నానమ్మను ఆదర్శంగా తీసుకున్నాను!
నానమ్మను ఆదర్శంగా తీసుకున్నాను!
Published Thu, Oct 17 2013 12:45 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
తొమ్మిది గజాల చీర... అది కూడా మడికట్టు, ముక్కు పుడక, రూపాయి కాసంత బొట్టు... వెండితెరపై ఈ వేషధారణలో కనిపిస్తానని సుహాసిని ఎప్పటికీ ఊహించి ఉండరు. అందుకే, ఈ కట్టూబొట్టూ అనగానే ఒకింత థ్రిల్‌కి గురై ‘రామానుజన్’ సినిమాని ఒప్పుకున్నారామె. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రామానుజం తల్లి పాత్రను సుహాసిని చేస్తున్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ - ‘‘రామానుజం జీవితంలో ఆయన తల్లి ‘కోమలత్తమ్మాళ్’ పాత్ర చాలా ఉందని, ఈ చిత్రంలో మీరు ఆ పాత్ర చేయాలని దర్శకుడు జ్ఞానశేఖరన్ చెప్పినప్పుడు నేను చాలా అదృష్టవంతురాల్ని అనిపించింది. రామానుజంలాంటి మేధావి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాని నేను ఎలా కాదంటాను? ఆయన తల్లి పాత్ర చేసే అవకాశం నన్నే వరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్ర కోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాను.
రామానుజం తల్లి చాలా డామినేటింగ్. మా నానమ్మ అలానే ఉండేది. కమల్‌హాసన్‌లాంటి వ్యక్తిని తీర్చిదిద్దిన ఘనత ఆమెది. నేను కూడా తన దగ్గరే పెరిగాను. అందుకే కోమలత్తమ్మాళ్ పాత్రకు తనను అనుకరించాను. అలాగే నా కుటుంబంలో, స్నేహితుల దగ్గర ఉన్న తొమ్మిది గజాల చీరలను సేకరించాను. మా అమ్మ ఫొటోల ఆధారంగా నగలను ఎంపిక చేసుకున్నాను.
అప్పట్లో మా అమ్మ ఎలాంటి కేశాలంకరణ చేసుకునేదో అదే ఫాలో అయ్యాను. నాకు చీరలు మామూలుగా కట్టడం వచ్చు. కానీ, మడికట్టు తెలియదు. ఈ సినిమా కోసం అది నేర్చుకున్నాను. మొత్తం మీద ఈ సినిమాలో నటించడం నాకు మంచి అనుభూతిని ఇస్తోంది’’ అని చెప్పారు. ఇందులో రామానుజన్ పాత్రను సావిత్రి మనవడు అభినయ్‌చేస్తున్నారు.
Advertisement