూరేశుడికి ఇస్తున్నానని వరదుడు వరమిచ్చాడు. అందరూ శ్రీరంగానికి బయలుదేరారు. ఓరోజు కూరేశుడు శ్రీరంగని ముందు నిలిచి తనకు భవబంధముల నుంచి విముక్తిని ప్రసాదించి తనలో చేర్చమని కోరుకున్నారు. ‘‘నాకన్నా ముందే వెళ్ళిపోదామనుకుంటున్నావా నాయనా’’ అని రామానుజులు అడిగారు. ‘‘మీకు వైకుంఠంలో నేనే స్వాగతం చెప్పాలి గురువర్యా. అక్కడ మీ ఆచార్యత్వాన్ని చాటాలి కదా’’ అన్నాడాయన.‘‘వైకుంఠంలో ఈ బంధాలేవి ఉండవు. కాని నీవు అక్కడ కూడా ఈ అనుబంధాన్ని ఆశిస్తున్నావంటే నీదెంత విశాల హృదయం కూరేశా, అయినా నిన్ను వదిలి నేనుండగలనా?’’ అన్నారు రామానుజులు. ‘‘ క్షమించండి స్వామీ ఆ విషయం మరిచా’’నని కన్నీట ఆచార్యుని పాదాలు కడిగారు కూరేశులు. ఆయన పాదాలను శిరసున ధరించారు. వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించారు. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహితస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోరామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే నిత్యం అచ్యుతుని పాదాలను సేవిస్తూ ఇతరములన్నీ గడ్డితో సమానమని తృణీకరించే మా గురువు రామానుజుని పాదములే నాకు శరణు అని ప్రార్థించారు కూరేశులు. కొద్దిరోజుల తరువాత కూరేశులు కుమారులైన వ్యాస పరాశర భట్టులను పిలిచి ‘అమ్మ జాగ్రత్త నాయనా ఇక మీ తల్లిదండ్రులు రంగనాయకి రంగనాథులే’అని శిరస్సును శ్రీరంగని వైపు, పుత్రుల ఒడిలో ఉంచి పాదములను భార్య ఆండాళ్ ఒడిలో ఉంచి నిర్విచారంగా, రామానుజునే మనసునిండా స్మరిస్తూ తుది శ్వాస విడిచారు. రామానుజులు వారికి స్వయంగా అంత్యేష్టి నిర్వహించారు. పుత్రులను ఓదార్చారు. మఠాధిపత్యాన్ని కూరేశుడి పుత్రుడు పరాశరుడికి అప్పగించారు. దాశరథి పుత్రుడు కందాడై అండన్ ‘అయ్యా! మీ విగ్రహాన్ని భూతపురి (శ్రీ పెరుంబుదూర్)లో ప్రతిష్టించుకునేందుకు అనుమతించాల’ని రామానుజుని కోరుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారుచేయించి, దాన్ని ఆలింగనం చేసుకుని శక్తిని ప్రవేశపెట్టి కొంత బలహీనులైనారు. ఆండన్ ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి రామానుజుని జన్మస్థలంలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రతిష్టింపజేసారు. అక్కడ తన విగ్రహ అభిషేక నేత్రోన్మీలన సమయంలో ఇక్కడ రామానుజులకు కళ్లు కదలిపోయాయి. ఆ ప్రతిష్ట జరిగినన్ని రోజులు రామానుజులు అస్వస్థత చెందారు. రెండోసారి షష్టిపూర్తి జరిగి 120 నిండుతున్నదని గమనించారు. ఆండన్ను, ఇతర శిష్యులను పిలిపించారు. ఎన్నెన్నో బోధనలు చేస్తున్నారు. ఎందుకో శిష్యులకు అర్థం కావడం లేదు. ‘భగవంతుడికి అనుకూలంగా ఉండండి, పాముకు దూరంగా ఉన్నట్టు నాస్తికులకు దూరంగా ఉండండి. సంసారులలో ఆసక్తి ఉన్నవారికి శాస్త్రజ్ఞానం బోధించండి. ఆసక్తి లేకపోయినా వారి పట్ల దయచూపండి. వైష్ణవుల పట్ల అపరాధం చేయకండి. శ్రీభాష్యం చదవండి. బోధించండి. వీలు కాకపోతే తిరువాయ్ మొళి చదవండి చదివించండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో గుడిసె కట్టుకుని సేవించండి. లేదా ఆలయాలకు వెళ్లి సేవ చేయండి. అదీ కాకపోతే ద్వయమంత్రం పఠించండి. మంత్ర భావాన్ని తెలుసుకొండి. అశక్తులైతే వైష్ణవులను సేవించండి. ఇక నాకు సెలవివ్వండి. నేను ఈ దేహాన్ని విసర్జించవలసిన సమయం ఆసన్నమైంది’ అనగానే శిష్యులు నిర్ఘాంతపోయారు. ‘దుఃఖించకండి నాయనా. నారాయణుని పూజించినట్టు వైష్ణవులను పూజించండి. అర్చామూర్తిని బొమ్మ అనుకోకండి, గురువు సామాన్యమానవుడనుకోకండి.’ అని బోధించారు. శిరస్సును గోవిందుని ఒడిలో ఉంచి పాదములను వడుగనంబి ఒడిలో పెట్టి శిష్యులందరికీ తోచిన బోధనలు చేస్తూ కన్నుమూసారు. నిన్ను వదులుకోను అని రంగనాథుడు అన్నట్టు రామానుజుని చరమశ్రీ శరీరం (తిరుమేని)కి శ్రీరంగనాథుడి ఆజ్ఞ మేరకు తన ఆలయ సముదాయంలోని వసంత మండపంలో ఆలయం నిర్మింపజేసారు. నేటికీ తానాన తిరుమేనిగా శ్రీమద్రంభగవద్రామా నుజులు కూర్చున్నభంగిమలో విగ్రహంగా ఘనీభవించిన ఆయన శ్రీశరీరాన్ని ఇప్పటికీ శ్రీరంగంలో అందరూ దర్శించుకోవచ్చు. 1017లో ప్రారంభమైన రామానుజ జీవనం 1137 పింగళనామ సంవత్సరం మాఘమాసం దశమీ తిథిరోజున ముగిసింది. 120 సంవత్సరాల రామానుజ మార్గం శాశ్వతంగా ప్రతిష్టితమైంది. రామానుజులు తీర్చిదిద్దిన క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, తిరునారాయణ పురం. అందుకే.. శ్రీరంగమంగళ మణిం కరుణా నివాసంశ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్శ్రీ హస్తిశైల శిఖరోజ్జ్వల పారిజాతమ్ శ్రీశం నమామి శిరసా యదుశైల దీపమ్ఆదిశేషుడై, సేనాని విష్వక్సేనుడై, చివరకు శ్రియఃపతియై ఈ లోకానికి వచ్చిన మహాజ్ఞానియా ఈ రామానుజుడు అని మనకు అనిపించేంత మహానుభావుడు. వేయేళ్ల కిందట అవతరించిన మహా ప్రాజ్ఞుడు. శేషోవాసైన్యనాథోవా శ్రీపతిర్వేతిస్వాత్త్వికైఃవితర్క్యాయ మహా ప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళమ్రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం (ఆయన దివ్యోపదేశాలు నిత్యం అభివర్థనం చెందుగాక).సమాప్తం. ‘రామానుజ మార్గం’ రచయిత ఆచార్య మాడభూషి శ్రీధర్ -
తొండనూరులో వెల్లివిరిసిన వైష్ణవం
బ్రహ్మరాక్షసిని పారద్రోలి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లారు. ఒకేసారి పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో మాట్లాడాలని సవాలు చేశారు. ఓడిపోతే తమ మార్గాన్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తాం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రుడికి ఒక కట్టుబాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లాడరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్టండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తాయి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం జాగ్రత్త’’ అన్నారు. రామానుజులు కనిపించకుండా తెర కట్టారు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తున్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే సమాధానం దూసుకుని వస్తున్నది. జైన మునులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో, సమాధానాలు శరాల్లా వస్తున్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన మండనలు వెలువడుతున్నాయి. శాస్త్ర, పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల వాక్యాలు, ఈటెల్లా వస్తున్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రాలు వడిసిపోతున్నాయి. నిరస్త్రమై నిస్తేజమై పడిపోతున్నాయి. అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి. కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లాడుతున్నారు? ఇది వాస్తవమా లేక కనికట్టా? అని తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపోయారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తిపోయారు. ‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లుతున్నది. వేలాది పడగల ఆదిశేషుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. ఆ భయానక దృశ్యం చూడగానే మాకు మతిపోయింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి పారిపోయినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రాలు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నలూ ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో జ్ఞాన సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త్రవేత్తలు, పండితులు, తర్కశాస్త్రజ్ఞులు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపోయి వైష్ణవం వెల్లివిరిసింది. జలాశయ నిర్మాణ నిపుణ రామానుజ ఆ ప్రాంతంలో అనావృష్టిని నివారించడానికి యోగ్యమైన స్థలంలో కరకట్ట నిర్మించి జలాశయాన్ని ఏర్పాటు చేయాలని రామానుజులు సంకల్పించారు. సహజమైన పరిసరాల్లో తటాకానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. అటూ ఇటూ సహజంగా ఉన్న కొండలు కొన్ని బండరాళ్లు పేర్చితే ఆనకట్ట సులువుగా తయారవుతుందని, అందుకు సాంకేతికంగా ఏం చేయాలో కూడా రామానుజుడు వివరించారు. రాజు విష్ణువర్ధనుడు ఆశ్చర్యపోయారు. యతిరాజులు గొప్ప సాంకేతిజ్ఞులు కూడా అని అర్థమైంది. రామానుజుడు ఆ తటాకానికి తిరుమల రాయ సాగరం అని నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో ఈ చెరువు ద్వారా ఏ మేరకు పంట పొలాలకు నీరు చేరుతుందో రామానుజులు అంచనాను వివరించారు. ఆనకట్ట నిర్మాణమై జలాశయంలో నీరు నిండిన తరువాత ఆశయం నెరవేరి ఆ ప్రాంతమంతా సుభిక్షమైంది. తిరునారాయణుని పునఃప్రతిష్ఠ ఓరోజు ఉదయాన్నే రామానుజులు అనుష్టానం కోసం ఊర్థ్వ పుండ్రాలను దిద్దుకోవడానికి తిరుమణి పెట్టె తెరిస్తే తిరు (శ్రీ)మణి (మన్ను) నిండుకుంది. ఎలా అని చింతిస్తున్న రామానుజులకు తిరునారాయణుడి మాట వినిపించింది.... ‘‘నేను ఓ పదిమైళ్ల దూరంలో ఉన్నాను. నా సన్నిధి మూతబడిపోయి ఉంది. నన్ను బయటకు తీసి నిలబెట్టవయ్యా యతిరాజా’’ అని. వెంటనే బయలుదేరి ఆ కీకారణ్యంలో చెట్లను కొట్టిస్తూ దారి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలోనే అటూ ఇటూ కొమ్మలు గీరుకుపోయి శరీరమంతా నెత్తుటి గాయాల రేఖలు ఏర్పడ్డాయి. (ఈనాటికీ శ్రీరామానుజుని ఉత్సవ విగ్రహానికి చారలు గీతల మచ్చలు, అభిషేక తిరుమంజనాల సమయంలో కనిపిస్తాయంటారు.) స్వామికోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంతకూ కనిపించడం లేదు. ‘‘ఇక్కడే ఓ పుట్టలోపల సరిగా చూడు అక్కడ ఉన్నాను’’ అని మళ్లీ అశరీర వాణి వినిపించింది. సంపెంగ చెట్టు, దానికి ఉత్తరాన కొన్ని అడుగులదూరంలో బదరీ వృక్షము (రేగు చెట్టు) దానికి పడమరలో పుట్ట కనిపించింది. పుట్టను గునపాలతో కొడితే పాములకు దెబ్బ తగులుతుందన్న భయంతో పాలు పెరుగు తెప్పించి పుట్టపై పోయించారాయన. మన్ను కరిగి తిరునారాయణుడి దివ్యమంగళ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో ‘మేలుకోట’ (ఈనాటి మేల్కోటే, కర్ణాటక) అనదగిన స్థలంలో భవ్యమైన ఆలయాన్ని రామానుజుని ఆలోచనలకు అనుగుణంగా శాస్త్రబద్ధంగా రాజు నిర్మింపజేశాడు. తిరునారాయణమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. రాజుగారు తన కోశాగారంలో ఉన్న ఒక ప్రాచీన వజ్రకిరీటం ఆ మూర్తికి అలంకరించాలనుకున్నారు. కాని శ్రీవారి శిరస్సుకు సరిపోలేదు. అయితే ఆ కిరీటానికి తగిన విగ్రహం ఒకటి ఉండి ఉండాల్సిందే అని రామానుజులు అన్నారు. ప్రాచీనాలయాలు విధ్వంసం చేసి శత్రువులు కొందరు విగ్రహాల్ని ఎత్తుకుపోయి ఉంటారని కాలక్రమంలో చేతులు మారి ఆ విగ్రహం ఉత్తరాన దెహలీ (దిల్లీ) సుల్తానుల చేతికి చిక్కిందని జనం చెప్పుకుంటున్న విషయం రామానుజులకు తెలిసింది. విగ్రహ రహస్యం ఛేదించడానికి రామానుజులు ప్రార్థన చేశారు. ఏకాగ్ర చిత్తంతో సాగిన ధ్యానంలో ఆయన చతుర్భుజుడై శంఖ చక్రధారియైన శ్రీరామపిళ్లై మూర్తి అనీ రామానుజులకు స్ఫురించింది. శ్రీరామపిళ్లైని తిరిగి రప్పించడానికి రామానుజులు కొందరు శిష్యులతో దిల్లీ నగరానికి బయలుదేరారు. పాదుషాను కలిశారు. తాము నిత్యమూ ఆరాధించే భగవంతుని మూర్తి సుల్తాన్ కోశాగారంలో ఉందని, దానికి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మా దగ్గరే ఉన్నట్టు మీకే విధంగా తెలిసింది?’ అని అడిగారు. తిరునారాయణ మూలమూర్తి పుట్టలోంచి ఆవిష్కారమైన విషయం, తనకు ధ్యానంలో శ్రీరామపిళ్లై కనిపించిన సంగతి వివరంగా సుల్తాన్‌కు చెప్పారు ఆచార్యులు. రామానుజుని తేజస్సుకు సుల్తాను అబ్బురపడ్డారు. విగ్రహం కోసం తన భాండాగారాన్ని రామానుజులకు చూపమన్నారు. కాని అందులో ఈ విగ్రహం కనిపించలేదు. రామానుజాచార్యులు మరోసారి మహాధ్యానంలోకి వెళ్లిపోయారు. స్వామీ ఎక్కడున్నారు అని పరితపించారు. మనసులో సాక్షాత్కరించారు. పాదుషా కూతురితో ఆడుకుంటున్నానని చెప్పారు స్వామి. మరునాడు ఆ విషయం పాదుషాకు తెలిపారు. ‘‘ఇక్కడే మీ దేవుడు ఉన్నట్టు మీకు ఏవిధంగా తెలిసింది?’’ అని అడిగారు. ‘‘మాకు ధ్యానంలో స్ఫురించింది’’ అన్నారు. ‘‘ధ్యానంలో దైవం స్ఫురించిన మాట నిజమే అయితే మీరే పిలుచుకోండి. మేం అంతఃపురానికి వెళ్లం, మిమ్మల్ని వెళ్లనివ్వం. మీ దేవుడు కదా వస్తాడేమో చూద్దాం’’ అని నవ్వాడు సుల్తాన్. ‘‘వస్తే మాతో పంపిస్తారు కదా’’ అని రామానుజులు అడిగారు. నడిచి రావడం జరగనే జరగదనే నమ్మకంతో నిశ్చింతగా సుల్తాన్ ‘‘తప్పకుండా’’ అని హామీ ఇచ్చారు. సుల్తాన్ దర్బారులో పద్మాసనం వేసుకుని రామానుజుడు తదేక ధ్యానం చేశారు. శ్రీరామపిళ్లైని ప్రార్థించారు. ‘శ్రీరామపిళ్లై రా నాయనా’ అని మనసారా పిలిచారు. శ్రీకృష్ణుని యశోద ఆప్యాయత నిండిన స్వరంతో ‘‘వరుగ వరుగ విజ్ఞేవామననమ్బీ వరుగ విజ్ఞే’’ అని రామానుజుడు భక్తితో పిలిచినాడు. అంతఃపురంలో ఉన్న ఆ రమణీయ విగ్రహం తనంత తానే ఛెంగు ఛెంగున వచ్చి రామానుజుని ఒడిలో చేరింది. సుల్తాన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రామానుజుల కన్నులు ఆర్ద్రతతో జలమయమైపోయాయి. సరిగ్గా అదే సమయానికి అంతఃపురంలో విగ్రహం మాయం కావడం కలకలం రేపింది. యువరాణి ఆడుకునే ప్రియమైన విగ్రహం అదృశ్యమైందని ఫిర్యాదు అందింది. ఆయనకు అర్థమైపోయింది– రామానుజులు ఒడిచేరిన అత్యంత సుందరమైన ఆ విగ్రహం తన కూతురు మనసు హరించిందని ఇన్నాళ్లూ ఆడుకున్నదని. రాణికి ఆ విషయం చెప్పి, ఒక యతికి ఇచ్చిన విగ్రహం మళ్లీ వాపస్ తీసుకోవడం జరగదని, మాట తప్పలేనని కనుక దాని గురించి మరిచిపొమ్మని ఆదేశించాడు సుల్తాన్. సుల్తాన్ యంత్రాంగం చేసిన సాయంవల్ల శ్రీరామపిళ్లైతో రామానుజ పరివారం మళ్లీ దక్షిణానికి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. మేల్కోట చేరుకున్నారు. సంపత్ కుమారుడని, శెల్వపిళ్లై (గారాబు తనయుడు) అని నామకరణం చేశారు. దివ్యసుందర చెలువ నారాయణ (తిరునారాయణ) ఆలయంలో ఒక ప్రత్యేక సన్నిధానాన్ని సంపత్ కుమారుడి కోసం నిర్మింపజేశారు రామానుజులు. తన ధ్యానంలో రామానుజాచార్యుల వారికి సజ్జెహట్టి బావిలో శ్రీదేవి భూదేవి (ఉభయ నాచ్చియార్లు) విగ్రహాలు, సంపెంగ చెట్టుకింద యదుగిరి అమ్మవారు కనిపించారు, వారిని రప్పించారు. నరసింహుని కొండలో పాండవ గుహలో విష్ణువర్ధనునికి దొరికిన పురాతనమైన వజ్రకిరీటం (వైరముడి) తెప్పించారు. ఆ కిరీటం శ్రీరామపిళ్లైకి సరిగ్గా సరిపోయింది. (ఆ విధంగా వజ్రకిరీటధారణ చేసిన ఆ రోజున ఇప్పడికీ వైరముడి ఉత్సవం ఏటేటా చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు.) సుదర్శనచక్రాన్ని పదిమంది ఆళ్వార్లను, తిరుక్కచ్చినంబి (కాంచీ పూర్ణులు), శ్రీమన్నాథమునులు, శ్రీ ఆళవందార్ (యామునాచార్యుల) విగ్రహాలను ప్రతిష్టించి తిరునారాయణపురం ఆలయాన్ని అత్యంత ప్రామాణికమైన నారాయణ క్షేత్రంగా నిలబెట్టారు రామానుజులు. మూలవరులు తిరునారాయణుడని, ఉత్సవమూర్తి శెల్వనారాయణుడని, తిరుమంజన బేరం (మూర్తి) నకువణ్ పుగళ్ నారాయణన్ అని, బలిబేరానికి వాళ్ పుగళ్ నారాయణన్ అనీ, శయనబేరానికి ననేఱళిల్ నారాయణన్ అని నమ్మాళ్వార్ల పాశురాల్లో ఉన్న నామాలను నిర్ధారించారు. తను చిన్నతనం నుంచి చాలా ఇష్టపడిన శెల్వపిళ్లైని విడిచి తానుండలేనని చెప్పింది యువరాణి. భోజనం చేయక మంచినీళ్లు తాగక నిరశన వ్రతం పట్టింది. ఓ విగ్రహం మీద ఇంత ప్రేమ ఏమిటని పాదుషా ఎంత చెప్పినా వినలేదు. యతిరాజును ప్రార్థించి ఆ విగ్రహం తిరిగి తెచ్చుకుంటానని యువరాణి పట్టుబట్టింది. ఏమీ చేయలేక పాదుషా పల్లకీలో అమ్మాయిని భద్రతాదళంతో పంపించాడు. తిరునారాయణ పురం చేరేనాటికి శెల్వపిళ్లై ప్రతిష్ఠ, వారికి వజ్రకిరీట ధారణ జరగడం, అత్యంత వైభవంగా దైనందిన తిరువారాధనలతో మంగళ తూర్యరావాలతో, తిరువాయిమొళి తదితర ప్రబంధ పాశురాల అనుసంధానంతో శెల్వప్పిళ్లై అలరారుతున్న విషయం గమనించింది. శాస్త్రప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్యసేవలు అందుకున్న స్వామిని దరిచేరడం తీసుకుపోవడం సాధ్యం కాదని యువరాణికి అర్థమైంది. ఆ స్వామి విరహాన్ని తట్టుకోలేక ఆమె అక్కడే అసువులు బాసింది. రామానుజులు ఆమెలో విగ్రహం పట్ల ఉన్న అపరిమితమైన ఆర్తిని, ప్రగాఢ ప్రేమను గమనించి, ఆమె సామాన్యురాలు కాదని, గోదాదేవి అంతటి భక్తురాలని నిర్ధారించి, ఆమెకు లక్ష్మీదేవితో సమాన స్థానం కల్పించి బీబీ నాంచియార్ అనీ తులుక్కనాచ్చియార్ అని నామకరణం చేసి మేల్కోటే నిత్యపూజలలో ఆమె ప్రతిరూపాన్ని నిలబెట్టారు. ఆమెకు రొట్టెల నైవేద్యంతో ఆరాధనా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినారు రామానుజులు. అక్కడే తిరునారాయణుడి నిత్యారాధనోత్సవాలలో పాల్గొంటూ రామానుజులు నిత్యారాధనలో పాల్గొంటూ, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, రుతోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, అభిషేకోత్సవ, పఞ్చపర్వతోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, తిరునక్షత్రోత్సవాలను జరిపిస్తూ 12 సంవత్సరాలు గడిపారు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
తిరుపతి నగర నిర్మాత రామానుజుడు
చోళరాజ్యానికి తమిళనాడులోని పుణ్యక్షేత్రం చిదంబరం రాజధాని. రాజు కులోత్తుంగ చోళుడు వీరశైవ భక్తుడు. అతనికెంత శివ భక్తి ఉందో అంతకుమించిన విష్ణు ద్వేషం ఉంది. చిదంబరం గొప్ప హరిహర క్షేత్రం. పరమ శివుడి ఆలయంతోపాటు పరమాత్ముడైన హరి రూపం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం కూడా పక్కనే ఉంది. విష్ణువును గొప్పవాడుగా జనం నమ్మకుండా ఉండాలంటే విష్ణు విగ్రహాన్ని తొలగించాలనే మూర్ఖత్వంతో, విపరీతమైన విష్ణుద్వేషంతో కులోత్తుంగ చోళుడు ఆలయాన్ని ధ్వంసం చేసి, గోవిందరాజస్వామి మూల విగ్రహాన్ని పెరికించి సముద్రం పాలు చేశాడు. రామానుజులకు ఈ విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంతటి దివ్యక్షేత్రాన్ని ధ్వంసం చేసినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. రాజే ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అందుకని రామానుజుడు గోవిందరాజుకు మరొకచోట భవ్యమైన ఆలయం నిర్మించాలని తిరుపతిని ఎంచుకున్నారు. సుధామూర్తిగా (సుద్దమన్నుతో) గోవిందరాజు విగ్రహాన్ని తయారు చేయించి శయనమూర్తిగా హరిని ప్రతిష్టింపజేశారు. భూదేవి రూపమైన గోదాదేవిని స్వామికి దక్షిణాన పట్టమహిషిగా ప్రతిష్ఠించారు. పవిత్రమైన తిరుమల కొండను కాళ్లతో తొక్కబోమని కిందనుంచే నమస్కరించిన ఆళ్వార్ల విగ్రహాలను తిరుమల చూస్తున్నట్టుగా ప్రతిష్టింపజేశారు. నాలుగు మాడ వీధులను నిర్ణయించి, అర్చక, పాచక, అధికార, సేవక తదితర వర్గాలకు గృహసముదాయాలను నిర్ణయించి, జల వనరులను, వర్తక సౌకర్యాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామానుజుని ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా యాదవరాజు ఎత్తయిన గోపురాలు, విశాలమైన వీధులు, ప్రాకారాలతో తిరుపతి నగరాన్ని నిర్మించారు. దానికి శ్రీమద్రామానుజ పురం అని నామకరణం చేశారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడు, తిరుపతిలో గోవిందరాజు తోడుగా ఉండి భక్తులను రక్షిస్తారని రామానుజులు ఏర్పాట్లు చేసారు. వ్యాసుడు రచించిన వరాహ పురాణంలో వేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రంలో ‘‘గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయతే నమః’’ అనే నామాన్ని సార్థకం చేస్తూ వారిరువురూ సోదర సమానులని నిర్ధారణ చేశారు. విష్ణుద్వేషి అయిన చోళరాజు దుష్టపు చూపు శ్రీరంగం పైన కూడా పడింది. అయితే ఆస్థాన నర్తకి, అద్భుత సౌందర్యరాశి, విష్ణు భక్తురాలు అయిన తిల్ల, రాజు దృష్టిని కొంతకాలం మరోవైపు మళ్లించడంలో సఫలీకృతురాలైంది. అదే సమయం లో ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తరలించి వైష్ణవులు రాజు దుర్మార్గం నుంచి రక్షించారు. అందుకే అక్కడ ప్రతిష్టించిన గోవిందరాజమూర్తికి తిల్లై గోవిందరాజు అని నామకరణం చేశారు. ప్రాణాలకు తెగించి కాపాడిన భక్తురాలి పేరును భగవంతుడికి పెట్టడం రామానుజుడికే చెల్లింది. ఈ నగర నిర్మాణానికి గాను రామానుజుడు సుదీర్ఘకాలం తిరుపతిలోనే ఉండవలసి వచ్చింది. అక్కడే శ్రీ భాష్య రచనకు ఆయన ఉపక్రమించారు. కొంత భాగం రచిస్తూ ఉండగా కొన్ని మౌలికమైన సందేహాలు తలెత్తాయట. సమాధానాల కోసం కురేశులను గోష్టీపూర్ణులవద్దకు పంపించి వారి వివరణలతో శ్రీభాష్య రచన తిరుపతిలో కొనసాగింది. మిగిలిన భాగం శ్రీరంగంలో పూర్తి చేశారు. యామునాచార్యుల ఆశయాలను నెరవేర్చుతూ తిరుమల తిరుపతి, శ్రీరంగం దివ్యదేశాలలో సక్రమమైన వైష్ణవారాధనా వ్యవస్థలను స్థిరీకరించి కట్టుదిట్టం చేశారు రామానుజులు. ఈ విషయాలన్నీ తెలిసి కులోత్తుంగచోళ రాజు రగిలిపోయాడు. తాను నాశనం చేసిన చిదంబరం విష్ణు ఆలయాన్ని తిరుపతిలో అంతకన్నా భవ్యంగా నిర్మించాడని తెలుసుకున్న ఆ రాజు కోపం మిన్నంటింది. శ్రీమద్రామానుజుల మీద ఎందుకో కోపం కలిగిన ఒక దుష్ట వైష్ణవుడు నాలూరాన్ చోళరాజు ద్వారా రామానుజుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ‘‘విగ్రహాన్ని సముద్రంలో పారవేయిస్తే వైష్ణవం అంతరించదు రాజా, వైష్ణవాన్ని శరవేగంగా దేశమంతటా వ్యాప్తిచేస్తున్న రామానుజుడిని అరికడ్తేనే అది సాధ్యం’’ అన్న నాలూరాన్ దుర్బోధ చెవికెక్కింది. శాస్త్రవాదానికి రమ్మంటే వస్తాడని రామానుజుడిని రాజధానికి రప్పించాలని కొందరు సైనికులను శ్రీరంగానికి పంపిస్తూ, రానంటే బంధించి తీసుకు రమ్మని రాజు ఆదేశించాడు. సైనికులు వచ్చి ‘శాస్త్ర వాదానికి రామాజునులు రావాలని రాజాజ్ఞ, రమ్మని చెప్పండి’ అన్నారు. రామానుజులు అనుష్టానానికి లోపలి గదిలో ఉన్నారు. రాబోయే అనర్థం ఏమిటో కూరేశుడికి అర్థమైంది. చోళ రాజు దౌర్జన్యం నుంచి ఏదో విధంగా రామానుజుడిని దక్కించుకోవాలి. ఆ సైనికాధికారులకు రామానుజుడెవరో తెలియదు. కనుక కాషాయ దండ కమండలాలు ధరించి తానే రామానుజుడినని పరిచయం చేసుకుని వారి వెంట బయలు దేరాడు. ఒంటరిగా కూరేశుడిని వెళ్లనివ్వడం ప్రమాదమని తెలిసి మహాపూర్ణులు తోడుగా బయలుదేరారు.వృద్ధుడైన తండ్రికి సాయంగా ఉండడం కోసం అత్తుళాయమ్మ కూడా నడిచింది. వెళ్లేముందు ముదలియాండాన్ (దాశరథి)కి ధనుర్దాసుకు రామానుజుల వారిని జాగ్రత్తగా పశ్చిమాన ఉన్న చోళ రాజుతో వైరం ఉన్న హోయసల రాజుల సామంతులైన కళ్యాణ చాణుక్యుల పాలనలోని కర్ణాటక తొండనూరు రాజ్యానికి తరలించి రక్షించమని రహస్యంగా చెప్పారు. చోళరాజు క్రూరచర్య కులోత్తుంగచోళుని రాజసభలో శాస్త్రమూ లేదూ చర్చా లేదు. మూర్ఖంగా అతని నిర్ణయాలను ఒప్పుకోవలసిందే, లేకపోతే శిక్షిస్తాడు. వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు కూరేశులు. శృతి స్మృతి పురాణాలనుంచి కూరేశులు ఎన్ని ప్రమాణాలు చూపినా వినకుండా, కులోత్తుంగ చోళుడు కూరేశులు, మహాపూర్ణుల నేత్రాలు పెరికించమని ఆదేశించాడు. ‘ఓరీ దుర్మార్గుడా నీవంటి పాపాత్ముడిని చూసిన కళ్లతో నేను నా ఆచార్యుడిని, శ్రీరంగని చూడలేను. నీవు పీకేదేమి, నేనే నా కళ్లు పెరుక్కుంటాను’ అని చెప్పి కళ్లు పెరుక్కున్నారు. మహాపూర్ణులు 105 సంవత్సరాల వృద్ధులని కూడా చూడకుండా కళ్లు పొడిపించి, అతి క్రూరంగా వారిని సభనుంచి తరిమివేశారు. అంధులై కళ్లనుంచి నెత్తురోడుతున్న ఆ ఇద్దరిని వెంట తీసుకుని అత్తుళాయమ్మ శ్రీరంగం వైపు నడిచింది. కూరేశులు ఆ బాధను తట్టుకోగలిగినా వార్థక్యంతో కనులు పీకిన బాధ భరించలేక మహాపూర్ణులు ‘‘కూరేశా ఇక నాకు సమయం తీరింది నాయనా,’’ అని శిరసు ఆయన ఒడిలో ఉంచి, అత్తులై ఒడిలో కాలు పెట్టుకుని (1102లో) తుది శ్వాస విడిచారు. ఇతర వైష్ణవమిత్రుల సాయంతో ఆచార్యులవారికి సంస్కారం చేశారు కూరేశులు. రామానుజుని రక్షించుకోవడానికీ జీవితాన్నే ఫణంగా పెట్టి మూర్ఖుడైన శత్రురాజు ఎదుట నిలబడడం అపూర్వమైన త్యాగం కూరేశులదైతే ప్రాణమే అర్పించిన మహాపూర్ణులది మహా త్యాగమే. ఆ తరువాత కూరేశుడు శ్రీ రంగనాథుడి ఆలయానికి వెళ్లాలనుకున్నారు. కాని భటులు అడ్డగించి రామానుజుని అనుచరులెవరూ రంగనాథుడి ఆలయంలోకి వెళ్లరాదని నిషేధ శాసనం విధించారని చెప్పారు. రామానుజుడు నా గురువు కాదని చెప్పండి లోనికి అనుమతిస్తాం అన్నారు వారు. ఎంచుకోవలసింది రామానుజుడినో రంగనాథుడినో అయితే నేను రామానుజుడినే ఎంచుకుంటాను ఏం చేసుకొంటారో చేసుకోండి అని కూరేశుడు వెళ్లిపోయారు. రంగని చూడలేక, ఆలయంలోకి వెళ్లలేక రామానుజుని వదులుకోలేక కూరేశుడు శ్రీరంగాన్నే వదులుకున్నాడు. భార్య ఆండాళమ్మను కొడుకులను, కోడళ్లను తీసుకుని తిరుమాలిరుంశోలైకి వెళ్లిపోయారు. కర్ణాటకలో రామానుజులు అప్పడికే రామానుజుడు కాషాయం వదలి శ్వేతవస్త్రం ధరించి కర్ణాటకకు రహస్యంగా తరలిపోయారని తెలుసుకుని కూరేశులు సంతోషించారు. తనకు చెప్పకుండా కూరేశులు, మహాపూర్ణులు మృత్యు కుహరంలోకి వెళ్లారే అని రామానుజుడు బాధపడుతూ కీకారణ్యాలు దాటుతున్నారు. నీలగిరి పర్వతాలను చేరుకున్నారు. విపరీతమైన వర్షం కురవడంతో రామానుజులు, ఆయన శిష్యులు విడిపోయినారు. ఒకరినొకరు వెతుకుతూ ఉన్న దశలో శిష్యులకు కొందరు గిరిజనులు కనిపించారు. ‘‘మీరెవరు ఎక్కడినుంచి వస్తున్నార’’ని అడిగారు. ‘శ్రీరంగంనుంచి’ అని చెప్పగానే ‘రామానుజులు క్షేమమేనా’ అని అడిగారు. రామానుజులు అడవిలో దారితప్పారని చెప్పగానే వారు కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆరురోజులు వెదికినా ప్రయోజనం లేకపోయింది. ఓ రాత్రి చలిమంటలు రగిల్చి కూచున్నారు. అక్కడికి ఒక శ్వేతవస్త్రధారి వచ్చి ‘‘ఇక్కడ జనావాసమేమయినా ఉందా’’ అని అడిగారు. చలికి ఆకలికి బాధపడుతున్న ఆ వైష్ణవుడిని ముందు చలిమంటల చెంత కూర్చోబెట్టారు. ఆయన శ్రీరంగం నుంచి వచ్చారని తెలుసుకుని ‘రామానుజులెక్కడున్నార’ని అడిగారు. ‘మీకు రామానుజులు ఏ విధంగా తెలుసున’ని ప్రశ్నిస్తే నల్లాన్ చక్రవర్తి శిష్యులమనీ భగవద్రామానుజులే తమకు మోక్షమార్గమని చెప్పారని వివరించారు. కూరేశుని వస్త్రాలలో ఉన్న వీరే రామానుజులని శిష్యుడు తెలిపారు. సాష్టాంగ దండాలు పెట్టి, కొర్రలను పిండిగా కొట్టి తేనెతో ఆరగించమని పెట్టారు. చెక్కతో పాదుకలు చేసి సమర్పించారు. ఆ అడవిలోనే రామానుజులను కట్టెలు కొట్టే వారి యజమాని ఇంటిలో దించారు. ఆ యజమాని భార్య కొంగిల్ పిరాట్టి (చేలాచలాంబ) ఒకసారి కరువు వల్ల శ్రీరంగానికి వలసబోయినప్పుడు రామానుజుడు ఏడిళ్లలో భిక్షాటన చేయడం, వందలాది శిష్యులు ఆయనను అనుసరించడం చూసి, ఇంతమంది మీవెంట రావడానికి కారణమేమిటి అని ఆయన్నే అడిగింది. ‘‘నేను వీరికి నారాయణ మంత్రం బోధించానమ్మా. సంసారం తరించడానికి అదే మార్గం. వీరంతా అందుకే నా శిష్యులుగా ఉన్నారు’’. ‘‘స్వామీ అయితే నాకూ ఆ మంత్రం బోధించండి’’ అని అడిగిందామె. నీకు శ్రద్ధ ఉంటే చాలు తల్లీ అని మంత్రోపదేశం చేశారు. మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఏదైనా అనుగ్రహించండి అని ఆమె ప్రార్థించింది. రామానుజులు ఆమెకు పాదుకలను ఇచ్చారు. వర్షాలు కురిసాయని తెలిసి ఆ తరువాత ఆమె మళ్లీ నీలగిరి కొండప్రాంతాలకు వచ్చింది. అప్పడినుంచి రామానుజుని దర్శనమే కాలేదు. వచ్చింది రామానుజుడని తెలుసుకుని ఆమె ప్రసాదం వండి రోజుటి వలెనే పాదుకలకు నైవేద్యం చేసి స్వామిని సాపాటుకు రమ్మని కోరింది. ‘‘అమ్మా శ్రీహరికి నివేదించని ఆహారాన్ని నేను తీసుకోకూడదు. అది నా వ్రతం. నీవు ప్రసాదాన్ని నా పాదుకలకు నివేదించావు కదా’’ అన్నారు. కొంగిల్ బయటకు వెళ్లి పాలు పండ్లూ తెచ్చి ఇచ్చింది. గురుపాదాలకు నివేదించిన విందును శిష్యులంతా స్వీకరించారు. కొంగిల్ పిరాట్టి ప్రేరణతో కోయవారు, కట్టెలు కొట్టుకునే వారంతా రామానుజుని శిష్యులైనారు. రామానుజులు అక్కడినుంచి వహ్ని పుష్కరంమనే రామనాథపురానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఆగి అక్కడినుంచి మిథిలా సాలిగ్రామం (మిర్లే సాలగ్రామం) చేరుకున్నారు. అక్కడ వడుగనంబి (ఆంధ్రపూర్ణులు) రామానుజుyì ని ఆశ్రయించి ఆయన ప్రియమైన శిష్యుడిగా ఎదిగాడు. ఆంధ్రపూర్ణులు ఒక్కరోజు కూడా శ్రీఆచార్య పాద తీర్థం లేకుండా ఉండలేనంత సన్నిహితులైనారు. రామానుజులు అక్కడినుంచి బయలుదేరి వెళ్తున్నట్టు చెప్పారు. మీ పాద తీర్థం లేకుండా రోజు ఎలా గడుస్తుంది ఆచార్యా అన్నారు. అక్కడున్న కొలనులో తన పాదం ఉంచి ఇదే నీ గురు పాద తీర్థం సరేనా అన్నారు రామానుజులు. ఈ సంఘటన వల్లనే ఆ గ్రామానికి సాలగ్రామమని పేరు వచ్చింది. అక్కడినుంచి తొండనూరు చేరుకున్నారు యతిరాజు. తొండనూరు విఠల దేవరాయని పాలనలో ఉంది. విఠల దేవరాయుడు జైనమతాన్ని ప్రోత్సహించేవాడు. ఆ రాజుకు రెండు సమస్యలు న్నాయి. రాజ్యం దుర్భిక్ష పీడితమైతే రాజకుమారి గ్రహపీడితురాలై ఉన్నది. పరిష్కారాన్ని ఆశించి జైనమత గురువులను తన ఇంటి విందుకు పిలిచాడు. ‘‘రాజా! యుద్ధంలో వేలు పోగొట్టుకున్న నీవు అంగవిహీనుడివి, విఠల దేవరాయనివి కాదు ఉట్టి భిట్టి దేవుడవు. నీవంటి అంగవిహీనుని ఇంట భోజనం చేయడం మతవిరుద్ధం. నీ మీద మా మంత్రాలు కూడా పారవు’’ అని చెప్పి విందుకు రాలేదు. రాజు చాలా దుఃఖించారు. రాణి ఆయనను ఓదార్చి, ‘‘శ్రీరంగం నుంచి యతిరాజు రామానుజులు వచ్చి తొండనూరులో ఉన్నారట. ఆయన ఇదివరకు ఒక రాజకుమారికి పట్టిన బ్రహ్మరాక్షసిని విడిపించిన మహిమాన్వితుడు. ఆ పవిత్రమూర్తి కాలిడిన చోట వర్షాలు పడతాయి, నేల సస్యశ్యామలమవుతుందంటారు. ఆ మహానుభావుడిని ఆహ్వానించండి. ఆపైన మన అదృష్టం’’. అప్పటికి రాజుకు మరో మార్గం కనిపించలేదు. యతిరాజును పిలిచారు. రామానుజులు శిష్యసమేతంగా రాజభవనానికి వెళ్లి రాకుమారిని సమక్షంలోకి తీసుకురమ్మని చెప్పారు. ఆమె వచ్చింది. పరిశీలించారు. గ్రహపీడ తొలగాలని ప్రార్థిస్తూ రామానుజాచార్య మంత్రపూరిత తీర్థాన్ని ఆమెపైన చిలకరించారు. ఆమెను పట్టిన బ్రహ్మరాక్షసి వదిలిపోయింది. ప్రశాంతమైన రాకుమారి సిగ్గుపడి లోనికి వెళ్లింది. రాజు ఆనంద భరితుడై ‘‘నేనూ నా రాజ్యం పరివారం జనం మీ అధీనం స్వామీ’’ అని రాజు శరణువేడాడు. రాజ దంపతులు జైనాన్ని వదిలి వైష్ణవాన్ని స్వీకరించి రామానుజుని శిష్యులైనారు. విఠల దేవరాయుడికి విష్ణువర్ధన రాయలని నామకరణం చేశారు. రాజే శిష్యుడు కాగానే ఆయన పరివారం చాలామంది జనులు కూడా అదే దారిలో నడిచారు. ఆచార్య మాడభూషి శ్రీధర్ -
తిరుమలాధీశుడు విష్ణువే!
రామానుజ మార్గంలో మరో చరిత్రాత్మక ఘట్టం.. తిరుమలాధీశుడు శివుడు కాడని, మహావిష్ణువని నిర్ధారించిన ప్రక్రియ. పండిత వాదనా పటిమ. తిరుమల తిరుపతి తమిళ పేర్లు. తిరుపతి అంటే శ్రీపతి, తిరుమల అంటే శ్రీకొండ లేదా శ్రీశైలం. శ్రీ వేంకటాచలానికి తమిళ పేరు తిరువేంగడం. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమైనారని ఆనాటి నారాయణవనం రాజు యాదవుడు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదలి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో కొందరు శైవులు ఆ మూలమూర్తి శివుడనీ, విష్ణువు కాదని, శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగకపోతే రాజ్యానికి అరిష్టమని రాజు చెవిని ఇల్లుకట్టుకుని పోరు పెట్టారు. యాదవరాజు ఈ అంశాన్ని పరిశీలించాలని అనుకున్నారు. అందుకొక విస్తారమైన చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తిరుమలేశుడు శివుడో కేశవుడో ప్రమాణాలతో నిరూపించాలని చాటింపు వేయించాడు. తమ మాటను నమ్మి శైవక్షేత్రంగా మార్చుతాడేమో అనుకుంటే రాజు చర్చాగోష్టి పెడతాడని శైవపండితులు ఊహించలేదు. శైవ క్షేత్రమని రుజువు చేయడానికి పురాణాల్లో ప్రమాణాలు వెతకనారంభించారు. రామానుజులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. తమ వాదాన్ని కూడా వినాలని యాదవరాజును కోరారు. ఆయన సరేనన్నారు. మరునాడు శైవులు వాదన ప్రారంభించారు. ఇక్కడ పుష్కరిణి పేరు స్వామి పుష్కరిణి, కనుక దానికి దక్షిణాన నెలకొన్న స్వామి సుబ్రహ్మణ్యస్వామి అని వాదించారు. స్వామి అనే పేరు కుమారస్వామికి గాక మరెవరికీ లేదన్నారు. వామన పురాణంలో వేంకటాచలం విశేషాలను వివరించారని ప్రమాణం చూపారు. స్కందుడు తారకాసురుడిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి ఏది అనువైన ప్రదేశమని అడిగితే విష్ణు క్షేత్రాలలోకెల్లా పవిత్రమైన తిరుమలకు వెళ్లమని సూచించాడు. స్కందుడు అక్కడికి వెళ్లే సమయానికే వాయుదేవుడు తపస్సు చేస్తున్నాడు. తపోభంగిమ కనుక స్కందుని చేతులలో యుద్ధకాలపు వీరుడికి ఉండే ఆయుధాలేవీలేవు. ఆయన కురులు జడలుకట్టి ఉన్నాయి. విష్ణువే అయితే ఆయన చేతిలో శంఖ చక్రాలు మొదలైన విష్ణు లక్షణాలైన ఆయుధాలు ఉండాలి అవేవీ లేవు. రెండు భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. విష్ణువుకు నాగాభరణాలు ఎప్పుడూ లేవు. బిల్వదళాలతో పూజలు అందుకుంటున్నాడు. విష్ణువుకు తులసీ దళాలే కాని బిల్వదళాలు శివుడికీ శివపరివారానికనీ, కనుక తిరుమలలో విష్ణువు కాదని, స్కందుడని వాదించారు. విష్ణువు కోసమే స్కందుడు తపస్సు రామానుజుడి వాదన: శైవ పండితులు ప్రస్తావించిన వామన పురాణాన్నే రామానుజుడు ఉటంకిస్తూ అందులోని 14వ అధ్యాయం ప్రకారం వేంకటాచలం విష్ణుక్షేత్రాల్లోకెల్లా పవిత్ర క్షేత్రమని ఉంది. స్వామి పుష్కరిణికి దక్షిణాన ఉన్నది వరాహ రూపంలో ఉన్న విష్ణుదేవాలయమే. వరాహపురాణంలోనే వేంకటాచలం వరాహ వాసుదేవ దివ్యధామమని కూడా ఉంది. వేంకటాచల మహత్మ్యంలో ధరణి వరాహస్వామి మధ్య సంభాషణ రూపంలో ఈ ప్రస్తావన ఉంది. పద్మపురాణంలో 24.1వ అధ్యాయంలో కూడా ఈ విషయమే వివరించారు. గరుడపురాణంలో 63వ అధ్యాయంలో అరుంధతీ వశిష్టుల సంభాషణలో, బ్రహ్మాండపురాణంలోని భృగు నారదుల మధ్య సంభాషణలో విష్ణు క్షేత్రమని స్పష్టంగా ఉంది. ఇన్ని పురాణాలు ధ్రువీకరించిన సత్యం ఇది. శ్రీనివాసునికి, వరాహమూర్తికి మధ్య జరిగిన సంభాషణ భవిష్యోత్తరపురాణంలో ఉంది. ఈ కల్పాంతం వరకు హరి శ్రీనివాసుని రూపంలో ఈ వేంకటాచలంపైన ఉంటారని, కుమారస్వామి చేత పూజలను అందుకుంటారని, శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహం చేసుకున్నారని, ఆ వివాహమహోత్సవానికి వరాహ స్వామిని, భూదేవిని ఆహ్వానించారని కూడా ఉంది. స్కందుడికి ముందుగా ఒక ముఖమే ఉందని తరువాత కృత్తికల పోషణలో ఆయన షణ్ముఖుడై పన్నెండు భుజాలను సంపాదించాడని ఉంది. ఇక్కడ ఒకే ముఖం నాలుగు భుజాలు ఉన్న మూర్తి స్కందుడని ఎలా చెప్పగలరని రామానుజుడు ప్రశ్నించాడు. తపస్సు కోసం వెళ్లినాడు కనుక స్కందుడు ఆయుధాలు వదిలేశారని శైవ పండితులవాదం కాని వనవాసానికి వెళ్లిన రామలక్ష్మణులు గానీ, పాండవులు గానీ ఆయుధాలు వదిలినట్టు ఎక్కడా లేదు కదా. అదీగాక వామన పురాణం 22, 23వ అధ్యాయాలలో స్కందుడు తపస్సు చేయడానికి వెళ్తూ వెంట తన అన్ని ఆయుధాలు తీసుకువెళ్లినట్టు స్పష్టంగా ఉంది. బిల్వదళాలతో పూజించడం వల్ల స్కందుడనే వాదం కూడా చెల్లదు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించే స్తుతి కూడా ఉంది, తులసి వలె బిల్వం కూడా విష్ణు ఆలయాలలో పూజలకు వినియోగిస్తారని రామానుజులు వివరించారు. వరాహ పురాణం మొదటి భాగం, అధ్యాయం 45, విభాగం 13లో వేంకటాచలానికి దశరథుడు వచ్చి శ్రీనివాసుని దర్శించారని, ఆ సమయానికి రుషులెందరో విష్ణువు గురించి తపస్సు చేస్తూ బిల్వదళాలతో అర్చించినట్టు పేర్కొన్నారు. ఇక జడలు కట్టిన కేశాలు శివుడికి మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. విష్ణువుకు అనేక అవతారాల్లో జడలు కట్టిన విస్తారమైన శిరోజాలు ఉన్నాయని చెప్పారు. వేంకటాచలానికి వచ్చేనాటికి విష్ణువుకు కురులు జడలు కట్టాయని ఆ పురాణంలో ఉంది. పద్మపురాణం అధ్యాయం 26 మూడో భాగంలో నాగాభరణాలు చిత్రించిన వస్త్రాలను ధరించినట్టు ఉంది. అందులోనే అధ్యాయం 27 నాలుగో భాగంలో జడలు కట్టినకేశాలతో ఆయన ఉన్నట్టు, తరువాత 33వ అధ్యాయం 10వ భాగంలో అవన్నీ త్యజించి సౌమ్యరూపానికి మారినట్టు కూడా ఉంది. భవిష్యోత్తరపురాణంలో శ్రీనివాసుని వివాహ సందర్భంలో ఆకాశరాజు అల్లుడికి నాగాభరణాలను బహూకరించినట్టు ఉంది. బ్రహ్మాండపురాణం రెండో అధ్యాయంలో ఆదిశేషుడు సందర్భాన్ని బట్టి పడకగా, ఛత్రంగా, ఆసనంగా, ఆభరణంగా మారతాడని ఉంది. భవిష్యోత్తర పురాణంలో అనేక శ్లోకాలు శ్రీనివాసుడు నాగాభరణాలు ధరించిన సందర్భాలను వివరించాయి. స్వామి వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంది. హృదయంపై లక్ష్మీదేవి ఉంది. కనుక నారాయణుడు కాక మరెవరూ కాదని రామానుజులు వివరించారు. ప్రస్తుత శ్రీనివాసుని భంగిమలోనే నారాయణుడి రూపం ఉండేదని వామనపురాణంలోని 24వ అధ్యాయం పేర్కొన్నది. ఈ వేంకటాచలం ఒకనాడు వైకుంఠంలోని క్రీడాపర్వతం. గరుడుడే దీన్ని మోసుకుని వచ్చాడు. కనుక ఇది గరుడాచలమనీ వైకుంఠ గిరీ అని అన్నారు. శృతి స్మృతులలో కూడా విష్ణుక్షేత్రమనే నిర్ధారించారు. రుగ్వేదం ఎనిమిదో అష్టకం ఎనిమిదో అధ్యాయం 13వ విభాగంలో కూడా ఈ విషయమే స్పష్టంగా ఉంది. ఇన్ని ప్రమాణాలతో రామానుజుడు నారాయణతత్వాన్ని నిర్ధారించిన తరువాత యాదవరాజుకు ఇంకేం మిగలలేదు. ‘‘యాదవరాజా మరొక అంశం. ఇది శైవక్షేత్రమని వాదించడానికి శైవపండితులు పుష్కరిణి పేరును ప్రస్తావించారు. అది స్వామిపుష్కరిణి కనుక అది కుమారస్వామిదే అన్నారు. పుష్కరిణికి స్వామి అని పేరు రావడానికి దాని పక్కన కుమార స్వామి తపస్సు చేసినందుకే అయి ఉండవచ్చు. స్వామి అంటే యజమాని, పెద్దవాడు అని కూడా అర్థం, పుష్కరిణులలో కెల్లా గొప్పది అయినందున స్వామి పుష్కరిణి అని కూడా అని ఉండవచ్చు. స్వామి అన్న పదానికి సంస్కృతంలో ఉన్న అర్థాలు సరిపోయేది శ్రీమన్నారాయణుడికే. ఎందుకంటే ఈ సకల విశ్వాన్ని సృష్టించి, పోషించే స్వామిత్వం ఆయనకే ఉంది కనుక. పుష్కరిణి తీరాన బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు తపస్సు చేశారని వామనపురాణంలో ఉందని చెప్పారు. కుమారస్వామి కూడా అక్కడే తారకాసుర సంహారం వల్ల కలిగిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి తండ్రి శివుడి సూచన మేరకు తపస్సు చేసారనీ శైవ పండితులే చెప్పారు. తిరుమల క్షేత్రంలో ఉన్నది స్కందుడైతే కుమారస్వామి తన గురించి తనే తపస్సు చేశాడనా? కుమారస్వామి విష్ణువు గురించి తపస్సు చేశారనడం అన్ని విధాలా సమంజసం కదా’’ అని రామానుజుడు వివరించారు. ఇంక వాదించడానికి ఏమీ లేదని యాదవరాజుకు అర్థమైపోయింది. ‘‘రామానుజముని లేవనెత్తిన ఈ అంశాలకు మీ దగ్గర ఏదయినా ప్రతివాదన ఉందా’’ అని యాదవరాజు అడిగారు. దానికి శైవులు.. ‘‘రామానుజాచార్యులవారు తిరుమలలో నెలకొన్నది స్కందుడు కాదని శివుడు కాదని చెప్పారు. కాని విష్ణువనడానికి రుజువులేమిటి? ఈ భంగిమలో ఎక్కడైనా విష్ణువు నిలబడినట్టు ఉందా? చేతిలో ఆయుధాలు లేవు. భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. చతుర్భుజుడే. పైనున్న రెండు హస్తాలు ఖాళీగా ఉన్నాయి. ఒక హస్తం పాదాలను చూపిస్తూ ఉంటే మరొక హస్తం నడుము మీద వేసి ఉంది. ఇది విష్ణు లక్షణమని ఏ విధంగా చెప్పగలరు? స్కందుడు, శివుడు కాకపోతే హరిహరుడవుతాడేమో గాని విష్ణువు కాడు. ఎందుకంటే ఇద్దరి లక్షణాలు పాక్షికంగా ఉన్నాయి కనుక..’’ అని కొత్త వాదాన్ని ఆవిష్కరించారు. ‘హరిహరుడో కాదో తేల్చవలసింది రామానుజులవారే’ అని యాదవరాజు అన్నారు.‘ప్రపంచంలోని ప్రతి అంశంలోనూ విష్ణు అంశం కొంత ఉంటుందని భగవద్గీత పదో అధ్యాయంలో ఉందని, కనుక స్కందునిలో మహదేవునిలో కూడా విష్ణు అంశ ఉంటుంది. స్కందుడు రోజూ మూడు సార్లు పుష్కరిణిలో స్నానం చేసి, వాయు సమక్షంలో నారాయణుని గూర్చి తపస్సు చేసేవాడని స్పష్టంగా వామనపురాణం 21వ అధ్యాయం రెండో భాగంలో ఉంది. శ్రీనివాసుని ఆరాధించడానికి కుమార ధారిక నుంచి స్కందుడు (సుబ్రహ్మణ్యస్వామి) వచ్చేవాడని నిర్ధారించిన పురాణాల్లోనే తొండమాన్ చక్రవర్తి తిరుమలలో విష్ణుమూర్తికి ఆలయం నిర్మించాడని కూడా ప్రస్తావించారు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు రుషులు పుష్కరిణి దక్షిణాన యజ్ఞాలు, తపస్సులు చేశారని, వారిని కరుణించి విష్ణువు ప్రత్యక్షమైనాడని శృతులలో ఉంది. స్కందుడు రాకముందే శివుడు తిరుమలకు దిగువన కొలువైనాడని, నారాయణుని గూర్చి కొండపైన తపస్సు చేయాలని స్కందుడికి శివుడే చెప్పినట్టు శైవ పండితులే పురాణాలను ఉటంకించారని, వరాహ పురాణం 29వ అధ్యాయంలో శ్రీనివాస అష్టోత్తర శతనామ స్తోత్రంలో ‘తిరుమల కొండ దిగువన శివుడు తలపులలో తపస్సులో ఉన్న నారాయణా’ అని కూడా ఉందని, కనుక తిరుమలేశుడు శ్రీనివాసుడైన నారాయణుడు కాక హరుడు కాని హరిహరుడు కాని మరోదైవం కానీ అయ్యే అవకాశమే లేదన్నారు. ‘శైవపండితులు ఇంకేమయినా వాదించదలచుకున్నారా’ అని యాదవరాజు అడిగారు.సాధికారికంగా ఇన్ని పురాణాలను ఉటంకిస్తూ రామానుజముని వాదించిన తరువాత, తర్కబద్ధంగా లక్షణాలను వివరించిన పిదప ఇంక మేమేం చెప్పగలం. అయితే రామానుజుని వాదాన్ని మేము అంగీకరించినా ఆ తిరుమలదైవం అంగీకరించాడని చెప్పగలిగితే మేం పూర్తిగా సంతుష్టులమవుతాం అని మరో ముడి వేశారు. వాదోపవాదాలలో పూర్తిగా పరాజయం పొందిన తరువాత ఇంకా తగాదా కొనసాగించాలని చూడటం సమంజసం కాదని యాదవరాజు కొంత కోపాన్ని ప్రదర్శించారు. రామానుజుడు మాత్రం ఈ శైవుల వాదాన్ని మరింత ఖండితంగా తొలగించి శాశ్వతంగా ఈ వివాదాన్ని నివారించాలని అనుకున్నారు. ‘సరే మనం శ్రీవారి ఆలయంలో శివ విష్ణుమూర్తులకు సంబంధించిన ఆయుధాలను ఉంచి తలుపులు వేద్దాం. మరునాడు స్వామి ఏ ఆయుధాలను స్వీకరిస్తారో చూద్దాం’ అన్నారు. యాదవరాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణ్వాయుధాలయిన శంఖ చక్రాలను, శంకరుడి హస్తభూషణాలైన త్రిశూల డమరుకాలను ఆనందనిలయంలో ఉంచారు. మరునాడు వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే శ్రీనివాసుడు శంఖ చక్రాలు ధరించి దర్శనమిచ్చారు. రాజు ప్రణమిల్లినాడు. రామానుజుని శిష్యుడైనాడు. యాదవరాజు తీర్పును శాసనంగా ప్రచురించమని కోరారు. గర్భాలయ విమానమైన ఆనందనిలయాన్ని పునరుద్ధరించి, వైఖానస ఆగమ విధానాల ప్రకారం వైష్ణవారాధనా విధాన క్రమాలను స్థిరీకరించారు. (రామానుజుని శిష్యుడు ఈ వాదోపవాదాల సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన అనంతాళ్వాన్ రచించిన శ్రీవేంకటాచల ఇతిహాసమాల ఆధారంగా) - రామానుజ మార్గం -
సమతామూర్తిగా... స్ఫూర్తిప్రదాతగా
మేల్కోటేలో రామానుజులు తన కులాతీత సమానతా సిద్ధాంతాన్ని సమగ్రంగా ఆచరణ ద్వారా నిరూపించి నిర్ధారించారు. తిరునారాయణుడిని పుట్టలోంచి బయటకు తీసి పునఃప్రతిష్ఠ చేయడానికి సహకరించిన గిరిజనులకు, హరిజనులకు ఆలయ ప్రవేశం, దర్శనార్హత కలిగించి సమతను చాటారు. దళితులనే తక్కువ చూపు లేకుండా కొందరిని తన శిష్యులుగా చేర్చుకున్న రామానుజులు భగవత్సేవలో దళితులందరికీ స్థానం ఉండాలని వారికి తిరుక్కులత్తార్ అనే గౌరవప్రదమైన పేరును పెట్టి, నియమనిష్టలను ఏర్పాటు చేసి, పంచసంస్కారాలు గావించి, భగవత్సేవలో కాహళి ఊదే కైంకర్యాన్ని కల్పించి సముచిత స్థానం ఇచ్చారు. సుల్తాను కూతురు శెల్వప్పిళ్లై విగ్రహాన్ని ప్రేమించి తిరునారాయణపురం వస్తే ఆమెకు గోదాదేవితో సమానమైన స్థానాన్ని కల్పించి, రొట్టెల నైవేద్యంతో ఆమెను ఆరాధించే పద్ధతిని ప్రారంభించారు. తొండనూరులో అన్ని కులాలవారికి సాగుజలం, తాగుజలం అందేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని ఏర్పాటు చేశారు. తన శిష్యులలో పట్టినిప్పెరుమాళ్ శూద్రకులజుడు. శ్రీరంగంలోని శివార్లలో ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి రామానుజుడు పట్టినిప్పెరుమాళ్ గుడిసెకు వెళ్లేవారు. అతను పరవశంతో పాడిన పాశురాలను కాస్సేపు వినేవారు. దాశరథి విధేయత రామానుజునికి అత్యంత ప్రియమైన శిష్యుడు దాశరథి. తిరుగోష్టియూర్ వెళ్లినప్పుడు ఒంటరిగా రమ్మంటే కూరేశుడిని, దాశరథిని ఎందుకు వెంటతీసుకొచ్చావని అడిగారు. దాశరథి తనకు దండం వంటి వాడనీ ఎప్పటికీ వదలలేనని అంటారు రామానుజులు. స్నానానికి వెళ్లేముందు ఆయన భుజంపైన చేయివేసి నడిచేవాడు. రామానుజుని ఆచార్యులలో ఒకరైన పెరియనంబి కుమార్తె ఆతుల్యలక్ష్మికి వంటపని రాదని వారి అత్తగారు కోపించి పుట్టింటికి పంపించి వేశారు. మళ్లీ వస్తే వంటవాడితో రమ్మని చెప్పిందామె. పెరియనంబి ఏంచేయాలో తోచక రామానుజుడి దగ్గరికి పంపారు. అంతా విన్న రామానుజుడు, ‘‘దాశరథీ ఈ అమ్మాయి వెంట వెళ్లి వారికి వంట చేసి పెట్టు నాయనా’’ అని పంపించారు. ఆయన మారుమాటాడకుండా వెళ్లిపోయాడు. రోజూ మంచి రుచికరమైన వంటలు చేస్తూ ఉన్నాడు. అత్తగారు శాంతించారు. ఓరోజు ఆతుల్యలక్ష్మి మామగారు ఇంటికి వచ్చిన పండితుడితో శాస్త్రచర్చ చేస్తున్నారు. ఓ సూత్రానికి వారు చెప్పిన అర్థం దాశరథికి వినబడింది. వెంటనే వంట ఇంటి నుంచి బయటికి వచ్చి ‘‘అయ్యా ఆ సూత్రం అర్థం అది కాదు. సమంజసమైన అన్వయం ఇది...’’ అని వివరించి మళ్లీ గరిటె పట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వంటవాడేనా ఈయన. ఏమిటీయన జ్ఞానం. ఇంత జ్ఞాని, పండితుడు, ఘంటం పట్టుకుని పుస్తకాలు వ్రాయాల్సిన వాడు తన ఇంట గరిటె పట్టుకుని వంట చేస్తున్నాడా. ‘నాయనా నీవెవరివి?’ అని అడిగాడు మామగారు. ఆతుల్యలక్ష్మి జోక్యం చేసుకుని ‘‘ఆయన రామానుజుని ప్రప్రథమ శిష్యులు దాశరథి’’ అని చెప్పగానే వారు ఇరువురూ ఆయన పాదాలపై పడి క్షమించమని కోరారు. తమ ఇంట ఈ వంట పని మానేయమని కోరుకున్నారు. దాశరథి ‘‘నేను రామానుజులవారి ఆజ్ఞను శిరసావహించవలసిందే. ఆచార్యుడు ఘంటం పట్టమంటే పడతాను. గంటె తీసుకొమ్మంటే అదే తీసుకుంటాను’’ అన్నాడు. అంతా కలసి దాశరథితో రామానుజుని దగ్గరకు వెళ్లారు. ఆయనకు దాశరథిని అప్పగించి ‘‘మీ శిష్యుడు అపారమైన శాస్త్ర జ్ఞాని. ఆయనచేత వంట చేయించుకోవడం మాకు మహాపాపమే. ఆతుల్యలక్ష్మిని పుట్టింటికి పంపించి వేసినందుకు క్షమించండి. అయ్యా మా కోడలికి మేం వంట నేర్పుకుంటాం, ఇంకేదైనా చేస్తాం, కాని మీరు దయచేసి దాశరథిని మీ ఆశ్రమంలో మీతోనే ఉండనీయండి’’ అని వేడుకున్నారు. కర్షకుడు మాఱనేఱి నంబి యామునాచార్యులు ఓసారి ఊరువెళ్లి వస్తూ ఒక కర్షకుడు బురదనీటిని తాగడం చూసి ఏమిటిదని అడిగారు. కర్షకుడు ‘‘నా భార్య అన్నం తేవడంలో ఆలస్యమైంది. ఆకలి ఈ శరీరమనే మన్నుకే కదా అందుకే ఆ మన్నుకు ఈ మన్నునే తినిపిస్తున్నాను’’ అన్నాడు. ఆ రైతు దేహాభిమానరాహిత్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ జిజ్ఞాసికి పంచసంస్కార కర్మలు అనుగ్రహించి, మాఱనేఱి నంబి అని పేరు పెట్టి తన శిష్యులలో చేర్చుకున్నారు. మాఱనేఱి నంబి శ్రీరంగంలో ఆచార్యుల వారి శుశ్రూష చేస్తూన్న సమయంలో యామునాచార్యుల వారికి రాచవ్రణం లేచింది. ఆ బాధ వల్ల అనుష్టానంలో ఏకాగ్రత కుదరడం లేదు. ఆ బాధను తనకు ఇచ్చేయమని మాఱనేఱి నంబి ప్రార్థించాడు. యామునాచార్యులు ఆ భాధను, త్రిదండాన్ని రోజూ మాఱనేఱి నంబికి ఇచ్చి అనుష్టానం తరువాత మళ్లీ తీసుకునే వారు. మొత్తం ఆ బాధను తనకే ఇమ్మని అది మహాప్రసాదంగా తాను అనుభవిస్తానని పదే పదే ప్రార్థించాడు. ఆయన మన్నించారు. యామునులు అవతారం చాలించిన తరువాత మాఱనేఱి నంబి ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. తన వార్ధక్యంలో మాఱనేఱి నంబి రాచపుండుతో బాధపడడం చూసి రామానుజుడు తట్టుకోలేక శ్రీరంగనాథుని ప్రార్థించి ఆ బాధను తొలగింప చేశారు. సంగతి తెలుసుకున్న మాఱనేఱి నంబి ‘‘రామానుజా ఏమిటీ పని. నా గురువు నాకు ఫలం రూపంలో ఇచ్చిన బాధను అనుభవించకుండా నీవు అడ్డు రాకూడదు. నా బాధను నాకిప్పించు నాయనా’’ అన్నారు. ‘‘నమ్మాళ్వార్ శ్రీ సూక్తిలో ఒక దశకాన్ని స్తుతించి మీ బాధను నివృత్తి చేయాలని ప్రయత్నించాను స్వామీ, నన్ను క్షమించండి’’ అన్నారు రామానుజులు. ‘‘అయితే మళ్లీ ప్రార్థించు. నాబాధ నాకు ఇప్పించు’’ అని ఆదేశించారు గురువుగారు. మళ్లీ ప్రార్థన చేసి విచారంతోనే మళ్లీ ఆ వ్రణాన్ని రప్పించారు రామానుజులు. ఆ బాధతోనే ఆయన పరమపదించారు. పెఱియనంబి వారికి బ్రహ్మమే«ధా సంస్కారం జరిపించారు. ఒక శూద్రుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయిస్తారా అని జాతి బ్రాహ్మణులు ఆగ్రహించి పెఱియనంబికి ఆలయ సేవల నుంచి బహిష్కారం విధించారు. శ్రీరంగని సేవించకపోవడం కన్న శిక్ష ఏముందని పెరియనంబి కుటుంబం కృంగి పోయింది. శ్రీరంగని ఊరేగింపు ఇంటిముందు నుంచి సాగుతున్న సమయంలో ఆయన పుత్రిక అత్తుళాయమ్మ రంగనాథుడిని చూసి ‘‘స్వామీ నా తండ్రి నీకేం అపకారం చేసినాడని ఈ బహిష్కారం, ఇదేనా నీ న్యాయం. ముందు సమాధానం చెప్పిన తరువాతనే నీవు ఇక్కడ నుంచి కదలాలి’’ అని కనుల నీరు కారుతుండగా మనసులో అనుకున్నది. అంతే! రథం ఎంత లాగినా కదలడం లేదు. అందరూ శ్రీరంగని ప్రార్థించినా ప్రయోజనం లేకపోయింది. ‘‘స్వామీ ఏమైంద’’ ని అడిగారు అందరూ. అర్చకునికి సమాధానం స్ఫురింపచేశారు రంగడు. ‘‘ఏ పాపమూ ఎఱుగని పెరియనంబిని బహిష్కరించడం రంగనాథునికి కోపం తెప్పించింది, భక్తుడికి, ఆచార్యానుగ్రహం పొందిన శిష్యుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయడంలో తప్పేమిటి? యామునాచార్యుల బోధలు విన్నవారు చేయవలసిన పనేనా ఇది అని శ్రీరంగడు ఆగ్రహించాడు’’ అని అర్చకుడు వివరించారు. వారంతా లోపలికి వెళ్లి పెరియనంబిని క్షమాపణ కోరి ఆయనను తీసుకువచ్చి రథం ఎక్కించిన తరువాత గాని రథం కదలలేదు. రెండో ప్రతిజ్ఞ: వ్యాస, పరాశర తన ఐశ్వర్యాన్నంతా త్యజించి రామనుజుని శిష్యుడై నిత్యం అభిగమన, ఉపాదాన, ఇజ్య, స్వాధ్యాయ యోగాలను చేస్తూ ఊంఛ వృత్తి (బిక్షాటన)తో జీవిస్తున్న నిరాడంబరుడు నిర్వికారుడు, నిరహంకారుడు, దేహాభిమానం పూర్తిగా వదులుకున్నవాడు కూరేశుడు (ఆళ్వాన్, శ్రీవత్సాంక అనే పేర్లూ ఈయనవే). విపరీతమైన వర్షం వల్ల ఆరోజు భిక్షాటనకు వెళ్లలేదు. ఊంఛవృత్తిలో రేపటికోసం దాచుకోవడం ఉండదు. నారాయణ స్వరూపమైన సాలగ్రామానికి ఒక ఫలాన్ని నివేదించి, ఆ సాలగ్రామ అభిషేక తీర్థాన్ని సేవించి దివ్యప్రబంధం పఠించి పడుకున్నారాయన. భార్య ఆండాళమ్మను తన భర్త ఉపవాసం బాధిస్తున్నది. ఆ సమయంలో శ్రీరంగని రాత్రి ఆరగింపు గంట వినిపించింది. ‘‘నీ భక్తుడు తిండి లేక నకనకలాడుతుంటే నీవు షడ్రసోపేత భోజనం చేస్తున్నావా హు’’ అని నవ్వుకున్నది. కాస్సేపటికి మేళతాళాల ధ్వనులు వినిపించాయి. స్వామి ఊరేగింపు వస్తున్నదనుకుని కూరేశులు ఆండాళ్ బయటకు వచ్చారు. శ్రీరంగడి ఉత్సవ మూర్తి రావడం లేదు. ఆలయ అధికారి ఉత్తమనంబి నెత్తిన ఒక మూటతో వస్తున్నారు. ఇదేమిటని అడిగాడు కూరేశుడు. శ్రీరంగని ప్రసాదం అన్నాడు. ‘‘వితరణ చేయడమో విక్రయించడమో చేయవలసిన శ్రీరంగ ప్రసాదం నాకెందుకు ఇస్తున్నార’’ని కురేశుడు అడిగాడు. ‘‘ఇది శ్రీరంగనాథుని ఆజ్ఞ. నాకు కలలో కనిపించి, నా మిత్రుడు నిరాహారంగా పడుకున్నాడు. నీవు శిరస్సున ప్రసాదం ఉంచుకుని సగౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వమని ఆదేశించారు. మీ కోసం శ్రీరంగడు నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. మీవల్లే నాకీ భాగ్యం కలిగింది. మీకు నా ధన్యవాదాలు, అభివందనములు స్వామీ’ అన్నారాయన. మౌనంగా ప్రసాదం స్వీకరించినా, ఎవరో బలీయంగా అడగకపోతే శ్రీరంగడెందుకు ప్రసాదం పంపిస్తాడని ఆలోచించి భార్యతో ‘‘శ్రీరంగని నీవేమైనా అడిగావా’’ అని ప్రశ్నించాడు. ‘‘నా స్వామి పస్తులుంటే నీవు హాయిగా భుజిస్తున్నావా అని మనసులో అనుకున్నాను’’ అన్నదామె. ‘‘ఎంత పనిచేశావు ఆండాళ్. నా స్వామిని గురించి అంత మాట అంటావా. ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు’’ అని హెచ్చరించాడు.‘‘నేనేమన్నాను.. మీరు మీస్వామి గురించి ఆలోచించారు. అదే విధంగా నేనూ నా స్వామి గురించి ఆలోచించకూడదా? అది నా ధర్మం’’. సరే ఇదేదో దైవసంకల్పమే కావచ్చు అనుకుని ఇద్దరూ రెండు ముద్దలు ప్రసాదాన్ని భక్తితో ఆరగించి నిద్రించారు. శ్రీరంగని ప్రసాదంగా ఆ దంపతులకు శుభకృత్‌నామ సంవత్సరం వైశాఖ మాసం పూర్ణిమ నాడు అనూరాధా నక్షత్రాన కవలలు జన్మించారు. జాతసూతకం ముగిసిన తరువాత రామానుజులు స్వయంగా కూరేశుని ఇంటికి వెళ్లి రక్ష చెప్పి ప్రేమతో పిల్లలను ఎత్తుకున్నారు. ‘‘గోవిందా ... ఏమిటిది ఈ శిశువుల నుంచి ద్వయమంత్ర సుగంధం వస్తున్నది?’’ అనడిగారు. ‘‘లోపలి నుంచి తీసుకువస్తూ రక్ష కోసం ద్వయమంత్రానుసంధానం చేశాను స్వామీ’’ అని గోవిందుడు జవాబిచ్చాడు. ‘‘సరే అయితే నీవే ఈ కవలలకు ఆచార్యుడివై నడిపించు’’. ఆ పసివారికి పంచాయుధ ఆభరణాలు ఇచ్చి దీవించారు. ఆ బాలురకు వ్యాస భట్టర్ అనీ పరాశర భట్టర్ ఇద్దరికీ నామకరణం చేశారు. కూరేశుడు పిల్లలను పట్టించుకునే వారే కారు. శ్రీరంగనాథుడు వీరిని నేను దత్తత తీసుకుంటున్నాను. వారు నా పుత్రులే సుమా అని కూరేశుడితో అన్నారని ప్రతీతి. కాలక్రమంలో గోవిందుని బోధనలతో ఏకసంథాగ్రాహులైన ఇద్దరు బాలురు శాస్త్రాధ్యాయనాలలో అగ్రగాములుగా నిలిచారు. యుక్తవయసులో వారికి ఉపనయన పంచసంస్కారాలు జరిపించారు. కుశాగ్రబుద్ధులైన ఈ కవలలు ఓ రోజు వీధిలో ఆడుకుంటూ ఉంటే ‘‘సర్వజ్ఞ భట్టరు వస్తున్నారు బహుపరాక్’’ అంటూ అరుపులు వినిపించాయి. మేళ తాళాలతో పల్లకిలో వస్తున్న పెద్దమనిషిని చూసి అందరూ పారిపోయారు కాని వ్యాసపరాశర భట్టరులు అక్కడే ఉండి ‘‘ఎవరో సర్వజ్ఞుడని తనకు తానే చాటించుకుంటూ పల్లకీలో ఊరేగుతున్నారు’’ అని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకున్నారు. అక్కడి ఇసుకను రెండు చేతుల్లో పట్టుకుని వ్యాస భట్టరు, ‘‘నా చేతుల్లో ఎంత ఇసుక ఉందో చెప్పండి సర్వజ్ఞులవారూ’’ అని అడిగాడు. ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మళ్లీ మౌనమే సమాధానమయింది సర్వజ్ఞుడికి. ఒక పిడికిలి ఇసుక పారవేసి, ‘‘ఇప్పుడెంత ఉందో చెప్పండి’’ అన్నాడా బాలుడు. ‘‘మీరేమి సర్వజ్ఞులు స్వామీ, రెండు గుప్పిళ్లలో దోసెడు, ఒక్క పిడికిలిలో గుప్పెడు ఇసుక ఉన్నదని తెలియదా’’ అన్నారు. ‘ఈ బాలురతోనే వాదించలేని నేను వీరి తండ్రులతో ఏమి వాదిస్తాను’ అనుకుని ఆయన ఇద్దరు పిల్లలను పల్లకీ ఎక్కించుకుని కూరేశుని ఇంటివద్ద దింపి, సర్వజ్ఞ నినాదాలు మానేసి వెళ్లిపోయారు. తరుణ వయస్కులు కాగానే వివాహం చేయాలని సంకల్పించినా కొన్నేళ్లుగా కంచీపురాన్ని వదిలి, శ్రీరంగని సేవలో ఉన్న కూరేశుడికి సంబంధాల గురించి తెలియదు. ఆండాళ్ ‘‘పిల్లల పెళ్లి గురించి పట్టించుకోరేమి?’’ అని అడిగితే ’’శ్రీరంగనాథుడు, మన స్వామి రామానుజులు ఉండగా మనకేమి దిగులు’’ అని వదిలేశారాయన. ‘‘రంగనాథా! పిల్లల పెళ్లి గురించి నన్నడుగుతారేమిటి, నీవుండగా, అదేదో నీవే చూసుకో’’ అని ఆ రాత్రి ఏకాంత సేవ తరువాత చెప్పి వచ్చేశారు. సంబంధాలు వెతుకుతూ రామానుజుడు ఇద్దరు కన్యలున్న బ్రహ్మజ్ఞాని మహాపూర్ణుడి బంధువు ఒకాయన ఉన్నాడని గమనించాడు. వారిని అడుగుదామన్నారు రామానుజులు. కన్యాదాత ఎందుకో నిరాకరించారు. కూరేశుడు స్మార్త బ్రాహ్మణ కులం వడమ శాఖకు చెందిన వాడు. మహాపూర్ణుడు బృహచ్చరణ వర్గానికి చెందిన పురశ్శిఖా బ్రాహ్మణుడు. ఈ కులాంతర భేదం వల్ల నిరాకరించి ఉంటారని ఒక అభిప్రాయం. కాని ఆశ్చర్యకరంగా ఓరోజు ఆయనే ముందుకు వచ్చి ఈ యువకులకు కన్యాదానం చేస్తానన్నారు. ‘‘శ్రీరంగనాథుడు నా కలలో కనిపించి’’ నా దత్త పుత్రులకు కన్యలను ఎందుకు ఇవ్వవు అని అడిగారు. ఇంతకన్న నాకు కావలసిందేముంది. నన్ను క్షమించి అంగీకరించండి’’ అని వేడుకున్నారు. మణ్ణి, అక్కచ్చిలను వారికిచ్చి వివాహం చేశాడాయన. గురుకృప, భగవదనుగ్రహం ఉన్న వ్యాస పరాశరులు ఆ మహర్షుల గౌరవాన్ని నిలబెట్టే రచనలు చేసి రామానుజుని ప్రియశిష్యులై భాసిల్లారు. పరాశర భట్టర్ శ్రీ లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ గుణరత్న కోశం, రంగనాథ వైభవాన్ని వివరించే శ్రీరంగరాజస్తవం, పూర్వోత్తర శతకాలు, త్రిమంత్ర సారాంశమైన అష్టశ్లోకి, శ్రీరంగనాథ స్తోత్రం, విష్ణుసహస్రనామస్తోత్రానికి సవివర వ్యాఖ్యానమైన శ్రీ భగవద్గుణ దర్పణం, కైశిక పురాణానికి చేసిన మణిప్రవాళ వ్యాఖ్యానం, అత్యంత మధురంగా ముక్త శ్లోకాలను రచించారు. పరాశరభట్టర్ అసాధారణ పాండిత్య వైభవాన్ని ప్రకటించే ఈ రచనలు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజానీకానికి చేరువ చేశాయి. వీరిరువురి రచనలు విష్ణుపురాణంలోని విశ్వతత్వాన్ని, జీవతత్త్వాన్ని, పరమాత్మతత్వాన్ని సులభగ్రాహ్యరీతిలో నిర్ధారించాయి. వ్యాసుడు, పరాశరుడు రచించిన పురాణాల మూలతత్వాన్ని, తత్వత్రయమును ఆ పేర్లుగలిగిన ఇద్దరు మహాభక్తుల ద్వారా వ్యాఖ్యానింపచేయడం రామానుజుని సమర్థత. తద్వారా వ్యాస పరాశర మునుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేసి యామునులకు ఇచ్చిన రెండో వాగ్దానం రామానుజులు నెరవేర్చారు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
రామానుజుని శిష్యరికంలో గోవిందుడు
శ్రీశైల పూర్ణులు ముందే వెళ్లి, ఎదురువచ్చి రామానుజుడికి మర్యాదలతో స్వాగతం చెప్పారు. ఈ వయసులో ఆయన ఉరుకులు పరుగులతో పనులు చేస్తూ ఉంటే అయ్యా ఈ వయసులో ఇంత శ్రమా? ఎవరైనా మీకన్న చిన్నవాడిని యువకులను పంపవచ్చుగదా అంటే ‘‘మొత్తం ఈ తిరుమలలో నాకన్న చిన్నవాడెవరూ నాకు కనిపించలేదయ్యా’’ అన్నారట. శ్రీశైలపూర్ణుల వినయం అది. వారు తెచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ముందుకు నడిచి మాడవీధులలో ప్రదక్షిణగా వెళ్లి, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, పుష్కరిణి తీర్థం స్వీకరించి అక్కడ చింతచెట్టును చుట్టి, పుష్కరిణీ తీరంలో ఉన్న శ్రీ వరాహ స్వామిని సేవించుకున్నారు. మహాద్వారం గుండా కలియుగ వైకుంఠమైన ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం, బలిపీఠం దగ్గర సాగిల పడి, వంటశాల, యాగశాల పరిశీలించి, తిరుమామణి మండపంలో తిరిగి, విష్వక్సేనుడిని సేవించుకుని యోగనరసింహస్వామిని దర్శించుకుని, దేదీప్యమానంగా ఆకాశంలో నిలబడి ఉన్న ఆనందనిలయ విమానాన్ని చూసి నమస్కరించి గర్భాలయంలో ప్రవేశించి, గరుడునికి మొక్కి, జయవిజయుల మధ్య నుంచి శ్రీనివాసుని చూస్తూ కులశేఖర పడి దాటిన రామానుజుడు ఆ దివ్యమంగళ రూపుని తన్మయుడై చూస్తూ ఆనంద పరవశుడై ‘శ్రీ శ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే’ అన్నారు. చేతులు కట్టుకుని స్వామి దివ్య తిరుముఖ మండలాన్ని సేవిస్తూ కాసేపు నిలిచిపోయారు. మంగళం పాడారు. స్థానాచార్యులు తీర్థం, శఠారి ఇచ్చారు. వేంకటేశ్వరస్వామివారి తిరుమంజనసేవ (అభిషేకం) చేసుకున్నారాయన. ‘‘ఆహా ఇది సాక్షాత్తూ వైకుంఠమే, సందేహం లేదు. ఇది నిత్యసూరులకు నిత్య నివాసమే. ఇది పరమ పావన క్షేత్రం. ఇది నా వలన అపవిత్రం కారాదు అనుకున్నారు’’. శ్రీశైలపూర్ణుల వారు కనీసం మూడురోజులు నిద్ర చేయాలని సూచించారు. సరేనన్నారు. మూడురోజులు ఉండి మూడోరోజున కూడా స్వామిని దర్శించారు. తిరుమలేశుని అనుమతిని, శ్రీశైలపూర్ణుల అనుమతిని తీసుకొని కిందికి బయలుదేరారు. తిరుపతిలో రామానుజుడు శ్రీశైలపూర్ణుల ఇంటిలోనే ఒక ఏడాది పాటు ఉన్నారు. గోవింద రాజులు కోవెలలో శ్రీశైలపూర్ణుల శ్రీమద్రామాయణ ప్రసంగాలను విన్నారు. శ్రీ రామాయణం సంపూర్ణంగా శ్రీశైల పూర్ణుల నుంచి ఏడాది పాటు నేర్చుకున్నారు. రామానుజాచార్యులకు అనువైన శిష్యుడిగా గోవిందుడు దొరికింది ఇక్కడే. గోవిందుడిని విశిష్టాద్వైతంలోకి మళ్లించి తీసుకువచ్చింది శ్రీశైల పూర్ణులే. వచ్చినప్పటి నుంచి గోవిందుని రామానుజులు గమనిస్తున్నారు. ఒకసారి శ్రీశైలపూర్ణుల శయ్యను సరిచేస్తున్నాడు. కాసేపటి తరువాత శయ్యమీద పడి దొర్లాడు. ‘‘గోవిందా ఏమిటిది..’’ అంటున్న రామానుజుని చూసి లేచి నిలబడ్డాడు. ‘‘నేను శయ్యసరిగా ఉందా లేదా అని చూసానంతే. ఒకవేళ ఎక్కడైనా ముడతలు పడితే గురువుగారు నొచ్చుకుంటారు. నిద్రాభంగమవుతుంది కదా. సరిచూడటం నా బాధ్యత అనుకున్నాను’’ అన్నాడు గోవిందుడు. మరో సందర్భంలో గోవిందుడు ఒక పామును పట్టుకుని దాని నోట్లో వేలు పెడుతున్నాడు. ఈ వింత చర్య చూసి ఆశ్చర్యపోయాడు. పాము మీదే దృష్టి అంతా. పాము నోట్లోనుంచి ఒక ముల్లు పీకి బయట పడేశాడు. ‘‘పాముతో ఆడుకుంటున్నావా’’ అని అడిగారు రామానుజుడు. ‘‘కాదు ఆచార్యా, పాపం దాని నోట్లో ముల్లు ఇరుక్కుని బాధపడుతున్నది. ఏదీ తినలేదు, నోరు మూయలేదు. ముల్లు తీయడం తప్ప మరో మార్గం లేదు... కనుక ఈ సాహసం చేశాను’’ అన్నాడు గోవిందుడు. ‘‘మరి అది పాము కదా... కాటేస్తే...’’ అన్నారు రామానుజులు. వేయలేదు కదా స్వామీ అని గోవిందుడి జవాబు. గోవిందుని గురుభక్తి, మంచి మనసు, అన్ని జీవుల పట్ల అనురాగం, భూత దయ అర్థమయింది. గోవిందుడిని తనతో పంపమని శ్రీశైల పూర్ణులను అభ్యర్థించారు. ఆయన వెంటనే అంగీకరించాడు. రామానుజునితో వెళ్లాలని, రామానుజుని ప్రియమైన శిష్యుడిగా మెలగాలని, ఆయనకు నిత్యం సేవలు చేసి మంచి శిష్యుడనిపించుకోవాలని బోధించి పంపించారు. గోవిందుడు రామానుజుని వెంటవెళ్లాడు గాని అతని మనసంతా శ్రీశైల పూర్ణుని మీదే ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలించలేదు. ఆకలి, నిద్రలేవు. ఇదంతా గమనించిన రామానుజుడు శ్రీశైలపూర్ణులు దూరం కావడం వల్లనే గోవిందుడు బాధపడుతున్నాడని, గురువును విడిచి ఉండలేని శిష్యుడని అర్థం చేసుకున్నారు. ఆచార్యుల వారి దగ్గరకు పంపడం ఒక్కటే మార్గమని నిర్ణయించి, కొందరిని తోడు ఇచ్చి తిరుపతికి తిరిగి పంపించారు. వారు వెళ్లి గోవిందుని పరిస్థితి వివరించారు. శ్రీశైలపూర్ణులు ‘‘ఒక ఆచార్యుడికి నిన్ను సమర్పించిన తరువాత తిరిగి వెనక్కి తీసుకోవడం తగనిపని. ఇప్పుడు నీవు ఆతని సొత్తువు నాయనా. నేను నిన్ను మళ్లీ స్వీకరించలేను. నీకు ఆచార్యభక్తి ఎక్కువ కనుకనే నిన్ను నేను ఆయనకు అప్పగించాను. నీవు నన్ను సేవించినట్టే శ్రీమద్రామానుజుడిని సేవించు గోవిందా. ఇది నీ భాగ్యం అని అర్థం చేసుకో. నీవు రామానుజులవారి వెంట ఉండి సేవిస్తే , ఆ ప్రతిసేవా నాకు అందుతుందని తెలుసుకో. నాకన్న రామానుజుడికి నీవంటి మంచి శిష్యుల అవసరం ఉంది. ఆయన జగద్గురువు. ఆయనను రక్షించుకునే బాధ్యత మనందరి మీదా ఉంది. కనుకనే నిన్ను ఆయనకిచ్చి పంపుతున్నాను. బాధపడకు. మనసు నిర్మలం చేసుకో. వెళ్లు. నీకు గురువైనా దేవుడైనా నేనైనా రామానుజుడే’’ అని బోధించారు. గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, కన్నీళ్లతో కాళ్లు కడిగి, గురువుగారి కుటుంబంలో ఒక్కొక్కరిని కళ్లారా చూసి. నమస్కరించి, సెలవు తీసుకుని గోవిందుడు మనసు రాయిచేసుకుని బయలుదేరాడు. గురువుగారి మాటలు మనసులో నాటుకున్నాయి. తనకు ఇక శ్రీశైల పూర్ణుడైనా రామానుజుడైనా ఒకరే. రామానుజుడిలోనే శ్రీశైలపూర్ణుల వారిని చూసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. గోవిందుడు మళ్లీ తన దగ్గరికే రావడం చూసి రామానుజులు ఆశ్చర్యపోయారు. జరిగింది తెలుసుకున్నారు. గురువుగారి ఉపదేశం విన్నారు. మౌనంగా తన పాదాలకు నమస్కరిస్తున్న గోవిందుడిని చూశారు. శ్రీశైల పూర్ణుడి ధర్మనిరతి, తనపై ఆయనకున్న ఆప్యాయత తలుచుకుని ఆయనకు నమస్కరించారు. గురువు ఆజ్ఞను మీరకుండా గోవిందుడు రామానుజుని సేవించసాగాడు. క్రమంగా స్వస్థత చెందాడు. గురువుకు ఏ అసౌకర్యమూ కలగకుండా చూసుకుంటూ రామానుజుని ప్రేమానురాగాలను గోవిందుడు సాధించాడు. శ్రీభాష్యం రచన– రామానుజ జైత్ర యాత్ర యామునాచార్యుల వారికిచ్చిన తొలి వాగ్దానం బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరమైన శ్రీభాష్యరచన. అందుకోసం కావలసినది బోధాయన వృత్తి. బాదరాయణ రుషి రచించిన రెండు లక్షల శ్లోకాల గ్రంథానికి సంక్షిప్తరూపమైన 25 వేల శ్లోకాల పుస్తకం కాశ్మీరంలోని శ్రీనగరంలో సరస్వతీ భాండాగారంలో ఉంది. కాశ్మీరానికి వెళ్లవలసిందే. మఠాన్ని నిర్వహించే బాధ్యత కొందరు శిష్యులకు అప్పగించి, శ్రీరంగనాథుడికి ప్రణమిల్లి పెరుమాళ్ అనుమతి తీసుకుని కురేశుడి (ఆళ్వన్, శ్రీవత్స పేర్లు కూడా ఆయనవే) వరద విష్ణు ఆచార్య, ఎంబార్ వంటి ప్రధాన శిష్యులతో కలసి మూడునెలల పాటు కాలినడకన ప్రయాణించి కాశ్మీరం చేరుకున్నారు. దారిలో అనేక నగరాలలో పండితులతో చర్చా సమరంలో పాల్గొన్నారు. తర్కంతో అందరినీ జయించారు. వాదనలో ఉద్దండులే అయినా సత్యశోధన శూన్యం కావడం, పాండిత్యంతోపాటు మూఢత్వం కూడా ఉండటం వారి పరాజయానికి కారణాలు. రామానుజుడు సత్యం వైపు వారి దృష్టిని మళ్లించారు. అక్కడి రాజాస్థాన పండితులతో వాదించి వారిని జయించారు. రాజు కూడా రామానుజుని ప్రతిభావిశేషాలను విజ్ఞానవిశేష వాదనా పటిమను చూసి ముగ్ధుడైనాడు. ‘‘మహారాజా, నేను నా గురువైన యామునాచార్యుల ఆజ్ఞ మేరకు బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని రచించేందుకు సంకల్పించాను. ఇదివరలో బోధాయనుడనే పండితుడు దానిపై వృత్తి గ్రంథాన్ని రచించినారు. అది మీ సరస్వతీ భాండాగారంలో ఉంది. మాకు ఆ ‘బోధాయన వృత్తి’ గ్రంథం చాలా అవసరం. మేం కొంతకాలం అధ్యయనం చేసిన తరువాత మీకు తిరిగి ఇవ్వగలం, దయచేసి ఆ పవిత్ర గ్రంథాన్ని కొద్ది రోజుల కోసం మాకు ఇవ్వవలసిందని అభ్యర్థన’’ అన్నారు. దక్షిణం నుంచి వచ్చిన రామానుజాచార్యులకు ఇవ్వడం కాశ్మీరు పండితులకు ఏమాత్రం నచ్చలేదు. ఇవ్వరాదని రాజుకు విన్నవించారు. ‘‘సరే, ఒకసారి చదువుకొనడానికయినా అనుమతించండి రాజా అని కోరారు. వేలశ్లోకాల గ్రంథాన్ని ఒక్కసారి చదివితే ఏమాత్రం సరిపోదని మొత్తం తెలిసే అవకాశమే లేదని భావించి పండితులు అంగీకరించారు. రాజుగారు ఆ గ్రంథాన్ని రామానుజునికి సమర్పించారు. రామానుజులు రాత్రింబవళ్లు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని కురేశుని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆయన అధ్యయనం ముగిసింది. శ్రీరంగం వెళ్లేముందు రాజసభలోనే రామానుజుడు తొలి సూత్రం ‘‘అధాతో బ్రహ్మజిజ్ఞాస’’ పై వ్యాఖ్యను చదివి, దానికి మరింత వివరమైన వ్యాఖ్యానం చేసి రాజును, అక్కడి సభాసదులను మెప్పించారు. బోధాయనుడి అన్వయాన్ని చదివిన వెంటనే ఒక్కసూత్రంపైన అంతగొప్ప భాష్యాన్ని చెప్పినందుకు రాజు ఆ గ్రంథాన్ని పూర్తిగా తీసుకుపోవచ్చునని రామానుజుడికి ఇచ్చేశారు. ఒక్కసారి చదివితేనే అద్భుత వ్యాఖ్యానం చేసిన రామానుజుడు ఇంకా కొన్నాళ్లపాటు ఈ పుస్తకం సమగ్రంగా అధ్యయనం చేసి శ్రీ భాష్యం రచిస్తే ఇంకే అద్భుతం చేస్తారో అని అక్కడ పండితులు ఈర‡్ష్య చెందారు. ఇతర మతాలనన్నీ జయించి వైష్ణవాన్ని సుస్థాపితం చేస్తారని అసూయపడ్డారు. విశిష్టాద్వైతం ముందు ఇక ఏమతాలు మిగలబోవని భయపడ్డారు. ఆయనకు గ్రంథం దక్కకుండా చేయాలనే దురుద్దేశంతో కొందరిని వెంట పంపించారు. కొన్ని రోజులపాటు వారు రామానుజుని బృందాన్ని అనుసరించి ఒక రాత్రి ఏమరుపాటుగా ఉన్నప్పుడు బోధాయన వృత్తిని వారు తస్కరించారు. మరునాడు లేచి చూసేసరికి ఆ గ్రంథం లేదు. లక్ష్యం విఫలమైందనీ. ఇంత శ్రమా వృథా అయిందనీ కలత చెందారు రామానుజులు. కాశ్మీరం వెళ్లి రాజుకు ఫిర్యాదు చేయాలని కొందరు, రాజు శిక్షించినంత మాత్రాన పుస్తకం దొరుకుతుందా అని మరికొందరు అనుకున్నారు. అంతలో అక్కడికి కురేశుడు వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. బోధాయన వృత్తి గ్రంథం పోయిందని చెప్పారు సహచరులు. ‘‘ఆచార్యవర్యా మీరేమాత్రం చింతించే అవసరం లేదు. నేను ఆ గ్రంథాన్ని కూలంకషంగా చదివినాను. మీకు కావలసిన విధంగా బోధాయనుడి వ్యాఖ్యాన వివరణలను నేను ఇవ్వగలను. మీరు నిశ్చింతగా ఉండండి స్వామీ.’ అన్న కురేశుని చూసిన రామానుజుని ముఖంలో వెలుగు కనిపించింది. ఏదీ రెండోసూత్రం గురించి బోధాయనుడు వ్రాసిన వాక్యాలు వినిపించు’’ అని పరీక్షించారు. కురేశుడు యథాతథంగా వినిపించాడు. రామానుజుని ఆశ్చర్యానందాలకు అంతులేదు. కురేశుని కౌగిలించుకుని, ‘నీ ఏకసంథాగ్రాహిత్వం నాకు తెలుసు కురేశా. ఇటువంటి కీడు శంకించే వృత్తి గ్రంథాన్ని నిన్ను అధ్యయనం చేయమని కోరాను. నా చింత దీర్చగలవనే నమ్మకం ఉంది కనుకనే. ఇక్కడున్న వీరందరికీ నీ విశిష్టత తెలియడం కోసమే నిన్ను పరీక్షించాను. నీ వల్ల నేను వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాను. కురేశా నీవే దానికి లేఖకుడిగా ఉందువుగాని. శ్రీరంగనాథుడి సన్నిధిలో మనం శ్రీభాష్య రచనాయజ్ఞాన్ని ప్రారంభిద్దాం’’ అన్నారు. ‘‘మహాభాగ్యం స్వామీ, నా జన్మధన్యం’’ అని కురేశుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. వ్యాసుడు రచయిత గణేశుడు లేఖకుడు వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరని ప్రశ్నించాడు. అందుకు సమర్థుడు వినాయకుడే అని తెలిసి, ఆయనను ప్రార్థించాడు. గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ధన్యోస్మి వినాయకా అని నమస్కరించగా, ‘‘వేదనారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతినమస్కారం చేశాడు. అయితే వ్యాసమహర్షీ, నాదొక విన్నపం అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడ ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంటవెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థంచేసుకున్న తరువాతనే వ్రాయాలి సుమా..’’అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు. సరే ననక తప్పదు. ‘‘నాకూ మంచిదే ఆ మహాగ్రంథమైన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’’ అనుకుని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహమై సాగిపోతున్నది. వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని గమనిస్తూ ప్రశంసిస్తూ ఆనందిస్తూ వ్రాస్తున్నాడు. ఇంకా సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవారట. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ ఆయన నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
తిరుమల యాత్రలో రామానుజులు
సహస్రాబ్ది ధారావాహిక – 17 రామానుజుడు బోధించిన భగవద్గుణాలను వివరించే హరి మేలుకొలుపు గీతాలు ఒక ఇంటినుంచి చాలా వీనుల విందుగా వినిపిస్తుంటే గోవిందుడు అక్కడే ఆగిపోయి, ఆ అరుగుమీద కూచుని తన్మయుడై వింటూ ఉన్నాడు. నిజానికి అది ఒక వేశ్య ఇల్లు. వెంటనే మరికొందరు శిష్యులు ఈ విషయాన్ని గురువుగారికి చేరవేశారు. ఇదేమి వింత గోవిందా, నీవు వేశ్య ఇంటి అరుగుమీద కూచోవడమేమిటి? అని రామానుజులు ప్రశ్నించారు. ‘‘మీ భగవద్గుణాలను వింటున్నానే గాని నాకు అదెవరి గృహమో తెలియదు ఆచార్యా’’ గోవిందుని నిష్కల్మష భక్తిని రామానుజుడు ప్రశంసించాడు.గోవిందుడికి అప్పటికే వివాహమైంది. భార్య రుతుమతి అయిన తరువాత గోవిందుని తల్లి కుమారుని దగ్గరకు వచ్చి గృహస్థాశ్రమ ధర్మానికి అనుగుణంగా సంసార బాధ్యత స్వీకరించి కోడలికి గర్భాదానం చేయాలని కుమారునికి ప్రబోధించింది. సరేనని ఒక రాత్రికి కోడలిని తీసుకురమ్మన్నాడు. ఆమె పాపం తీసుకువచ్చింది. కాని గోవిందుడు రానే రాలేదు. ఎంతసేపటికి భగవన్నామ స్మరణే కాని సంసారం ధ్యాసే లేకుండా పోయిందని రామానుజుడికి విన్నవించింది ఆయన తల్లి. నేను కనుక్కుంటానమ్మా అన్నారు రామానుజుడు. ‘‘గోవిందా నీవు సంసార జీవితంలో ఉంటే భార్యతో కాపురం చేయాలి కదా’’ అని అడిగారు. ‘‘అవును ఆచార్యా కాని ఏకాంతం దొరికితే కదా సంసారం చేసేది. నాకు అన్ని సమయాల్లోనూ అన్ని కాలాల్లోనూ మీ దివ్యబోధలే వినిపిస్తున్నాయి. సూర్యుడిపై మీరే వెలుగుతున్నారు. ఇక చీకటే లేదు. ఏకాంతమే లేదు. ఇంత వెలుగులో సంసారమూ కాపురమూ సాధ్యమేనంటారా?’’ అన్నాడు గోవిందుడు. తన శిష్యునికిసన్యాసాశ్రమమే సరైందని నిర్ధారించి రామానుజుడు అతణ్ని సన్యాసాశ్రమంలో చేర్పించి ఎంబార్ అనే నామాన్ని ఇచ్చారు. దాశరథికంచి మఠంలో ఉన్నపుడే మేనమామ కుమారుడు దాశరథి (మొదలియాండన్) శిష్యుడైనాడు. మరొక ముఖ్యశిష్యుడి పేరు కురేశుడు. అతను కుర్ అనే అగ్రహారానికి రాజు. అత్యంతసంపన్నుడైన కురేశుడు తన సతి ఆండాళమ్మతో కలసి రామానుజుని పాదాలను ఆశ్రయించాడు. తిరుమారి మార్బన్ అనే నామాన్నిచ్చారు రామానుజులు. ఇదే సందర్భంలో ఒకనాటి గురువు యాదవప్రకాశులు తన తల్లి ఆజ్ఞమేరకు రామానుజుని శిష్యుడుగా గోవింద దాసు అనే కొత్త నామంతో ఆశ్రమప్రవేశం చేశారు. ముగ్గురికీ పంచ సంస్కారాలు చేశారు. యతిధర్మసముచ్ఛయము అనే పుస్తకం రాసిన తరువాత కొద్దికాలానికి యాదవ ప్రకాశులు పరమపదించారు. తిరుమలను పుష్పవనంగా మార్చిన రామానుజులుద్వారక శ్రీ కృష్ణ క్షేత్రాన్ని వస్త్రధామంగానూ, పూరీ జగన్నాథ క్షేత్రాన్ని అన్నధామంగానూ కీర్తిస్తారు. ఆవిధంగానే తిరుమల పుష్పధామం అంటారు. పూలవనాలకు పెట్టింది పేరు తిరుమల. అందుకు కారణం రామానుజుడు. ఒకసారి రామానుజుడు తిరువాయిమొళిలో ఒక పాశురం పారాయణం చేస్తూ ఉన్నారు. వైకుంఠ వాసులైన నిత్యసూరులు కూడా పరమపదం నుంచి వచ్చి తిరుమల స్వామిని సేవిస్తారు అని ఆ పాశురంలో వివరించారు. ‘‘శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యకైంకర్యం చేయాలి, సర్వకాలాలలో సర్వావస్థలలో కైంకర్యం ఆగకూడదు’’ అంటూ ఎవరైనా తిరుమల వెళ్లి అక్కడే ఉండి ఆ చలికి ఓర్చి పూలవనాలు పెంచుతూ స్వామికి పుష్పకైంకర్యం చేస్తారా అని రామానుజులు అడిగారు. అనంతసూరి (అనంతాళ్వారు) నేను వెళ్తానన్నాడు. అందుకు మెచ్చుకుని ఆశీర్వదించి పంపారు. తిరుమలలో అంతకుముందు యామునాచార్యుల వారు కొన్నాళ్లు పూల సేవ చేసేవారు. ఆయన శిష్యులైన శ్రీశైలపూర్ణుల వారి నేతృత్వంలో అనంతాళ్వార్ ఆ సేవ కొనసాగించాలని సూచించారు. తిరుమల కొండలలో రకరకాల పూల మొక్కలను పెంచారు అనంతసూరి. దానికి యామునోత్తర పుష్పవనం అని పేరు పెట్టారు. కాని ఆ మొక్కలు ఇచ్చే పూలు సరిపోవనీ, ప్రత్యేకంగా ఒక ఉద్యానవనమే స్వామివారికి ఉండాలని, అందుకు ఒక చెరువు కూడా అవసరం అని అనంతాళ్వారు అనుకున్నారు. చెరువు తవ్వకంలో తన భార్య తప్ప మరెవరి సాయం తీసుకోకూడదని నేల తవ్వడం మొదలు పెట్టారు. భార్య తట్టలో ఎత్తి మన్ను దూరంగా పారబోసేది. వీరి దీక్ష పరీక్షించాలని శ్రీనివాసుడే బాలుడి రూపంలో వచ్చి నేను మీకు సాయం చేస్తానని పేచీ పెట్టాడు. ససేమిరా వీల్లేదన్నారు అనంతాళ్వార్లు. గర్భవతి అయిన భార్య చెమటోడ్చి తట్టల్లో మట్టి ఎత్తుతూ ఉంటే కొంతదూరంలో ఆ తట్టలను అందుకుని దూరంగా గుమ్మరించి తట్టను అమ్మగారికి ఇచ్చేస్తున్నాడు బాల బాలాజీ. కాస్సేపటి తరువాత భార్య వేగంలో అంతరార్థం ఆయనకు అర్థమైంది. పట్టుకుందామని వెంటపడ్డాడు. దొరకలేదు. తన చేతిలో ఉన్న గునపం విసిరినాడు. అది ఆయన గదుమకు గాయం చేసింది. పరుగెత్తిపోయాడు. వెంట తానూ పరిగెత్తివెళ్లాడు. ఆ బాలుడు ఆనందనిలయంలోకి వెళ్లి అంతర్థానమైనాడు. గర్భగుడిలో వేంకటేశుని మూలమూర్తి గదుమనుంచి రక్తం కారుతున్నది. అర్చకులు స్వామివారి చుబుకానికి పచ్చ కర్పూరం పెడుతున్నారు. తను గాయపరిచింది సాక్షాత్తూ వేంకటేశ్వరుడినే అని తెలిసి ఏడుస్తూ అనంతాళ్వార్ పడిపోయారు. క్షమించమని వేడుకున్నారు. ‘‘నీ భక్తికైంకర్యాన్ని లోకానికి చాటడానికే ఈ లీల. బాధపడకు అనంతాళ్వార్ నీ భక్తికి గుర్తుగా నేనీ పచ్చకర్పూరాన్ని నిత్యమూ నా గదుమ మీద ధరిస్తాను’’ అని స్వామి పలికారు. చెరువు పూర్తయింది. పక్కనే పెద్ద తోట. రకరకాల పూల మొక్కలతో అలరారుతున్నది. రామానుజం అని ఆ తోటకు పేరు పెట్టారు. స్వామికి రెండుపూటలా సుగంధ సుమమాలలు అందుతున్నాయి. ఈ పూలు పూచే తోట చూడాలని స్వామి అలమేలు మంగతో కలిసి రాత్రి తోటకు వచ్చిన కథ మరొకటి వాడుకలో ఉంది. దంపతులిద్దరూ తోటలో పూలు తెంపి వాసన చూసి కొప్పులో ముడిచి వెళ్లినట్టు మరునాడు అనంతాళ్వార్‌కు స్పష్టంగా కనిపిస్తున్నది. తన తోటనెవరో పాడు చేస్తున్నారని భావించి రాత్రి కాపలా ఉన్నారు. తొమ్మిదో రాత్రి నవయువ దంపతులిద్దరూ కనిపించారు. అమ్మవారిని పట్టుకుని మల్లెతీగలతో చెట్టుకు కట్టి, పరుగెత్తుతున్న యువకుడి వెంట పడ్డారు. ఆయన అప్రదిక్షణంగా తిరుగుతూ మాయమైపోయారట. సుప్రభాతం తరువాత గర్భాలయంలో ప్రవేశిస్తే స్వామి వక్షస్థలంమీద అమ్మవారి విగ్రహం మాయమై కనిపించింది. అర్చకులు ఆందోళన పడుతుంటే స్వామి కంఠధ్వని వినిపించింది. అలమేలు మంగమ్మ అనంతాళ్వార్ తోటలో ఉంది తీసుకుని రమ్మన్నారట. ఛత్ర చామర వాహన మంగళ వాయిద్యాలతో తోటకు వెళ్లి సాక్షాత్తూ అమ్మవారినే కట్టివేసిన గొప్పదనం నీదే అనంతాళ్వార్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడాయన. క్షమించమని ప్రాథేయపడి ఆమెను పూలబుట్టలో కూర్చుండబెట్టి, ఆనందనిలయంలో స్వామికి అప్పగించారు. అప్పటినుండి ఆయన అమ్మవారికి మేనమామ అయ్యారని కొందరు, కాదు కాదు స్వామికి కన్యాదానం చేసినట్టు అమ్మవారినిచ్చి ఆయన స్వామికే మామ అయ్యాడనీ అంటారు. రామానుజులు ఆ పాశురం చదివినప్పటినుంచి వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలనే తపన పెరిగింది. కంచి, తిరుమలక్షేత్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని రామానుజులు శ్రీరంగనాథుని కోరారు. కంచికి వచ్చి కాంచీపూర్ణులను కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన అపరిమితానందపరవశుడై అప్యాయంతో లేవనెత్తి ఆలింగనం చేసుకుని వరదుడి దర్శనానికి తీసుకు వెళ్లారు. గోపురానికి నమస్కరించి, అనంతసరస్సులో స్నానమాచరించి, ప్రాకారంలో నెలకొన్న వరాహస్వామిని దర్శించి తరువాత ఆళ్వార్లకు, బలిపీఠానికి, ద్వారపాలకులైన జయవిజయులకు మొక్కి, అనంతునికి ప్రణమిల్లి, సభామండపంలో ప్రవేశించారు. ఆ సభలోనే మొదటిసారి యామునాచార్యులు రామానుజుని చూసి సంతోషించారు. ఆ విషయం గుర్తుచేసుకుంటూ భాష్పపూరిత లోచనాలతో రామానుజుడు నమోనమో యామునాయ యామునాయ నమోనమః నమోనమో యామునాయ యామునాయ నమోనమః అని స్తుతించాడు. కంచి విమానాన్ని దర్శించారు. వరదుడి పట్టమహిషి పేరుందేవిని కీర్తించాడు. చక్రత్తాళ్వారునిదర్శించి, పెరియ తిరువడికి (గరుడునికి) నమస్కరించి హస్తగిరి 24 మెట్లు ఎక్కుతూ వరదుడి ప్రాంగణానికి చేరుకున్నారు. వరదరాజస్వామి ముందు నిలిచి, ఎంత కాలం తరువాత నీ దర్శనం పెరుమాళ్ అనుకుంటూ వేయికళ్లు చేసుకుని చూసుకున్నారు. తీర్థ శఠగోప ప్రసాదాలను స్వీకరించి, మహానంద భరితుడైనాడు. తనతో పాటు నడిచి దర్శనం ఇప్పించిన కాంచీ పూర్ణులకు రామానుజుడు వందనమొనర్చినారు. తిరుమలనాథుడిని దర్శించాలన్న ప్రగాఢమైన వాంఛ ఉందని కాంచీపూర్ణులకు తెలియజేశారు. కాంచీపూర్ణులు దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శిష్యగణంతో కాషాయవస్త్రధారియై త్రిదండధారియై ఆచార్య రామానుజుడు తిరుమలకు బయలుదేరారు. కొంతదూరం నడిచిన తరువాత దారి తోచడం లేదు. ఎవరూ దారి ఏదో చెప్పలేకపోతున్నారు. అక్కడ బావిలో నీరుతోడుకుంటున్న ఒక వ్యక్తిని దారి అడిగాడు. అతను చాలా ఓపికగా గుర్తులు చెబుతూ దారి అర్థమయ్యేట్టు చెప్పాడు. రామానుజుడు అతనికి కృతజ్ఞతలు చెప్పడం ఏ విధంగా అని ఒక క్షణం ఆలోచించి సాష్టాంగ నమస్కారం చేశారు. తమ ఆచార్యులు నేలమీద సాగిలపడే సరికి ఆయన శిష్యులంతా అక్కడే ఆ బావిదగ్గర, తామూ నేల మీద పడి దండాలు పెట్టారు. ఇంత పెద్ద స్వాములోరు తనకు దండాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక అతనూ ప్రతినమస్కారం చేశాడు. అక్కడి వారంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణించి తిరుపతి చేరుకున్నారు. తిరుమల కొండ కింద తిరుపతి దగ్గర ఆళ్వారుతీర్థంలో నెలకొన్న పదిమంది ఆళ్వారులను సేవించారు. ఆళ్వార్ తీర్థాన్నే కపిల తీర్థం, దివ్యసూరి తీర్థమనీ అంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆళ్వారులంతా అక్కడ ఆగి, తిరుమల కొండమీదనుంచి జాలువారుతున్న కపిల తీర్థంలో స్నానం చేసి తిరుమల పర్వతానికి మొక్కి ఇక్కడినుంచే మంగళ శాసనం పాడి తిరిగి వెళ్లిపోయేవారు. అందుకని అది ఆళ్వార్ తీర్థం అయింది. శేషాచలం అంటే ఆదిశేషుడే అక్కడ పర్వతమై నిలిచి ఉన్నాడు. అంతటి శేషుడిపైన కాలుపెట్టడం అపచారమనీ, సాలగ్రామ మయమైన తిరుమలను తమ పాదాలతో తొక్కరాదని రామానుజుడు అక్కడే నిలబడి పోయినాడు. రామానుజులు తిరుమల తిరుపతికి బయలుదేరి వస్తున్నారనే వార్త అక్కడ వైష్ణవులందరికీ తెలిసిపోయింది. తన మేనల్లుడు ఆచార్యుడై వస్తున్నాడని సంతోషించి శ్రీశైలపూర్ణుడు రామానుజుడిని తోడ్కొని రావడానికిగాను కొండదిగి వచ్చారు. స్వాగతం చెప్పి ‘‘రా నాయనా కొండమీదికి వెళ్దాం. వేంకటేశ్వరుని దర్శనం చేసుకుందాం పద’’ అన్నారు. ‘‘ఆచార్యవర్యా, పరమపావనమైన ఈ తిరుమల శిఖరాలను నేను కాలితో తొక్కడమా, అది భావ్యమా? నేను ఇక్కడే ఆగిపోతాను. నేనిక్కడినుంచే మంగళాశాసనం పాడుతాను...’’అన్నారు ఆ కొండనే చూస్తూ..శ్రీశైలపూర్ణులు చాలా సేపు రామానుజుడికి నచ్చజెప్పారు. కాని ఆయన వినలేదు. ‘‘సరే అయితే మీరు చేయగూడని పని అనుకున్న పని మేము మాత్రం చేయడమెందుకు. మేమూ వెళ్లం రామానుజా’’ అని కూర్చుండిపోయారు. ‘‘అయ్యా మీ ఆజ్ఞ, మీతోపాటే నేనూ ఈ వైష్ణవ బృందం వస్తాం. ఇక ఆయనదే భారం. ఈ దివ్య పర్వతాన్ని కాలితో తాకుతున్నందుకు నన్ను క్షమించుగాక...పదండి స్వామీ’’ అని రామానుజులు అన్నారు. అందరూ గోవిందనామం చేస్తూ బయలుదేరారు. రామానుజుడు భయభక్తులతో మోకాలు మోపి అపరాధ క్షమాపణ కోరి నడిచారు. చివరికొండనయితే ఆయన మోకాళ్లమీదుగానే ఎక్కారని, అందుకే అది మోకాళ్ల పర్వతం అనే పేరు సంతరించుకుందని అంటారు. ∙ -
మాలాధర వరరంగల శిష్యరికం
శ్రీరంగని సేవలో రామానుజులు పరవశులవుతున్నారు. మహాపూర్ణులతో వివరంగా మాట్లాడుకోవాలని తపన పడుతున్నారు. తన భార్య తంజ ద్వారా అవమాన సంఘటన జరిగినప్పటి నుంచి క్షమాపణ చెప్పుకునే అవకాశం కోసం పరితపిస్తున్నారు. ఓరోజు కలిసి ‘‘నాభార్య తప్పిదానికి నన్ను మన్నించండి స్వామీ’’ క్షమాపణ కోరారు. ‘‘నీ భార్య అంత నేరం చేసినట్టు నాకు జ్ఞాపకమే లేదు’’ అన్నారు పెరియనంబి. కొన్ని మరచిపోవలసిన సంఘటనలను మహానుభావులు ఆ విధంగా వదిలేస్తారు. లేకపోతే కంచినుంచి మొత్తం కుటుంబంతో సహా తరలిపోవలసినంతగా కదలించిన సంఘటనను అసలు గుర్తుపెట్టుకోకుండా ఉండగలగడం సాధ్యం. వాటిని మనోఫలకంనుంచి తుడిచిపెట్టడమే సత్పురుషుల లక్షణం. ఆచార్యుల సత్పురుషత్వాన్ని మననం చేసుకుంటూ రామానుజుడు ‘‘మీరిదివరకు నాకు దివ్యప్రబంధమును బోధించి నన్ను ధన్యుడిని చేశారు. ఇప్పుడు యామునాచార్యుల రచనలు ఇతర దివ్యగ్రం«థములను మీద్వారా అధ్యయనం చేయదలచుకున్నాను. నన్ను అనుగ్రహించండి స్వామీ’’ అని వేడుకున్నారు. నిష్కల్మష హృదయులైన మహాపూర్ణుడు ‘‘రామానుజా అంతకన్న కావలసిందేమిటి. ఆలస్యమేలేదు. వెంటనే మొదలు పెడదాం. మన యామునాచార్యులకు ఆంతరంగిక శిష్యులు గోష్టీపూర్ణుల వారు. అన్నింటికన్న ప్రధానమైన పరమపావన కరమైన అష్టాక్షరి ద్వయమంత్రాలలో సమస్త శాస్త్ర సారం ఇమిడి ఉంది. అది నీవు గోష్టీపూర్ణులనుంచి తెలుసుకోవడం ముఖ్యం. ఆ విషయమై వ్యాఖ్యానించగల నిపుణుడు మరొకరు లేరు. అందుకు ఆయనను ఆశ్రయించే కార్యాన్ని ఆరంభించు’’ అని చెప్పారు. రామానుజులు వెంటనే తిరుగోష్టియూరు ప్రయాణం చేశారు. చేరుకున్నారు. స్వామి ఇప్పుడు కాదు మరోసారి చూద్దాం అని 18 సార్లు తిప్పిపంపారు. 19 వ సారి కురేశుడు దాశరథితో కలిసి వెళ్లినపుడు రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయించుకుని రహస్యార్థాలను వివరించారు. ఓం అనే మొదటి పదం ప్రణవం. నమః అనే నమస్సు మధ్యమం, నారాయణాయ చివరిది. ఇది భుక్తిని ముక్తిని ప్రసాదించే సిద్ధమంత్రం. భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ మంత్రమునే రుషులు మునులు జపిస్తూ ఉంటారు. ఈ మంత్రం జపించిన వారికి లభించనిది అంటూ ఏమీ ఉండదు. (ఆ రహస్యాలను వెంటనే ఆయన తిరుగోష్టియూర్ గోపురం ఎక్కి అందరికీ వెల్లడించడం గురించి ఈ సహస్రాబ్ది ధారావాహిక తొలిభాగాల్లో విస్తారంగా చర్చించుకున్నాం) గురువుగారి చేత ఎంబెరుమానార్ (మా ప్రభువు) అని బిరుదు పొందిన శిష్యుడు రామానుజుడు. మళ్లీ రా నీకు చరమశ్లోకం (సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః) పరమార్థాన్ని వివరిస్తాను అని గోష్టీపూర్ణులు అనుగ్రహించారు. గురువు ఆశీస్సులు పొందడం కన్న విజయం ఏముంటుంది. అందుకే శ్రీరంగంలో జయజయధ్వానాలతో స్వాగతం చెప్పారు. రామానుజుని విద్యాతృష్ణ అంతులేనిది. గోష్టీపూర్ణులు ఒకసారి శ్రీరంగం వచ్చినపుడు స్వయంగా రామానుజుడిని చూచుటకు ఆశ్రమాన్ని సమీపించారు. ముందే గమనించిన రామానుజుడు ఎదురేగి సాష్టాంగ నమస్కారాలు చేసినారు. దీవిస్తూ రెండు చేతులతో లేవనెత్తి ఎంతో ఆప్యాయతతో ‘‘నీవు ఇంకా ఆళ్వారుల దివ్యప్రబంధాలను నేర్చుకోవాలి. నమ్మాళ్వారుల తిరువాయిమొళి అర్థాలు అంతరార్థాలు గ్రహించాలి’’ అన్నారు. మాలాధరుడు– వరరంగడు ‘‘నాకెవరు ఉపదేశిస్తారు స్వామీ..’’ అని ప్రశ్నించారు. ‘‘నా సహాధ్యాయి స్నేహితుడు మాలాధరుడు ఉపదేశిస్తాడు..‘‘ అని మాలాధరుని దగ్గరకు తీసుకువెళ్లి రామానుజుని అప్పగించారు గోష్టీపూర్ణులు. కాంచీ పూర్ణుల మార్గదర్శకత్వం, మహాపూర్ణుల మహోపదేశం, గోష్టీపూర్ణుల మంత్రార్థ రహస్యోపదేశాల తరువాత ఆవిధంగా రామానుజుడు మాలాధరుడి శిష్యుడైనారు. గురువు చెప్పింది చెప్పినట్టు వినడంతోనే సరిపెట్టుకోకుండా దివ్యప్రబంధాలలో రచయితల భావాన్ని గమనించడానికి రామానుజుడు ఆలోచిస్తూ ఉండే వారు, గురువుగారి అన్వయానికి తోడు తను కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ సాగుతూనే ఉండేది. ఒక్కోసారి రామానుజుని సమన్వయం మాలాధరుడికి ఆశ్చర్యం కలిగించేది. ఇది మా గురువుగారు నాకెన్నడూ చెప్పలేదే అనిపించేది. నమ్మాళ్వారుల తిరువాయిమొళి ఉపదేశం సాగుతున్న సందర్భంలో ఒక పత్తు (పదిపాశురాలు) వివరణ పూర్తయింది. కాని ఒక పాశురంలో అర్థాన్ని విశదీకరిస్తూ ‘‘స్వామీ నీతో ఉన్న సంబంధాన్ని తెలియజేసే జ్ఞానాన్ని ఇచ్చినా, ఆ జ్ఞానాన్ని నశింపచేసే ఈ భౌతిక దేహంలో నన్ను బంధించినావే’’ అని ప్రశ్నించినట్టు మాలాధరుల వారు తెలిపారు. రామానుజులు ఆలోచనలో పడ్డారు. స్వామీ ఒక పత్తులో తొమ్మిది పాశురాలు ఒకరీతిలో భగవంతుని ప్రశంసలతో సాగి ఒక్క పాశురంలో మాత్రం ఈ విధంగా భగవంతుడిని నిందించే విధంగా నమ్మాళ్వార్లు వ్రాసి ఉంటారంటారా? జ్ఞానాన్ని దరిచేయనీయని ఈ భౌతిక దేహంలో చిక్కుకున్నప్పటికీ నాకు నీతో ఉన్న సంబంధ జ్ఞానాన్ని ప్రసాదించావు అని ఉంటారేమో కాస్త ఆలోచించండి అన్నారు రామానుజులు. మాలాధరులకు ఈ వాదం నచ్చలేదు. నాకు మా గురువుగారు యామునాచార్యుల వారు ఈ వివరణ ఇవ్వలేదు. నీ అన్వయం నీదే. నీవు ప్రతిదానికీ కొత్తగా అన్వయాలు ఇస్తున్నావు. ఇది సరికాదు. అని మాలాధరులు బోధనను నిలిపివేసారు. రామానుజులు మౌనంగా నమస్కరించి వెళ్లిపోయారు. కొన్నాళ్ల తరువాత గోష్టీపూర్ణుల వారు రామానుజుని దివ్యప్రబంధ అధ్యయనం ఏ విధంగా ఉందని అడిగారు. ఆగిపోయిందని శిష్యులు తెలిపారు. వారికి వివరాలు తెలియవు. ఆయన వెంటనే శ్రీరంగానికి వచ్చి మాలాధరుని అడిగారు.. ‘‘ఏమైంది రామానుజుని దివ్యప్రబంధ విద్యాభ్యాసం ఆగిన మాట నిజమేనా’’. ‘‘అవును నేను చెప్పింది ఆయన వినడం లేదు. వేరే అర్థాలు ఊహిస్తున్నారు. యామునులు చెప్పని అన్వయాలు చేస్తున్నాడు. దీని అర్థం యామునాచార్యులను ధిక్కరించినట్టే అని నాకు అనిపించింది. మన గురువుగారికి వ్యతిరేక వ్యాఖ్యానాన్ని నేను వినదలుచుకోలేదు అందుకే ఆపాను’’ అని మాలాధరుడు వివరించాడు. అన్వయంలో విభేదాన్ని పూర్తిగా విన్నతరువాత ‘‘రామానుజుడి వ్యాఖ్యానమే సమంజసంగా ఉంది మాలాధరా.. నిజానికి యామునుల అంతరంగాన్ని రామానుజుడి కన్న తెలిసిన వారెవరైనా ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇతర పాశురాల అర్థాలతో సమన్వయించి మొత్తం పాఠ్యం యొక్క సారాంశాన్ని గమనించి అన్వయం చేయడమే సరైనది కదా. యామునుల çహృదయం రామానుజుడికి బాగా తెలుసు. అతని వల్ల తప్పు జరగదు. రామానుజుడికి అన్నీ తెలుసు. కాని గురుముఖతః కొంత నేర్చుకునేందుకు శ్రీకృష్ణుడు సాందీపని ముందు కూర్చున్నట్టు రామానుజుడు మనముందు శిష్యుడై ఉన్నాడు. భవిష్యదాచార్యుడైన రామానుజుడు గురువు దగ్గరకు వెళ్లడం కాదు. గురువులే వెళ్లాలి. అది ఆధ్యాత్మిక అవసరం మాలాధరా..’’ అని యామునాచార్యులు మాలాధరుడిని తీసుకుని రామానుజుని వద్దకు వెళ్లారు. ఆచార్యులిరువురూ వస్తుండగా ఎదురేగి పాదాభివందనం చేసి సాదరంగా లోనికి తీసుకువెళ్లి గౌరవించారు రామానుజులు. మళ్లీ అధ్యయనం మొదలైంది. ఒక నూతన ధృక్కోణం నుంచి తిరువాయి మొళి అన్వయం సాగుతున్నది. రామానుజుడు కొత్త అర్థాలను ఆవిష్కరిస్తున్నారు. అన్వయాన్ని సమన్వయంగా చర్చిస్తున్నారు. మాలాధరులు సానుకూల ధోరణిలో ఈ అర్థాలు రామానుజునికి స్ఫురించడం గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతున్నారు. ‘‘రామానుజా... నీవు ఒక్కరోజైనా యామునాచార్యులతో మాట్లాడలేదు. వారి ప్రబోధాలు వినలేదు. నిన్ను ఆచార్యుల వారు రప్పించినా వారు దేహం వదిలిన తరువాతనే నీవు చేరుకున్నావు. వారి మనసు నీకెలా అర్థమయింది. ఏమిటీ సాహసం?’’ అని అడిగారు. ‘‘మన్నించండి స్వామి. అదంతా ఆచార్యుల అనుగ్రహం, మీదయ. నావరకు నేను యామునులకు ఏకలవ్యశిష్యుడిగా భావిస్తాను. నేను మీతో విభేదించడం లేదు. మీరు అర్థం చెప్పిన తరువాత నా మనసుకు తోచిన అర్థాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు సరైనదో కాదో విశదం చేస్తే ధన్యుడినౌతాను’’ అని వినయంగా సమాధానం చెప్పారు. ఆ కాలపు విశేషం ఏమంటే గురువులు తమకు తెలిసినది బోధించి, ఇతర విజ్ఞానానికి గాను మరొక ఆచార్యుడిని ఆశ్రయించాలని సహృదయంతో పంపేవారు. మాలాధరుడు కూడా తన దివ్యప్రబంధ బోధన ముగిసిందనీ, ఇక నీవు వరరంగమునిని ఆశ్రయించి తదుపరి విద్యాభ్యాసం కొనసాగించాలని నా సూచన. వారి దగ్గర ఇంకా అనేకానేక శాస్త్ర విద్యారహస్యాలు ఉన్నాయి. వారినాశ్రయించమనీ అన్నారు. ధన్యోస్మి అని వెంటనే రామానుజులు వారిదగ్గరకు వెళ్లారు. వరరంగముని ముందుగా రామానుజుని పరీక్షించారు. వినయాన్ని పరిశీలించారు. గురుభక్తిని సమీక్షించారు. ‘‘గురువును భగవంతుడిగా భావించే వాడే విద్యార్జనకు అర్హుడు. గురువు మనసు గెలుచుకోవడం ముఖ్యం. ఆచార్యులని మదిలో శిష్యుడిపట్ల ప్రేమాభిమానాలు కలిగే విధంగా శిష్యుడు వ్యవహరించాలి. గురువుకు ప్రేమ కలిగి శిష్యుడిపట్ల వాత్సల్యం పెంచుకుంటాడు. దాన్ని అలుసుగా తీసుకోకుండా, గురువును అలక్ష్యం చేయకుండా కేవలభావం లేకుండా నడుచుకోవాలి. గురువే భగవంతుడు. ఆ భావన కరువైన శిష్యుడికి భగవత్ ప్రాప్తి కూడా సందేహాస్పదమే అవుతుంది’’ అని ముందుగా గురుశిష్య సంబంధం గురించి వరరంగముని పాఠాలు చెప్పారు. రామానుజుడు అన్ని విధాలా అర్హుడని నిర్ణయించి శిష్యుడిగా స్వీకరించి తనకు తెలిసిన దివ్యప్రబంధ రహస్యాలను ఉపదేశించారు. ఎప్పటి వలెనే రామానుజుడు శ్రద్ధాభక్తులతో వినయవిధేయతలతో ఒక ఆదర్శ విద్యార్థిగా నేర్చుకున్నారు. గురుశుశ్రూష చేసి గురువు మనసు గెలిచి, విద్యను అభ్యసించారు. రామానుజుని శిష్యులు కురేశులు రామానుజాచార్యులకు ప్రధానమైన శిష్యుడు. కుర్ అనే గ్రామానికి అధినేత మహాసంపన్నుడు అయిన కురేశుడు తెల్లవారినప్పటి నుంచి రాత్రిదాకా దానాలు చేస్తూనే ఉంటాడు. వచ్చిన వారందరికీ దానాలు చేసిన తరువాత ఒక రోజు రాత్రి కురేశుని భవనం ప్రధాన ద్వారాన్ని మూసినప్పుడు దఢేలని ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఏమిటని వరదరాజపెరుమాళ్ను లక్ష్మీదేవి అడిగింది. కురేశుడు రోజంతా వచ్చిన వారికి దానధర్మాలు చేసి ఇప్పుడే తలుపు మూసుకున్న చప్పుడది. ఎంత మంది వచ్చినా కాదనని కురేశుడి దానశీలాన్ని వరదుడు వివరిస్తే ఆయనను ఒక సారి చూడాలని లక్ష్మీదేవి భర్తను అడిగారు. సరేనని కురేశుడిని సతీసమేతంగా తీసుకురమ్మని వరదుడు కాంచీపూర్ణులను ఆదేశించారు. కాంచీపూర్ణుల వారు తమ ఇంటికి వచ్చి రమ్మని అడిగితే, తన ఇంటి తలుపు చప్పుడు గురించి వరదుడు లక్ష్మీదేవి మాట్లాడుకున్నారని తెలిసి కురేశుడు ఆండాళ్ ఆశ్చర్యపోతారు. తలుపు చప్పుడయ్యేట్టుగా వేయడం అహంకారానికి నిదర్శనంగా మారిందని తెలుసుకుని, ఎవరో వచ్చి తనను అడగడం కాదు, తామే వెళ్లి అందరికీ దానాలు చేయాలని కురేశుడు తనకు ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం ఆస్తినంతా పేదలకు పంచి పెట్టారు. ఆ తరువాత కంచి వరదుడిని కురేశ దంపతులు దర్శనం చేసుకున్నారు. కురేశుని భార్య ఆండాళ్ క్షమాపణ వేడింది. స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆచార్యుడైన రామానుజుడి దగ్గరకు వెళ్లాలని వారిరువురూ శ్రీరంగం బయలుదేరారు. దారిలో అరణ్యమార్గంలో ప్రయాణించినపుడు ఆండాళ్ కొంత భయపడితే, ఎందుకు భయపడుతున్నావు? చేపలు నీటిలో పురుగులను తినేస్తాయి. మరణం జీవితాన్ని తినేస్తుంది. దొంగలు ధనాన్ని తింటారు. మన దగ్గర ధనం ఏమీ లేదుకదా దొంగలేం చేస్తారు? అని అడిగాడు. మీరు నీళ్లు తాగడానికని ఒక బంగారు గిన్నె తెచ్చుకున్నాను అంటుంది ఆండాళ్. దాన్ని తీసుకుని విసిరి పారేస్తారు కురేశులు. ఏ భయమూ లేకుండా శ్రీరంగం చేరుకున్నారు. వారు రాగానే రామానుజులు ఆసనం దిగి ఎదురొచ్చి ఆలింగనం చేసుకుని లోనికి తీసుకువెళ్లారు. గోవిందుడు తన చిన్నమ్మ కుమారుడు గోవిందుడు శైవంనుంచి వైష్ణవంలోకి మళ్లితే బాగుండునని రామానుజుడు యోచించారు. శ్రీ కాళహస్తిలో శివుని సేవలో ఉన్న గోవిందుని రప్పించే బాధ్యతను మేనమామ శ్రీ శైలపూర్ణులకు అప్పగించారు రామానుజుడు. త్వరలోనే గోవిందుడు రామానుజుడి ప్రధాన శిష్యుడుగా చేరాడు. ఒకసారి భక్తులు గోవిందుని ప్రశంసించారు. అతని భక్తి, జ్ఞానము, గురుభక్తిని కొనియాడారు. దానికి గోవిందుడు అవునవునని తల ఊపినాడట. నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు ఆ విధంగా ఒప్పుకోవడం ఆత్మస్తుతి కదా గోవిందా, ఆత్మస్తుతి పాపమని తెలియదా.. అని రామానుజుడు వారిముందే అడిగారట. స్వామీ వీరు నన్ను పొగుడుతున్నది మిమ్మల్ని ఆశ్రయించిన తరువాతనే కాని అంతకు ముందు కాదు. ఇప్పుడు నేను మీ శిష్యుడిని, ఈ వైభవమంతా మీది. మీ శిష్యత్వమే నాకు ఈ స్థితి కల్పించింది. సంసారకూపంలో పడిన నన్ను మీరు ఉద్ధరించారు. ఈ పొగడ్తలన్నీ మీవి. మీకే చెందుతాయి. అందుకే ఒప్పుకున్నాను. మిమ్మల్ని, మీ గురుత్వాన్ని, అనుగ్రహాన్ని ప్రశంసించడం సమంజసమే కదా. కనుక నేను అవునన్నాను. ఇందులో నా ప్రమేయమేమీ లేదుస్వామీ... అని వినయంతో వివరించారు గోవిందుడు. రామానుజుడు లేచి వచ్చి గోవిందుని కౌగలించుకుని, ‘‘గోవిందా నీకు కలిగినంత జ్ఞానం నాకు కూడా కలుగుగాక‘‘ అన్నారు. ఆచార్య మాడభూషి శ్రీధర్ -
రామానుజుని రక్షించిన కంచి వరదుడు
ఇది రెండో సారి... రామానుజుడు తన వ్యాఖ్యానాన్ని తప్పుబట్టడం.... అయినా నేనేమీ తప్పు చెప్పలేదే... ‘‘నేను ఆ వాక్యంలోని పదాలకు మన నిఘంటువుల్లో... వాడుకలో ఉన్న సామాన్యమయిన అర్థం చెప్పాను. ఆ అర్థం లేదంటావా? దాంతోపాటు ఇంకే అర్థమయినా నీకు తోస్తున్నదా.... నీ అభిప్రాయం ప్రకారం ఇంకేదయినా అర్థం ఉంటే అది నీవు చెప్పవచ్చు కదా.... దానికీవిధంగా కన్నీళ్లు కార్చడం ఎందుకు... నేనేదో ఘోరం చేసినట్టు....’’ అన్నారు గురువు.రామానుజుడు స్థిమితంగా చెప్పడానికి ఉపక్రమించాడు. మొహమాటానికి పోయి చెప్పకపోతే తప్పవుతుంది. తన బుద్ధికి తోచిన అన్వయాన్ని తను చెప్పక తప్పదు. గురువు గారి అనుజ్ఞ కూడా అయింది కనుక చెప్పడం ప్రారంభించాడు.‘‘క..పి..మాటలో ‘క’ అంటే నీరు, పి అంటే పిబతి, అంటే తాగునది, నీటిని తాగేవాడు సూర్యుడు, కప్యాసం అనే సమాసానికి అర్థం సూర్యకిరణముల తాకిడిచేత వికసించినది అనే భావం. ఆ విధంగా రవికిరణ స్పర్శ చేత వికసిత పులకితమయ్యే పుష్పం తామర. పురుషోత్తముని కన్నులు సూర్యకిరణ స్పర్శచేత వికసించిన తామరల వలె ఉబ్బుగా, ఎఱుపుగా మెరుస్తున్నాయని అర్థం అని నేననుకుంటున్నాను. ఈ భావనా జాలంలోకి కోతి పిర్రలు వచ్చే అవకాశాలే లేవు. సందర్భం, సమయం, ఔచిత్యం ప్రకారం పదాలను విశ్లేషించి ఆ బ్రహ్మవాక్యంలో ఉన్న పోలికను అర్థం చేసుకోవాలని నేననుకుంటున్నాను గురువర్యా...’’ అని చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యాఖ్యానాన్ని రామానుజుడు వివరించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే నీటిని తాగుతున్న ఎర్రని తామర తూండ్ల వలె, గులాబీ వర్ణఛాయలతో ఆర్ద్రంగా ఉన్న మనోహర నేత్రాలని ఆ వాక్యాన్ని సందర్భోచితంగా అన్వయించవలసి ఉంటుంది. కన్నులలో ఎప్పుడూ నీరు ఉంటుంది. సరస్సులో నీరు సూర్యుడి కిరణాలతో మెరిసినప్పుడు అక్కడే అప్పుడే వికసిస్తున్న తామర పూరేకుల వలె ఆర్ద్రయుతంగా ఆయన నేత్రాలు కనిపించాయి, పరమాత్ముని కన్నులో లేత ఎఱుపుదనాన్ని కలువల లేలేత ఎర్రదనంతో పోల్చడం సముచితంగా ఉంటుంది కాని, కేవలం ఎఱుపురంగులో ఉన్నంత మాత్రాన కోతి పిర్రలతో పోల్చడమా. ఆ పదాలకు ఆ అర్థాలు ఉన్న మాట నిజమే అయినా ఇంత అనుచితంగా, అసందర్భంగా అర్థ రహితంగా.. పోల్చడం న్యాయం కాదని రామానుజుడు వివరించాడు. భగవన్నేత్రాలు పుండరీకములనే భావన భక్తిని ప్రేరేపిస్తుంది కాని, కోతి పిర్రల పోలిక నకారాత్మకమైన విపరీత ఆలోచనలను ప్రేరేపించి, వర్ణన హాస్యాస్పదంగా మారి, రచయిత లక్ష్యం వాక్యపు ఉద్దేశ్యం దెబ్బతింటాయి. పోలిక అనేది శబ్దార్థ వివరణలో ఒక అలంకారం. ఉన్నతమైన ఉత్తమమైన భావాలను ప్రేరేపించే అర్థాలకోసం పోలికలుంటాయి కాని నీచమైన ఆలోచనలను జనింపచేయడానికి కాదు. రామానుజుని వివరణ మరోసారి సహాధ్యాయుల మనసు గెలుచుకుంది, మన్ననలు అందుకుంది. అందులో సమన్వయత, భక్తి, ఔచిత్యం, సందర్భం కలిసి ఉన్నాయి. అందులో రసం ఉంది రక్తి ఉంది. ప్రేమజనించే శక్తి ఉంది. గురువర్యులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో అని కూడా తోటి విద్యార్థులు ఆలోచించడం మొదలు పెట్టారు.శిష్యులు ఈ విధంగా ఆలోచిస్తారనేదే గురువుగారి బాధ. తాను చెప్పిన పోలిక ఎంత దారుణంగా ఉందో అప్పుడు అర్థమయింది. తోచింది తోచినట్టు చెప్పడం కన్నా కాస్త ఆలోచించి వివరిస్తే బాగుండేదని బాధ పడ్డారు. కాని మళ్లీ పెద్దరికం అడ్డొచ్చింది. మరోసారి తన అహం దెబ్బ తిన్నది. ఇంత ప్రతిభావంతమైన అన్వయం ముందు తన పాండిత్యం వెలవెల పోవడం ఖాయం. తన పరువు ప్రతిష్టలు రామానుజుని విజ్ఞాన తేజస్సుముందు పతనమవడం ఇది రెండో సారి. గురువుగా తనకు ఇది ఎదురు దెబ్బ. అందరి ముందూ జరిగింది కనుక, తన గురుకులానికి తీవ్ర అప్రతిష్ట. వ్యక్తిగతంగా తట్టుకోలేనంత తీవ్రమైన అవమానం అని యాదవప్రకాశుడి మనస్సు పరితపిస్తున్నది. కాని పైకి ఏమనగలడు? గురుశిష్యులుగా తమ పొందిక ఇక పొసగదని అనిపించిందాయనకు. కొంత సేపటి తరువాత, గురువు మాటలు బయటకు వచ్చాయి.‘‘నా బోధన నీకు సరిపడకపోతే నీవు ఈ గురుకులాన్ని వదలి వెళ్లవచ్చు’’ అని యాదవ ప్రకాశుడు రామానుజునితో అన్నారు. అందులో కోపం దాచడం సాధ్యం కాదు.గురువుగారి అహం దెబ్బ తిన్నదని గ్రహించాడు. కాని అందుకోసం విష్ణు దూషణయైన విపరీత వ్యాఖ్యానం సహించడం సాధ్యం కాదు. ఏమీ అనలేక పోయాడు. ఈ ఉద్రిక్త ఉద్వేగ సమయంలో గురుకులంలో ఉండడం, వదలడం గురించి వాదనకు దిగడం అప్రస్తుతమవుతుందనీ, మౌనమే శ్రేయస్కరమని భావించి వినయంగా నమస్కరించి ఊరుకున్నాడు రామానుజుడు.గురువులు లేదా సహాధ్యాయులు, లేదా ఇతర పండితులు చర్చాగోష్టిలో వ్యక్తం చేసిన భావనకన్నా విభిన్నమయిన అభిప్రాయాన్ని చెప్పడం అవిధేయత కాకూడదు. విశ్లేషణ విజ్ఞానాలకు సంబంధించిన అంశాలపైన చర్చ ఎన్నటికీ నేరం కారాదు. సముచితమైన అన్వయం సందర్భాన్ని బట్టి వివరించడమే విద్యావికాసం, అది తప్పుకానేకాదు అని రామానుజుడు మళ్లీ చెప్పదలచుకోలేదు. ఆ విధంగా సాగదీస్తే వాదం ప్రతివాదం పెరిగి వివాదం అవుతుంది. ప్రమాదం అవుతుంది. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది వెంటనే చెప్పడం కష్టం. కనుక నోరుమూసుకున్నాడు. అదీ విజ్ఞతే కదా.సహాధ్యాయులందరికీ రామానుజుని అన్వయం అర్థవంతంగా ఉందని తోచింది. ఇదే సరైనదని ప్రశంసించారు. యాదవ ప్రకాశునికి ఆగ్రహం కలిగిందని వారికీ అర్థమయింది. కాని గురువుగారి ఆగ్రహానికి అర్థం లేదు. దాన్ని ప్రకటించడం కూడా సరికాదని శిష్యులూ అనుకున్నారు, గురువుగారికీ అర్థమైంది. కాని అది అంతటితో ఆగలేదు. అది క్రమేణా అవమాన భావనగా పెరిగి పెరిగి అసూయగా మారి ప్రతీకారేచ్ఛకు దారితీస్తున్నది. ఆలోచిస్తే రామానుజుని పోలిక అన్వయం సమయోచితంగా ఉన్నాయని తనకూ అనిపిస్తున్నది. ఆ వివరణ ముందు తన అర్థం వివరణ నిలబడే అవకాశమే లేదు. కాని ఈ పరాజయాన్ని అంగీకరించడం సాధ్యం కావడం లేదు. ఆగ్రహం అసూయగా పరిణమిస్తూ పగగా ప్రజ్వలిస్తూ ఉన్నది. విభేదాల విషజ్వాల అయితే లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం కొన్ని వాక్యాల అన్వయానికి సంబంధించిన విభేదం మాత్రమే కాదని. మౌలికమైన సైద్ధాంతిక అవగాహనకు సంబంధించిన అంశమనీ తెలుస్తుంది. అద్వైత సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. అంటే ఆయనకు ఏ ఆకారాలూ వికారాలు ఉండవు. మానవులకు ఉన్నట్టు మంచీ చెడు వంటి గుణాలను ఆపాదించడానికి వీలు కాదు. కాని పరమాత్ముడు సుగుణుడనీ సాకారుడనీ రామానుజుడు అంటున్నాడు. అక్కడే సైద్ధాంతిక విభేదాలు మొదలైనాయి. దివ్యలక్షణ గుణవైభవాలున్న జగన్మోహనాకారాన్ని ఆరాధనా సాధనంగా దైవతత్వాన్ని వివరిస్తున్నాడు రామానుజుడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మకు భౌతిక లక్షణాలతో భేదాలేమిటనే ఆలోచన గురువుగారిది. ఈ విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అని గురువుగారికి సందేహం మొదలైంది. తన వాదాన్ని ఓడించి రామానుజుడు గెలుస్తాడేమో. యాదవ ప్రకాశుడి అద్వైత సిద్ధాంతమే పరాస్తమవుతుందేమో. అని భయంలో పడిపోయాడు. తన సిద్ధాంతాన్ని నిలబెట్టడం తన గురుతరమైన బాధ్యత, అందుకు రామానుజుడు అడ్డు వస్తున్నాడనీ అనుకున్నాడు గురువు. ఇటువంటి రామానుజుడిని తన శిష్యుడిగా ఇంకా కొనసాగించడం మంచిది కాదనే భావం ప్రబలమవుతూ వచ్చింది. తన మార్గానికి అడ్డు తగులుతున్నాడని అనుకుంటున్నాడు కనుక రామానుజుడి అడ్డును తొలగించడమే ఒక మార్గమేమో అనే తీవ్రమైన ఆలోచన కూడా వచ్చింది. తానా అంటే తందానా అనే శిష్యవర్గం ఈ వాదనను బలపరిచింది. గంగాయాత్రకని బయలు దేరి వారణాసి చేరి అక్కడ మణికర్ణిక ఘాట్ లో రామానుజుని ముంచి వేయడం సరైన ఆలోచన అని అనుకున్నారు. ఈ పథకం ప్రకారం తమ లక్ష్యం నెరవేరుతుంది, గంగా స్నానం వల్ల పాపం అంటదు, రామానుజుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడని నమ్మించవచ్చు అని యాదవప్రకాశుని అతని అనుయాయులు ఒప్పించారు. తీర్థయాత్రకు శిష్యబృందంతో బయలుదేరారు. రామానుజుడికి గోవింద మిశ్రుడికి ఈ పన్నాగం తెలియదు. పుణ్య క్షేత్ర సందర్శన గంగా స్నాన భాగ్యం కలుగుతుందని అమాయకంగా వారు నమ్మారు. కనుక వారూ గురువుగారితో పయనమయ్యారు. దారిలో శిష్యుల సంభాషణల ద్వారా గోవిందుడికి కుట్ర స్వరూపం కొంత అర్థమయింది. ఇంకా కొన్నాళ్ల తరువాత అది లోతైన కుట్ర అనే విషయం గోవిందుడికి అర్థమయింది. ఈ ప్రమాదం నుంచి రామానుజుని తప్పించాల్సిందే. వింధ్య పర్వతాల దాకా యాత్ర సాగింది. గోవిందుడికి ఏకాంతంగా రామానుజుడితో మాట్లాడే అవకాశం అంతగా దొరకడం లేదు. దొరికిన వెంటనే చాలా క్లుప్తంగా ప్రమాదాన్ని రామానుజుని చెవిన వేసినాడు. రామానుజుడు ఆవేదన చెందాడు. ఏ తప్పూ చేయలేదు. గురువు పట్ల ఏ అపచారమూ చేయలేదు. అయినా తనను గురువు గారు అనుమానిస్తున్నారు. శాస్త్ర అన్వయంలో విభేదించినందుకు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు తనకు ఈ శిక్ష అన్నమాట. ఇది తనకు పరీక్ష అనుకున్నాడు. గురువుగారి బృందం నుంచి వేరయిపోవడం ఒక్కటే మార్గం. వారితో నడవలేక వెనుకబడినట్లు నటించి తన సహాధ్యాయ బృందం నుంచి తప్పుకున్నాడు. కానీ దారి దొరకడం లేదు. ఎటు వెళితే ఏ ప్రాంతానికి చేరుకుంటాడో అర్థం కావడం లేదు. దట్టమైన అడవి. దిక్కు తోచడం లేదు. ఒంటరి తనం. అడగడానికి ఎవరూ కనిపించడం లేదు. దారి కూడా లేదు. ముళ్లతో కాళ్లు గీరుకుపోయినాయి. అలసట, దాహం, నిరాశ, సూర్యతాపం మించిపోతున్నది. ఆకలి దహించుకుపోతున్నది.ఇతరుల సొమ్ము అపహరించిన వాడికి నీరు దొరకని వింధ్యపర్వత ప్రాంతాల్లో జన్మిస్తాడని విన్నాను. నేనెవరి సొమ్ము తీసుకోకపోయినా నాకు ఆ పరిస్థితి ఎదురైందని రామానుజుడు విచారించాడు. ఇంత కష్టమైనా తన కర్మను తిట్టుకున్నాడే కానీ గురువుగారిని నిందించలేదు. నారాయణ నామమే శరణ్యమని ధ్యానిస్తూ ఉన్నాడు. వీలయినంత వరకు ముందుకు నడుస్తూ ఉన్నాడు. వరదుని దయ అంతలో ఒక జంట వస్తున్నట్టు గమనించాడు. ముచ్చట్లు చెప్పుకుంటూ యువదంపతులు వస్తున్నారు. దగ్గరికి చేరుకుంటూ ఉంటే అర్థమయింది వారు కోయ దంపతులని. ఈ కారడవిలో తనకోసమే దేవుడు పంపినట్టు వస్తున్నారనిపించింది. కనీసం దారైనా చూపకపోతారా?‘‘అయ్యా మీరు ఎక్కడనుంచి వస్తున్నారు, ఎటువైపు మీ ప్రయాణం...’’ అని రామానుజుడు వారిని ప్రశ్నించాడు.‘‘మేము సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాం. సత్యవ్రత క్షేత్రానికి (కాంచీపురం) వెళ్లాలని సంకల్పం. చాలా దూరం కదా..’’ అన్నాడా యువకుడు.‘‘మీ వెంట నేనూ రావచ్చా, నాకు ఇక్కడ దారి దొరకడం లేదు. నా గురువుగారు, సహాధ్యాయుల బృందంనుంచి తప్పిపోయాను. ముందుకు వెళ్తున్నానో వెనక్కు వెళ్తున్నానో కూడా తెలియడం లేదు’’. అని రామానుజుడు అడిగాడు.‘‘అదేం భాగ్యం నాయనా, మనం కలిసే వెళ్దాం. రండి’’ అని యువకుడు అన్నాడు. ఇద్దరూ మాటల్లో పడిపోయారు. కలిసి నడుస్తూ ఉన్నారు.సాయంకాలమైంది. దారిలో ఒక చెలిమె కనిపించింది. రామానుజుడు సాయంకాల సంధ్యావందనం ఆచరించాడు. ధ్యానం ముగిసింది. ముఖమూ, కాళ్లూ చేతులు కడుక్కుని, నీళ్లు తాగి సేద దీరారు. ఇంతలో కోయ యువదంపతులు ఫలాలు తెచ్చి పెట్టినారు. ఆ ఫలాలు తిని అక్కడ ఒక పెద్ద వటవృక్షం నీడన విశ్రమించారు. బాగా అలసి పోయినాడో ఏమో రామానుజుడికి తెల్లవారుజాము దాకా గాఢమైన నిద్రపట్టింది. మెలకువ వచ్చి చూసే సరికి పక్కన కోయ దంపతులు లేరు. అటూ ఇటూ కాస్త తిరిగి చూసినా వారి జాడ లేదు. తెల తెల వారుతున్నది. దూరంగా జనం మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తున్నది. ముందుకు వెళితే అక్కడో జలాశయం ఉంది. నీళ్లను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అక్కడ కొందరు స్నానాలు చేస్తున్నారు.‘‘అయ్యా ఇదే ప్రాంతం... దగ్గరలో ఏదైనా గ్రామంగానీ... పట్టణంగానీ ఉన్నాయా.. ’’అని అడిగారు.‘‘అయ్యా తమరు పుణ్యకోటి విమానం (కంచి గోపురం) చూచుటలేదా’’ అని ఎదురు ప్రశ్నించారు అక్కడి వారు.అవును దూరంగా అదే కాంచీపురం, వరదరాజుని గోపురం. ఆశ్చర్యం. తన గమ్యం చేరుకున్నాడు రామానుజుడు. కాదు కాదు తనను ఆ భిల్లు దంపతులు గమ్యం చేర్చారు. ఇంతకూ వారెవరు? ...ఎవరేమిటి? ఒక్క రాత్రిలో వింధ్య పర్వత ప్రాంతం నుంచి కాంచీపురానికి తనను తరలించిన తండ్రి కంచి వరదుడే, ఆ తల్లి లక్ష్మీతాయారే. సందేహం లేదు. తనను కరుణించి తల్లిదండ్రులై తరలి వచ్చిన ఆది దంపతులనే గుర్తించలేకపోయానే అని మధన పడ్డారు రామానుజుడు. ఇంటికి చేరుకుని తల్లి పాదాలకు నమస్కరించినాడు. -
గురువుకోసం జగద్గురువు
రామానుజుడు దినదిన ప్రవర్థమానమవు తున్నాడు. చిన్ననాడే ఆ చిన్నవాడికి పెద్ద విషయాలు అంతుపడుతున్నాయి. ఎవరైనా వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ బాలుడు కనులతోనే వింటాడట. పాలసంగతేమో గాని, గాలి అంటే చాలా ఇష్టం. గాలి సోకితే చాలు ఏడుపు రాదు. వాయుభక్షకుడా? ఇవన్నీ సర్పలక్షణాలు కదా అని తల్లిదండ్రులు ఆలోచించే వారు. అన్నప్రాశన నాడు రామానుజుడు బంగారం పట్టుకుంటాడా లేక పుస్తకం తాకుతాడా అని అందరూ చూస్తూ ఉంటే, బాలుడు గబగబా పాకుతూ వెళ్లి కేశవసోమయాజి తిరువారాధన మందిరానికి చేరుకుని అక్కడ నారాయణ విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడట. ఓనమాలు అక్షరాభ్యాసం నాడు, తండ్రి ఓం నమః అని రాసి దిద్దమంటే అదేమిటని దాని అర్థమేమిటని అడిగాడట. అర్థం చెప్పేదాకా దిద్దలేదు. అర్థం చెప్పిన తరువాత తానే స్వతంత్రంగా ఓం నమః అని రాసి చదివేసరికి కేశవసోమయాజి ఆశ్చర్యపోయాడు. విన్నది విన్నట్టు చెప్పగలవాడు, ఒక సారి బోధిస్తే మళ్లీ చెప్పనవసరం లేని వాడు ఇతడు ఏక సంథాగ్రాహి అని గమనించాడు. రామానుజుని సమక్షంలో వేదాంత చర్చలు చేస్తే చాలు ఆ మాటలు ఆ విధంగానే చెప్పి తండ్రిని అదేమిటని అడిగేవాడట. ఒక్కరోజులో అక్షరాలు, మరోరోజున గుణింతము, ఆ తరువాత రోజు వర్ణక్రమము, మరునాడు పేర్లు వ్రాయడం, బాలశిక్ష అత్యంతవేగంగా ముగిసింది. రెండో మారు చెబితే ఎందుకు చెప్పిందే మరలా చెబుతారు అని అడిగేవాడట. పుట్టగానే పరిమళించిన నిగమ సుమము రామానుజుడు. బాలుడు పెరుగుతున్నాడు. ఆజానుబాహువవుతున్నాడు. మహాపురుష లక్షణాలు పొడగడుతున్నాయి. యుక్తవయసులో రామానుజునికి ఉపనయన సంస్కారం చేసినారు. వేదవిద్య ప్రారంభించారు. మూలము, క్రమము, జట, ఘన పాఠములు బోధిస్తున్నారు, అతను శరవేగంగా గ్రహిస్తున్నాడు. అప్పటినుండి త్రికాల సంధ్యావందనములు తప్పడం లేదు. సంస్కృత తమిళ భాషలను శరవేగంగా నేర్చుకుంటున్నాడు. తండ్రి చదివే మంత్రాలు, స్తోత్రాలు వెంట వెంట చెప్పగలుగుతున్నాడు. నాలాయిర పాశురాల పఠనం కూడా మొదలైంది. అదేమిటి, దీని అర్థమేమిటి, ఇలానే ఎందుకు అంటారు వంటి ప్రశ్నలతో తండ్రిని ముంచెత్తుతున్నాడు. గోదాదేవి తిరుప్పావు పాశురాలు ఒక్కసారి తల్లి పాడితే చాలు తనయుడికి కంఠతా వస్తున్నది. ఎన్ని పాశురాలు చదివినా రామానుజుడికి ఎందుకో గోదాదేవి రచించి గానంచేసిన తిరుప్పావై పాశురాలంటే ప్రీతి. ఓ వైపు వేద, వేదాంత, వేదాంగ రహస్యాలను బోధించగల గురువు గురించి తండ్రి వెదుకుతూనే పదహారేళ్ల కౌమార యవ్వన ప్రాయాలలోకి అడుగుపెడుతున్న రామానుజుడికి వివాహం చేయాలని సంకల్పించారు తండ్రి. తంజమాంబా రామానుజుల వివాహం తల్లిదండ్రులు చూచి నిర్ణయించిన కన్య తంజమాంబ (రక్షమాంబ)తో వివాహానికి రామానుజుడు అంగీకరించడం జరిగిపోయింది. శాస్తోక్త్రంగా వైభవంగా వివాహం జరిపించారు. వివాహానంతరజీవనం సాగుతున్నదశలో, తండ్రి ఆసూరి కేశవుని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. మధ్యమధ్య తీవ్రంగా అస్వస్థుడవుతున్నాడు. రామానుజుడు ఆందోళన చెందుతున్నాడు. తల్లి కాంతిమతి దివారాత్రములు భర్తవెంట ఉండి పరిచర్యలు చేస్తున్నది. కేశవసూరి ఔషధం తీసుకొనడానికి అంగీకరించడు. ఆరాధన తరువాత తీర్థమే ఆయనకు ఔషధం. ఒకనాడు స్వప్నంలో అతనికి శఠగోపముని (నమ్మాళ్వార్) కనిపించి నీ కుమారుడు మహాజ్ఞాని, జ్ఞానంతో భవబంధాలను పటాపంచలు చేసే బంధముక్తుడిని చేసే మహాయోగి. నీవు నిశ్చింతగా ఉండవచ్చునని ఉపదేశిస్తాడు. మరునాడు రామానుజుని పిలిచి, చెంత కూర్చుండబెట్టి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించాడు. ‘‘తెల్లవారుజాము స్వప్నములు సత్యములే నాయనా, నీవే ఆచార్యుడవు. నీ పాదాలే నాకు శరణు నాయనా..’’ అన్నారు.‘‘తండ్రీ ఏమిటీ వింత. మీరు నా పాదాలను కోరడమా? మీరు నాకు గురువులు, ఆచార్యులు, జనకులు. ఇది విపరీత చర్య తండ్రీ..’’ అని రామానుజుడు వేడుకున్నారు. నీ వలన నాకు పరమపదయోగము ప్రాప్తమవుతున్నది. అదిగో అదే విరజానది, అదే వైకుంఠం... నారాయణా నీ చరణాలే శరణు, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, రామానుజ చరణౌ శరణం ప్రపద్యే.. ’’ అంటున్నట్టు పెదాలు కదులుతున్నాయి. అదిగో పరవాసుదేవుడు... పీతాంబరధారి, అంతర్యామి, అంటూ... కన్నుమూశారాయన. కన్నీరు తుడిచిన కన్నతల్లి రామానుజుడు హతాశుడైనాడు. చాలాకాలం విషాదంలో మునిగిపోయినాడు. తండ్రివియోగంతో ఆయననే తలచుకుంటూ దుఃఖిస్తున్న కొడుకును చూసి తల్లి కాంతిమతి అతనికి ధైర్యం చెప్పడం అవసరం అని నిశ్చయించుకుంది. కొడుకును చేరబిలిచి ‘‘నాయనా ఎవరిని తలచుకుని ఏడుస్తున్నావు. ‘జాతస్యహి ధృవో మృత్యుః «ధృవం జన్మ మృతస్యచః’ అని వినలేదా? నీ తండ్రి దేహం గురించా బాధ? ‘‘అంతవంత ఇమే దేహాః’’ (దేహం శాశ్వతం కాదు) శిధిలమై నిర్జీవమైన ఆ దేహాన్ని నీవే కదా చితి ముట్టించి ముగించినావు. పోనీ నాన్నగారి ఆత్మగురించి బాధపడుతున్నావా? అది శరీరబంధమునుంచి విముక్తమయి హరిని చేరినదని నమ్ముతున్నావా లేదా? నమ్మితే ఇంక దేనికి బాధ. అనిత్యమైన దేహమును విడిచి ముక్తుడై పరమపదము చేరిన నీ పితృదేవుల గురించి ఎందుకు నాయనా తపిస్తున్నావు, అని జ్ఞాన బోధ చేసిన మాతృమూర్తిని చూసి అవును నిజమే నేనెందుకు ఏడుస్తున్నాను? అనుకున్నాడు. తల్లిమాటలలో రామానుజునికి కనిపించని గురువు వినిపించినాడు. తల్లిదండ్రులే కదా తొలిగురువులు. శాస్త్రం చెప్పగల గురువులకోసం కంచికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు రామానుజుడు, తల్లి ఆనందంగా అనుమతించింది. గురువు కోసం అన్వేషణ వేదాంత విద్య నేర్చుకుందామని అనుకుంటున్నాడే కాని నాలుగు కాసులు సంపాదించి సంసారాన్ని నడపాలన్న ఆలోచనే లేదు. ఈయన అసలు నాతో కాపురం చేస్తాడా అని తంజమ్మ అనుమానించసాగింది. వేదాంతపు వెర్రి తలకెక్కితే ఇక సంసారం మీద వ్యామోహం ఏముంటుందన్నది ఆమె ప్రశ్న. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణ త్రయములపై వ్యామోహం వదులుకోవాలని వేదాలు బోధిస్తున్నాయి. ఇక నా సంసారం ఎటుపోతుందో, ఏమవుతుందో. ఆ ఆలోచనతో ఆమె చేసే పనులలో రామానుజునికి ఏదో లోపం కనిపిస్తూనే ఉంది. భర్త కంచికి వెళ్లి వేదాంత జ్ఞానార్జన ఆరంభిస్తే దారేషణ తగ్గిపోవడం తప్పదని ఆమెకు అనిపిస్తున్నది. నాకు ప్రపంచంపై విరక్తి రావడం లేదు. ఆయన అడుగులు వైరాగ్యంవైపు పడుతున్నాయి. ‘‘భగవంతుడిని ధ్యానించడానికి వేదాంత శాస్త్ర అధ్యయనం అవసరమా, వేదాలు నేర్వని మానవులకు భగవంతుడు పట్టుబడడా? అట్లా అయితే నావంటి వారి గతేమిటి?’’ భార్య ప్రశ్నించింది. ‘‘పరమాత్ముడిని చేరడానికి వేదాంత విద్యతో పనే లేదు. స్వామి కల్యాణ గుణానుభవము చాలు. సులభమైన తరుణోపాయాలు చాలా ఉన్నాయి’’ అన్నారు రామానుజులు.‘‘అయితే మీరెందుకు సులభోపాయాలు వదిలి కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి ఎందుకు కష్టపడాలనుకుంటున్నారు.’’ తంజమ్మ అడిగింది.‘‘ఈ సమాజంలో వేదాలను వ్యతిరేకించే దుర్మతములు ప్రబలుతున్నాయి. వీరికి సరైన సమాధానం చెప్పడానికి నేను ఎంతో నేర్చుకోవలసి ఉంది. వీరిని వాదాల్లో ఓడించకపోతే వారన్నదే నిజమని జనం భ్రమించే ప్రమాదం ఉంది. కనుక కొన్ని సంవత్సరాలు నేను వేదాంత రహస్యాలను అధ్యయనం చేయవలసి ఉంది. కంచిలో యాదవప్రకాశులనే పండిత ప్రకాండులున్నారు. వారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అని రామానుజులు వివరించారు. ‘‘ఈ మతాలేమిటి దుర్మతాలేమిటి?’’ అని అమాయకంగా అడిగింది తంజమ్మ.మతాలంటే అభిప్రాయాలు. జగత్తుకు కారణం ఏమిటి అనే ప్రశ్నకు పరిపరివిధాలుగా సమాధానాలు చెబుతున్నారు. కొందరు వేదాల్లో సమాధానం ఉందని నమ్ముతున్నారు. కొందరు అంగీకరించడం లేదు. చార్వాకము, జైనము, సౌత్రాంతికము, వైభాషికము, యోగాచారము, మాధ్యమికము అనే ఆరు వేదబాహ్యమతములు. వీరిలో చార్వాకము నాస్తిక మతం. వీరికి ప్రత్యక్షమే ప్రమాణము. కనిపించే భూమి, అగ్ని, నీరు, వాయువులనే వీరు ఉన్నట్టు నమ్ముతారు. ఇంతకు మించి ఏదీ లేదంటారు. శరీరమెంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుందని జైన సిద్ధాంతం. జగత్తు కర్యాకారణ రూపంలో నిత్యానిత్యంగా ఉంటుంది. ఏనుగుకు ఏనుగంత ఆత్మ ఉంటుందంటారు. వైభాషికుడు, సౌత్రాంతికుడు, యోగాచారుడు, మాధ్యమికుడు .. వీరు బౌద్ధమతస్తులు.వీరు ఆత్మను అంగీకరించరు. జగత్తు పరమాణు సంఘటితమై ఉంటుందని దీనియందు క్షణిక బుధ్ధియే మోక్షమని అంటారు. ఇంకా కొద్ది విభేదాలతో మరికొన్ని మతాలు ఉన్నాయి. సన్మతమేమిటో చెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. యాదవ ప్రకాశుల వారు అద్వైత మతస్తులని అంటున్నారు. అదేమిటో వారిని ఆశ్రయించి వారి బోధలు వింటే తప్ప తెలియదు. అందుకే కంచికి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. (సత్కథాకాలక్షేపము పేరుతో పరమపదవాసులు కవిరత్న గుదిమెళ్ల రామానుజాచార్యస్వామి వారు (నడిగడ్డపాలెం) రచించిన భగవద్రామానుజుల చరిత్ర అనే పుస్తకంలో వివరమైన వ్యాఖ్యానం ఉంది. రామానుజుని బాల్య యవ్వన వివాహ జీవనం గురించి చాలా వివరంగా ఆ పుస్తకంలో ఉంది. కొన్ని సంఘటనలు అంశాలు ఈ అద్భుతపుస్తకం ఆధారంగా రూపొందినవి) ఇక రామానుజుని వేదాంత శాస్త్ర జిజ్ఞాసను ఆపడం ఎవరితరమూ కాదని తంజమ్మ మనసులో నిశ్చయించుకున్నది. తత్వవిషయంలో నిమగ్నమై ఉన్న రామానుజుడికి నేనవసరమే లేదు. ఈయన మహాపురుషుడు. వీరు సాధించవలసిన విజయములు వేరే ఉన్నవి. ఇల్లు సంసారములకు మించిన బాధ్యతలు వీరు తలకెత్తుకొనుచున్నారు. నేను అల్పురాలిని, నాజ్ఞానం ఏమాత్రం సరిపోదు. నేను స్వార్థ చింతన గలదానిని. వారేమో పరార్థ చింతన పరమార్థ చింతన మరమాత్మ చింతనలో మునిగిపోతున్నారు. వారు అద్భుతమైన వెలుగువైపు సాగుతున్నారు. నాది సాధారణ జీవన విధానం. వారితో పొసగడం సాధ్యమో కాదో. కాదు కాదు సాధ్యం కాదు. అని ఆలోచిస్తున్న తంజమ్మను బుట్ట ఇమ్మని అడుగుతున్నాడు రామానుజుడు. ఆమెకు వినిపించడం లేదు. కంచికి కదులతున్న భర్త తన పరధ్యానాన్ని గమనించి, తానే బుట్టను తీసుకున్నాడు. తంజమ్మ కథ కంచికి చేరుతున్నట్టనిపించింది. కాలినడకతో కంచికి బయలుదేరిన రామానుజుని వాకిట నిలబడి కాంతిమతి, తంజమ్మ సాగనంపుతున్నారు. గూడబుట్ట ఇంత బరువుగా ఉందేమని అడిగాడు రామానుజుడు. భూభారాన్ని మోయడానికి సిధ్ధంగా ఉన్న మీకు ఇదొక బరువా అని చమత్కరించింది తంజమ్మ. నేను భూభారం మోయడమేమిటి తంజా అన్నాడు రామానుజుడు. సంసారబంధాలు వదులుకొని జనులను ఉద్ధరించే భారం మోయడానికే కదా తమరి ప్రయాణం అందామె. ఓహో అదా నీ అభిప్రాయం అని నవ్వుకున్నారు. మీరేమనుకున్నారు మరి? నీమనసులో ఉన్న బరువంతా బుట్టలోకి నెట్టావేమోననుకున్నాను. ఓచూపు చూసిందామె. రామానుజుడు గంభీరంగా అడుగులు వేస్తూ కంచివైపు నడుస్తుంటే తల్లి అతనిలో ఆదిశేషుని జాడను గమనించింది. పుణ్యపురుషుడొకడు కదిలి వెళుతున్నట్టు కనిపిస్తున్నది. తంజమ్మ మనోహరుడైన భర్త గమన సౌందర్యాన్ని చూస్తూ ఉంటే తన అదృష్టరేఖ తరలిపోయినట్టు అనిపిస్తున్నది. కొంగు చాటున ముఖం, కన్నీటి తెరల చాటున చూపులు...అంతా అస్పష్టంగా ఉంది. ఈ ప్రయాణం ఎటు? రామానుజుడెవరు? జననం శ్రీపెరుంబుదూర్: జీవనకాలం (1017–1137): నాథముని, యామునా చార్యుల తరువాత శ్రీవైష్ణవ విశిష్ఠాద్వైతాన్ని ప్రసిద్ధం చేసిన సిద్ధాంత కర్త, భక్తి ఉద్యమకారుడు, బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం – శ్రీ భాష్యం, భగవద్గీతాభాష్యం, వేదాంత సంగ్రహ అనేవి ప్రధాన ప్రామాణిక సైద్ధాంతిక గ్రంథాలు, శరణాతి, శ్రీరంగ, శ్రీ వైకుంఠ గద్యాలు (గద్యత్రయం), నిత్య గ్రంథం రచన. రామానుజుని రచనల పైన హారోల్డ్ కోవార్డ్, థామస్ అక్వినాస్, ఎ బి వాన్ బ్యూటెనెన్ పరిశోధనలు జరిపి ఇవి చాలా ప్రభావం కలిగించిన గ్రం«థాలని తమ పరిశోధనా సైద్ధాంతిక గ్రం«థాలలో నిరూపించారు. మహ్మదీయ రాజుల దాడులలో ధ్వంసమైన అనేక ఆలయాలను పునరుద్ధరించి, ఆ మత పాలకులతో వాదం జరిపి వారు ఎత్తుకుపోయిన విగ్రహాలను తిరిగి సాధించి ఆలయాల్లో నెలకొల్పిన ధీరుడు. ఆలయాలలో అన్నికులాలవారికి ప్రవేశం జరిపించి, అందరికోసం చెరువులు తవ్వించి, విజ్ఞానం మంత్రోపదేశం అందరూ పొందాలనే సర్వసమతా సూత్రాన్ని బోధించి పాటించిన జగద్గురువు రామానుజులు. 120 సంవత్సరాలు జీవించిన రామానుజుని తిరుమేని (శరీరం) కూర్చున్న భంగిమలో శ్రీరంగనాథుని ఆలయ సముదాయంలో 880 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా పూజలందుకుంటున్నది. ఈ ఫొటోలోనిదే ఆ విగ్రహం. -
మాజీ డీజీపీపై లారీ డ్రైవర్ దాడి
చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడు జైళ్ల శాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంత ఊరు అయిన సేలం సూరమంగళంలో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఆయన కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా ఓ లారీ అతివేగంతో ఎదురు వచ్చింది. దీంతో కారు ఆపి... కిందకి దిగిన రామానుజన్... లారీని ఆపి... ఎందుకు అంత వేగంగా నడుపుతున్నావంటూ లారీ డ్రైవర్‌ను మందలించారు. దీంతో లారీడ్రైవర్ మాజీ డీజీపీతో దుర్భాషలాడడంతో పాటు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడి పోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాలీవుడ్లో భారతీయుడి జీవితగాథ
హాలీవుడ్ తెరపై మరో భారతీయుడి జీవితకథ సందడి చేయనుంది. గణితశాస్త్ర మేధావిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను హాలీవుడ్లో సినిమాగా తెరకెక్కించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేం దేవ్‌పటేల్ రామానుజన్గా నటించిన ఈ సినిమాను టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. సామాన్యుడైన శ్రీనివాస రామానుజన్ మద్రాస్ నగరం నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మాథ్యూ బ్రౌన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేవిక బైసే, దేవ్‌పటేల్‌కు జంటగా నటిస్తుంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రామానుజానికి సహాయం చేసే ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు జిహెచ్ హార్డీ పాత్రలో జెరెమీ ఐరన్స్ కనిపించనున్నాడు. -
'40 సార్లు గుండు గీశారు'
తన తలకు కనీసం నలభై సార్లు గుండు కొట్టారని దక్షిణాది నటుడు అభినయ్ వడ్డి వెల్లడించారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అభినయ్ బుధవారం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జీవిత కథ ఆధారంగా తమిళ, ఇంగ్లీషు భాషలలో నిర్మితమవుతున్న 'రామానుజన్' చిత్రానికి సంబంధించిన విశేషాలను అభియన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ చిత్రంలోని ముఖ్యపాత్ర కోసం గుండుతో కనిపించాల్సి ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు తనకు ముందే చెప్పారని తెలిపారు. అందుకు తాను మనస్పూర్తిగా అంగీకరించానని తెలిపారు. దాంతో అన్ని సార్లు గుండు గీస్తారని చెప్పారు. తమిళనాడు కుంభకోణంలో చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో భాగంగా క్షరకుడు ఎల్లప్పుడు తనతో ఉండేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్ర షూటింగ్లో భాగంగా లండన్ వెళ్లినప్పుడు విగ్ పెట్టుకుని తిరగాలని తెగ అరాటపడ్డానని అయితే తన తలకు జుట్టు కొద్దికొద్దిగా వస్తున్న క్రమంలో విగ్ తన తలకు అతకలేదన్నారు. దాంతో విగ్గు పెట్టుకునేందుకు గుండె గీయించుకోవలసి వచ్చిందని షూటింగ్ నాటి విశేషాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కర్పూర సినిమా నిర్మిస్తున్న ఆ చిత్రంలో బామా, సుహాసిని మణిరత్నం, నిళగళ రవి, శరత్ బాబు, విజయ్, అబ్బాస్, ఢిల్లీ గణేష్, వై.జీ మహేంద్రలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
క్లయిమాక్స్‌లో రామానుజన్
గణిత శాస్త్రమేధావి రామానుజన్ జీవిత కథ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామానుజన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు పెరియార్, భారతీ వంటి నాయకుల జీవిత కథలను తెరపై ఆవిష్కరించారు. దివంగత నటుడు జెమిని గణేశన్ మనవడు అభినయ్ రామానుజన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్యగా ప్రముఖ కన్నడ, మల యాళ నటి భామ నటిస్తున్నారు. సుహాసిని, అబ్బాస్, శరత్ బాబు, నిళల్గల్ రవి తదితరులు నటిస్తున్నారు. చిత్ర విశేషాలను దర్శకుడు తెలుపుతూ రామానుజన్ ప్రఖ్యాత గణితశాస్త్ర మేధావి అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే అలాంటి కీర్తి గడించిన వ్యక్తి తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు ఆ తరువాత ప్రపంచం ఆయన గణిత శాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించడం తదితర పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా రామానుజన్ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలోని చాలా సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రంలో చాలా మంది తమిళం తెలిసిన అమెరికన్లు నటించడం విశేషం అని చెప్పారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రూపొం దిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటుందని చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
నానమ్మను ఆదర్శంగా తీసుకున్నాను!
తొమ్మిది గజాల చీర... అది కూడా మడికట్టు, ముక్కు పుడక, రూపాయి కాసంత బొట్టు... వెండితెరపై ఈ వేషధారణలో కనిపిస్తానని సుహాసిని ఎప్పటికీ ఊహించి ఉండరు. అందుకే, ఈ కట్టూబొట్టూ అనగానే ఒకింత థ్రిల్‌కి గురై ‘రామానుజన్’ సినిమాని ఒప్పుకున్నారామె. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రామానుజం తల్లి పాత్రను సుహాసిని చేస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ - ‘‘రామానుజం జీవితంలో ఆయన తల్లి ‘కోమలత్తమ్మాళ్’ పాత్ర చాలా ఉందని, ఈ చిత్రంలో మీరు ఆ పాత్ర చేయాలని దర్శకుడు జ్ఞానశేఖరన్ చెప్పినప్పుడు నేను చాలా అదృష్టవంతురాల్ని అనిపించింది. రామానుజంలాంటి మేధావి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాని నేను ఎలా కాదంటాను? ఆయన తల్లి పాత్ర చేసే అవకాశం నన్నే వరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్ర కోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాను. రామానుజం తల్లి చాలా డామినేటింగ్. మా నానమ్మ అలానే ఉండేది. కమల్‌హాసన్‌లాంటి వ్యక్తిని తీర్చిదిద్దిన ఘనత ఆమెది. నేను కూడా తన దగ్గరే పెరిగాను. అందుకే కోమలత్తమ్మాళ్ పాత్రకు తనను అనుకరించాను. అలాగే నా కుటుంబంలో, స్నేహితుల దగ్గర ఉన్న తొమ్మిది గజాల చీరలను సేకరించాను. మా అమ్మ ఫొటోల ఆధారంగా నగలను ఎంపిక చేసుకున్నాను. అప్పట్లో మా అమ్మ ఎలాంటి కేశాలంకరణ చేసుకునేదో అదే ఫాలో అయ్యాను. నాకు చీరలు మామూలుగా కట్టడం వచ్చు. కానీ, మడికట్టు తెలియదు. ఈ సినిమా కోసం అది నేర్చుకున్నాను. మొత్తం మీద ఈ సినిమాలో నటించడం నాకు మంచి అనుభూతిని ఇస్తోంది’’ అని చెప్పారు. ఇందులో రామానుజన్ పాత్రను సావిత్రి మనవడు అభినయ్చేస్తున్నారు.