బొమ్ములూరు శ్మశానవాటికలో మృతదేహాన్ని వెలికితీస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఇన్‌సెట్‌లో మృతుడు జంగం చంటి (ఫైల్)
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్: పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన ఓ వ్యక్తిని హతమార్చి కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చోరీ ముఠాలో సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్లితే.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన జంగం చంటి (28), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి వెంకన్న, తుమ్మా సుబ్రహ్మణ్యం, షేక్ సుభాని అలియాస్ సిద్ధు, ముత్యాల నవీన్, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ నాగుల్ మీరా అలియాస్ బిల్లాతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో గతేడాది కేరళలో దొంగతనం చేసిన ఈ ముఠా సభ్యులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు అపహరించారు. దీనిలో కొంత బంగారం విక్రయించేందుకు జంగం చంటికి ఇవ్వగా, విక్రయించిన మొత్తాన్ని తిరిగి ముఠా సభ్యులకు చెల్లించకపోవటంతో వీరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో చంటిని హతమార్చేందుకు పథకం రచించిన రాయపాటి వెంకన్న, ఇతర ముఠా సభ్యులు గత ఏడాది నవంబర్ 16వ తేదీన నమ్మకంగా అతనిని ఇంటి నుంచి తీసుకువెళ్లారు.
అదే రోజు చంటి కుమారుడి అన్నప్రాసన కావటంతో పార్టీ ఇవ్వమని కోరటంతో మిత్రులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలోని ఓ హోటల్‌లో రూం తీసుకుని చంటిని ఇతర ముఠా సభ్యులు చితకబాదారు. అనంతరం కారులో ఎక్కించుకుని క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని పూడ్చివేసేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ జాతీయ రహాదారి పక్కన బొమ్ములూరులో శ్మశాన వాటిక కనిపించటంతో అక్కడ రాత్రి వేళలో పూడ్చిపెట్టి పరారయ్యారు. జంగం చంటి కనిపించటం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వ్యక్తి అదృశ్యం కేసు నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.
చదవండి: (పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానంతో...)
పోలీసుల విచారణలో భాగంగా చంటిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లిన తోటి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించటంతో క్రమంగా వాస్తవాలు బయటకు వచ్చాయి. జంగం చంటిని హత్యచేసి బాపులపాడు మండలం బొమ్ములూరులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పటంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, చిలకలూరిపేట సీఐ వై.అచ్చయ్య సోమవారం సంఘటనాస్థలికి చేరుకున్నారు.
బాపులపాడు తహసీల్దార్ టి.మల్లికార్జునరావు, హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ టి.సూర్య శ్రీనివాస్ సమక్షంలో సమాధిని తవ్వి జంగం చంటి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. మృతుని సోదరుడు జంగం బాజీ, ఇతర కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి, కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment