చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడు జైళ్ల శాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంత ఊరు అయిన సేలం సూరమంగళంలో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఆయన కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళ్తున్నారు.
ఆ క్రమంలో ఎదురుగా ఓ లారీ అతివేగంతో ఎదురు వచ్చింది. దీంతో కారు ఆపి... కిందకి దిగిన రామానుజన్... లారీని ఆపి... ఎందుకు అంత వేగంగా నడుపుతున్నావంటూ లారీ డ్రైవర్ను మందలించారు. దీంతో లారీడ్రైవర్ మాజీ డీజీపీతో దుర్భాషలాడడంతో పాటు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు.
కిందపడి పోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.