మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసిన తర్వాత చాలామంది సీనియర్ హీరోయిన్లు నిజమేనంటూ తమ అభిప్రాయం చెప్పారు. అయితే, తాజాగా నటి సుహాసిని ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో మహిళలకు రక్షణ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. అందులో పలు భాషలకు చెందిన నటీమణులు, దర్శకులు పాల్గొన్నారు.
అందులో పాల్గొన్న నటి సుహాసిని మాట్లాడుతూ సినిమా రంగం ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రంగాలలో పని చేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారన్నారు. అయితే సినిమాలో అలా కాదన్నారు. 200 నుంచి 300 మంది షూటింగ్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడే ఒక కుటుంబంలా కలిసుండాలన్నారు. అక్కడ విధి, విధానాలను పాటించకపోతే హద్దులు మీరే అవకాశం ఉంటుందన్నారు. 200 మంది ఓ చిత్ర యూనిట్‌లో తమ కుటుంబాలకు దూరంగా ఉండే వారిపై కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఇప్పుడు సినిమా రంగంలోని వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదన్నారు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలను చూస్తారన్నారు. అదేవిధంగా ఇతర చిత్ర పరిశ్రమల మాదిరి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ తక్కువన్నారు. మలమాళ చిత్రాల షూటింగ్‌లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయని చెప్పారు. దీంతో నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువన్నారు. ఇదే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోందని చెప్పారు.
తమిళ చిత్ర షూటింగ్ పూర్తి అయితే తాను చైన్నెకి తిరిగి వెళ్లిపోతానని, తెలుగు షూటింగ్ అయితే హైదరాబాద్‌కు, కర్ణాటకలో షూటింగ్ అయితే బెంగళూర్‌కు వెళ్లిపోతానన్నారు. అయితే మలయాళం సినిమాల షూటింగ్ పూర్తి అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్లలేరని, కారణం అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడమేనని అన్నారు. అంతేకాకుడా మీకు బయటకు కూడా వెళ్లడం కుదరదన్నారు. అందుకే షూటింగ్ ప్రాంతాల్లో హద్దులు మీరుతున్నాయనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment