రామానుజుని శిష్యరికంలో  గోవిందుడు | Govindudu is a disciple of Ramanuju | Sakshi
Sakshi News home page

రామానుజుని శిష్యరికంలో  గోవిందుడు

Published Sun, Feb 18 2018 1:04 AM | Last Updated on Sun, Feb 18 2018 1:20 AM

Govindudu is a disciple of Ramanuju - Sakshi

శ్రీశైల పూర్ణులు ముందే వెళ్లి, ఎదురువచ్చి రామానుజుడికి మర్యాదలతో స్వాగతం చెప్పారు. ఈ వయసులో ఆయన ఉరుకులు పరుగులతో పనులు చేస్తూ ఉంటే అయ్యా ఈ వయసులో ఇంత శ్రమా? ఎవరైనా మీకన్న చిన్నవాడిని యువకులను పంపవచ్చుగదా అంటే ‘‘మొత్తం ఈ తిరుమలలో నాకన్న చిన్నవాడెవరూ నాకు కనిపించలేదయ్యా’’ అన్నారట. శ్రీశైలపూర్ణుల వినయం అది. వారు తెచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ముందుకు నడిచి మాడవీధులలో ప్రదక్షిణగా వెళ్లి, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, పుష్కరిణి తీర్థం స్వీకరించి అక్కడ చింతచెట్టును చుట్టి, పుష్కరిణీ తీరంలో ఉన్న శ్రీ వరాహ స్వామిని సేవించుకున్నారు. మహాద్వారం గుండా కలియుగ వైకుంఠమైన ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం, బలిపీఠం దగ్గర సాగిల పడి, వంటశాల, యాగశాల పరిశీలించి, తిరుమామణి మండపంలో తిరిగి, విష్వక్సేనుడిని సేవించుకుని యోగనరసింహస్వామిని దర్శించుకుని, దేదీప్యమానంగా ఆకాశంలో నిలబడి ఉన్న ఆనందనిలయ విమానాన్ని చూసి నమస్కరించి గర్భాలయంలో ప్రవేశించి, గరుడునికి మొక్కి, జయవిజయుల మధ్య నుంచి శ్రీనివాసుని చూస్తూ కులశేఖర పడి దాటిన రామానుజుడు ఆ దివ్యమంగళ రూపుని తన్మయుడై చూస్తూ ఆనంద పరవశుడై ‘శ్రీ శ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే’ అన్నారు. చేతులు కట్టుకుని స్వామి దివ్య తిరుముఖ మండలాన్ని సేవిస్తూ కాసేపు నిలిచిపోయారు. మంగళం పాడారు. స్థానాచార్యులు తీర్థం, శఠారి ఇచ్చారు.  వేంకటేశ్వరస్వామివారి తిరుమంజనసేవ (అభిషేకం) చేసుకున్నారాయన. ‘‘ఆహా ఇది సాక్షాత్తూ వైకుంఠమే, సందేహం లేదు. ఇది నిత్యసూరులకు నిత్య నివాసమే. ఇది పరమ పావన క్షేత్రం. ఇది నా వలన అపవిత్రం కారాదు అనుకున్నారు’’. 

శ్రీశైలపూర్ణుల వారు కనీసం మూడురోజులు నిద్ర చేయాలని సూచించారు. సరేనన్నారు. మూడురోజులు ఉండి మూడోరోజున కూడా స్వామిని దర్శించారు. తిరుమలేశుని అనుమతిని, శ్రీశైలపూర్ణుల అనుమతిని తీసుకొని కిందికి బయలుదేరారు. తిరుపతిలో రామానుజుడు శ్రీశైలపూర్ణుల ఇంటిలోనే ఒక ఏడాది పాటు ఉన్నారు. గోవింద రాజులు కోవెలలో శ్రీశైలపూర్ణుల శ్రీమద్రామాయణ ప్రసంగాలను విన్నారు. శ్రీ రామాయణం సంపూర్ణంగా శ్రీశైల పూర్ణుల నుంచి ఏడాది పాటు నేర్చుకున్నారు. రామానుజాచార్యులకు అనువైన శిష్యుడిగా గోవిందుడు దొరికింది ఇక్కడే. గోవిందుడిని విశిష్టాద్వైతంలోకి మళ్లించి తీసుకువచ్చింది శ్రీశైల పూర్ణులే. వచ్చినప్పటి నుంచి గోవిందుని రామానుజులు గమనిస్తున్నారు. ఒకసారి శ్రీశైలపూర్ణుల శయ్యను సరిచేస్తున్నాడు. కాసేపటి తరువాత శయ్యమీద పడి దొర్లాడు. ‘‘గోవిందా ఏమిటిది..’’ అంటున్న రామానుజుని చూసి లేచి నిలబడ్డాడు. ‘‘నేను శయ్యసరిగా ఉందా లేదా అని చూసానంతే. ఒకవేళ ఎక్కడైనా ముడతలు పడితే గురువుగారు నొచ్చుకుంటారు. నిద్రాభంగమవుతుంది కదా. సరిచూడటం నా బాధ్యత అనుకున్నాను’’ అన్నాడు గోవిందుడు. 

మరో సందర్భంలో గోవిందుడు ఒక పామును పట్టుకుని దాని నోట్లో వేలు పెడుతున్నాడు. ఈ వింత చర్య చూసి ఆశ్చర్యపోయాడు. పాము మీదే దృష్టి అంతా. పాము నోట్లోనుంచి ఒక ముల్లు పీకి బయట పడేశాడు. ‘‘పాముతో ఆడుకుంటున్నావా’’ అని అడిగారు రామానుజుడు. ‘‘కాదు ఆచార్యా, పాపం దాని నోట్లో ముల్లు ఇరుక్కుని బాధపడుతున్నది. ఏదీ తినలేదు, నోరు మూయలేదు. ముల్లు తీయడం తప్ప మరో మార్గం లేదు... కనుక ఈ సాహసం చేశాను’’ అన్నాడు గోవిందుడు. ‘‘మరి అది పాము కదా... కాటేస్తే...’’ అన్నారు రామానుజులు. వేయలేదు కదా స్వామీ అని గోవిందుడి జవాబు.  గోవిందుని గురుభక్తి, మంచి మనసు, అన్ని జీవుల పట్ల అనురాగం, భూత దయ అర్థమయింది.  గోవిందుడిని తనతో పంపమని శ్రీశైల పూర్ణులను అభ్యర్థించారు. ఆయన వెంటనే అంగీకరించాడు. రామానుజునితో వెళ్లాలని, రామానుజుని ప్రియమైన శిష్యుడిగా మెలగాలని, ఆయనకు నిత్యం సేవలు చేసి మంచి శిష్యుడనిపించుకోవాలని బోధించి పంపించారు. గోవిందుడు రామానుజుని వెంటవెళ్లాడు గాని అతని మనసంతా శ్రీశైల పూర్ణుని మీదే ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలించలేదు. ఆకలి, నిద్రలేవు. ఇదంతా గమనించిన రామానుజుడు శ్రీశైలపూర్ణులు దూరం కావడం వల్లనే గోవిందుడు బాధపడుతున్నాడని, గురువును విడిచి ఉండలేని శిష్యుడని అర్థం చేసుకున్నారు. ఆచార్యుల వారి దగ్గరకు పంపడం ఒక్కటే మార్గమని నిర్ణయించి, కొందరిని తోడు ఇచ్చి తిరుపతికి తిరిగి పంపించారు. వారు వెళ్లి గోవిందుని పరిస్థితి వివరించారు. శ్రీశైలపూర్ణులు ‘‘ఒక ఆచార్యుడికి నిన్ను సమర్పించిన తరువాత తిరిగి వెనక్కి తీసుకోవడం తగనిపని.

ఇప్పుడు నీవు ఆతని సొత్తువు నాయనా. నేను నిన్ను మళ్లీ స్వీకరించలేను. నీకు ఆచార్యభక్తి ఎక్కువ కనుకనే నిన్ను నేను ఆయనకు అప్పగించాను. నీవు నన్ను సేవించినట్టే శ్రీమద్రామానుజుడిని సేవించు గోవిందా. ఇది నీ భాగ్యం అని అర్థం చేసుకో. నీవు రామానుజులవారి వెంట ఉండి సేవిస్తే , ఆ ప్రతిసేవా నాకు అందుతుందని తెలుసుకో. నాకన్న రామానుజుడికి నీవంటి మంచి శిష్యుల అవసరం ఉంది. ఆయన జగద్గురువు. ఆయనను రక్షించుకునే బాధ్యత మనందరి మీదా ఉంది. కనుకనే నిన్ను ఆయనకిచ్చి పంపుతున్నాను. బాధపడకు. మనసు నిర్మలం చేసుకో. వెళ్లు. నీకు గురువైనా దేవుడైనా నేనైనా రామానుజుడే’’ అని బోధించారు. గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, కన్నీళ్లతో కాళ్లు కడిగి, గురువుగారి కుటుంబంలో ఒక్కొక్కరిని కళ్లారా చూసి. నమస్కరించి, సెలవు తీసుకుని గోవిందుడు మనసు రాయిచేసుకుని బయలుదేరాడు. గురువుగారి మాటలు మనసులో నాటుకున్నాయి. తనకు ఇక శ్రీశైల పూర్ణుడైనా రామానుజుడైనా ఒకరే. రామానుజుడిలోనే శ్రీశైలపూర్ణుల వారిని చూసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. గోవిందుడు మళ్లీ తన దగ్గరికే రావడం చూసి రామానుజులు ఆశ్చర్యపోయారు. జరిగింది తెలుసుకున్నారు. గురువుగారి ఉపదేశం విన్నారు. మౌనంగా తన పాదాలకు నమస్కరిస్తున్న గోవిందుడిని చూశారు. శ్రీశైల పూర్ణుడి ధర్మనిరతి, తనపై ఆయనకున్న ఆప్యాయత తలుచుకుని ఆయనకు నమస్కరించారు. గురువు ఆజ్ఞను మీరకుండా గోవిందుడు రామానుజుని సేవించసాగాడు. క్రమంగా స్వస్థత చెందాడు. గురువుకు ఏ అసౌకర్యమూ కలగకుండా చూసుకుంటూ రామానుజుని ప్రేమానురాగాలను గోవిందుడు సాధించాడు.  

శ్రీభాష్యం రచన– రామానుజ జైత్ర యాత్ర
యామునాచార్యుల వారికిచ్చిన తొలి వాగ్దానం బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరమైన శ్రీభాష్యరచన. అందుకోసం  కావలసినది బోధాయన వృత్తి. బాదరాయణ రుషి రచించిన రెండు లక్షల శ్లోకాల గ్రంథానికి సంక్షిప్తరూపమైన 25 వేల శ్లోకాల పుస్తకం కాశ్మీరంలోని శ్రీనగరంలో సరస్వతీ భాండాగారంలో ఉంది. కాశ్మీరానికి వెళ్లవలసిందే. మఠాన్ని నిర్వహించే బాధ్యత కొందరు శిష్యులకు అప్పగించి, శ్రీరంగనాథుడికి ప్రణమిల్లి పెరుమాళ్‌ అనుమతి తీసుకుని కురేశుడి (ఆళ్వన్, శ్రీవత్స పేర్లు కూడా ఆయనవే) వరద విష్ణు ఆచార్య, ఎంబార్‌ వంటి ప్రధాన శిష్యులతో కలసి మూడునెలల పాటు కాలినడకన ప్రయాణించి కాశ్మీరం చేరుకున్నారు. దారిలో అనేక నగరాలలో పండితులతో చర్చా సమరంలో పాల్గొన్నారు. తర్కంతో అందరినీ జయించారు. వాదనలో ఉద్దండులే అయినా సత్యశోధన శూన్యం కావడం, పాండిత్యంతోపాటు మూఢత్వం కూడా ఉండటం వారి పరాజయానికి కారణాలు. రామానుజుడు సత్యం వైపు వారి దృష్టిని మళ్లించారు. అక్కడి రాజాస్థాన పండితులతో వాదించి వారిని జయించారు. రాజు కూడా రామానుజుని ప్రతిభావిశేషాలను విజ్ఞానవిశేష వాదనా పటిమను చూసి ముగ్ధుడైనాడు. ‘‘మహారాజా, నేను నా గురువైన యామునాచార్యుల ఆజ్ఞ మేరకు బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని రచించేందుకు సంకల్పించాను. ఇదివరలో బోధాయనుడనే పండితుడు దానిపై వృత్తి గ్రంథాన్ని రచించినారు. అది మీ సరస్వతీ భాండాగారంలో ఉంది. మాకు ఆ ‘బోధాయన వృత్తి’ గ్రంథం చాలా అవసరం. మేం కొంతకాలం అధ్యయనం చేసిన తరువాత మీకు తిరిగి ఇవ్వగలం, దయచేసి ఆ పవిత్ర గ్రంథాన్ని కొద్ది రోజుల కోసం మాకు ఇవ్వవలసిందని అభ్యర్థన’’ అన్నారు.

దక్షిణం నుంచి వచ్చిన రామానుజాచార్యులకు ఇవ్వడం కాశ్మీరు పండితులకు ఏమాత్రం నచ్చలేదు. ఇవ్వరాదని రాజుకు విన్నవించారు. ‘‘సరే, ఒకసారి చదువుకొనడానికయినా అనుమతించండి రాజా అని కోరారు. వేలశ్లోకాల గ్రంథాన్ని ఒక్కసారి చదివితే ఏమాత్రం సరిపోదని మొత్తం తెలిసే అవకాశమే లేదని భావించి పండితులు అంగీకరించారు. రాజుగారు ఆ గ్రంథాన్ని రామానుజునికి సమర్పించారు. రామానుజులు రాత్రింబవళ్లు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని కురేశుని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆయన అధ్యయనం ముగిసింది. శ్రీరంగం వెళ్లేముందు రాజసభలోనే రామానుజుడు తొలి సూత్రం ‘‘అధాతో బ్రహ్మజిజ్ఞాస’’ పై వ్యాఖ్యను చదివి, దానికి మరింత వివరమైన వ్యాఖ్యానం చేసి రాజును, అక్కడి సభాసదులను మెప్పించారు. బోధాయనుడి అన్వయాన్ని చదివిన వెంటనే ఒక్కసూత్రంపైన అంతగొప్ప భాష్యాన్ని చెప్పినందుకు రాజు ఆ గ్రంథాన్ని పూర్తిగా తీసుకుపోవచ్చునని రామానుజుడికి ఇచ్చేశారు. ఒక్కసారి చదివితేనే అద్భుత వ్యాఖ్యానం చేసిన రామానుజుడు ఇంకా కొన్నాళ్లపాటు ఈ పుస్తకం సమగ్రంగా అధ్యయనం చేసి శ్రీ భాష్యం రచిస్తే ఇంకే అద్భుతం చేస్తారో అని అక్కడ పండితులు ఈర‡్ష్య చెందారు. ఇతర మతాలనన్నీ జయించి వైష్ణవాన్ని సుస్థాపితం చేస్తారని అసూయపడ్డారు. విశిష్టాద్వైతం ముందు ఇక ఏమతాలు మిగలబోవని భయపడ్డారు. ఆయనకు గ్రంథం దక్కకుండా చేయాలనే దురుద్దేశంతో కొందరిని వెంట పంపించారు. కొన్ని రోజులపాటు వారు రామానుజుని బృందాన్ని అనుసరించి ఒక రాత్రి ఏమరుపాటుగా ఉన్నప్పుడు బోధాయన వృత్తిని వారు తస్కరించారు. మరునాడు లేచి చూసేసరికి ఆ గ్రంథం లేదు. లక్ష్యం విఫలమైందనీ. ఇంత శ్రమా వృథా అయిందనీ కలత చెందారు రామానుజులు. కాశ్మీరం వెళ్లి రాజుకు ఫిర్యాదు చేయాలని కొందరు, రాజు శిక్షించినంత మాత్రాన పుస్తకం దొరుకుతుందా అని మరికొందరు అనుకున్నారు. అంతలో అక్కడికి కురేశుడు వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. బోధాయన వృత్తి గ్రంథం పోయిందని చెప్పారు సహచరులు. ‘‘ఆచార్యవర్యా మీరేమాత్రం చింతించే అవసరం లేదు. నేను ఆ గ్రంథాన్ని కూలంకషంగా చదివినాను. మీకు కావలసిన విధంగా బోధాయనుడి వ్యాఖ్యాన వివరణలను నేను ఇవ్వగలను. మీరు నిశ్చింతగా ఉండండి స్వామీ.’ 

అన్న కురేశుని చూసిన రామానుజుని ముఖంలో వెలుగు కనిపించింది. ఏదీ రెండోసూత్రం గురించి బోధాయనుడు వ్రాసిన వాక్యాలు వినిపించు’’ అని పరీక్షించారు. కురేశుడు యథాతథంగా వినిపించాడు. రామానుజుని ఆశ్చర్యానందాలకు అంతులేదు. కురేశుని కౌగిలించుకుని, ‘నీ ఏకసంథాగ్రాహిత్వం నాకు తెలుసు కురేశా. ఇటువంటి కీడు శంకించే వృత్తి గ్రంథాన్ని నిన్ను అధ్యయనం చేయమని కోరాను. నా చింత దీర్చగలవనే నమ్మకం ఉంది కనుకనే. ఇక్కడున్న వీరందరికీ నీ విశిష్టత తెలియడం కోసమే నిన్ను పరీక్షించాను. నీ వల్ల నేను వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాను. కురేశా నీవే దానికి లేఖకుడిగా ఉందువుగాని. శ్రీరంగనాథుడి సన్నిధిలో మనం శ్రీభాష్య రచనాయజ్ఞాన్ని ప్రారంభిద్దాం’’ అన్నారు. ‘‘మహాభాగ్యం స్వామీ, నా జన్మధన్యం’’ అని కురేశుడు ఆనందంగా ఒప్పుకున్నాడు.            

వ్యాసుడు రచయిత గణేశుడు లేఖకుడు        
వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరని ప్రశ్నించాడు. అందుకు సమర్థుడు వినాయకుడే అని తెలిసి, ఆయనను ప్రార్థించాడు. గణపతి ఘంటం పట్టుకుని  ప్రత్యక్షమైనాడు. ధన్యోస్మి వినాయకా అని నమస్కరించగా, ‘‘వేదనారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతినమస్కారం చేశాడు. అయితే వ్యాసమహర్షీ, నాదొక విన్నపం అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడ ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంటవెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థంచేసుకున్న తరువాతనే వ్రాయాలి సుమా..’’అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు. సరే ననక తప్పదు. ‘‘నాకూ మంచిదే ఆ మహాగ్రంథమైన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’’ అనుకుని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహమై సాగిపోతున్నది. వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని గమనిస్తూ ప్రశంసిస్తూ ఆనందిస్తూ వ్రాస్తున్నాడు. ఇంకా సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవారట. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ ఆయన నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు.
- ఆచార్య మాడభూషి శ్రీధర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement