ఎన్‌సీసీ సీనియర్ల దాష్టీకం | NCC Senior students Attack on juniors at Palnadu | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ సీనియర్ల దాష్టీకం

Published Thu, Jul 25 2024 8:07 AM | Last Updated on Thu, Jul 25 2024 1:13 PM

NCC Senior students Attack on  juniors at Palnadu

పరీక్ష పేరుతో జూనియర్లను చితకబాదిన వైనం 

నరసరావుపేట ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాల హాస్టల్లో అర్ధరాత్రి పైశాచికం 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఏటా ఇదే తంతు 

కేసు నమోదు చేసిన నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులు  

సాక్షి, నరసరావుపేట: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఎన్‌సీసీ సీనియర్‌ క్యాడెట్లు పైశాచిక ఆనందంతో జూనియర్లను చితకబాదారు. సర్టిఫికెట్‌ కోసం ఉబికి వస్తున్న కన్నీటినీ దిగమింగుకుని జూనియర్‌ క్యాడెట్లు బాధను ఓర్చుకున్నారు. ఈ వీడియో ఆలస్యంగా బయటకు రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారి్థలోకం ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 
 
ఏటా ఇదే తంతు
వజ్రోత్సవాలు జరుపుకోబోతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటలోని  శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ(ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌) కళాశాల స్థాయిలో ఎన్‌సీసీ విభాగం ఉంది. ఇక్కడ ఏటా సీనియర్‌ విద్యార్థులు జూనియర్లపై వికృతచేష్టలకు పాల్పడడం  సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఏటా బీ సరి్టఫికెట్‌ పరీక్షకు వెళ్లే క్యాడెట్లను సీనియర్లు విచక్షణారహితంగా వెదురు బెత్తాలతో కొట్టడం ఇక్కడ ఆనవాయితీగా ఉందని సమాచారం. సీనియర్లు కొట్టే దెబ్బలకు చర్మం లేచిపోయి భరించలేని నొప్పితో ఎంతో మంది జూనియర్లు నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైరలైన వీడియోలోనూ సీని యర్లు జూనియర్లను చితకబాదిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.   

గత ఫిబ్రవరిలో ఘటన    
గత ఫిబ్రవరి 3,4 తేదీలలో చీరాలలో జరగనున్న ఎన్‌సీసీ బీ–సరి్టఫికెట్‌ పరీక్షకు వెళ్లే 20 మంది క్యాడెట్లను సీనియర్లు 2 తేదీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చితక్కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.  తమను తమ సీనియర్లు ఇంత కంటే ఎక్కువగా కొట్టారని వీడియోలో కామెంట్‌ చేయటం ఈ తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా ఉంది. క్యాడెట్ల పరేడ్‌ను పర్యవేక్షించాల్సిన ఎన్‌సీసీ ఆఫీసర్‌ డ్రిల్‌ సమయంలో ఉండరని విద్యార్థులు బుధవారం చెప్పారు. డ్రిల్‌ ఉన్న రోజు సాయంత్రం ఆలస్యంగా  హాజరయ్యే క్యాడెట్లను క్రమశిక్షణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తుంటారని 
పేర్కొంటున్నారు.   



నోరువిప్పని యాజమాన్యం 
ఘటనపై ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్‌  కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సోము మల్లయ్య, ఎన్‌సీసీ ఆఫీసర్‌ మేజర్‌ బి.ఎస్‌.ఆర్‌.కె.రాజు, బాధిత విద్యార్థులను తన చాంబర్‌కు పిలిపించుకొని విచారణ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపల్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మల్లయ్య  ఘటనపై విచారణ జరుపుతున్నామని మొక్కుబడిగా ప్రకటించారు.

 

కేసు నమోదు  
వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన వన్‌టౌన్‌ సీఐ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థులను ఘటనపై ఆరా తీశారు. తమపై సీనియర్లు అజయ్‌కుమార్, గోపీకృష్ణ మరో నలుగురు కలిసి దాడి చేశారని సీహెచ్‌ పాల్‌ థామస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా  వివరణ కోరేందుకు కళాశాల హాస్టల్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఎన్‌సీసీ ఆఫీసర్‌ మేజర్‌ బి.ఎస్‌.ఆర్‌.కె.రాజు, సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు దురుసుగా ప్రవర్తించారు.

ఏఐఎస్‌ఎఫ్‌ ధర్నా.. 
ఎన్‌సీసీ జూనియర్‌ క్యాడెట్లపై సీనియర్ల దాషీ్టకాన్ని నిరసిస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ఎస్‌ ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాల ఎదుట, హాస్టల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు, గోపిచంద్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కాసా రాంబాబు, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement